తెలుపు-నలుపు

“ఏ దేశ చరిత్ర చూసినా, ఏమున్నది గర్వ కారణం, నర జాతి చరిత్ర సమస్తం, పర పీడన పరాయణత్వం” అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. ఇందుకు ఆస్ట్రేలియా చరిత్ర మినహాయింపేమీ కాదు. ఆస్ట్రేలియా చరిత్ర గురించి చిత్ర విచిత్రమైనవీ, పరస్పర విరుధ్ధమైనవీ అయిన వాదాలెన్నో వున్నాయి.

ఏ దేశ చరిత్ర చూసినా….
-శారద

“ఏ దేశ చరిత్ర చూసినా, ఏమున్నది గర్వ కారణం, నర జాతి చరిత్ర సమస్తం, పర పీడన పరాయణత్వం” అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. ఇందుకు ఆస్ట్రేలియా చరిత్ర మినహాయింపేమీ కాదు. ఆస్ట్రేలియా చరిత్ర గురించి చిత్ర విచిత్రమైనవీ, పరస్పర విరుధ్ధమైనవీ అయిన వాదాలెన్నో వున్నాయి.

యూరోపు నించి వలస వచ్చిన వాళ్ళూ ఖైదీల కంటే ముందు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలనించీ ఎబోరిజీన్లు నివసిస్తూవుండే వారు. కొద్ది యేళ్ళ కింద దాదాపు రెందు లక్షల ఏళ్ళ కింది మానవ అవశేషాలు తవ్వకాల్లో బయట పడ్డాయి. దానితో ఆఫ్రికాలో ఆది మానవుడు (హోమో సేపియన్) ఉద్భవించేకంటే ముందే ఆస్ట్రేలియాలో మనిషి జీవించి వుండవచ్చని నమ్ముతున్నారు. కానీ ఇంకొన్ని సిధ్ధాంతాలు దాదాపు నలభై యాభై వేల యేళ్ళ కింద మానవుడు ఇతర భూభాగాలనించి ఇక్కడికి వలస వచ్చి ఉండొచ్చు నని ప్రతిపాదిస్తున్నాయి.

ఏది ఏమైనా, పదిహేడవ శతాబ్దిలో డచ్చివారు మొదటి సారి ఆస్ట్రేలియాలో కాలు మోపటంతో వారి లిఖిత చరిత్ర మొదలైంది. పదిహేడవ శతాబ్ది మొదట్లో డచ్చి పడవలు వ్యాపార నిమిత్తమై సిలోన్, జావా ద్వీపాలకు ప్రయాణిస్తూ, కొన్నిసార్లు దారి తప్పి ఆస్ట్రేలియా పశ్చిమ తీరాన్ని చేరేవి. 1616 లో మొదటి సారి డచ్చి వారు పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో వారి రాకను సూచిస్తూ ఒక శిలా ఫలకాన్ని వుంచారు. 1642 లో డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దక్షిణ భూగోళంలో వున్న భూభాగం కోసం వెతకటానికి ఒక పెద్ద ఎక్స్పెడిషన్ను పంపింది.ఏబెల్ టాస్మాన్ అనే పడవ ఈ కార్యక్రమంలో భాగంగా రెండు సార్లు దక్షిణానికి వచ్చి టాస్మానియా దీవులను, న్యూజీలాండ్ దీవులను కనుక్కొంది. ఎందుకనో పదిహేడవ శతాబ్ది చివరికల్లా డచ్చి వారికి ఆస్ట్రేలియా సరదా తీరిపోయింది.

అప్పటికే 1622 లో బ్రిటిష్ నావికులు ఆస్ట్రేలియాలో కాలు మోపారు. డచ్చి వారికిలాగే బ్రిటిష్ వారికీ మొదట ఆస్ట్రేలియా పశ్చిమ తీరం ఏమంత ఆకర్షణీయంగా అనిపించలేదు. అయితే 1769లో కెప్టెన్ జేమ్స్ కుక్ “ఎండెవర్” అనే పడవలో భూమధ్య రేఖ నించి దిగువగా వీనస్ నక్షత్రాన్ని చూడాలని ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో భాగంగా ఆయన న్యూజీలాండ్ దీవులపై బ్రిటిష్ పతాక ఎగురవేసారు. అటు నించి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆయన పడవ ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని చేరింది. ఆ ప్రదేశమే ఇప్పుడు బోటనీ బే గా ప్రసిధ్ది కెక్కింది.

1776లో అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు బ్రిటిష్ ప్రభుత్వాన్నించి స్వతంత్రం ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాయి. దానితో బ్రిటిష్ ప్రభుత్వానికి తన ఖైదీల చెరసాలలకోసం కొత్త ప్రదేశాన్నెతకవలిసిన పరిస్థితి ఏర్పడింది. కిక్కిరిసి పోయిన బ్రిటన్ జైళ్ళనించి ఖైదీలను ఆస్ట్రేలియా దేశానికి తరలించారు. ఆ ఖైదీలు కొత్త ప్రదేశంలో పంటలు పండించీ, గనులు తవ్వీ బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్థకి ఉపయోగ పడేవారు. పంతొమ్మిదో శతాబ్దిలో విక్టోరియా రాష్ట్రంలో బంగారం బయట పడటంతో ఆస్ట్రేలియాకి “గోల్డ్ రష్” ప్రారంభమైంది. దాంతో ప్రజలు తండోపతండాలుగా ఆస్ట్రేలియా ఖండానికి రావటం మొదలుపెట్టరు. పంతొమ్మిదో శతాబ్దం చివరికి బ్రిటిష్ ప్రభుత్వం ఖైదీలను ఆస్ట్రేలియాకి పంపే పధ్ధతికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. 1788 నించి 1868 వరకూ దాదాపు లక్షా డెభ్భై వేల మంది ఖైదీలు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ ఖైదీలు చాలా మంది తరువాత ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసారు.

1901లో ఆస్ట్రేలియా కామన్వెల్త్ దేశంగా స్వతంత్రం ప్రకటించుకుంది. పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా, ఇంగ్లండు రాజ వంశీయులపై వారికెంతో మోజు. అందుకే ఇంకా బ్రిటిష్ రాణిగారే వారి రాజ్యాంగ అధిపతి. ఆమె ప్రతినిధిగా ఇక్కడ గవర్నర్ జెనరల్ వుంటారు.1999లో రిపబ్లిక్ గా మారటమా, లేక బ్రిటిష్ రాజ వంశీయుల అనుయాయిగానే వుండటమా అన్న విషయంలో రెఫరెండం జరిగింది. ప్రజలందరూ మహా రాణి వైపే మొగ్గు చూపారు.

ఇంత చరిత్ర గతిలో, ఒక కొత్త దేశం ఆవిర్భావంలో, సామ్రాజ్యవాదపు దేవత రథ చక్రాల కింద నలిగిపోయిన దీనులు ఎబోరిజీన్లు. వీరు ఆస్ట్రేలియా ఖండంలో వేల యేళ్ళ నించీ నివసిస్తున్న ప్రజలు. లావుగా, నల్లగా, పొట్టిగా, చప్పిడి ముక్కుతో, ముభావంగా వుండే వీళ్ళు చూపులకి కొంచెం అదో రకంగా వుంటారు. ప్రకృతికి దగ్గరగా, భూదేవిని పూజిస్తూ, నాగరికత అని మనం అనుకునే సమాజానికి దూరంగా ప్రశాంతంగా వారి మానాన వాళ్ళు బ్రతుకుతూ వుండగా వీరి పాలిటి శని లాగా శ్వేత జాతీయులు వచ్చి వీళ్ళ బ్రతుకు దుర్భరం చేసారు.

ఆస్ట్రేలియా తీరంలో దిగిన శ్వేత జాతీయులందరూ, కొత్త ప్రదేశంలో సహజంగా వచ్చే అభద్రతా భావం వల్లనో, లేక తర తరాల జాత్యహంకారం వల్లనో కానీ, స్థానికంగా బ్రతుకుతున్న ఎబోరిజీన్లని జంతువులని వేటాడినట్టు వేటాడి చంపారు. చాలా సంవత్సరాలు ఎబోరిజీన్లని హత్య చేయటం శిక్షా స్మృతిలో నేరంగా కూడా పరిగణించలేదంటే జాత్యహంకారం ఏ స్థాయిలో వుండేదో ఊహించొచ్చు.

వలస వచ్చిన యూరోపియన్లు గుంపులు గుంపులుగా వేటకి వెళ్ళినట్టు వెళ్ళి ఎబోరిజీన్లని హత్య చేసే వారు. వారి స్త్రీలని మానభంగం చేసి, వారిని చెప్పరాని హింసలు పెట్టారు. ఆయుధాలతో హత్య చేయటమే కాకుండా, వాళ్ళకమ్మే పిండిలో, వాళ్ళ నివాస స్థలం దగ్గర వుండే జలాశయాల్లో విషం కలిపి వాళ్ళని గుంపులు గుంపులుగా చంపేసారు. ఇవే కాక, వాళ్ళలోకి మశూచి, అమ్మ వారు, లైంగిక వ్యాధులూ అన్నీ ప్రవేశ పెట్టారు. ఆరు వందల తెగలుగా విడిపోయి దాదాపు ఏడు లక్షలు వుండే ఎబోరిజీన్ల జనాభా 1930 నాటికి నలభై శాతానికి పడిపోయిందంటే మన మనసులు కరగక మానవు. టాస్మానియాలో 1803 లో అయిదు వేలకి పైగా ఎబోరిజీన్లు నివసిస్తూ వుండగా, యాభై ఏళ్ళ అనంతరం 1858లో వారి సంఖ్య కేవలం పదిహేను! ఇంత పైశాచికంగా, దారుణంగా మానవ జాతి చరిత్రలో ఎక్కడా హత్యలు జరిగి వుండవు.

సహించినంత కాలం సహించినా, కొంత కాలం తరువాత ఎబోరిజీన్లు తిరగ బడ్డారు. అయినా యూరోపియన్ల తుపాకుల ముందు నిలువ లేక పోయారు. 1838 లో మయాల్ క్రీక్ అనే చోట కొంత మంది శ్వేత జాతీయూలు కొందరు ఎబోరిజీన్లను పట్టుకొని కట్టి వేసి కాల్చి చంపారు. దీనిని ప్రభుత్వం నేరంగా పరిగణించి విచారణ మొదలు పెట్టింది. పత్రికలూ, ప్రజలూ మండి పడ్డాయి. హత్య కు వ్యతిరేకంగా కాదు, విచారణకు వ్యతిరేకంగా! “ఎబోరిజీన్లను చంపటం కూడా నేరమేనా?” అని ప్రశ్నిస్తూ సంపాదకీయాలు వెలువడ్డాయంటే బహుశా మనుషులమై పుట్టినందుకు మనమందరమూ దేవుడి ముందు సిగ్గుతో తల వంచుకోవాలేమో! ఎట్టకేలకు నేరస్థులందరకీ మరణ శిక్షలు పడ్డాయి.

దీనికంటే భరించలేని ఘోరమైన నేరం ఎబోరిజీన్ల పిల్లల్నెత్తుకు పోవటం! మాన భంగాలకి గురైన ఎబోరిజీన్ స్త్రీలకి పుట్టిన సంతతి రెండు జాతులకీ మధ్య వింతగా వుండే వారు. ఇలాటి వాళ్ళ వళ్ళ శ్వేత జాతి సంకరమై పోతుందనీ, వాళ్ళు పెద్దయి పగ తీర్చుకుంటారనీ, రక రకాల అర్థం లేని కారణలు చెప్పి, ప్రభుత్వం వాళ్ళని తల్లుల దగ్గర్నించి ఎత్తుకెళ్ళి అనాథాష్రమాల్లో చేర్పించేది. ఈ వ్యవహారమంతా చట్ట బధ్ధంగానే నడిచేది. దాదాపు లక్ష మంది పిల్లలు 1910 నించి 1970 మధ్యలో వాళ్ళ కుటుంబాలనించి బలవంతంగా వేరు చేయ బడ్డారు. ఈ పిల్లలనే ‘స్టోలెన్ జెనరేషన్ ‘ గా వ్యవహరిస్తారు.

దాదాపు ఇరవైయవ శతాబ్ది అర్ధ భాగం వరకూ ఆస్ట్రేలియాని మచ్చ లేని శ్వేత జాతి దేశంగా (white Australia) వుంచటానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. కానీ మానవ హక్కుల సంఘాలూ, సంఘ సంస్కర్తలూ ముందుకొచ్చి వత్తిడి తేవటంతో అలాటి చట్టాలన్నిటికీ స్వస్తి చెప్పింది. గత పదేళ్ళుగా శ్వేత జాతీయులు వాళ్ళ నేర చరిత్రనీ, ఎబోరిజీన్లని వాళ్ళు పెట్టిన హింసలనీ తప్పుగా ఒప్పుకుంటున్నారు

స్టోలెన్ జెనెరేషన్ లో తల్లులనించి విడిపోయిన పిల్లలందరూ పెద్ద వాళ్ళయ్యారు. ప్రభుత్వం నిర్ద్వంద్వంగా గత కొన్ని ఏళ్ళుగా వాళ్ళని క్షమాపణ కోరుకుంటూనే వుంది. 1995 లో ఏర్పాటైన ప్రభుత్వ కమీషన్ ఉత్తరువుల ప్రకారం ఈ పిల్లలందరినీ వెతకి పట్టుకునే కార్యక్రమం మొదలైంది. వీరిలో మొట్ట మొదటగా 1958 లో అపహరించ బడ్డా బ్రూస్ ట్రెవోరో అనే వృధ్దునికి ప్రభుత్వం దాదాపు అర మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించింది.

ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏ ప్రభుత్వ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, ఆ పట్టణం నిర్మాణంలో నాశనమైన తెగల పేర్లు ఉటంకించి, వాళ్ళని క్షమాపణ అడిగి, జీవితాలు తారుమారైన వాళ్ళని స్మరించుకొని కానీ మొదలు పెట్టగూడదు. ఇది ప్రభుత్వ ఉత్తరువు.

మొదటగా వలస వచ్చిన యూరోపియన్లు ఎబోరిజీన్లు మనుషుల్లో లెక్క కాదు కనక ఈ భూబాగం ఎవ్వరికీ చెందదని వాదించారు. (terra nullius). కానీ1982 లో ఎడ్డీ మేబో అనే ఎబోరిజీన్ కుల పెద్ద ఆ సిధ్ధాంతాన్ని సవాలు చేస్తూ క్వీన్స్ లాండ్ హై కోర్టులో దావా వేసారు. కోర్టు అతని వాదనను అంగీకరించి అన్ని ప్రభుత్వాలూ ఇక్కడ వేల ఏళ్ళ నించీ నివసిస్తున్న ఎబోరిజీన్ తెగలకు పట్టాలున్న పక్షంలో భూమి తిరిగి ఇచ్చెయ్యాలని సూచించింది.

నిజం చెప్పాలంటే ఎబోరిజీన్ల జీవితాలు ఇన్నిన్ని చట్టాలు చేసినా చాలా దయనీయంగా వుంది. తాగుడు, జూదం, మాదక ద్రవ్యాలూ, గృహ హింస అన్నిటితో వాళ్ళు భయంకరమైన జీవితాలు గడుపుతున్నారన్నది నగ్న సత్యం. అయితే వాళ్ళ బ్రతుకులు బాగు చేయాలంటే ఏమి చేయాలో మాత్రం ఎంత మంది మేధావులకీ అంతు పట్టటం లేదు. వాళ్ళని తాగుడు మానిపించే ప్రయత్నం చేయకపోగా, ప్రభుత్వం వారికి సారాయిని తక్కువ ధరకు అమ్ముతుంది. వాళ్ళకి సారాయి అందుబాటులో లేకపోతే పెట్రోలు పొగ తాగటమో, మాదక ద్రవ్యాలు అమ్మటమో చేస్తారన్నది ప్రభుత్వం వాదన.

తమ కొరకై చట్టాలు చేస్తున్న శ్వేత జాతి ప్రభుత్వంపై వారికేమాత్రం నమ్మకం లేదు. బహుశా తర తరాలుగా మనని హింసించిన వాళ్ళని నమ్మటం, ద్వేషించ కుండా వుండటం అసాధ్యం కాబోలు.
నిరాశ నిండిన చూపులతో, బ్రతుకు మీదా, భవిష్యత్తు మీదా ఏ మాత్రం ఆసక్తి లేకుండా, తాగిన మత్తులో జోగుతూ, అన్ని రకాల వ్యాధులతో మగ్గుతూ, “కెన్ ఐ హేవ్ ఏ డాలర్, ప్లీజ్” అంటూ అక్కడక్కడా అడుక్కుంటూ వుండే ఎబోరిజీన్లని చూసినప్పుడు మాత్రం మనసు బాధతో మూలగకుండా వుండదు.


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

2 thoughts on “తెలుపు-నలుపు

  1. పింగుబ్యాకు: వైద్యో నారాయణో హరిః « నీలాంబరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s