చదరంగంలో చాలా సార్లు రాజునో మంత్రినో కాపాడుకునేందుకు బంట్లను పణంగా
పెట్టటం మామూలే. ఇద్దరు ఖైదీలు
(27 ఆగష్టు 2007, ఏపీవీక్లీ)
చదరంగంలో చాలా సార్లు రాజునో మంత్రినో కాపాడుకునేందుకు బంట్లను పణంగా
పెట్టటం మామూలే. రాజకీయ చదరంగంలో కూడా తమ తమ పదవులు కాపాడుకోవటానికో లేక మళ్లీ మళ్లీ పదవులు చేజిక్కించుకోవటానికో బంట్లని బలిపశువులని చేయటం చాలా సర్వ సాధారణమైన విషయం. ఏ మాత్రం విలువ లేని ఈ బంట్లని మామూలు పరిభాషలో సామాన్య పౌరుడు (కామన్ మేన్) అని పిలుస్తూ వుంటాము.
ఈ సంవత్సరం (2007) చివరి భాగంలో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరుగుతాయి. అయిదోసారి అధికారం చేజిక్కించుకోవాలని జాన్ హొవార్డ్ (లిబరల్ పార్టీ)కి వుండటం సహజమే. అయితే కాలం ఖర్మం కలిసి వస్తున్నట్టు లేవు. అసలే ఇరాక్ తో యుద్ధంలో అమెరికాకి మద్దతు నివ్వటం మీద చాలా మంది పెదవి విరిచారు. దీనికి తోడు ఇద్దరు ఖైదీలు ఆయన పదవికి అడ్డం పడేలా వున్నారు.
సెప్టెంబరు పదకొండు 2001 తరువాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన యుధ్ధ భేరీలు మోగించింది. ఆ యుధ్ధం లో ఆఫ్ఘనిస్తాన్ లో పట్టుపడ్డ ఉగ్రవాది డేవిడ్ హిక్స్. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జన్మించిన హిక్స్ మద్యం, మాదక ద్రవ్యాలతో కూడిన వివాదాస్పదమైన బాల్యం గడిపాడు. కొద్ది రోజులు జపాన్ లో గుర్రాల ట్రైనర్ గా కూడా పని చేసాడు. ఇస్లాం మత ప్రబోధనలతో ప్రభావితుడై మతం మార్చుకుని, పాకిస్తాన్ చేరుకున్నాడు. అట్నించి లష్కర్-ఎ-తోయిబా లో చేరి జీహాద్లో పాల్గొనటానికై ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాడు. డిసెంబరు 2001 లో డేవిడ్ హిక్స్ ని అమెరికా ప్రత్యేక్ దళాలు (యూ. ఎస్.స్పెషల్ ఫోర్సస్)పట్టుకుని యుధ్ధ ఖైదీకింద అమెరికా తీసుకు వెళ్లాయి.
అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణ మీద హిక్స్ ని గాంటెనామో బే లోని డిటెన్షన్ కేంప్ లో వుంచింది. కొన్ని నెలల ఏకాంత ఖైదు తరువాత హిక్స్ ఆత్మహత్యా ప్రయత్నంకూడా చేసాడు. హిక్స్ తల్లి బ్రిటిష్ పౌరసత్వం వల్ల హిక్స్ లాయర్లు హిక్స్ కి కూడా బ్రిటిష్ పౌరసత్వం లభిస్తే అమెరికా ప్రభుత్వం నించి క్షమా భిక్ష పొందవచ్చుననుకున్నారు. చాలా కారణాల వల్ల ఆ వ్యూహం ఫలించలేదు. గాంటెనామోబే లో హిక్స్ ని, ఇంకా ఇతర ఖైదీలని చిత్ర హింసలు పెట్టారని ఆరోపణలున్నాయి. ఆరేళ్లపాటు హిక్స్ ఏ సహాయమూ అందక జైలులో పడి వున్నాడు. అమెరికా ప్రభుత్వం అతనిపై చార్జి షీటు దాఖలు చేయలేదు, ఆస్ట్రేలియా ప్రభుత్వం అతని అతీ గతీ పట్టించుకోలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అలసత్వం పట్ల పత్రికలూ మీడియా ధ్వజమెత్తాయి.
ఇప్పుడు ఎలక్షన్లలో ఈ విషయం ప్రాముఖ్యత సంతరించుకోవటంతో హొవార్డ్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం కాళ్లా వేళ్లా పడి అతని కేసుని విచారణకి రప్పించగలిగింది. ఈ లోపుగానే ఎన్నో మానవ హక్కుల సంఘాలు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తూర్పార బట్టాయి. ఎట్టకేలకు అతనిపై అభియోగాన్ని మోపి అమెరికా ప్రభుత్వం కేసు విచారించి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఎంతో ఒత్తిడి తెచ్చిన మీదట అతని జైలు కాలాన్ని అడిలైడ్ లో గడపటానికి ఒప్పుకుంది కానీ, అతను అమెరికా ప్రభుత్వంపై దావా వేయకూడదనీ, గాంటెనామోబే గురించి కానీ అమెరికా సైన్యం గురించి కానీ ఒక సంవత్సరం పాటు ఎక్కడా పత్రికా ప్రకటనలివ్వకూడదనీ వగైరా షరతులన్నీ విధించింది. ఈ హిరణ్యాక్ష వరాలన్నిటికీ
ఒప్పుకుని హిక్స్ ఈ సంవత్సరం మే నెలలో అడిలైడ్ చేరుకున్నాడు. అతన్ని అమెరికా నించి ఆస్ట్రేలియా రప్పించటానికి ప్రభుత్వం అక్షరాలా అర మిలియను డాలర్లు ఖర్చు పెట్టింది.
ఈ రకంగా పరాయి దేశల్లో నేరాలు చేస్తూ పట్టుబడ్డ తమ దేశస్థుల కొరకు తాపత్రయపడటం ఆస్ట్రేలియా కేమీ కొత్త కాదు. రెండేళ్ళ కింద షపేల్ కోర్బీ అనే యువతి దాదాపు నాలుగు కిలోల మాదక ద్రవ్యాలతో ఇండోనీషియాలోని బాలి నగరంలో విమానాశ్రయంలో పట్టుబడింది. డ్రగ్స్ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించే ఇండోనీషియన్ ప్రభుత్వం ఆమెకి ఇరవై సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. దానిని మరణ శిక్ష చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంకా పిటిషన్లు పెడుతూనే వుంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అంతకు సంవత్సరం మునుపే సునామీ భీభత్సంలో ఇండోనీషియాకి బోలెడంత ఆర్ధిక సహాయం చేసినందుకు ఆస్ట్రేలియా ప్రజలూ, మీడియా ప్రభుత్వం మీద విరుచుకు పడ్డాయి.కనీసం కోర్బీ ఖైదుని ఆస్ట్రేలియాకి మార్చటానిక్కూడా ఇండోనీషియా ఒప్పుకోలేదు. కోర్బీ విషయంలో విఫలమైనా, హిక్స్ ని పరాయి దేశంలోని ఖైదు నించి తెచ్చి ప్రభుత్వం నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ ఎలక్షన్లలో మనకేం ఢోకా లేదు, హిక్స్ ని చూపించి మీసం మేలి వేయవచ్చని అధికారంలో వున్న పార్టీ అనుకుంటూ వుండగానే డాక్టర్ హనీఫ్ విషయంలో ఘోరంగా
పప్పులో కాలేయటం జరిగింది.
ఈ సంవత్సరం జూలై ఒకటిన స్కాట్ లేండ్ లోని గ్లాస్గో విమానాశ్రయంలో కారు బాంబు పేలింది. అంతకు ముందే లండన్ నగరంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న రెండు కార్లను పట్టుకున్నారు. ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది.
జూలై మూడున బ్రిస్బేన్ విమానాశ్రయంలో స్వస్థలమైన బెంగుళూరు వెళ్లటానికి సిధ్ధంగా వున్న డాక్టర్ మహమ్మద్ హనీఫ్ ను ఆస్ట్రేలియా ఫెడెరల్ పోలిసులు అరెస్టు చేసారు. అతను లండన్ లో వుండగా వాడిన టెలిఫోన్ సిం కార్డు పేలిన కార్ల దగ్గర దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాదు, గ్లాస్గో బాంబు పేలుళ్లలో పట్టు బడ్డ కఫీల్ అహమ్మద్ అతనికి దూరపు బంధువు. ఇరవై ఏడేళ్ల దాక్టర్ హనీఫ్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తూ వుండగా, అతని భార్యా, కూతురూ బెంగుళూరులో వున్నారు. వారిని చూడటానికి అతను ఇండియాకి టికెట్ కొన్నాడు. కానీ రిటర్న్ టికెట్టు కొనలేదు. ఈ విషయం చాలా అనుమానాస్పదంగా తోచింది పోలీసులకి.
దాదాపు రెండు మూడు వారాల్లో పోలీసులు అతనిపైనున్న ఒక్క ఆరోపణని కూడా నిరూపించలేకపోయారు. ఊరు వదిలి వెళ్లేటప్పుడు ఇంకా చార్జి మిగిలిపోయిన కార్డుని తెలిసిన వాళ్లకివ్వట్టం మామూలే. అలా తను లండన్ వదిలి వచ్చేటప్పుడు తన టెలిఫోన్ కార్డుని కఫీల్ కిచ్చానని హనీఫ్ అన్నారు. ఇంతకీ ఆ కార్డు దొరికింది పేలుడు సంఘటన జరిగిన ప్రదేశంలో కాదు. అతనికి బ్రిస్బేన్ కోర్టు బెయిల్ ప్రకటించి జామీనుమీద విడుదల చేసింది. కానీ అతను వెలుపలికి వచ్చేలోపలే ఇమ్మిగ్రషన్ మంత్రి కెవిన్ ఆండ్రూస్ అతని వీసాని రద్దు చేసి నిర్బంధంలో వుంచారు. రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థలో ఇలా జోక్యం చేసుకోవటం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దానికి మంత్రి గారు హనీఫ్ గురించి తమ దగ్గర రహస్య వివరాలున్నాయనీ, వాటిని బయట పెట్టటం దేశ భద్రత దృష్ట్యా మంచిది కాదనీ మభ్య పెడుతూ వచ్చారు. ఇదంతా ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఉగ్రవాదం విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుందని ప్రజలకి ఋజువు చేయటానికే.
ఏ మాత్రం ఆధారాల్లేని ఆరోపణలతో అతన్ని నిర్బంధించటం పట్ల ప్రజల్లో మీడియాలో నిరసన వెల్లువైంది. ఎట్టకేలకు అతన్ని జూలై నెలాఖరున విడుదల చేసారు. అతను వెంటనే బెంగుళూరు చేరుకున్నారు. చాలా విచిత్రంగా ఆండ్రూస్ ఈ విషయాన్ని కూడా అనుమానాస్పదంగా భావిస్తున్నారు.
టెర్రరిజం అంతర్జాతీయ సమస్య. ఆ సమస్యని తమదైన పధ్ధతిలో ఎదుర్కోవటానికి ప్రతి రాజ్యానికీ సార్వభౌమాధికారాలున్నాయి. అలాగే పొరపాట్లు జరగటం కూడా మానవ సహజం. ఈ మొత్తం వ్యవహారంలో చిరాకు కలిగించేవి ప్రభుత్వం నించి కనపడుతున్న మొండి వైఖరీ, దూకుడు వ్యవహారమూ.
“అవును! పొరపాటు జరిగింది. దానివల్ల ఒక మామూలు మనిషికి తీరని నష్టం జరిగితే జరిగి ఉండవచ్చు గాక. మేం మాత్రం ఈ విషయంలో ఎటువంటి క్షమాపణా చెప్ప దలచుకోలేదు,” అని ప్రధాన మంత్రీ, విదేశాంగ మంత్రీ ప్రకటనలివ్వటం చాలా విచారకరం.
ఇంతకీ క్షమార్పణ చెప్తే ఎన్నికల్లో ఓడిపోతారా, చెప్పకపోతే ఓడిపోతారా అన్న విషయం మీద భిన్నాభిప్రాయాలున్నాయి.
ప్రజాభిప్రాయం నిరసన వెల్లువలో భారతీయుల గొంతుకలు వినపడకపోవటం చాలా విచారకరం.
ఉగ్రవాదిగా ౠజువైన హిక్స్ బాధ్యతని తన పైన వేసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఏ మాత్రం ఋజువుల్లేకున్నా ఒక భారతీయుణ్ని అనుమానించినందుకు కనీసం “సారీ చెప్పండీ” అని డిమేండ్ చేయలేదు మన భారతీయ ప్రభుత్వం. బహుశా ఇది ఇండియాలో ఎన్నికల సమయం కాకపోవటం వల్ల కాబోలు.
స్థానిక ఇండియన్ అసోసియేషన్ కనీసం ఒక మెమొరాండం సమర్పించటానికి కూడా ఒప్పుకోలేదు. అవును మరి. అందరం రాబోయే రకరకాల స్వామిజీల ప్రవచనాలతో, దేవుడికి నిత్య పూజలతో బిజీగా వున్నాం. తోటి భారతీయుడికి జరిగిన అన్యాయం, అవమానాల గురించి పట్టించుకునేంత తీరిక మాకెక్కడిది?
**************************************************************