తెలుపు-నలుపు

అభివృద్ది చెందిన దేశాల్లో జీవన శైలి ఎంతో హాయిగా వుంటుంది. జనాభా
 తక్కువ వున్న ఆస్ట్రేలియా అయితే మరీ. మేడి పండా పనస పండా?
                                    -శారద

(ఏ పీ వీక్లీ 25 అక్టోబర్ 2007)
అభివృద్ది చెందిన దేశాల్లో జీవన శైలి ఎంతో హాయిగా వుంటుంది. జనాభా
 తక్కువ వున్న ఆస్ట్రేలియా అయితే మరీ. కరెంటు కోత, పెరిగే ధరలూ, మంచి నీటి సమస్యా,
ఇలాంటివేమిటో ఇక్కడ తెలియనే తెలియంట్టుంటారు. మనం గంటలు గంటలు కరెంటు కోత
 అనుభవిస్తూ కూడా దాన్నొక జోక్ లా పెద్దగా నవ్వేస్తూ వుంటాము. ఇక్కడ
 వుండేవాళ్ళు మాత్రం పావుగంట కరెంటు లేకపోతే పిచ్చెత్తి పొతారు. మాకు తెలిసిన
 ఢిల్లీలోని పోలిస్ అధికారి ఏదో పని మీద అడిలైడ్ వచ్చారు.  ఇక్కడ మేము
 “ట్రాఫిక్ జాం” అని పిల్చుకునే ఘట్టాన్ని చూసి పొర్లి పొర్లి నవ్వారు. “ఇదీ ఒక
 ట్రాఫిక్ జామా? ఢిల్లీకి రండి, చూపిస్తాను ట్రాఫిక్ జాం ఎలా వుంటుందో,” అన్నారు
 కరకుగా. మేమంతా జడుసుకున్నాం.                        

తీర్చి దిద్దినట్టున్న ఇళ్ళూ, తళ తళా మెరిసే రోడ్లూ, వెళ్తూంటే మనకొరకు
 తలుపు తెరిచి పట్టుకుని “ఆఫ్టర్ యూ” అని మర్యాద ఒలికే ప్రజల ప్రవర్తనా
 చూసి వచ్చిన కొత్తలో చెప్పలేనంత ఈర్ష్య కలిగిన మాట నిజం. చాలా రోజులు పగలూ రాత్రీ
 ఆలోచించాను, ఇంత సుఖంగా మన దేశంలో మనం కూడా బ్రతకాలంటే ఏం చేస్తే
 బాగుంటుందా అని. ఇంత వరకూ జవాబు తట్టలేదు.

కానీ రెండు రోజుల కింద పేపర్లో సూట్ కేస్ లో రెండేళ్ళ పిల్ల వాడి శవం దొరికిందనీ, ఆ పిల్లవాణ్ణి తల్లే హత్య చేసిందనీ చదివాను. ఎందుకో ఒక్క సారి “మేడి పండు చూడ మేలిమై యుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు”, పద్యం గుర్తొచ్చింది. అవినీతి, నేరాలు, అస్త వ్యస్తంగా వుండే సాంఘిక వ్యవస్థా, నత్త నడక నడిచే న్యాయ వ్యవస్థా కొద్దో గొప్పో అన్ని చోట్లా వుంటాయేమో. కానీ, కన్న పిల్లల్ని హత్య చేసే తల్లి తండ్రులు మాత్రం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా కనిపిస్తుండొచ్చు.

ఆస్ట్రేలియాలోని భారతీయులు అన్ని రకాల ఉద్యోగాలూ చేస్తారు. అన్నిటికంటే కష్టమైన పని యేమిటి అన్న ప్రశ్నకి అందరి సమాధానమూ దాదాపు ఒకటే. హై స్కూలు లో టీచరు ఉద్యోగం కంటే వత్తిడి పెంచే ఉద్యోగం ఇంకేదీ ఉండదిక్కడ. అన్ని పాశ్చాత్య దేశాల్లో లాగే ఇక్కడ కూడా టీనేజి పిల్లల జీవితాలూ, ఆలోచనలే వింతగా వుంటాయి. ఇండియాలో ఉండే మధ్య తరగతి కుటుంబాల్లోని టీనేజర్లకి ఎంట్రన్సులూ, పరీక్షలూ, డ్రస్సులూ,మేచింగు నగలూ వగైరా సమస్యలుంటాయి. కానీ ఇక్కడ టీనేజీ పిల్లలకి కొంచెం పెద్ద సమస్యలే వుంటాయి, మధ్య తరగతి, సంపన్న కుటుంబాలలో కూడా.

రెండేళ్ళ కింద, బీ.యస్సీ. క్లాసుకి పాఠం చెప్తున్న నాతో, ఒక చిన్నది, “రేపు నాకు రావటనికి వీలవదు. మా బాబుకి బేబీ సిట్టర్ దొరకలేదు,” అంది. ఆ అమ్మాయికి పదిహేడు పద్దెనిమిదేళ్ళకంటే ఎక్కువ వుండవు. అప్పుడే తనకొక బాబా?

ఆస్ట్రేలియాని పట్టి పీడిస్తున్న  సమస్యల్లో టినేజి గర్భాలూ ముఖ్యమైనది. వింతైన విషయం ఏమిటంటే,  మన దేశంలో చాలా వరకు వుండే సమస్యలకు కారణాలేమిటో మనకు చూచాయగా నైనా తెలుసు. ఇక్కడ మామూలు మనుషులకి ఈ టినేజీ
ప్రెగ్నెన్సీల సమస్యకి మూల కారణం ఏమిటో అంతే బట్టదు. చాలా వింతగా అనిపించినా నిజం అదే. 2001 సెన్సస్ ప్రకారం ఆస్ట్రేలియాలో జన్మించిన శిశువుల్లో దాదాపు అయిదు శాతం పద్దెనిమిదేళ్ళ లోపు తల్లులకి జన్మించారు. దీనికంటే ఆందోళన కలిగించే విషయం, ఇంతకు ఎన్నో రెట్ల మంది అమ్మాయిలు గర్భ విఛ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఇలాంటి అమ్మాయిల్లో కొందరు
 పదమూడు పద్నాలుగేళ్ళ పిల్లలు వున్నారంటే కొంచెం భయం వేసే మాట నిజం.

ఆ మధ్య పేపర్లో, టీనేజిలో గర్భం ధరించి చదువులు పాడైన పిల్లలకోసం ప్రభుత్వం ఒక సహాయక కార్యక్రమం చేపట్టింది. ఆ వార్త చూపించి నేను మా స్నేహితురాలినడిగాను, “టీనేజీ పిల్లలు చేయి దాటి పోయిందాక చూస్తూ వూరుకుని, తరువాత సహాయం అంద చేసేకంటే, వాళ్ళకి సరైన వయసులో మంచీ చెడూ బోధిస్తే ఈ సమస్యే వుండదుగా” అని. ఆవిడ వెంటనే “మనం చెప్పినా పిల్లలు వినొద్దూ”, అంది.

పాశ్చాత్య సంఘంలో మనిషి స్వేఛ్ఛకి పెద్ద పీట. ఎంత చిన్న పిల్లలకైనా వాళ్ళ వ్యక్తిత్వాలని భంగ పరిచే విధంగా తల్లి తండ్రులూ, గురువులూ ప్రవర్తించకూడదు. అయితే ఈ విషయంలో మన వాళ్ళది ఒక రకం “అతి” అయితే, ఇక్కడ వీళ్ళది ఇంకొకరకం “అతి” అనిపిస్తుంది.

ముఫ్ఫై యేళ్ళొచ్చినా పిల్లల వ్యక్తిత్వాలని గుర్తించదు మన సమాజం. మంచీ చెడూ తెలియని ముక్కు పచ్చలారని వయసులో “స్వేఛ్ఛా”, “ఇండివిడ్యువాలిటీ” అంటూ పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకునే బాధ్యత టీనేజర్ల మీదకి నెట్టుతుంది ఇక్క డ సమాజం.  అమ్మా నాన్నల నీడలో నిర్భయంగా, నిష్పూచీ గా, పూలతోటలో షికారులా వుండాల్సిన బాల్యం, మీడియా సందేశాలూ, సెలెబ్రిటీల అనుకరణా, అమాయకత్వం వల్ల ముళ్ళ కంచెల్లోనే ఎక్కువగా చిక్కుకుంటుంది.

అసలింత సమస్యకీ మూలం ఇక్కడ మనుషులకి ఏ మాత్రం నిగ్రహం లేక పోవటం, మితి మీరిన అత్మ పరాయణత్వం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ సగటు మనిషి దేనికోసమూ, ఆఖరికి తన కడుపున పుట్టిన పిల్లల కోసమైనా సరే తమ సుఖాలని వదులుకోడు. ఒంటరిగా వుండే తల్లులు కొత్త ప్రియుడు దొరకగానే కన్న పిల్లలని ఫోస్టర్ హోంలో చేర్చి ప్రియుడితో వెళ్ళి పోతారు. తల్లి ప్రేమని కూడా స్వార్థం కలుషితం చేయటం చాలా విచిత్రమైన విషయం.

తల్లి తండ్రులు ఇంత స్వార్థంతో ఏమాత్రం నీతి నియమాలకి విలువ ఇవ్వకుండా, తమ సుఖాలనే పట్టించుకుంటూ, కన్న పిల్లలని కూడా తమకి అడ్డంకి అనుకున్నప్పుడు ఆ పిల్లలకి తమ ముందు తరాల మీద ఏ మాత్రం గౌరవం వుండదు సరి కదా, ఒక రకమైన ఏహ్య భావం వుంటుంది. వ్యవస్థ మీదా, తల్లి తండ్రుల మీదా, గురువుల మీదా దేని మీదా పిల్లలకి నమ్మకం, గౌరవం  లేక పోవటం వల్లే ఇక్కడ టీనేజీ సమస్యలు ఇంతగా పట్టి పీడిస్తున్నాయనిపిస్తుంది.

దీనికంటే విచిత్రమైన విషయం ఇంకొకటుంది. పదిహేనేళ్ళు దాటిన పిల్లలు తల్లి తండ్రులని వదిలేసి వేరే వుండదలచుకుంటే ప్రభుత్వం వారి రోజు వారీ ఖర్చుకి డబ్బిస్తుంది. అలా ఇవ్వకపోతే పిల్లలు మాదక ద్రవ్యాలు అమ్మటమో, వ్యభిచారం లోకి దిగటమో చేస్తారన్నది ప్రబుత్వం వాదన.  ఇలా పిల్లలకి డబ్బు అందుబాటులో వుండటం వలన తమ మాటకు విలువ వుండటంలేదని తలి తండ్రుల వాదన.

ఏది ఏమైనా లేత వయసులో వున్న పిల్లలకు మంచీ చెడూ బోధించి, సక్రమమైన మార్గ నిర్దేశం చేసే రోల్ మోడల్స్ లేరనే చెప్పాలి. ఆ మధ్య ఆస్ట్రేలియాలోని ఒక టీవీ నటుడు డేనియల్ ఓకోనర్ ఆరోగ్య శాఖా మంత్రి టోనీ అబోట్ పుత్రుడేనని వదంతి బయల్దేరింది. మీడియా కథనం ప్రకారం డేనియల్ తల్లీ, టోనీ దాదాపు ముఫ్ఫై యేళ్ళకింద స్నేహితులు. అయితే అప్పట్లో తనకి చాలా మంది ‘స్నేహితులు ‘  వుండటం వల్ల డేనియల్ తండ్రి ఎవరో గట్టిగా చెప్పలేనని అతని తల్లి నిజాయితీగా ఒప్పుకుంది. ఆమె నిజాయితీ చాలా మెచ్చుకోదగ్గదే అయినా, పదహారేళ్ళ వయసులో చాలా మంది మగ స్నేహితులతో గడపటం కొంచెం అసహ్యకరమైన విషయం అనే ఒప్పుకోవాలి. ఇంతకీ టొనీ అతని తండ్రా కాదా అన్నది నిర్ధారించటానికి డీ. ఎన్. ఏ పరీక్షలు నిర్వహించి కాదని తేల్చారు.  చాలా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే చాలా వార్తా పత్రికలు ఇటువంటి సమస్యలకు మూల కారణం కుటుంబ నియంత్రణ సదుపాయాలు అందుబాటులో వుండకపోవటమేనని తేల్చి చెప్పారు.

ప్రతీ విడాకుల కేసులోనూ, పిల్లల తండ్రి ఎవరు అన్నది తేల్చటానికి డీ.ఎన్.ఏ పరీక్షలు తప్పనిసరి. బహుశా తల్లి శీలాన్నీ, నీతీ నిజాయితీలనే నమ్మలేని సమాజంలో పిల్లలకి దేని మీదైనా నమ్మకం వుండటం అసాధ్యం కాబోలు. తన ప్రవర్తనే  సరిగ్గా లేని తల్లి పిల్లలకేం మార్గ దర్శకురాలు కాగలదు?

అందుకే మితిమీరిన ఆత్మ పరాయణత్వం, సుఖ లాలసలే సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని చాలా మంది అంటూ వుంటారు.

కానీ చాలా సార్లు మనకందనంత ఎత్తులో మానవత్వం, నిస్వార్ధపు సేవా కనిపిస్తాయి, మనని ఆశ్చర్యంలో ముంచేస్తూ. ఆ మధ్య ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఆఫీసరు ఒక చందా కోసం వచ్చారు. చందా దేనికని అడిగితే ఇండొనీషియాలోని సునామీ బాధితుల కోసమని చెప్పాడు. ఆ చందా కోసం ఆయన నలభై కిలోమీటర్లు నడిచి, కిలోమీటరుకి డాలరు చొప్పున యాభై మంది స్నేహితుల దగ్గరనించి సేకరించాడు. అలాగే కేన్సర్ రీసెర్చికి చందా కోసం మా ఆఫీసులో నలుగురు గుండు గీయించుకున్నారు.  కొలంబియా లాటి దేశాల్లో  సంఘ సేవ చేయటానికి ఉద్యోగం నించి ఆరు నెలలు సెలవు పెట్టి మరీ వెళ్తారు కొందరు.

పక్క మనిషికి ప్రాణాల మీదికొస్తున్నా కూడా స్పందించం మనం. పైగా పలకరిస్తే ఏది మన తలకి చుట్టుకుంటుందో అనే భయంతో తప్పించుకుని కూడా తిరుగుతాం. సునామీ, భూకంపాలూ, ఇంకా ప్రకృతి వైపరీత్యాలప్పుడూ చందా చేసిన డబ్బులో ఎంత శాతం బాధితులకి చేరుతుందో అనుమానమే. ఉద్యోగానికి సెలవు పెట్టి సంఘ సేవ చేయటం మాట అటుంచి ఉద్యోగంలో రెండు చేతులా లంచాలు మేయ కుండా వుంటే అదే మనం చేసే పెద్ద సంఘ సేవ.

ఇలా ఆలోచిస్తే ఇక్కడ సంఘం మేడి పండు కాదు, పైకి ఎలా వున్నా లోపల తియ్యగా వుండే పనస పండు అనిపిస్తుంది. రెండూ నిజమేనేమో, బహుశా, మన దగ్గర లాగే!

                                                                                  *******************************

One thought on “తెలుపు-నలుపు

  1. ఒక మాట చెప్పనాండీ …భారత దేశం లో జనాభా ఎక్కువ. పొద్దున్న లేస్తే ప్రతి చోటా పోటీ, ఒకరిని మించాలని పరుగు, ఎవరో ఏదో అనుకుంటారని బెరుకు, ఇళ్ళల్లో, వీధుల్లో, మనసుల్లో, ఆలోచనల్లో ఇరుకు. కొందరికి బ్రతుకే పెద్ద సమస్య. ఎటు తిరిగినా, ఏమి చేసినా- ఎందుకు అనే ప్రశ్నలు. బయట ఎండలు, సమయానికి రాని బస్సులు, వచ్చినా సదుపాయాలు లేని రైళ్ళు. ఎక్కడ చూసిన అసహనం, అసహాయత్వం, అసమానత్వం, అవమానం, అనుమానం. ఇన్ని “అ” లక్షణాలతో (గమనించండి – నేను “అవ” లక్షణాలని అనట్లేదు – నిసాహాయత్వం తో మరుగునపడి వ్యతిరేకపదాలైన మనవారి మంచితనపు ఆనవాళ్ళు.). దయచేసి మన దేశాన్ని ఆస్ట్రేలియా తో పోల్చకండి. వారిది కనిపించే కలిమితనపు సౌరభం అయితే మనవారిది బయటపడలేని , బయలుపర్చుకోలేని లేమి తనపు “అమర్యదాలివి”.
    -లలితా త్రిపుర సుందరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s