ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది. అమెరికాకి పెట్రోలు పిచ్చి!
క్రీడాభిరామం
(ఏ. పీ. వీక్లీ. సెప్టెంబరు 10, 2007)
ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది. అమెరికాకి పెట్రోలు పిచ్చి, ఇండియాకి చదువుల పిచ్చి, ఇజ్రాయెల్కి యుద్ధాల పిచ్చి, అరబ్బు దేశాలకి ఆయుధాల పిచ్చి. అలాగే ఆస్ట్రేలియాకి ఆటల పిచ్చి. ఆ విషయం వాళ్ళ క్రికెట్టు జట్టుని చూస్తేనే అర్ధమవుతుంది. క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఏ ఆటైనా వాళ్ళు జీవన్మరణ సమస్య లా తీసుకుంటారు. మన వాళ్ళ లాగా, “ఆ! గెలుపూ ఓటములు దైవాధీనాలు. మనం నిమిత్త మాత్రులం. అంతా మాయ,” అన్నట్టు ఆడనే ఆడరు. ఈ ఆట గెలవకపోతే చచ్చి పోతామేమో అన్నంత పట్టుదలగా ఆడతారు. అందుకే ఒలింపిక్స్ లో గానీ, కామన్వెల్త్ ఆటల్లో గానీ సంచులతో పతకాలు పట్టుకెళ్తారు. “పూను స్పర్థలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే” అన్నారు గురజాడ. కానీ ఇక్కడ అన్ని స్పర్థలూ పోటిలూ క్రీడల్లఓనే.
స్కూల్లో ఏ పరీక్షయినా సరే, మిగతా పిల్లలకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుని, మన పిల్లలకు టీచర్లు అందరికంటే తక్కువ మార్కులు వేసారని తిట్టటానికి వీలే వుండదు. ఎందుకంటే మనకి టీచర్లు మిగతా పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయో చచ్చినా చెప్పరు కాబట్టి.
“ఇలా అయితే పిల్లలకి కాంపిటీటివ్ స్పిరిట్ ఎలా వస్తుంది?”, ఇండియా లో ఐ.ఐ.టీ కోచింగ్ సెంటర్లని తలచుకుంటూ అడిగాను, మా అమ్మాయి టీచర్ని. ఆవిడ నావైపు జాలిగా చూస్తూ, “చదువు కాంపిటీషన్ కోసం కాదు. అది లైఫ్ స్కిల్స్. అలాంటి విషయాల్లో పోటీ వుంటే కొంతమంది పిల్లలు నిరుత్సాహ పడి చదువు వదిలేస్తారు. బ్రతకటానిక్కావలిసిన అక్షరాస్యతని వాళ్ళు మిస్ అవుతారు కదా? అందుకే చదువుల్లో పోటీ వుండకూడదు. కాంపిటీటివ్ స్పిరిట్ కోసం ఆటల పోటీలు వున్నాయిగా,” అన్నారు.
నిజమే, ఇక్కడ స్కూల్లలో చిన్నప్పట్నించే ఆటల్లో చేర్పించి చాలా ప్రోత్సహిస్తారు. అన్ని సబ్జక్టులతోపాటు విధిగా ఆటలని ఒక సబ్జక్టుగా నియమించి, ప్రతీ విద్యార్థీ విద్యార్థినీ ఏదో ఒక ఆటలో పాల్గొనేటట్టు చేస్తారు. చాలా క్రీడా సంఘాలు పాఠశాలలన్నీ గాలించి ప్రతిభావంతులైన క్రీడా కారులకి ఎన్నో వసతులూ, సదుపాయాలూ కల్పించి ఆడిస్తాయి. వివిధ స్థాయిల్లో అనేక పోటీలు జరిపి పిల్లలని వాటిల్లో పాల్గొనటానికి ప్రోత్సాహపరుస్తాయి.
అయితే అలా పోటీల్లో ఆడటానికి ప్రాక్టీసు చేసే పిల్లల తల్లిదండ్రుల ప్రవర్తన అచ్చం మన దగ్గర స్కూలు పరీక్షల్లోలాగే వుంటుంది. కొండొకచో ఇంకా మొరటుగా, చిరాగ్గా వుంటుంది. మిగతా పిల్లలని హేళన చేయటం, కోచ్ తో గొడవపడటం, పెద్దగా అరవటం ఇక్కడ ఆట స్థలాల్లో చాలా సహజం. చాలా మంది పిల్లలు బాహాటంగానే “మా అమ్మా నాన్నలని ప్రాక్టీసుకి తీసుకెళ్ళటం చాలా ఎంబరాసింగ్ గా వుంటుంది” అని ఒప్పుకుంటారు.
స్కూల్లో లెక్కలూ సైన్సూ అద్భుతంగా చేసేవాళ్ళకంటే స్కూల్ టీంలో వుండేవాళ్ళకి గౌరవం ఎక్కువ. కొంచెం బక్క పలచగా, సగటు ఆస్ట్రేలియన్ల కంటే పొట్టిగా వుండే ఏషియన్లు ఆటల్లో వెనకబడి సిగ్గుతో చితికి పోతూ వుంటారు. భారతీయ సంతతికి చెందిన పిల్లలు ఎక్కువగా టెన్నిస్, ఈత నేర్చుకుంటారు.
వీళ్ళు ఆటల్లో ఇంత బాగా రాణించటానికి, మంచి ఒడ్డూ పొడుగుతో వున్న వాళ్ళ దేహ దారుఢ్యం, ఎక్కువ స్టామినా, తినే తిండీ, శ్రధ్ధాసక్తులతో పాటు మంచి వసతులు కూడా ఒకటి. మంచి టెన్నిస్ కోర్టులూ, ఈత కొలనులూ, పోటీలు నిర్వహించే క్లబ్బులూ, ఒకటేమిటి, డబ్బుంటే వెన్నెల్లో గొడుగేసుకోవచ్చు. వివిధ జట్ల ఎంపికలో, ప్రాంతీయ తత్వాలూ, కుల తత్వాలూ, డబ్బూ ఇవేవీ కాకుండా కేవలం ప్రతిభ ప్రాతిపదిక మీదే కావటంతో మెరికల్లాటి జట్లు వుంటాయి.
క్రికెట్ లో మకుటం లేని మహారాజులే అయినా ఇక్కడ క్రికెట్ కంటే ఫుట్బాల్ అంటేనే మక్కువ ఎక్కువ. ఈత, టెన్నిస్, టేబిల్ టెన్నిస్, అథ్లెటిక్స్, గుర్రపు పందాలు కూడా ఇక్కడ చాలా పాప్యులర్ ఆటలు.
అన్ని రకాల ఫుట్బాల్ లో కెల్లా ఏ.ఎఫ్.ఎల్. (ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్) నిర్వహించే ఆజీ రూల్స్ ఫుట్బాల్ (ఫుటీ) అన్నిటికంటే ఎక్కువ ఫాలోయింగ్ (ప్రపంచంలో ఎక్కువగా ఫాలోయింగ్ వున్న ఆటల్లో మూడవ స్థానం) వున్న ఆట. ఆస్ట్రేలియాలో వివిధ రాష్ట్రాల్లోంచి తలపడే పదహారు టీంలతో ఈ ఆట ఒక బిలియన్ డాలర్ల పరిశ్రమ. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రం నించి ఈ ఆటలో రెండు జట్లు పాల్గొంటాయి. పోర్ట్ అడిలైడ్, అడిలైడ్ క్రోస్ గా పిలువబడే ఈ జట్ల మీద వుండే అభిమానం అడిలైడ్ నగరాన్ని రెండు గా చీలుస్తుందంటే అతిశయోక్తి కాదు. కిందటి వారం క్రోస్ జట్టు కేప్టెన్ మార్క్ రిషొటొ రిటైర్మెంట్ ఒక చక్రవర్తి మహాభినిష్క్రమణం లా పేపర్లలో వివరించబడింది. కోడి గుడ్డు ఆకారంలో వుండే ఎర్రని బంతితో ఆడే ఈ ఫుటీయే కాకుండా, మామూలు సాకర్, రగ్బీ కూడా ఎక్కువగానే ఆడతారు.
ప్రపంచంలో జరిగే నాలుగు టెన్నిస్ గ్రాండ్ స్లాం పోటీ ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటి. లేటన్ హీవిట్ కీ పాట్ రాఫ్టర్ కీ వున్న గ్లామరూ, డబ్బూ, పాప్యులారిటీ ఇంతా అంతా కాదు! ఒలింపిక్ ఈత పోటిల్లో లెఖ్ఖ లేనన్ని పతకాలు సంపాదించిన ఇయాన్ థోర్ప్ ఇక్కడ అందరికీ ఆరాధ్య దైవం. అంతా అతన్ని ముద్దుగా “థోర్పీడో” అని పిలుచుకుంటారు. ప్రతీ స్కూలు విద్యార్థీ ఎనిమిదో తరగతి కల్లా నాలుగు వందల మీటర్లు ఈద గలిగి వుండాలి అన్నదే ప్రభుత్వ నినాదం.
హాకీకి ఎక్కువగా అభిమానులు లేకపోయినా ప్రతీ సారీ ఒలింపిక్, కామన్ వెల్త్ హాకీ పోటీల్లో పతకాలు వాళ్ళవే!
క్రికెట్ లో ఆస్ట్రేలియన్ల ప్రతిభ గురించి వేరే చెప్పనవసరం లేదు. దేశానికి చెప్పలేనన్ని విజయాలు చేకూర్చి పెట్టే మేటి ఆటగాళ్ళు కూడా మామూలు ప్రాంతీయ పోటీల్లో ఆడటమే వాళ్ళ విజయ రహస్యమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రపంచంలో కెల్లా అత్యద్భుతమైన బాట్స్ మేన్, సర్ డొనాల్డ్ బ్రాడ్మేన్ తొంభై రెండేళ్ల పండు వయసులో ఆరేళ్ళ క్రితం అడిలైడ్ నగరంలో మరణించారు. చివరి సంవత్సరాల్లో ఎవరితోటీ మాట్లాకుండా ఒంటరి గా జీవించిన ఆయన టెండుల్కర్ కోసం ఒక పార్టీ కి రావటం విశేషం. ఆయన పేరిట ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళని విడుదల చేసింది. అడిలైడ్ లో బ్రాడ్మేన్ మ్యూజియం, అడిలైడ్ ఓవల్ తో పాటు పెద్ద పర్యాటక విశేషం. ఏషస్ పోటీల్లీఓ ఇంగ్లండుతో తలపడ్డా ఇక్కడ ఇండియా తో జరిగే పోటిలను చాలా శ్రద్ధగా చూస్తారు. టెండుల్కర్, లక్ష్మణ్ అంటే జనం పడి చస్తారు.
వింతైన విషయం ఏమిటంటే ఇంత క్రీడాభిమానం వున్నా, ఆస్ట్రేలియన్లకి క్రీడా స్ఫూర్తి కొంచెం తక్కువనే చెప్పాలి. ఆటలో ప్రత్యర్ధి జట్టుని అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి చికాకు పెట్టటం, విజయం లో మితిమీరిన సంతోషం ప్రకటించటం, ఓటమిలో చిన్నపిల్లల్లా ఉక్రోషంగా అరవటం అన్నీ వాళ్ళకున్న లక్షణాలు. ఇంకా విచిత్రంగా వాళ్ళు ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ క్రీడాకారులు జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యానాలు చేస్తారని ఆరోపిస్తారు.
ఆస్ట్రేలియన్ల క్రీడాభిమానానికి వున్న ఇంకొక వికృత కోణం, పందాలు. రెండు చీమలు నడచి వెళ్తూ వుంటే చుట్టూ వుండే ఆస్ట్రేలియన్లు అందులో ఏది వేగంగా నడుస్తుందని పందెం కట్టుకుంటారని ప్రతీతి. పుట్టుక నించి చావు వరకూ, ప్రతీదీ పందాలకు దారి తీస్తుంది. గుర్రపు పందాలు ఖరీదైన గుర్రాలతోనూ, ట్రైనెర్లతోనూ, బెట్టింగ్ ఏజెన్సీలతోనూ కూడుకున్న పెద్ద పరిశ్రమ. ఈ నెల గుర్రాలకు సోకిన వింతైన ఫ్లూ జ్వరం వల్ల మిలియన్ల డాలర్ల నష్టం జరగొచ్చని ఊహిస్తున్నారు.
ఏథెన్స్ లో 2004 లో జరిగిన ఒలింపిక్ పోటీల్లో ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పతకాలు సాధించింది. ఇందులో పదిహేడు బంగారు పతకాలు వుండగా, పదహారు వెండి, పదహారు కాంస్య పతకాలూ వున్నయి. ఈ ఒలింపిక్ పోటిల్లో, స్త్రీల రోయింగ్ (పడవ నడపటం) జట్టులో వింతైన వివాదం చెలరేగింది.
ఆ జట్టు వేగంగా పడవ నడుపుతూ కాంస్య పతకానికి చేరువలో ఉండగా, సాలీ రాబిన్స్ అనే జట్టు సభ్యురాలు, అలసిపోయినట్టు వెనక్కి వాలిపోయారు. దాంతో వాళ్ళ జట్టు నాలుగో స్థానానికి దిగజారి పతకాన్ని పొందే అవకాశం పోగొట్టుకున్నారు. ఆ అపజయంతో ఆస్ట్రేలియాలోని పత్రికలూ, ఇతర క్రీడా సంఘాలూ మండి పడ్డాయి. ఆ జట్టులోని ఇంకొక సభ్యురాలు కాట్రోనియా ఓలివర్ రాబిన్స్ పై పదిమందిలో చేయి చేసుకున్నారు. చెప్పేదేమిటంటే ఇక్కడ ఆటల పోటీలలో అంతంత ఆవేశాలుంటాయి. “ఒక బిలియన్ జనాభా వున్న మీ దేశం నించి అసలు మంచి ఆటగాళ్ళే రారెందుకు?” అని వాళ్ళు కుతూహలంగా అడిగినప్పుడు మనం ఏమి చేయగలం, ఏడవలేక నవ్వటం తప్ప?
nice post n good info