మనలాగే ఆస్ట్రేలియన్ లలో ఎన్నో మంచి లక్షణాలూ, ఎన్నో చెడ్డ లక్షణాలూ వున్నాయి.జీవన పోరాటం
-శారద
(ఏ పీ వీక్లీ జనవరి 3 2008)
మనలాగే ఆస్ట్రేలియన్ లలో ఎన్నో మంచి లక్షణాలూ, ఎన్నో చెడ్డ లక్షణాలూ వున్నాయి. అన్నిటికంటే వాళ్ళలో వున్న గొప్ప లక్షణం, వాళ్ళకి జీవితం మీద వున్న గౌరవం, మమకారం. విరక్తితో జీవన పోరాటం లోంచి వెనుదిరిగటమన్నది వాళ్ళ శైలిలోనే లేదు. క్రికెట్ మైదానం మీద ఎంత అంకిత భావం, కసితో పోరాడుతారో, జీవితంలోనూ అంతే.
చూడటానికి చాలా తేలికైన వ్యవహార శైలితో, పెద్ద తెలివితేటలు లేనట్టూ, పెద్ద పెద్ద ఆశయాలు లేనట్టూ, ఈజీ గోయింగ్ స్వభావంతో వుంటారు ఆస్ట్రేలియన్లు. కానీ విధి వక్రించినప్పుడూ, అనుకోని కష్టాలు ఎదురైనప్పుడూ వాళ్ళలోని సహజమైన పోరాట పటిమని చూసి మనం అభినందించకుండా వుండలేం.
మూడు వందల పరుగుల దగ్గర అందరూ అవుటయిపోవటమన్నది ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు భరించలేని విషయం. అలాంటి స్థితిలో వాళ్ళు మొన్న మెల్బోర్న్ లో తిరగబడి మన వాళ్ళని
మట్టి కరిపించిన తీరు మరిచిపోలేం కదా. నిజ జీవితంలోనూ వాళ్ళ వైఖరి అలాగే వుంటుంది. ఆ పట్టుదలా, కసీ, కిల్లర్ ఇన్స్టింక్టూ మనమూ నేర్చుకోవాలి.
నీల్ ఫుల్లర్ అడిలైడ్ కి చెందిన ముఫ్ఫై ఏడేళ్ళా సాకర్ ఆటగాడు. పదిహేడేళ్ళ వయసులో 1987 లో మొదటిసారి మైదానం మీద ఆడుతున్నప్పుడు ఆఖరి క్షణాల్లో పెనుగులాటలో కిందపడి కుడి కాలు విరగకొట్టుకున్ణాడు.
కానీ ఆపరేషన్లు బెడిసికొట్టటంతో అతని పద్దెనిమిదో పుట్టినరోజుకి నాలుగు రోజుల ముందు అతని కుడి కాలు పూర్తిగా కొట్టేసరు డాక్టర్లు. ఆస్ట్రేలియా సాకర్ జట్టులో స్థానం సంపాదించాలన్న కలతో వున్న అతను ఈ విపత్తుతో కుప్ప కూలిపోయాడు.
కానీ పుంజుకుని ప్రొస్థెటిక్ లిమ్బ్స్(పెట్టుడు కాలు)తో పెరాలింపిక్స్ లో పాలుగొన్నాడు. 1989నించీ అతను అథ్లెటిక్స్ పోటీల్లో 34 (16 బంగారు, 10 వెండి, 8 కాంస్య) పతకాలు గెలుచుకున్నాడు. ఇలాటి వీరోచిత గాథలు ఆస్ట్రేలియాలో లెక్కలేనన్ని వింటాం.
ఎంత వయసులో కానీ వాళ్ళు, “ఆ! ఈ వయసులో ఇప్పుడిది ఎందుకులే,” అని చప్పరించెయ్యరు. టీనేజి వయసులో ఏవేవో కారణాలవల్ల చదువుకోలేని వాళ్ళు ఎంతో పెద్దయి కూడా ఉత్సాహంగా చదువు పూర్తి చేస్తారు.
తమ పిల్లలతో కలిసి గ్రేడ్యుయేషన్ చేసి ఫోటోలు దిగేవాళ్ళు బోలెడుమంది. డెభ్భై యేళ్ళ వయసులో ఈత నేర్చుకుని తొంభై యేళ్ళ వయసులో పోటీల్లో పాల్గొని నెగ్గిందొకావిడ. ఆ వయసులో అంతటి ఆరోగ్యం
వుండటం ఒక అదృష్టమైతే, అంతటి పట్టుదలా ఉత్సాహం వుండటం ఇంకొక అదృష్టం.
కొలీన్, డొరీన్ లది అందమైన ప్రేమ గాథ. అడిలైడ్ నగర వాస్తవ్యులైన వాళ్ళిద్దరూ మొదటిసారి 1940లో పద్దెనిమిదేళ్ళ వయసులో కలుసుకున్నారు.
కొలిన్ పోలీసు యూనిఫాం లోని అందగాడైతే, డొరీన్ తండ్రితో పాటు ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణంలో పియానో వాయించేది. ఆ అమాయకమైన వయసులో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్ళాడాలనుకున్నరు. అయితే మొదటి ప్రపంచ యుధ్ధం ఇద్దరినీ విడదీసింది.
ఆస్ట్రేలియా వైమానిక దళం లో పని చేస్తూ కొలిన్ ఇంగ్లండు వెళ్ళాడు.డొరీన్ సంగీత ప్రపంచంలో మెట్లెక్కసాగింది. మెల్బోర్న్, సిడ్నీ నగరాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చింది. 1944 లో డొరీన్ వేరొక అతనిని
(అతని పేరూ కొలినే) వివాహం చేసుకుంది. ఏదో సినిమాలోలా తన వివాహం గురించి ఆమె రాసిన ఉత్తరం కొలిన్ కి అందనేలేదు. 1945లో అడిలైడ్ తిరిగొచ్చిన కొలిన్, డొరీన్ పెళ్ళి గురించి విని నిర్ఘాంతపోయాడు.
అయినా తేరుకుని ఇంకొక స్నేహితురాలు పాలిన్ ని పెళ్ళాడాడు. యాభై సంవత్సరాలు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికారు. పిల్లల్ని కన్నారు, పెంచి పెద్ద చేసారు. 1979లో కొలిన్ తన భార్యకి విడాకులిచ్చాడు. యాధృచ్చికంగా 1995లో,కొలిన్ డొరిన్ కలుసుకున్నారు.
అప్పుడామె వయసు డెభ్భై రెండేళ్ళు. ఆమె భర్త మరణించీ పదేళ్ళకు పైనే అయింది. ఇద్దరూ పాత విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరిపై ఒకరికి
ప్రేమ ఎంత మాత్రం తగ్గలేదని గుర్తించి 1997లో పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరూ ఇంకా ప్రేమ పక్షుల్లా వాళ్ళ సొంత విమానంలో ఊరంతా చుట్టి వస్తూ వుంటారు. ఇప్పుడిద్దరి వయసూ ఎనభైకి పైనే.
కాళ్ళూ చేతులు సరిగ్గా లేనివాళ్ళు కూడా వీల్ చైర్లో కూర్చుని షాపింగుకీ, లైబ్రరీకీ వెళ్తూ వుంటరు.మనుషుల్లో అంత పట్టుదల ఉండటం ఒక కోణమైతే, వాళ్ళకి సంఘం సహృదయంతో చేయూతనివ్వటం ఇంకొక కోణం. ‘కాళ్ళూ చేతులు సరిగ్గా లేక ఇప్పుడు నీకు
లైబ్రరీకి వెళ్ళటం ఒకటి తక్కువా?” అంటూ ఎవరూ విసుక్కోరు. వికలాంగులకీ, నేరస్థులకీ, జీవితం చేతిలో మోసపోయిన వారికీ, అందరికీ తమ కలలని సాకారం చేసుకునే హక్కు వుందని నమ్ముతారు. తమకి ఇష్టమైన పనిని, ఎంత కష్టమైనా, ఇతరుల
అభిప్రాయాలతో ప్రమేయంలేఖుండా చేసుకుంటూ పోవటమే వీరి నైజం. కొన్నిసార్లు అది చాలా దూరం పోయి యుక్తాయుక్త విచక్షణ కూడా కోల్పోతారు, అది వేరే విషయం.
పుట్టిన మరుక్షణమ్నించీ, చచ్చే వరకూ, “అందరూ ఏమనుకుంటారో!” అనే మంత్రం జపించే మనకి వ్యక్తికి ఇంత బలమూ పట్టుదలా వుండటం వింతగా అనిపించటంలో వింతేమీ లేదు మరి.