తెలుపు-నలుపు

ఆస్ట్రేలియాలో అన్నిటికంటే అందమైనది నిర్మలమైన ఆకాశం.  అడుగు జాడలు
                                                             -శారద
(ఏ పీ వీక్లీ డిసెంబర్ 13 2007)

ఆస్ట్రేలియాలో అన్నిటికంటే అందమైనది నిర్మలమైన ఆకాశం. లండన్ లాటి యూరోపియన్ నగరాల్లోలా ఆకాశం ఎప్పుడూ మబ్బు పట్టి దిగులుగా వుండదు. ఇండియాలోలా పొగ చూరీ వుండదు. మంచి మనిషి మనసులా, హాయిగా అక్కడక్కడ తేలిపోతూ వుండే తెల్లటి మబ్బు తరకలతో విశాలంగా భూమినంతా ఆక్రమించుకొని వుంటుంది. దానిని చూడగానే మనం, “ఆహా! ఇక్కడ వాతావరణ కాలుష్యం చాలా తక్కువ కాబోలు. అందుకే ఆకాశం అంత బాగుంది,” అనుకుంటాం.

సరిగ్గా అక్కడే మనం పప్పులో కాలేసినట్టు లెక్క. ప్రపంచ  దేశాలన్నిటిలోనా వాతావరణాన్ని కలుషితం చేసేది ఎక్కువగా ఆస్ట్రేలియన్లే!

మనుషులై పుట్టినందుకు మనందరం తల్లిని పీడించే పిల్లల్లా ప్రకృతిని పీడించి వనరులని వాడుకుంటున్నాము. మనం వాడుతున్న వనరులూ, మన జీవన శైలీ అన్నీ కలిపి ప్రకృతి మనకు ప్రేమతో అందించే సంపదలనీ  క్షీణింప చేస్తున్నాయి. కార్బండై ఆక్సైడు, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన వాయువులు భూమిని పొరలా కమ్ముకుని ఉష్ణొగ్రతని పెంచుతున్నాయి. భూగర్భ ఇంధనాన్ని ఖర్చు చేయటం, అడవులని నరికేయటం, వాతావరణంలోకి ఫ్లోరో కార్బన్లని వెద జల్లటం వగైరాలన్నీ ఈ “గ్రీన్ హౌస్ ఎఫెక్ట్”ని పెంచుతున్నాయి. కాళిదాసులా మన కాళ్ళకింద కొమ్మని మనమే ఆనందంగా నరుక్కుంటున్నాం.

మన దైనందిన జీవితంలో వాడే పరికరాలతో మనం వాతావరణంలోకి వెదజల్లే కార్బన్ డై ఆక్సైడుని మన “కార్బన్ ఫుట్ ప్రింట్” (కార్బన్ అడుగుజాడ) అంటారు.  ఇతర ఇంధన వనరులూ, పర్యావరణ రక్షణకోసం చేపట్టే ప్రక్రియాలతో తగ్గించిన కార్బన్ డై ఆక్సైడ్ని “కార్బన్ ఆఫ్సెట్” అంటారు. ప్రపంచంలో అన్ని దేశాలకంటే పెద్ద కార్బన్ అడుగుజాడలు అమెరికా ఆస్ట్రేలియా దేశాలవి. కేవలం శాస్త్రీయ ఇంధన వనరుల పైనే ఆధారపడటం ఒక కారణమైతే, శారీరక సుఖానికీ, సదుపాయాలకీ బానిసలైపోయిన జీవన శైలి రెండవది. ఆస్ట్రేలియా తన ఇంధనానికి అణు శక్తి పైనో, వాయు, సౌర శక్తులపైనో ఏమాత్రం ఆధారపడకుండా, కేవలం బొగ్గు ఆధారంగానే ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. దానికి తోడూ విపరీతమైన కార్ల వాడకం వల్ల కూడా వాతావరణ కాల్లుష్యం పెరుగుతుంది. సగటు ఆస్ట్రేలియన్ కుటుంబం యేడాదికి పదమూడు టన్నుల కార్బన్ డై ఆక్సైడుని వాతావరణంలోకి వెద జల్లుతుంది. దీనిని తగ్గించటనికి ఎన్నో మార్గాలున్నాయి. కార్ల వాడకం తగ్గించి బస్సులోనో, సైకిల్ పైనో, కాలి నడకనో వెళ్ళటం, ఇంధనాన్ని తక్కువగా వాడే కొత్త కార్లని వాడటం,  ఇండ్లల్లో వేడి నీటి వాడకంలో చిట్కాలు, ఇండ్లలో వాడే పరికరాల వాడకంలో చిట్కాలు వీటన్నిటితో మనం చాలా కార్బన్ డై ఆక్సైడు ని తగ్గించుకోవచ్చు. 

వాతావరణానికి హాని చేసే పాత పరికరాలు (వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, డ్రయర్లు మొదలైనవి) వదిలేసి కార్బన్ డై ఆక్సైడుని తగ్గించే కొత్త పరికరాలు కొనటానికి ప్రభుత్వం సబ్సిడీలిస్తుంది.
 
ఈ రకంగా భూమి మీద ఉష్ణొగ్రతలు పెరగటం వల్ల  మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టం సంవత్సరానికి 2మి.మీ. ల చొప్పున పెరుగుతుంది. ఎన్నో మహానగరాలు (మన ముంబాయితో సహా) మునిగి పోవచ్చునని శాస్త్రఙ్ఞులు అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత 0.74 డిగ్రీ సెల్సియస్ చొప్పున పెరగనుంది. తుఫానులు, భరించలేని వేడి వాత పడి యేటా ఎంతో మంది మరణిస్తున్నారు.

వాతావరణంలో వస్తున్న మార్పులన్నిటినీ దృష్టిలో పెట్తుకుని ఐక్య రాజ్య సమితి వాతావరణ కాలుష్యానికి పరిష్కార మార్గాలు సూచించటనికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది (UNFCC). ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకుని గ్రీన్ హౌస్ వాయువులని తగ్గించేందుకు మార్గాలని అన్వేషించటమే ఈ సంఘం ముఖ్య ఉద్దేశ్యం. 1992 లో రియో డీ జేనిరో లో జరిగిన చర్చల్లో ప్రపంచ 190  దేశాలు  పాల్గొని పర్యావరణ రక్షణ గురించి చర్చించాయి. 1997 లో మూడో సారి సమావేశమైనప్పుడు ఈ సంఘం “క్యోటో ప్రతిపాదనను” సభ్య దేశాల ముందుంచింది. ఈ క్యోటో ప్రోటోకాల్ 16 ఫిబ్రవరి 2005 నుంచి అమలులోకి వచ్చింది.

క్యోటో ప్రతిపాదన ప్రపంచ దేశాలను అభివృధ్ధి చెందిన దేశాలు, అభివృధ్ధి చెందుతున్న దేశాలుగా విభజించి వారికి వాతావరణ కాలుష్య నివారణలో గమ్యాలు నిర్దేశించింది. అమెరికా, కజకస్తాన్ తప్ప మిగతా అన్ని దేశాలూ ఈ ప్రతిపాదనను ఒప్పుకోన్నాయి. ఈ ప్రతిపాదన 2012 వరకూ అమలులో వుంటుంది.

భారత్, చైనా తో సహా 137 అభివృధ్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రతిపాదనపై సంతకం చేసాయి. అభివృధ్ధి చెందిన దేశాల్లో ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ ల తో సహా 36 దేశాలు సంతకం చేసాయి. అయితే అభివృధ్ధి దిశలో వున్న దేశాలకు విష వాయువులు తగ్గించుకునే బాధ్యత లేదు. ఎందుకంటే దీనివల్ల వారి ఆర్ధిక వ్యవస్థ కుంటుపడొచ్చు. కానీ యేటా వారు ప్రసరిస్తున్న విష వాయువుల భోగట్టా మాత్రం సంఘం ముందుంచాలి.  అయితే గ్రీన్ హవుజ్ వాయువుల వెల్లడి తగ్గించుకోవటం వల్ల తగ్గే ఆర్ధికలాభాలను కార్బన్ క్రెడిట్ అమ్మటం ద్వారా పూరించుకోవచ్చు.
 
ఈ ప్రతిపాదన ప్రకారం అభివృధ్ధి చెందిన దేశాలు 2008-2012 వరకు వారి వారి గ్రీన్ హవుస్ వాయువులను అయిదు శాతం తగ్గించాలి. ఇలా తగ్గించటంలో దేశా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా చూసుకొనే బాధ్యత కూడా ఆయా ప్రభుత్వాల మీద వుంది. ఒక వేళ ధనిక దేశలు 2012 వరకు వారి వారి కార్బం ఎమిషన్లని తగ్గించుకోలేకపోతే, తరువాత సంవత్సరాలలో ఇంకా ఎక్కువ తగ్గించుకోవలసి వస్తుంది.

క్యోటో ప్రతిపాదన బీద దేశాలకి వత్తాసునిస్తూ, ధనిక దేశాలని అన్యాయంగా శిక్షిస్తుందన్న కారణంగా అమెరికా ఈ ప్రతిపాదనని ఒప్పుకోలేదు.  ఎక్కువగా ధనిక దేశల జీవన విధానం వల్లే వాతావరణం ఇంతగా కలుషితం చెందిందన్న వాదనను అమెరికా ఒప్పుకోలేదు.  కారణం క్. అమెరికా ప్రభుత్వం అడుగుజాడల్లో నడిచిన హొవార్డ్ లిబరల్ ప్రభుత్వం కూడా క్యోటో ప్రతిపాదనని ఒప్పుకోలేదు.

నవంబరు 27 న జరిగిన ఎన్నికలలో విజయం సాధించిస్ కెవి రడ్ లేబర్ ప్రభుత్వం, పదవిలోకొచ్చిన మరుక్షణమే క్యోటొ ప్రతిపాదనపై సంతకం చేసింది. మార్చి 2008 నించీ ఆస్ట్రేలియా తన అడుగు జాడలు చిన్నవిగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా మొదలు పెట్టాలి.

డిసంబరు మూడు నించి బాలి (ఇండొనీషియా) లో జరిగిన సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యానికి ఒక సమగ్రమైన వ్యూహాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగింది. తరువాత ఇదే సదస్సు కొపెన్ హేగెన్ లో 2009 లో జరుగనుంది.
ముక్తాయింపు: ఈ కాలం రాసేనాటికి అమెరికా క్యోటో ప్రతిపాదనని అంగీకరించకపోయినా, తరువాత కొద్ది రోజులకే ఈ ప్రతిపాదనని అంగీకరిస్తూ సంతకం చేసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s