తెలుపు-నలుపు

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ…..
                                                                శారద

(ఏ పీ వీక్లీ అక్టొబరు 11, 2007)
 

ఏ దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలన్నా అక్కడి లలిత కళల గురించి తెలుసుకుంటే చాలు.  ఏ దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలన్నా అక్కడి లలిత కళల గురించి తెలుసుకుంటే చాలు. భారత దేశం కళలకి కాణాచి. భరత నాట్యం, కూచిపూడి, యక్షగానం, నాటకం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఒకటేమిటి, నాగరికత  ఉఛ్ఛ దశని సూచించే అనేకానేక లలిత కళలు వాళ్ళకే సొంతం. స్వతహాగా భారతీయులు చాలా స్వాభిమానం గలవారు. అందుకే వాళ్ళు వాళ్ళ గడ్డ వదిలి ఎంతదూరం వెళ్ళినా వాళ్ళ సంస్కృతిని మరచిపోరు. పరాయి పాలనలో మూడు వందల యేళ్ళు మగ్గినా వాళ్ళ సంప్రదాయాలను, అలవాట్లను, అభిరుచలనీ వదులుకోలేరు.

ఇవన్నీ మా స్నేహితురాలు క్లారా పుస్తకాలు చదివి ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. పరిచయమవ్వగానే నాతో, “నాకు భారతీయులంటే చాలా అభిమానం. ఇంత దూరం వచ్చినా నువ్వు మొహం మీద చిన్న బొట్టు పెట్టుకుంటావు చూడు! ఆ ఆత్మ విశ్వాసమంటే ఇంకా ఇష్టం,” అంది. నాకు చాలా గర్వం వేసింది. మా ఇంట్లో బొమ్మల కొలువూ, మా స్నేహితుల ఇంట్లో వరలక్ష్మీ వ్రతమూ చూసి తనకి కూడా చీర కట్టి, బొట్టు పెట్టమని బ్రతిమిలాడింది.  ఆహా ! మనదెంత గొప్ప నాగరికత, ఎంత గొప్ప సంస్కృతి అని మురిసిపోయాను.

అన్ని ఊళ్ళలాగే మా ఊళ్ళోనూ రకరకాల భారతీయ సంఘాలు, అన్నిటికీ కలిపి గొడుగులా ఇంకొక పెద్ద సంఘమూ వుంది. తెలుగు సంఘం వాళ్ళు ఉగాది సందర్భంగా పెద్ద కార్యక్రమం చేస్తున్నారని తెలియగానే క్లారాని రమ్మన్నాను. శనివారం ఆరింటికి వెళ్దామని చెప్పాను. ‘అదేంటి, ప్రోగ్రాం నాలుగున్నరకని వుందిగా”, అంది ఆశ్చర్యంగా పాంప్లెట్ చూస్తూ.
నాకేం చెప్పాలో తోచలేదు. క్రితం ప్రోగ్రాంలో నేనొక్కదాన్నీ నిజంగా నాలుగున్నరకి వెళ్ళి కూర్చుని, ఎదురు చూసి, అందర్నీ తిట్టుకుని పెంచుకున్న బీ.పీ., ఆ తరువాత అందరూ, నా వైపు పురుగుని చూసినట్టు చూస్తూ, “మీకేమీ పనుల్లేవా, సరిగ్గా టైముకొచ్చారు? అంత తీరిగ్గా ఎలా వుంటారో నబ్బా”, అనటమూ, ఆ తరువాత ఎప్పుడో ఏడింటికి మొదలైన ప్రోగ్రామూ గుర్తొచ్చాయి.
ఈ అమ్మాయిని ప్రోగ్రాముకి పిలిచి తప్పు చేస్తున్నానేమో అన్న అనుమానం పెనుభూతంలా పట్టుకుంది. అయినా ఇప్పుడిక చేసేదేమీ లేదు.
“అదా! అది మనకి కాదులే, ఆర్గనైజర్లకి. ప్రేక్షకులం ఆరింటికి వెళ్తే చాలు,” అని సర్ది చెప్పాను.

అనుకున్నట్టే ఆరైనా ప్రోగ్రాముకి ఎవరూ రాలేదు. ఇద్దరు ముగ్గురు మైకులూ, లైట్లూ సవరిస్తున్నారు. సెక్రెటరీ, ప్రెసిడెంటూ మిగతా సంఘం సభ్యులు ఫుల్-సూట్లలో, మెరిసిపోతున్న బూట్లతో నవ్వుతూ హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళ  (రెస్పెక్టివ్)  భార్యలు పెళ పెళ లాడే పట్టు చీరలూ, ధగ ధగ లాడే నగలతో ఒక మూల నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.  క్లారా వున్నట్టుండి నా చెవిలో, “ఆడ వాళ్ళు ఇంత చక్కగా ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటే, మగవాళ్ళు ఎందుకు సూట్లూ- బూట్లూ వేసుకొచ్చారు”, అని అడిగింది. ఇవాళ ఇలా ఎన్ని సార్లు నా గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకుంటుందో అని బెంగ పడుతూ, “మా దేశం మగ వాళ్ళకి వీలయినంత వరకూ బాధ్యతలని భార్య మీదకు తోసేయటం అలవాటు. అందుకని మా సంప్రదాయాన్ని రక్షించుకునే బాధ్యత కూడా ఆడవాళ్ళకే వదిలేసారు,” అని చెప్పాను.

ఏడింటికి ఆడవాళ్ళ మేకప్పులూ,  మగవాళ్ళ క్రాపింగులూ చెదిరిపోతున్నాయని గుర్తించి, ప్రోగ్రాం మొదలు పెడదామా అని కాసేపు చర్చించి ఎట్టకేలకు మొదలుపెట్టారు. ప్రెసిడెంటు ప్యూర్ ఇంగ్లీష్ లో అద్భుతంగా అరగంట సేపు ప్రసంగించారు. ఆ తరువాత పిల్లల కార్యక్రమం అని ప్రకటించారు. “ఆయనెందుకు మీ భాషలో కాకుండా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు,” అన్న క్లారా ప్రశ్నని విననట్టు నటించాను.

“మా పిల్లల డాన్సు టీ బ్రేక్ తరువాత అని చెప్పారు. ఆరున్నరకి బ్రేక్ కదా అని ఏడింటి కొస్తే, ఇంకా మొదలు కూడా పెట్టలేదేమిటి,” రుస రుస లాడుతుంది ఒక పట్టు చీర. నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచింది, కానీ నవ్వితే క్లారా ఎందుకని అడుగుతుంది. నవ్వును దగ్గుగా మార్చి తప్పించుకున్నాను.

పిల్లల కార్యక్రమంలో మొదటగా ఢమాకా లాటి డాన్సు, అన్నారు. హాలంతా చీకటైపోయింది. మళ్ళీ లైట్లు వెలిగేసరికి, స్టేజీ మీద నలుగురు పదిహేడేళ్ళ అమ్మాయిలు! “క్రేజీ కియారే”, పాటకి వాళ్ళు చేసిన ఆ నృత్యమూ, ఆ డ్రస్సులూ చూసి ఇబ్బందిగా కుర్చీలో కదిలాను. ఆ తరువాత, “ధూం”, “ధాం” “ఢీం”, “ఢాం”, “ఛీ”, “థూ”, “పోకిరి వెధవ”, ‘దొంగ రాస్కెల్”, “పళ్ళు రాలగొడతా” వగైరా సినిమాల్లోని పాటలకీ, రీమిక్సులకీ  పిల్లలు చేసిన నాట్యాలు చూసి చెవులు హోరెత్తిపోయాయి, కళ్ళు పుచ్చి పోయాయి. నాకు క్లారా వైపు చూడటానికే భయంగా వుంది.

మెల్లగా టీ బ్రేకు తొమ్మిదింటికి ఇచ్చారు.
“నాకస్సలు ఇలాటి డాన్సులూ పాటలూ ఇష్టం వుండవండీ, కానీ మా పిల్లలు వినరు,” ఒకావిడ అంటోంది చుట్టు వున్న వాళ్ళతో. ఇంకాసేపు అక్కడే వుంటే ఆ కార్యక్రమానికో, లేకపోతే మనుషుల్లో వుండే హిపోక్రసీకో నాకు పిచ్చెక్కటం ఖాయం. అందుకే క్లారా వెళ్దామా అనగానే బయలుదేరాను.

కార్లో క్లారా మౌనంగా వుంది. నేనూ ఎక్కూవగా మాట్లాడించలేదు. మరునాడు ఆఫీసులో క్లారా, “నేను ఈ సంవత్సరం మూడు ఇండియన్ ప్రోగ్రాములకెళ్ళాను. తెలుగు, తమిళ్, బెంగాలి. అందరూ ఇవే డాన్సులు చేసారు. అవి చాలా పాప్యులర్ పాటలా? వాళ్ళు చేసేది ఏ రకమైన నాట్యం? అది భరత నాట్యం కాదూ, కథక్ కూడా కాదు, ఎందుకంటే నేనవి రెండూ చూశాను. అవేమిటీ?” అనడిగింది కుతూహలంగా.

ముందుగా ఈ ఉద్యోగం వదిలేసి వేరేది చూసుకుందామా అన్న ఆలోచన వచ్చింది. చిన్నగా సంబాళించుకొని, “అవా? అవిప్పుడూ ఇండియాలో అన్నిటికన్నా పాప్యులర్. వాటిని బాలీవుడ్ డాన్సులు అంటారు. భరతముని భరత నాట్యం రచించినట్టు, దీనిని ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ఇంకా చాలా మంది కలిసి, తిండి తినకుండా కష్టపడి రచించారు. ఈ పిల్లలందరూ వాళ్ళకి ఏకలవ్య శిష్యరికం చేసి పగలూ రాత్రి డి.వీ.డీ లు చూస్తూ సాధన చేసి నేర్చుకుంటారు,” పామూ చావకుండా కర్రా విరగకుండా చెప్పాను. ఏదో ఆలోచిస్తూ వుండిపోయింది క్లారా.

మా వూళ్ళో ఎక్కువగా ఇండియన్ ప్రోగ్రాములన్ని ఒకే థియేటర్లో జరుగుతాయి. రెండు నెలల తరువాత శ్రీమతి సుధా రఘునాథన్ కచ్చేరీ అదే థియేటర్లో జరిగింది. ఆవిడ మూడు గంటలు అద్భుతమైన కచ్చేరీ చేసారు. రెండేళ్ళుగా ఆ థియేటర్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జాన్, కచ్చేరి తరువాత ఎవరినో అడుగుతున్నాడూ,
“వై డింట్ షి సింగ్ “ధూం మచారే” ?” అని. నాకెందుకో చాలా సిగ్గూ, అవమానమూ అనిపించాయి.

ఎప్రిల్ నెలలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిర్వహించే “ఇండియన్ మేళా” ప్రకటనలు చూసాను. ప్రతీ సంవత్సరం ఆ “మేళా” లో మేమందరం చాలా ఉత్సాహంగా “భారతీయ సంస్కృతి”ని ఆస్ట్రేలియన్లకి పరిచయం చేస్తాము. అక్కడ  ఒక పెద్ద స్టేజీలో పొద్దున పదకొండింటినించి రాత్రి పదకొందింటి వరకూ ఎడతెరిపి లేకుండా బాలీవుడ్ డాన్సులు జరుగుతూ వుంటాయి. అవి చూడటానికి ఇసుక వేస్తే రాలనంత జనం వుంటుంది. పది నించి ఇరవై యేళ్ళలోపు ఆడా-మగా పిల్లలు యథా శక్తి సినిమా తారలని అనుకరిస్తూ వారి వారి శరీర భాగాల్ని వీలైనంత వేగంగా తిప్పుతూ వుంటారు. “ఇండియన్ కల్చర్” ని ఆస్ట్రేలియన్లకి అంత గొప్పగా పరిచయం చేసామని అనుకుంటూ భారతీయులూ, “ఇండియన్ కల్చరంటే బాలీవుడ్” అనుకుంటూ ఆస్ట్రేలియన్లూ తరిస్తారు. 

ఆ పెద్ద స్టేజీకి దూరంగా బిక్కు బిక్కుమనుకుంటూ ఒక చిన్న స్టేజీ మీద భారతదేశం సంప్రదాయక కళాలు, అంటే శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హరికథా కాలక్షేపం లాటివి జరుగుతూ వుంటాయి. దాన్ని చూడడాటినికి ఒకళ్ళిద్దరు భారతీయులూ, ఇంకొంచెం మంది ఆస్ట్రేలియన్లూ వస్తారు. మనవాళ్ళనైతే బతిలాడినా అటువైపు రారు. వచ్చినా, “ఇప్పుడే, బాత్రూం కెళ్ళొస్తాను” అని పారిపోతారు. అందుకే ఈసారి ఆ స్టేజీని పూరీలమ్మే స్టాల్ పక్కన పెట్టమని రిక్వెస్టు చేసారు కొందరు చాదస్తులు, అప్పుడా పూరీలకోసం వచ్చే వాళ్ళని కూర్చో బెట్టొచ్చన్న ఆశతో! అయితే కిందటి సారి, ఆడిలైడ్ లోనే పుట్టి పెరిగి, సంగీతం నేర్చుకోవటానికి కలకత్తాకి వెళ్తూ వుండే జాష్ బెన్నెట్ అద్భుతమైన సితార్ వాదన, చీకట్లో మెరుపు తీగని చూసే అనుభూతి వంటిది.

“ఇండియన్ మేళా” కి వెళ్దామా అనడిగాను క్లారాని జంకుతూనే. ఒక్క క్షణం ఆగి నా వైపు చూసి, “నేను రాను,” అంది. అర్ధమైనట్టుగా తల వూపి బయటపడ్డాను.
                                          ********************************

One thought on “తెలుపు-నలుపు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s