తెలుపు-నలుపు

సాధారణంగా మనం తెలుపు రంగుని మంచికీ, నలుపు రంగుని చెడుకీ చిహ్నంగా భావిస్తూ వుంటాము. (16 జూలై, ఏపీవీక్లీ)

సాధారణంగా మనం తెలుపు రంగుని మంచికీ, నలుపు రంగుని చెడుకీ చిహ్నంగా భావిస్తూ వుంటాము. జీవితంలో మనకి ఎదురయే మంచి చెడులకీ, కంటికి కనపడే రంగులకీ ఈ రకమయిన సంబంధం అంటగట్టడం అంత మంచి పధ్ధతి కాదేమో నన్న అనుమానం అప్పుడప్పుడూ రాక మానదు.
నిజానికి జీవితంలో కానీ మనుషుల్లో కానీ, కేవలం మంచీ, లేక చెడూ కుప్పలు పోసినట్టు లేవు. అందరం మిశ్రమాలమే. తెలుపో లేక నలుపో ఒంటరిగా రాసి పోసినట్టు లేవు. ప్రపంచం మంచీ చెడూ, కష్టం సుఖం, తెలుపూ నలుపుల అందమయిన సమ్మేళనం.

భారత దేశం వదలి ఎక్కడో మనది కాని చోటులో, మనకి కొన్నిసార్లు వింతగా అనిపించే సంస్కృతిలో బ్రతకటంలో కొన్ని చికాకులూ, కొన్ని సౌలభ్యాలూ, ఇంకొన్ని హాస్యాస్పదమైన విషయాలూ ఎన్నెన్ని రంగులో! వాటిలో కొన్ని….

భారత దేశంలోని మహానగరాలనించి వచ్చేవారికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగర
విమానాశ్రయంలోనించి బయటకి రాగానే కొంచెం వింతగా, ఏమిటోగా అనిపిస్తుంది. కొంచెం సేపయిన తరువాత గానీ అలా ఎందుకనిపించిందో అర్థం కాదు. కారణం మరేదో కాదు, రోడ్లపైన చాలా
పలచగా కనిపించే జన వాహన సంచారం.ఆ మాటకొస్తే, మెల్బోర్న్ లేదా సిడ్నీ నించి వచ్చేటప్పుడూ అలాగే అనిపిస్తుంది, ఇంత తక్కువగా నర సంచారం వుంది, ఇవ్వాళ ఏదయినా సెలవు రోజేమోనని!

దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్ర రాజధాని అడిలైడ్ నగర జనాభా దాదాపు పదకొండు లక్షలు (ఒక మిలియన్ కంటే కొంచెం ఎక్కువ). మొత్తం రాష్ట్ర జనాభా ఇరవై లక్షలు. ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఇసుక ఎడారితో పరుచుకున్న ప్రదేశం కావటంతో దాదాపుగా రెండు వందల లక్షల (ఇరవై మిలియన్లు) జనాభా తో చాల తక్కువ జన సాంద్రతతో వుంటుంది. దీనీకి తోడు గత కొద్ది సంవత్సరాలుగా జనాభా పెరుగుదల ఎక్కువగా లేదు.

యాభై లక్షల మంది (అయిదు మిలియన్లు) కి పైగా నివసించే మన హైదరాబాదు నించి వచ్చి ఇక్కడ ఒక చదరపు కిలోమీటరులో ఆరు వందల మంది వుంటారని తెలిస్తే ముక్కు మీద వేలేసుకోక మానం. ఇక్కడి వాళ్ళు, “అచ్చం మీ బొంబాయి లాగుంటుంది” అని విర్రవీగే సిడ్నీ మహానగరం జనాభా నలభై లక్షలు (నాలుగు మిలియన్లు) మాత్రమే ! పదమూడు మిల్లియన్ల కంటే కొంచెం ఎక్కువ జనాభా తో ముంబాయి నగరం ప్రపంచంలో కెల్లా ఎక్కువ జనసాంద్రత వున్న నగరం.

అసలే వున్న తక్కువ జనాభా లొ ఎనభై అయిదు శాతం నగరాల్లోనే వుండటంతో, చుట్టు పక్కల
పల్లెటూళ్లలో ఇంకా తక్కువగా మనుషులుంటారు. కొన్ని కొన్ని వూళ్లలో జనాభా వంద మంది అన్న బోర్డు చుసినప్పుడు, ” వనస్థలిపురంలో మా వీధిలో ఇంతకన్నా ఎక్కువ మందే వుంటారు,” అని
పిల్లలతో చెప్పి నవ్వాను చాలా సార్లు.

మొదట్లో ఇంత తక్కువ జనాభా వుండటం వల్ల ఎంత లాభం, ఇంకెంత హాయి అనే అనుకుంటాము. బాంకుల్లో, సినిమాల్లో, ఏ మాత్రం రద్దీ వుండదు. స్కూళ్లలో సీట్లకోసం టెన్షన్ అసలే వుండదు. రోడ్లపైన వాహనాల రాక పోకలూ, పెట్రోలు పొగలు తక్కువగా వుండటం లో వుండే సుఖం సరే సరి. బస్సుల్లో నిలబడటం దాదాపు మర్చేపోతాం. పార్కుల్లో పిల్లల గోలకంటే పిట్టల గోలే ఎక్కువగా వినిపిస్తుంది. వచ్చిన కొత్తలో పొద్దున్నే
పాలవాడి పిలుపులూ, ఆకుకూరలమ్మేవాడి అరుపులూ లేక బెంగతో బాధ పడ్డవాళ్ళెందరో!
పట్టణాల పరిశుభ్రత, దైనందిన జీవితంలో సౌలభ్యం, వనరుల కోసం భయంకరమైన పోటీ లేకపోవటం, ఇవన్నీ తక్కువ జనాభా కున్న కొన్ని కోణాలు.

కానీ కొన్ని సార్లు, మరీ ఇంత తక్కువ కాకుండా ఇంకా కొంచెం జనాభా వుంటే బాగుండేదేమో అని కూడా
అనిపించే సందర్భాలున్నాయి. ముఖ్యంగా, ఇక్కడ పనిమనుషులని పెట్టుకోవటం అసాధ్యం, బ్రతుకంతా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి, మన బట్టలు మనమే వుతుక్కోవాలి, మన ఇల్లు మనమే ఊడ్చి తుడుచుకోవాలి అన్న విషయం అర్ధమవగానే “మనం అసలు ఇక్కడికెందుకొచ్చాం” అన్న ప్రశ్న రాక మానదు. ఎంత పెద్ద డాక్టరయినా, మెర్సిడీస్ బెంజి కారున్నా, ఇంటికెళ్ళగానే, గిన్నెలు కడగటమో, డిష్ వాషర్లో వేయటమో తప్పదు. పక్క మనిషి సాయం ఇంత ఖరీదయినది కావటంతో ఇక్కడ అందరూ చాలా వరకు శారీరకమయిన పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇంటికి రంగులు వేయటం, చిన్న చిన్న వడ్రంగం పనులూ, రిపేరులూ, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. మనలాంటి వాళ్ళకి ఇలాంటి పనులేవీ రావని నవ్వుతారు కూడా!

పోతే, గత కొద్ది సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో శిశు జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇంకొక వైపు పరిశుభ్రమయిన వాతావరణం, ఆరోగ్యకరమయిన తిండీ, ఎక్కువగా ఒత్తిడి లేని లేని జీవన సరళీ, అత్యాధునికమయిన వైద్య సదుపాయాలూ, వీటన్నిటి వలన సగటు జీవితకాల పరిమితి అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో, ఇంకా కొద్ది ఏళ్లలో యువతీ యువకులూ, మధ్య వయసు వారికంటే వృధ్దులసంఖ్య పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు సంఘంలో వుత్పత్తులు పెంచేవారి సంఖ్య తక్కువగా, దానిని అనుభవించేవారి సంఖ్య ఎక్కువగా అవుతుంది. దీనీనే “పాపులేషన్ ఏజింగ్” సమస్యగా గుర్తించి ప్రభుత్వం ఇతర దేశాలనించి వలస ప్రజలని ప్రోత్సహిస్తోంది.

దీని ప్రభావం ఎక్కువగా వృద్ధుల మీద పడుతుందేమోననిపిస్తుంది కొన్ని సార్లు. ఇప్పటికే “ఓల్డ్ ఏజ్ హోం” లలో
పెద్దవారి సంఖ్య చాలా ఎక్కువగా వుండి దానికి తగినట్టు డాక్టర్లూ, నర్సులూ లేకపోవటం తో చాలా కష్టంగా వుంది. ఇది ఇంకా ఘోరంగా మారొచ్చు నంటున్నారు. అరవై యేళ్ల స్త్రీ తొంభై యేళ్ళ తల్లినేం కనిపెట్టి వుండగలదు, ఆవిడని చూసుకోవటానికే పిల్లలు లేనప్పుడు!

నానాటికీ క్షీణిస్తున్న జనాభాని పెంచుకోవటానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. రెండు సంవత్సరాల క్రితం పిల్లలని కంటే మూడు వేల డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ దానివల్ల జనాభా పెరగటం మాటెలా వున్నా, పాకెట్ మనీ కావాలసినప్పుడల్లా పిల్లలని కంటే సరిపోతుంది అనుకునే టీనేజర్స్ ఎక్కూవ కావటంతో అదంత మంచి ఆలోచన కాదేమోనన్న ఆలోచనలో పడింది.

అనుకుంటాం కానీ, మన చుట్టూ వున్న మనుషులు మనకెంత మానసిక భద్రత నిస్తారు! అది లేకపోవటంతో పాపం ఇక్కడ వాళ్ళెంతో ఒంటరిగా వుంటారు. వాళ్లకది అలవాటే కానీ, మనకి అలవాటు లేకపోవటంతో సమస్యలా అనిపిస్తుంది. తిండీ, నిద్ర ల్లాగే అయినవాళ్ల ఆప్యాయత కూడా కనీసావసరమేనేమో. ఎక్కువయినా, తక్కువయినా ఇబ్బందే మరి!
——————————————————————————-

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s