తెలుపు-నలుపు

పుట్టి పెరిగిన దేశం వదిలి ఒక పరాయి దేశానికి పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళటానికి మనకి సవాలక్ష కారణాలుంటాయి. ఆలోచనలకీ భయాలకీ బందీలం మనం
( 30 జులై 2007 ఏపీవీక్లీ)

పుట్టి పెరిగిన దేశం వదిలి ఒక పరాయి దేశానికి పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళటానికి మనకి సవాలక్ష కారణాలుంటాయి. మనం వున్న పరిస్థితుల కంటే ఇంకొంచెం మెరుగైన వాతావారణంలో బ్రతకాలనో, మన వృత్తి లో ఇంకా పైకెదగటానికి ప్రోత్సాహం లభించే అవకాశాలు ఎక్కువగా వుంటాయనో, పిల్లలకి మంచి అవకాశాలూ, భవిష్యత్తూ ఇవ్వాలన్న తపనో, ఏదీ కాకపోతే, చుట్టూ వున్నవారితో పోటీనో, ఏదో ఒకటి మనని ఇంకొక చోటికి వచ్చి మళ్లీ అన్ని రకాలుగా బ్రతుకు పోరాటం మొదలుపెట్టమని ఎగదోస్తుంది. చాలా వరకు మనం కావలసిన దాన్ని పొందుతాం కూడా. కానీ కొన్నిసార్లు మాత్రం, మనం లేని దాని కోసం వెతుక్కుంటూ వున్నది కూడా పారేసుకున్నామా అన్న అనుమానం రాకుండా వుండదు.
భారత దేశం లో నైనా ఎక్కడైనా, మన అవసరాలూ, ఆడంబరాలూ పెరిగినంతగా ఆదాయం పెరగటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం జన్మంతా ఒక్క మంగళ సూత్రం గొలుసూ, నల్లపూసల గొలుసూ, మహా అయితే ఒక్క నెక్లెసు తో ఆడవాళ్లు తృప్తి గా వుండేవారు. ఇప్పుడలా కాదు, ప్రతీ చీర మీదకీ మేచింగ్ నగలుండాలి. ఏదో అదృశ్య శక్తి ఒకేసారి నగల, చీరల పోటీ పెట్టినట్టు అందరు భారతీయ స్త్రీలకీ వ్యామోహం పెరిగిపోయింది. ఏతా వాతా, ఏ డబ్బులూ రాని ఇంటి పనితో పాటు నాలుగు డాలర్లు రాల్చే ఉద్యోగం తప్పనిసరి. ఇండియానించి ఇక్కడికి వచ్చేవారికి కొన్నిసార్లు క్వాలిఫికేషన్ సరిపోక ఏదో ఒక కోర్సులో చేరి అదనపు డిగ్రీలు సంపాదించి ఆ పైన ఉద్యోగంలో చేరక తప్పదు. ఏ కోర్సులో చేరితే తొందరగా, ఎక్కువ డబ్బులొచ్చే ఉద్యోగం దొరుకుతుందో కనిపెట్టటం మనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, రాగానే ఆ కోర్సులో చేరిపోతాం.
రాజేశ్వరిగారిని ఏ వీకెండు కదిలించినా, “చాలా పని పేరుకుపోయిందండీ, పూర్తి చేయాలి” అంటూ వుండేవారు. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, మరి ఆయన ఏమీ సాయం చేయరా అని అడిగాను నవ్వుతూ. “అయ్యొయ్యో! అది కాదండీ, పాపం ఆయన సాయం చేస్తాననే అంటారు, ఆయనకసలు టైమే వుండదు!” అన్నారు. ఆశ్చర్య పోయాను. సాధారణంగా ఇక్కడ ఉద్యోగాల్లో ఇండియా లాగానో, అమెరికా లాగానో పెద్ద వత్తిడి వుండదు. టంచనుగా తొమ్మిదింటికి మొదలుపెట్టి అయిదింటికి పెట్టె సర్ది, అయిదున్నర-ఆరింటికల్లా ఇల్లు చేరతారందరూ. ఆయనంత బిజీ ఎందుకబ్బా, అనుకొని, “ఏం చేస్తుంటారు మీ వారు” అని అడిగాను కుతూహలంగా.
“టేఫ్ లో ఏదో ఐ.టి. కోర్సు చేస్తున్నారండీ. అందుకే పగలంతా క్లాసులకెళ్తారు. రాత్రేమో పరీక్షలకి చదువుకోవటం, అసైన్మెంట్లూ వుంటాయి. ఏ సహాయమూ చేయటానికుండదు పాపం. నేను చిన్న కంపెనీలో లేబొరటొరీ అసిస్టెంటుగా చేరాను. ఆయన చదువుకున్నన్నాళ్లూ నేనుద్యోగం చేస్తే ఖర్చులు గడచిపోతాయి కదా! అయేసరికి ఇంటి పనీ- బయటి పనీ-ఆఫీసు పనీ- చాలా కష్టంగా వుంది. రెండేళ్లలో ఆయన కోర్సు అయిపోగానే ఉద్యోగం మానేసి ఇల్లు చూసుకుంటాను”, అన్నారు భవిష్యత్తులోకి ఆశగా తొంగి చూస్తూ. నిజమే మరి, కుటుంబాన్ని నడిపించటనికి భర్తకా మాత్రం చేయూతనివ్వాలి. అందుకే ద్విపాత్రాభినయం చేస్తూ అలిసిపోతున్నారు అని జాలి పడ్డాను.
నాలుగేళ్ల తరువాత మళ్లీ ఎక్కడో కనబడిన రాజేశ్వరి గారు, మళ్లీ “బీజీ” మంత్రం పఠిస్తున్నారు. “మీ వారి కోర్సింకా అయిపోలేదా యేమిటి?” అనడిగాను.
“కాదండీ, ఆయనకి ఆ కోర్సు చేయగానే మంచి వుద్యోగం వచ్చింది. దాంతో నేనూ అదే కొర్సులో చేరాను. పగలంతా క్లాసులు, రాత్రుళ్లు అసైన్మెంట్లూ, పరీక్షలకి ప్రిపరేషనూ వుంటాయి. అందుకే వంటా, షాపింగులూ అన్నీ వీకెండులోనే చేస్తాను. ఆయనేమో పాపం ఆఫీసులోనే అలసిపోతారు.” అన్నారావిడ మొహమాటంగా.
హయ్యో, భగవంతుడా అనుకున్నాను. ఆయన చదువుకుంటూ ఆవిడ ఉద్యోగం చేసినా ఆవిడకే రెండింతలు పనీ, ఆయన ఉద్యోగం చేసి ఆవిడ చదువుకున్నా ఆవిడకే రెండింతలు పని. ఈ లెక్క ఎలా చేసినా ఒకే ఆన్ సరొస్తుంది అనుకున్నాను విరక్తిగా.
ఈ మధ్యనే ఇండియా వెళ్లొచ్చిన కల్పన, ఇండియాలో ఆడవాళ్లెంత సుఖ పడుతున్నారో, మనవెంత కుక్క బ్రతుకులో చెప్తున్నారు ఆవేశంగా.
“మన బొంద,మనదీ ఒక బ్రతుకేనా? వంట చేయటం, అంట్లు తోమటం, బట్టలుతకటం, పిల్లలని రక రకాల క్లాసుల చుట్టూ తిప్పటం, ఇల్లు సర్దుకోవటం, అంతా చేసి, మళ్లీ ఆఫీసులకెళ్లటం. అదే మా చెల్లెలు, విప్రో లో జాబ్ చేస్తుంది. ఎంత సుఖం, ఎంత సుఖం! ఇడ్లీ పిండి దగ్గర్నించీ షాపుల్లో దొరుకుతాయి. పనిమనిషొచ్చి గిన్నెల పనీ, బట్టల పనీ, ఇల్లు శుభ్రమూ చేస్తుంది. పిల్లలకి ట్యూషన్ లో చక్కగా చదువు చెప్తారు. అదేమయినా రోజూ మంచి చీర కట్టుకుని ఆఫీసుకెళ్లటమే! మళ్లీ వారం వారం సినిమాలూ, హోటల్లో భోజనాలు. దాన్ని చూస్తే నా కెంత ఈర్ష్య అనిపించిందో చెప్పలేను. వెళ్లిపోతాను నేను కూడా, అక్కడే ఏదో ఉద్యోగం చూసుకుని” అని చెప్తున్నారు.
నిజమే, మగవాళ్లకి అక్కడైనా ఇక్కడైనా బాగుందనే అనిపిస్తుంది,
“హబ్బ! ఇక్కడ ట్రాఫిక్ ఎంత హాయిగా వుందొయ్” అనో లేకపోతే,
“నాకిక్కడ అన్నిటికంటే నచ్చినవి స్విమ్మింగ్ పూల్సూ, టెన్నిస్ కోర్టులూ!” అనే వారి మాటలు వింటుంటే. వాళ్లెప్పుడూ ఏ విషయం గురించీ తల బద్దలు కొట్టుకుంటున్నట్టు అనిపించదు. ఒక్క అమ్మా నాన్నల్ని ఒంటరిగా ఇండియాలో వదిలేసాం అనే బాధ తప్పించి వాళ్ల బ్రతుకుల్లో పెద్ద మార్పేమీ వున్నట్టుండదు. ఇంకా చెప్పాలంటే వృత్తి రీత్యా, ఇతర సంగీత సాహిత్య పరమైన హాబీలకి బోలెడంత తీరికా, ఉత్సాహమూ, ఓపికా దొరుకుతాయి.
అసలు ఆడవాళ్లందరూ, “మేం ఇండియాలోనే వుంటాం, పని మనుషులతో పనులు చేయించుకుంటూ. మీరు కావాలంటే అమెరికాకో ఆస్ట్రేలియాకో ఆఫ్రికాకో అఘోరించండి” అని మొండికేయాలి.
కల్పనగారి భర్తకి ఇండియాలో మంచి ఉద్యోగం వచ్చిందని విని చాలా సంతోషించాను.
“ఎప్పుడు ప్రయాణం” అనడిగాను.
“ఆయనొక్కరే వెళ్లి రెండేళ్లుండి మళ్లీ వస్తారు” అన్నారావిడ.
“అదేమిటి, ఇండియాకి వెళ్లటానికి ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు.అయినా మీరే వెళ్దామనుకున్నారు కదా?” ఆశ్చర్యంగా అడిగాను.
“అవుననుకోండి. కానీ, నాకెందుకో అక్కడికెళ్తే శారీరకంగా తెరిపిగానే వుంటుంది కానీ, మన లైఫ్ మీద మనకేమీ కంట్రోలు వుండదనిపించింది. ప్రతీ దానికీ మా అత్తగారిదీ మామగారిదీ పర్మిషను తీసుకుంటూ వుండాలి. వాళ్లదే కాకుండా, చుట్టాలదీ, స్నేహితులదీ ఒకటే ఇంటర్ఫియరెన్ సు! ఇక్కడయితే ఎవడి గోల వాడిదే, ఎవరూ ఇంకొకళ్ల గురించి పట్టించుకోరు. నా కారు నేను నడుపుకుంటూ, నా ఇష్టం వచ్చినట్టు నేను పిల్లలని పెంచుకుంటాను. ఈ స్వతంత్రం అక్కడెలా వస్తుంది? పిల్లలు అసలంత భయంకరమైన కాంపిటీషను తట్టుకోగలరా?..” ఆవిడ ఇంకేదో చెప్తున్నారు.
నాకేదో అర్ధమయినట్టయింది. అదీ మనిషికి కావలసింది, తనకిష్టమయిన విధంగా జీవించే చాయిస్! అందుకే ఇక్కడ ఎంత ఇబ్బందిగా వున్నా, ఆడవాళ్లకి ఇక్కడే బాగుందనిపిస్తుంది కాబోలు. ఏ విషయం గురించయినా ఆలోచించి నిర్ణయాలు తిసుకునే స్వతంత్రమూ, అవకాశమూ వుండాలే కాని, శారీరకమైన వత్తిడి మనని పెద్దగా బాధించదు. మరీ మాట్లాడితే, స్వతంత్రం లేనప్పుడు శారీరకంగా ఎంత సుఖంగా వున్నా, ముళ్ల మీదున్నట్టుంటుంది. మనం కట్టుకునే బట్టలూ, మన పిల్లల చదువులూ, మనం వేసుకునే నగలూ, కొనుక్కునే ప్రాపర్టీలూ, అన్నిటి గురించి అందరి కామెంట్లూ, సలహాలూ, జోక్యాలూ వుండవు కాబట్టి శాంతిగా వున్నట్టనిపిస్తుంది.
అందుకే రెండు సంవత్సరాలకోసారి ఇండియా వెళ్తూ, అందరినీ వదిలి వచ్చేటప్పుడు బావురుమని ఏడుస్తూ, పండగలప్పుడు అమ్మనీ నాన్ననీ తల్చుకొని కళ్ల నీళ్లు పెట్టుకుంటూ, ఉగాది పండగకి ఇక్కడ చలికాలం కావటంతో మావిడికాయలు దొరకవని తిట్టుకుంటూ, బోలెడంత హోం సిక్నెస్ మనసులో దాచుకుంటూ, రోజులు వెళ్లదీస్తాము. మనం మన ఆలోచనలకీ, అర్ధం లేని భయాలకీ బందీలం మరి.

2 thoughts on “తెలుపు-నలుపు

  1. సరిగ్గా చెప్పారు. అలా complain చెయ్యడంలోనూ ఒక తృప్తి. ఇంకా ఏమో చెప్పాల్ని ఉంది. కానీ మీరు ఇంత చక్కగా వ్రాశాక చెప్పేదేముందీ. నాకు వెలిగిన జ్ఞాన జ్యోతి ఇంకొంచెం కాంతివంతమైంది అంతే. పక్కవారిలో గమనించాక ఇదే విషయం నాలోనూ గమనించుకుని అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s