తెలుపు-నలుపు

ఆస్ట్రేలియా దేశ వాసులకి తీరని కోరిక ఒకటుంది. దాన్ని గురించి వాళ్లెప్పుడూ దిగులు పడుతూ వుంటారు. కుడి ఎడమైతే
(13 ఆగష్టు 2007, ఏపీవీక్లీ)

ఆస్ట్రేలియా దేశ వాసులకి తీరని కోరిక ఒకటుంది. దాన్ని గురించి వాళ్లెప్పుడూ దిగులు పడుతూ వుంటారు. అదేమిటంటే మిగతా శ్వేత జాతి దేశాల్లా (అమెరికా, ఇంగ్లండు, కెనెడా మొదలైనవి) ఇక్కడ మంచు కురుస్తున్న క్రిస్మస్ పండగని చూడటం. ‘వైట్ క్రిస్మస్ మేము ఇక్కడ చూడలేం కదా ‘ అని వాళ్లు ఎంతో నిరాశతో అనుకుంటూ వుంటారు. ప్రపంచమంతా చలిలో వణుకుతూ క్రిస్మస్ జరుపుకుంటుంటే, ఇక్కడ ప్రజలు బీచి ఒడ్డున మన తెలుగు సినిమా హీరోయిన్లలా చాలీ చాలని బట్టలతో నిట్టూరుస్తూ పడి వుంటారు.

ఆస్ట్రేలియా ఖండం భూమధ్యరేఖకి దిగువన వుండటం వలన వాతావరణం చాలా ఇండియాలోని వాతావరణానికి భిన్నంగా, ఒక్క మాటలో చెప్పాలంటే తిరగేసినట్టు వుంటుంది. ఇండియాలో ఋతుపవనాలు మొదలై వాతావరణం చల్లబడటం మొదలయే ఆగష్టు సెప్టెంబరు నెలల్లో ఇక్కడ మెల్లగా వెచ్చబడటం మొదలవుతుంది. సెప్టెంబరు ఒకటో తారీఖు నించి వసంత ఋతువు ప్రారంభం అని ప్రభుత్వం
ప్రకటిస్తుంది. అమ్మయ్య, దిక్కుమాలిన చలి పీడ విరగడయింది అని మనం అనుకున్నా, ఎక్కువగా చలిగానే వుంటుంది, ఎండతో దోబూచులాడుతూ.

వసంత ఋతువుతో పాటు కోకిల పాటలూ, మావిడి పూతలూ లేకపోగా, “హే ఫీవర్” తప్పని సరి. వసంత ఋతువులో ప్రకృతి అన్ని రకాల, రంగుల పూలతఓ అద్భుతమైన అందాన్ని సంతరించుకుంటుంది. ఆ అందాన్ని చూసి మైమరచి పోయి పూల దగ్గరికెళ్లామా, మన పని అంతే. గాలితో తేలుతూ వచ్చే పుప్పొడి ముక్కులోనూ, కంటి పొరల్లోనూ చేరి, అలర్జీనీ ఆ తరువాత ఒంటి నొప్పితో కూడిన ఒక రకమైన జ్వరం లాటి నీరసాన్నీ కలగజేస్తాయి. ఏంటీ హిస్టమిన్ టాబ్లెట్లు మింగుతూ, సెప్టెంబరు నెలంతా గడుస్తుంది.

అక్టోబరు నెలలో వేసవిలో ప్రవేశిస్తున్నామని గడియారాలు ఒక గంట వెనక్కి తిప్పుకుంటాం, రేప్పొద్దున్న గంట ముందే లేవాలి, ఎలాగరా దేవుడా అనుకుంటూ. ఈ గడియారం వెనక్కీ ముందుకీ తిప్పడం వల్ల లాభాలేమిటో ఒక పట్టాన అర్ధం కావు. వేసవిలో ప్రవేశించేటప్పుడు ఒక గంట గడియారాలన్నీ ముందుకు తిప్పుకుని ఒక గంట కాలాన్ని పోగొట్టుకుంటాం. చలికాలంలో ప్రవేశించేముందు గడియారాన్ని మళ్లీ వెనక్కి తిప్పుకుని ఆ పోగొట్టుకున్న గంటా తిరిగి తీసుకుంటామన్న మాట.

పద్ధెనిమిదో శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ నవ్వులాటకి ఈ “డే లైట్ సేవింగ్” సూత్రాన్ని ప్రతిపాదించాడని కొందరంటారు. మొదటి సారి ఈ రకంగా గడియారాలని సర్దుబాటు చేసుకోవటం మొదటి ప్రపంచ యుధ్ధ కాలంలో దీపాలు తొందరగా ఆర్పేసి, చమురు ఆదా చేయటం కోసం జరిగింది. కానీ ఆస్ట్రేలియాలో ఈ సవరణ ఎక్కువ మందికి నచ్చకపోవటంతో వెంటనే దాన్ని రద్దు చేయటం కూడా జరిగింది. మళ్లీ రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో ప్రభుత్వం ఈ పధ్ధతిని ప్రవేశపెట్టి, మళ్లీ 1944 లో రద్దు చేసింది. తిరిగి 1967లో డే లైట్ సేవింగ్ ని ప్రవేశపెట్టిన తరువాత ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

ఆస్ట్రేలియా దేశస్థులకి ఎక్కువగా బయట కాలం గడపటం ఇష్టం. కొంచెం సూరీడు కనపడగానే పిక్నిక్ బుట్టలూ దుప్పట్లూ స్విమ్మింగ్ సూట్లూ తీసుకుని బయల్దేరతారు. నవంబరు నెలంతా బార్బీక్యూలతో గడిచిపోతుంది.

డిసెంబరు జనవరి నెలలు భరించలేని ఎండతో ఎడారి ప్రదేశం అంటే ఏమిటో మనకి బాగా తెలిసొస్తుంది. ఎండ వేడి తీవ్రతతో పాటు, రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఎండగా వుండడంతో చాలా అలసటగా అనిపిస్తూ వుంటుంది. డిసెంబరు అనగానే క్రిస్మస్ పండుగా, స్కూలు సెలవలూ గుర్తొస్తాయి. ఇక్కడ క్రిస్మస్ పండుగ వేడుకలు చూస్తే కొంచెం నవ్వూ, కొంచెం జాలీ వేస్తాయి. నలభై డిగ్రీల ఎండలో పాపం షాపింగ్ సెంటర్లలో క్రిస్మస్ తాత వేషంలో మనుషులని చూసినప్పుడు కొంచెం చిరాకుగా కూడా అనిపిస్తుంది. ఇంగ్లీషు పాలన నించి విముక్తి పొందినా మన దేశంలో చాలా చోట్ల ఇంకా భావ దాస్యం, భాషా దాస్యం కనిపిస్తూనే వుంటాయి. లేకపోతే రోడ్లు పగిలే ఎండల్లో పిల్లలని స్కూల్ కి టై-బూట్లూ వేసుకుని రమ్మని అనటంలో అర్థం వుందా? ఇక్కడా అలాగే ఇంగ్లండు వాసనలు పోలేదు. మంచు కురిసే Yఊరోప్ ఉత్తర అమెరికా ఖండాల్లో క్రిస్మస్ తాత ఎరుపు తెలుపు కలిసిన దుస్తులూ, నల్లటి పెద్ద బూట్లు, పెద్ద బవిరి గడ్డంతో వుండటంలో అర్థం వుంది. ఇక్కడా శాంతా క్లాజ్ కి అదే వేష ధారణ వుండాలనటం కొంచెం ఇబ్బందే మరి. బహుశా ఏ దేశంలో వున్నా మనుషులందరికీ సంప్రదాయం మీద గౌరవం, అభిమానం వుంటాయి కాబోలు. మే నెల ఎండల్లో, పెళ్లిళ్లలో మనం పెళ పెళ మంటూ పట్టు చీరలు కట్టుకోమూ? ఈ మధ్య కొంత మంది ఇక్కడ మామూలు మనుషుల్లాగే క్రిస్మస్ తాత నిక్కరూ, పూల పూల షర్టూ, నల్ల కళ్లద్దాలూ, ఆకు చెప్పులూ, పెద్ద టోపీ పెట్టుకుని వుండాలని నొక్కి వక్కాణిస్తున్నారు.

ఎండలందు ఆస్ట్రేలియా ఎండలు వేరయా, అని, ఇక్కడ ఎండలో ఇంకొక కోణం కూడా వుంది. అదే “అతి నీలలోహిత రశ్మి” (అల్ట్రా వయొలెట్ రేడియేషన్). సూర్య రశ్మి తో పాటు ఈ అ.నీ.లో రశ్మి కూడా భూమిని చేరుకుంటుంది. అయితే భూగోళం చుట్టూ పరుచుకుని వున్న స్ట్రాటో స్పియర్ లో వున్న ఓజోన్ పొర ఈ అల్ట్రా వయొలెట్ కిరణాలని అడ్డుకుంటుంది. ఇందువల్లే మానవ జాతి సమస్తం ప్రాణాలతో బతికి బట్టకడుతుంది. అతి శక్తి వంతమైన ఈ
కిరణాలు చర్మాన్ని కేన్సర్ బారిన పడేయటం తో పాటు, రోగ నిరోధక శక్తిని క్షీణింప చేస్తాయి.

రకరకాల కారణాల వల్ల ఈ ఓజోన్ పొర మందం భూగోళం ధృవాల వద్ద పలచ బడుతుంది. దానికి తోడు నానా విధాల రసాయనాల వాడకం వల్ల వెలువడే క్లోరో ఫ్లోరో కార్బనులు ఈ పొరను ఇంకా అరగ దీస్తాయి. వెరసి ఆస్ట్రేలియా ఖండంలోని సూర్య కాంతిలో చాలా ఎక్కువగా అల్ట్రా వయొలెట్ కిరణాలుంటాయి. పైగా శ్వేత జాతీయుల చర్మం లో “మెలనిన్” పాలు చాలా తక్కువ. కొంత వరకు ఈ మెలనిన్ చర్మానికి వచ్చే కేన్సర్ని నిరోధించగలదు. చర్మంలో మెలనిన్ లేమి, సూర్య కాంతిలో అతి నీలలోహిత కిరణాలూ వల్ల ఇక్కడ చర్మానికి కేన్సర్ చాలా తరుచుగా సోకుతుంది. దాన్ని నివారించటానికి “సన్ స్క్రీన్” వాడతారు. ఈ ఎండాకాలమంతా నల్ల కళ్లద్దాలూ, సన్ స్క్రీన్ లోషనూ, తలపైన వెడల్పాటి పెద్ద టోపీ తప్పనిసరి. లేదా భయంకరమైన తల నొప్పితో ప్రాణాలు తోడేస్తున్నట్టుంటుంది.

ఎండాకాలంలో ఇక్కడ వుండే ఇంకొక సమస్య పాములు. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన టైపాన్, బ్రౌన్, టైగర్, డెత్ ఏడర్ వగైరా పాములకు ఆస్ట్రేలియా పుట్టిల్లు. పట్టణాలకు దూరంగా వుండే పల్లెల్లో బ్రౌన్ పాము కరిచి కొంత మంది ఆసుపత్రి చేరుకునేలోగానే మరణిస్తారు. ఇంత విషపూరితమైన పాముల మధ్య తిరుగుతూ వున్నా ఇక్కడ పాముని చూడగానే చంపేయకుండా, ఆర్.ఎస్.పీ.సి.ఏ (జంతువుల రక్షణ సంస్థ)కి శ్రధ్ధగా ఫోన్ చేసి ఆ పాముని అప్పగిస్తారు. ఇది ఎంతో మెచ్చుకోవలసిన విషయం.

డిసెంబరులో ఆకులూ గడ్డి అంతా ఎండిపోయి ఏమాత్రం అగ్గి రవ్వ తాకిన భగ్గుమని మండిపోయి నగరాలకు నగరాలే తగలపడి పోతాయి. మెల్బోర్న్, కేన్ బెర్రా, సిడ్నీ అన్ని నగరాలూ ఏదో ఒకసారి ఈ “బుష్ ఫైర్” (దావానలం) బారిన పడ్డవే. అందుకే ఆ టైంలో అందరూ వాళ్ల సర్టిఫికేట్లూ, నగలూ, ఇంకా ముఖ్యమైన సామానులూ సూట్కేసుల్లో పెట్టుకుని అగ్ని కనపడగానే పారిపోవటానికి సిధ్ధంగా వుంటారు. ఇళ్లన్నీ చెక్కతో చేసినవి కావటంతో భద్రత తక్కువ. అందుకే ఇక్కడ డిసెంబరు జనవరి నెలల్లో “టోటల్ ఫైర్ బాన్” అంటే ఆరు బయట చిన్న అగ్గిపుల్ల వెలిగించటం కూడా నిషేధం. అయినా ఎవరో తుంటరులు చిన్న సిగరెట్టు పీకలు వేయటం, ఇళ్లూ తోటలూ తగలబడి లక్షలాది డాలర్ల నష్టం జరగటం ప్రతి సంవత్సరమూ వుంటునే వుంది.

ఈ రకంగా తల క్రిందుల వాతావరణం వల్ల అన్నిటికంటే బాగుండేది, అక్టోబరు నెలలో మావిడికాయ పప్పు తినగలగడం! ఇండియాకి ఫోన్లో మాట్లాడేటప్పుడు మాత్రం, క్రిస్మస్ రోజు చచ్చేంత ఎండగా వుంది, అని మనం అనగానే వాళ్లు ప్రతీ సారీ ఆశ్చర్యపడటం చాలా గమ్మత్తుగా, ఇంకా హాయిగా వుంటుంది. అంతేకాదు, “ఎండ ప్రాణాలు తోడూతుందు” అని మేనెలలో వాళ్లనగానే,
“చలితో మేం చస్తున్నాం” అనటం ఇంకొక సరదా! ఆ సరదా గురించి తరువాత మాట్లాడదాం.


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

One thought on “తెలుపు-నలుపు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s