తెలుపు_నలుపు

ఆస్ట్రేలియా ఫెడరల్ (సార్వత్రిక) ఎన్నికలు నవంబరు 24 న ముగిసినవి.ఎన్నికలు 2007
(ఏపీవీక్లీ  నవంబరు 29 2007)                                                                               -శారద

 ఆస్ట్రేలియా ఫెడరల్ (సార్వత్రిక) ఎన్నికలు నవంబరు 24 న ముగిసినవి. అనుకున్నట్టుగానే లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. గత పన్నెండు ఏళ్ళుగా పదవిలో వున్న  లిబరల్-నేషనల్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రధాన మంత్రి జాన్ హొవార్డ్ తన సీటు కోల్పోయేలా వున్నారు. ఇంకా ఆయన నియోజక వర్గంలో వోట్ల లెక్కింపు పూర్తి కాలేదు. చాలా మంది లిబరల్ పార్టీ నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

 ఆస్ట్రేలియా దేశం బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ పాలనలో వున్నా, వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే పార్లమెంటరీ వ్యవస్థ కూడా వుంది. ఫెడరల్ పార్లమెంటుకి రెండు విభాగాలున్నాయి. మన దగ్గర లోక్ సభ లాటి “హవుజ్ ఆఫ్ రెప్రెసెంటేటివ్స్” (ప్రజా ప్రతినిధుల సభ), రాజ్య సభ లాటి “సెనేట్”. అయితే రెండు సభల్లోకీ సభ్యులని మూడేళ్ళకొకసారి ప్రజలే ఎనుకుంటారు. ప్రబుత్వం ప్రతిపాదించే ఏ బిల్లైనా రెండు సభల్లోనూ ఆమోదం పొందాలి. వీళ్ళే కాక మహా రాణి ప్రతినిధిగా గవర్నర్ జెనరల్ కూడా వుంటారు.

ఇరవై మిల్లియన్ల జనాభాకి నూట యాభై మంది ప్రజా ప్రతినిధులుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి గెలిచిన పార్టీకి డెభ్భై అయిదు (యాభై శాతం) సీట్లు వుండాలి. మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం లేదు. ఇంత వరకూ లిబరల్-నేషనల్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎనభై ఆరు సీట్లతో ప్రభుత్వాన్నేర్పాటు చేసింది. నాలుగు సార్లు ఎన్నికలు గెలిచిన సంకీర్ణ ప్రభుత్వం ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయింది. శనివారం జరిగిన ఎన్నికల్లో కెవిన్ రడ్ నాయకత్వంలోని లేబర్ పార్టీ ఎనభై మూడు సీట్లతో విజయ భేరి మోగించింది.

సెనేట్ లో డెభ్భై ఆరుగురు ప్రతినిధులుంటారు. ఆస్ట్రేలియాలోని ఆరు రాష్ట్రాలకి పన్నెండు చొప్పున, రెండు టెరిటరీలకి రెండు చొప్పునా ప్రతినిధులనెన్నుకోవలసివుంటుంది. ఈ ప్రతినిధులందరినీ ఒకే ఎన్నీకలో కాకుండా సగం సీట్లకు ప్రతినిధులని మూడేళ్ళకొకసారి, సాధారణ ఎన్నికలతో కలిపి ఎన్నుకుంటారు.
 
ఈ లెక్కలూ, చిట్టాలూ పక్కన పెడితే, ఇక్కడ ఎన్నికల్లో వాతావరణం, నాయకుల ప్రవర్తనా కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. ఎన్నికల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి నాయకుల నిలువెత్తు కటౌట్లు! అవి ఇక్కడ మచ్చుకైనా కనపడవు. అన్ని పోస్టర్లూ ఏ4 సైజులో వుండి కరెంటు స్థంబాలకి అంటించి వుంటాయి. అలాగే, నాయకులవేమో నిలువెత్తు విగ్రహాలు, నియోజక వర్గం సభ్యునిదేమో చీమ తలకాయంత ఫోటో వుండవు. నాయకులదే చిన్న ఫోటో పెట్టి నియోజకవర్గం అభ్యర్ధిదే పెద్ద చిత్రం వుంటాయి. నాయకులు మందీ మార్బలం వెంటేసుకుని పెద్ద ప్రచారాలు చేయరు. అభ్యర్ధి మాత్రం ఒక్క సెక్రెటరీ తోడు రాగా ఇంటింటికీ వెళ్ళి వోట్లు అడుక్కుంటారు. ఎన్నిల్కల ఖర్చు చాలా కొంచెమేనని చెప్పాలి. ప్రచారం ఎక్కువగా టీవీ, ఇంటర్నెట్ మాధ్యమాల్లో, వాద ప్రతివాద రూపాల్లో వుంటాయి. నాయకులు ఎంత ప్రచారపు హోరులోనైనా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతమైన నిందారోపణలూ, బురద చల్లుకోవటాలూ చేయరు. హింసా కాండ, హత్యలూ వగైరాలు వుండవు.

ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కాగానే, జాన్ హొవార్డ్ హుందాగా, తమ పార్టి ఓటమికి పూర్తి బాధ్యత తనదేననీ, రాబోయే లేబర్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ తమ సహకారాన్నందించాలనీ చెప్పారు. నూతన ప్రధాని కెవిన్ రడ్ కూడా, దేశానికి హొవార్డ్ ఎనలేని సేవ చేసారనీ, ఆయన పాలనలో ప్రజలకై చాలా కార్యక్రమాలు చేపట్టారనీ చెప్పారు.

అన్నిటికంటే వింతైన విషయం, ఎన్నికలూ, ఫలితాల ప్రకటనా దాదాపు ముఫ్ఫై నలభై గంటల్లో ముగిసిపోతుంది. శనివారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్, ఆ తరువాత వోట్ల లెక్కింపూ ప్రారంభమవుతాయి. ఆదివారం వుదయానికల్లా ముఖ్యమైన నియోజక వర్గాల్లో ఫలితాలు ప్రకటించి, సోమవారం వుదయానికి అన్ని ఫలితాలూ వెల్లడవుతాయి. ఇంకా వింతైన విషయం, పౌరులు వోటు వేయకపోతే జరిమానా విధించ బడుతుంది. దేశంలో లేని వారు తమ వోటును పోస్టు ద్వారానో, ఈ మెయిలు ద్వారానో
పంపుకోవచ్చు. వోటు వేయటం మాత్రం తప్పదు.

వుదయాన్నే వోటూ వేయటానికి వెళ్ళిన నాకు, లేబర్ పార్టీ, లిబరల్ పార్టీ కర పత్రాలు పట్టుకుని నిలబడ్డ ఇద్దరు అమ్మాయిలు కులాసాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవటం చూసి నవ్వొచ్చింది. మన దగ్గర కాంగ్రెసు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని అలా చూడ గలమా? రిగ్గింగూ, హింసా, హత్యలూ, రక్త పాతాలూ లేని ఎన్నికలు చూడగలమా? పౌరులందరూ బాధ్యతగా వోటు వేయటం చూడగలమా? నాయకులు వోట్లకోసం సారాయి, కరెన్సీ నోట్లు వెదజల్లకుండా వుండటం చూడ గలమా? నాయకులు ఎన్నికల ప్రచారంలో (ఆ తరువాత చట్ట సభల్లో కూడా) ఒకరి నొకరు “అన్ పార్లమెంటరీ” భాషలో తిట్టుకోకుండా హుందాగా వుండటం చూడ గలమా?

ఎందుకని ప్రపంచంలొ కెల్లా పెద్దదైన ప్రజా స్వామ్య దేశంలో ఎన్నికలు ఒక ప్రహసనంలా అయిపోయాయి?నేతల నీచత్వమా, మన బాధ్యతా రాహిత్యమా, మన అవిద్యా, ఏది కారణం? ఆలోచించక తప్పదు మనకందరికీ.
 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s