తెలుపు_నలుపు

సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాంప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
                                                -శారద

(ఏ పీ వీక్లీ నవంబర్ 15 2007)

సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాం. “అక్కడేముంది, నా మొహం, ఉత్త ఎడారి ప్రాంతం”, అని మనం చాలా సార్లు చప్పరించేస్తాం కూడా. కానీ ఆస్ట్రేలియా ఖండాన్ని చూసిన తరువాత మనకనిపిస్తుంది, ఇంత ఎర్రటి ఎడారి కూడా ఎవరో చిత్రకారుడు ప్రశాంతమైన మనసుతో కుదురుగా కూర్చుని గీసిన బొమ్మలా ఎంత అందంగా వుందని.

చుట్టూ వున్న గంభీరమైన సముద్రం, కాల ప్రవాహంతో తమకేమీ ప్రమేయం లేనట్టుండే  పర్వత శ్రేణులూ, కమ్మటి వాసనతో మత్తెక్కిచ్చే  ఎత్తైన యూకలిప్టస్ చెట్లూ, వాటి కొమ్మలని కరచుకుని నిద్రపోతూ ముద్దొచ్చే కొవాలాలూ, భూదేవి నొసట కుంకుమలా వుండే ఎర్రటి ఇసుకా, గాలి చప్పుడు తప్ప ఏ విధమైన సవ్వడీ లేని నిశ్శబ్దం, చెప్పలేనంత అందంగా వుంటాయి.

ప్రతీ సంవత్సరం డిసెంబరు ఎండా కాలం సెలవుల్లో అందరూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రకృతి ఒడిలో కొంచెం సేద దీరి రావటం అలవాటు. ఎడారి ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు, ఒక కారులో కాకుండా రెండు కారుల్లో వెళ్ళటం, ఎక్కువ మంచి నీళ్ళు తీసుకెళ్ళటం లాటి జాగ్రత్తలు తీసుకుంటే క్షేమంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రావచ్చు.  అలాటి కొన్ని అద్భుత సౌందర్య రాశుల గురించి….

1) గ్రేట్ బారియర్ రీఫ్ : ప్రపంచంలో కెల్లా పెద్దదైన  ఈ ” పగడాల దిబ్బ”  భూమికి చాలా ఎత్తు నుంచి కూడా కనిపిస్తుందని ప్రతీతి. దాదాపు మూడు వేల చిన్న చిన్న పగడాల దిబ్బలు (వీటిని “కోరల్ రీఫ్” అంటారు) వున్నవి. ఈ రీఫ్ పొడవు రెండు వేల మూడు వందల కిలోమీటర్లు. ఆస్ట్రేలియాకి ఉత్తర భాగాన క్వీన్స్ లాండ్ తీరానికి సమాంతరంగా వుందీ గ్రేట్ బారియర్ రీఫ్.  బ్రిస్బేన్ నగరానికి దగ్గరగా వుండే కెయిర్న్స్  అనే చిన్న వూరి నించి జలాంతర్గామిలో సముద్రంలోకి కొంత దూరం ప్రయాణించి ఈ రీఫ్ ని చూడొచ్చు. దాదాపు రెండు వేలకంటే ఎక్కువ రకాల చేపలు వుండే ఈ రీఫ్ ని మన కళ్ళతో చూసిన తరువాత మనకింకే అక్వేరియమూ చూడ బుధ్ధవదు. ఆ రంగులూ, ఆ చేపల వంటి మీద మెరుపూ, డిజైన్ లూ చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేము.
 ప్రపంచంలో వుండే రీఫ్ లలో ఇరవై శాతం ఆస్ట్రేలియా చుట్టూ వుండే సముద్ర ప్రాంతాలలో వున్నాయి.

మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ వ్యాపించి వుణ్డే ఈ రీఫ్ లో చిన్న చిన్న దీవులు వున్నాయి. వాతావరణ కాలుష్యం, సరదా కోసం చేపలు పట్టటం, ప్లాస్టిక్కుల వల్లా ఈ రీఫ్ లోని కొంత ప్రాణి ప్రపంచం దెబ్బ తింటూంది. అందు వల్లే ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వీన్స్ లాండ్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతాన్నంతా పరిరక్షిత ప్రాంతంగా ప్రకటించి రక్షక కార్యక్రమాలు చేపట్టింది.

గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు పడ్డ ఈ ప్రాంతాన్ని చూడటానికి యేటా దాదాపు ఇరవై లక్షల యాత్రికులు వస్తూ వుంటారు. ఈ యాత్రికుల వల్ల ప్రభుత్వానికి బోలెడంత  (యేటా రెండు బిలియన్ డలర్లు) ఆదాయాన్నిచ్చినా, కొంత వరకు అక్కడ వుండే చేపలకి హాని చేస్తున్నాయి. 1981 లో ఈ ప్రాంతాన్ని  world heritage గా ప్రకటించారు.

Great Barrier Reef

 GBR-II

2)కంగారూ దీవి : ఈ సంవత్సరం ఏషియా పసిఫిక్ ప్రాంతంలో వున్న అన్ని దీవుల్లోకెల్లా అందమైనదని ఏకగ్రీవంగా ఎన్నికైనది కంగారూ దీవి. సింగపూర్ కంటే ఏడు రెట్లు పెద్దదైన కంగారూ దీవి అద్భుతమైన వన్య ప్రాణులకూ, వృక్ష జాతులకూ పుట్టిల్లు. ఈ వన్య ప్రాణులన్నీ జూ లాగానో, పార్కులాగానీ నిర్బంధంలో కాక స్వేఛ్ఛగా దీవి అంతా తిరుగుతూ వుంటాయి. కొవాలాలూ, సీల్సూ, ఎకిడ్నాలూ, కంగారూలూ రకరకాలైన జంతు జాలం హాయిగా ఏ ఆడ్డూ లేకుండా తిరిగే సురక్షితమైన ప్రాంతం. ఈ మొత్తం దీవి సభ్య సమాజానికి దూరంగా వుండేలా, తన సహజ వృక్ష జంతు సంపదలకూ ప్రజలు అడ్డు రాకుండ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడక్కడ టూరిస్టులకొరకు వుండే హోటళ్ళూ, రిసార్టులూ, టూరిజం వారి ఆఫీసులూ తప్ప మామూలు జీవనం వుండాదనే చెప్పాలి.

దక్షిణా ఆస్ట్రేలియా తీరానికి కొద్ది దూరంలో సముద్రంలో వుండే కంగారూ దీవి ఆస్ట్రేలియా చుట్టూ వుండే చిన్న చిన్న దీవుల్లో టాస్మేనియా దీవి కంటే కొంచెం చిన్నది. ఆడిలైడ్ నగరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరాన వుండే కేప్ జర్విస్ అనే రేవు నించి సముద్ర్మలో దాదాపు పదిహేను కిలోమీటర్లుంటూంది. 1802 లో మేథ్యూ ఫ్లిండర్స్ అనే నావికుడు మొదటిసారి ఈ దీవిని చూసి కంగారూ ఐలాండ్ అని పేరు పెట్టాడంటారు. దీవి నిండా వుండే వన్య ప్రాణులతోపాటూ, సముద్రపు రాపిడికి వింత వింత ఆకృతులు ధరించిన కొండ చరియలు కూడా పెద్ద ఆకర్షణ. ఇక్కడ తీరంలో ఇసక మెత్తని పరుపు లా కాలేస్తే లోపలికి జారి పోతూ వుంటుంది.

భూగర్భంలో వుండే స్టాలక్టైట్, స్టాలగ్మైట్ లతో నిండిన లైం  స్టోన్ గుహలు చాల అందంగా వుంటాయి. ఇవి కంగారూ దీవిలోనే కాక ఆస్ట్రేలియా ఖండమంతా వున్నాయి. మిలియన్ల సంవత్సరాల కింద జీవించి మరణించిన జంతు జాలం బొమికలలోని కాల్షియం వల్ల ఈ భూగర్భ గుహలేర్పడతాయి. ఈ కేల్షియం నీరు మరియు కార్బన్డై ఆక్సైడు తో కలిసి ఆమ్లం లా భూగర్భాన్ని తొలిచి గుహలా చేస్తుంది. మళ్ళీ నీరు ఆవిరై పోగానే మిగిలిన కేల్షియం ఆ గుహ చూరుని పట్టుకుని పెద్ద పెద్ద షాండిలీర్ల లా వేళ్ళాడుతుంది. ఈ కింద వున్న గుహ ముఖా ద్వారం అచ్చం ఆర్చీ లా వుంటుంది. దీన్ని ” అడ్మిరల్స్ ఆర్చ్” అంటారు. ఈ గుహకి రెండు వైపులా ద్వారాలుంటాయి. 

Adm Arch

3)గ్రాంపియన్ పర్వత శ్రేణులు: ఆడిలైడ్ నించి మెల్బోర్న్ కారులో ప్రయాణం చేస్తే, మధ్యలో తగులుతాయి గ్రాంపియన్ పర్వత శ్రేణులు. మన దగ్గర తూర్పు, పశ్చిమ కనుమల్లా చాలా దూరం వరకూ వ్యాపించి వుండే పర్వత శ్రేణులివి. వృక్ష సంపద కంటే ఆకాశన్నంటుతూ వున్నట్టు గంభీరంగా వుండే పర్వత శిఖరాలు కను విందు చేస్తాయి. ఆ శిఖరాల కంటే చెక్కుకు పోయినట్టున్న వాటి మొహాలు భయం గొలుపుతూ గుండె ఝల్లుమనిపించేలా వుంటాయి. వాటిల్లో కొన్ని విచిత్రమైన ఆకారాలు కూడా వుంటాయి. యూకలిప్టస్ చెట్లూ, గుభిల్లున దుమికే జల పాతాలతో గ్రాంపియన్స్ చాలా ప్రశాంతమైన ప్రదేశం.

Halls Gap

 Gramps

4)గ్రేట్ ఓషన్ రోడ్ : విక్టొరియా (మెల్బోర్న్) దగ్గర సముద్రపు ఒడ్డున కొన్ని పర్వతాలని సముద్రం వేల సంవత్సరాలుగా కోసింది. ఈ పర్వతాలన్నీ సముద్రునితో నిత్య సంఘర్షణలో ప్రాణాలు కోల్పోగా కొన్ని శిలలు ఈ సంఘర్షణకి సాక్షిగా ఒడ్డున మునుల్లా నిలబడి వుంటాయి. వీటినే “ట్వెల్వ్ అపోసల్స్” అని పిలుస్తారు. అడిలైడ్ నించి మెల్బోర్న్ కారు ప్రయాణంలో వీటిని చూడొచ్చు. సముద్రానికీ పర్వతాలకీ మధ్య వుండే ఈ సన్నని బాట పొడవు దాదాపు రెండు వందల కిలోమీటర్లు. పచ్చటి యూకలిప్టస్ చెట్లతో నిండిన పర్వతాలు నీలి సముద్రాన్ని కవ్విస్తున్నాట్టు ఠీవిగా నిలబడి వుంటాయి. వీళ్ళ సుదీర్ఘ పోరాటన్ని వినోదంగా చూస్తున్నట్టున్న నీలాకాశం లో తెల్లని మబ్బు తునకలు, ఉదయిస్తున్న సూర్యుని ఎరుపూ,  ఈ రంగుల సమ్మేళనాన్ని చూస్తూ ఎన్ని గంటలైనా నిలబడొచ్చు.

ఇవే కాక కాకాడ్డూ నేషనల్ పార్క్, మౌంట్ గాంబియర్, రస్సెల్ జలపాతాలూ, ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి వింతలకీ అందానికీ ఆస్ట్రేలియాలో కొదవ లేదు. వెళ్ళి చూడటనికి ఓపికా తీరికా వుండాలంతే !
                                ===========================

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s