సాహిత్యంలో కథలది ఒక విశిష్టమైన స్థానం. మానవ జీవితంలోని విభిన్నమైన, ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించటంలో కథా ప్రక్రియకున్న శక్తి వేరే చెప్పుకోనవసరంలేదు.
నలుగురు కథకులు, నాలుగు దృక్పథాలు
(విపుల మాస పత్రిక, మార్చి 2008)
-శారద
సాహిత్యంలో కథలది ఒక విశిష్టమైన స్థానం. మానవ జీవితంలోని విభిన్నమైన, ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించటంలో కథా ప్రక్రియకున్న శక్తి వేరే చెప్పుకోనవసరంలేదు. నవల సినిమా అయితే కథ స్టిల్ ఫోటో లాటిది. నైపుణ్యంకల ఫోటో గ్రాఫరు ఒక్క ఫోటోలో తను చెప్పదలచుకున్నదంతా చూపించటంలో సఫలీకృతుడవుతాడు. చేయి తిరిగిన కథకులు కథ నిడివితో ప్రమేయంలేకుండా తను చూపించదలచుకున్న కోణాన్ని చూపిస్తారు.
మంచి కథ ఒక విషయాన్ని హై లైట్ చేస్తూ, ఆ విషయం మానవుల ప్రవర్తననీ, మానవ సంబంధాలనీ ఎలా ప్రభావితం చేస్తుందో సున్నితంగా చెప్ప గలిగి వుండాలి. నవలలకున్న ఒక సౌలభ్యం కథలకి లేదు. కథ చిన్నగా, సూటిగా వుండాలి. నీతులు బోధించకూడదు. తీర్పులు చెప్పకూడదు. చదువరికి విషయాన్ని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు గాక కొంచెం సటిల్ గా, చదువరి ఊహకీ, తెలివి తేటలకి పని చెప్పేదిగా వుండాలి.
తెలుగులో లాగే ప్రపంచంలోని అన్ని భాషలలోనూ, అన్ని కాలాల్లోనూ అద్భుతమైన కథకులు ఆవిర్భవించి, సాహిత్యాన్ని అందరానంత ఎత్తుకి తీసుకెళ్ళి, జీవితపు లోతులను చూపించారు. అలాటి గొప్ప కథకుల్ల్లోంచి ఒక నలుగురి గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. వీరు నలుగురు మాత్రమే కాక ప్రపంచ సాహిత్యంలో కథా రచనను ఔపోసన పట్టిన గొప్ప రచయితలెందరో వున్నారు. ఈ నలుగురూ నాలుగు వేర్వేరు దేశాలకి చెందిన వారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విశిష్టమైన శైలి. ఒక్కొక్కరూ ఒక్కొక్క కోణాన్నించి జీవితాన్ని పరిశీలించి వారు కనుక్కొన్న నిజాలనీ తమదైన పధ్ధతిలో మనకంద చేసారు. వీరు నలుగురూ దాదాపు ఒకే కాలానికి చెందిన వారు.
ఆంటొన్ చెహోవ్ (1860-1904): రష్యాలో పుట్టి నలభై నాలుగేళ్ళ చిన్న వయసులోనే గతించిన ఆంటొన్ చెహోవ్ నాటక రచయితగా కంటే కథా రచయితగా ఎక్కువ పేరుపొందాడు. వృత్తి రీత్యా వైద్యుడే అయినా, పత్రికా విలేఖరిగా పనిచేస్తూ ఎన్నో కథలనీ నాటకాలనీ రచించారు. ముందుగా కథలని కేవలం డబ్బు సంపాదన కొరకే ప్రారంభించినా, కొద్ది కాలంలోనే కథా రచనని ఒక అద్భుతమైన కళగా మార్చిన అక్షర శిల్పి ఆయన.
ఆరుగురు పిల్లల్లో ఒకడైన చెహోవ్ 1860 లో దక్షిణ రష్యాలో జన్మించారు. ఆయన తండ్రి పావెల్ అక్కడ ఒక చిన్న దుకాణదారు. పిల్లలని అతి తీవ్రంగా దండించే పావెల్ తరువాత చెహోవ్ చాలా కథల్లో చోటు చేసుకున్నారు. చెహోవ్ తల్లి యెవ్జెనియా అతన్ని చిన్నప్పుడే కథల ప్రపంచానికి పరిచయం చేసింది. ఆయన తన బాల్యాన్ని ఖైదుతో పోల్చారు. చెహోవ్ కి పదహారేళ్ళప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్ధిక కారణాల వల్ల మాస్కోకి తరలి వెళ్ళింది. దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, చెహోవ్ ఉన్నదంతా అమ్మి చదువుకున్నారు. మెడికల్ కాలేజి లో విద్యార్థిగావున్నప్పుడే ఆయన అడపా దడపా కథలు రాస్తూ పేరు తెచ్చుకున్నారు. మొదట్లో ఆయన ఎక్కువగా హాస్య రస భరితమైన కథలు రాసేవారు. పాతికేళ్ళ వయసులోనే టీ.బీ. వాత పడ్డ చెహోవ్ నలభై నాలుగేళ్ళ వయసులో మరణించారు.
బెర్నార్డ్ షా, సోమర్సెట్ మాం, వర్జీనియా వుల్ఫ్, బేట్స్ మొదలైన కథకులందరూ తాము చెహోవ్ వల్ల ప్రభావితులైనట్టు ఒప్పుకున్నారు.
ఇరవై ఆరేళ్ళ వయసులో మొదటగా ఒక కథా సంకలనాన్ని ప్రచురించిన చెహోవ్ ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో పుష్కిన్ బహుమతిని గెలుచుకున్నారు. ఆ తరువాత పదేళ్ళ వరకూ ఆయన లెక్క లేనన్ని కథలు రాసి రష్యన్ సాహిత్యంలో మరచిపోలేని ప్రభావాన్ని చూపారు. ఆయన రాసిన నాటకాలు స్టేజిపై మొదట్లో విఫలమైనా, తరువాత చాలా ప్రజాదరణ పొందాయి. “అంకుల్ వాన్యా”, “ది త్రీ సిస్టర్స్”, “ది చెర్రీ ఆర్చర్డ్” మూడూ ఆయన రాసిన నాటకాల్లోకెల్లా గొప్పవని పేరు పొందినవి. అయినా ఆయనని ప్రజలు కథా రచయితగానే ఎక్కువ ప్రేమించారు.
చెహోవ్ కథల్లో సాధారణంగా ఒకే ఒక్క సంఘటన వుంటుంది. ఆ సంఘటనలో వుండే వ్యక్తులు చాలా వరకు కేవలం ఆ సంఘటన వల్లే ఆ ప్రదేశంలో కలుస్తారు. రచయిత ఆ సంఘటన గురించి కానీ వ్యక్తుల గురించి కానీ ఎక్కువ వర్ణనలూ వివరణలూ ఇవ్వరు. కథ నిడివి నాలుగైదు పేజీలకు మించదు. కానీ ఆ నాలుగైదు పేజీల్లోని ఆ చిన్న సంఘటనలోనే ఆ వ్యక్తుల గురించి, వాళ్ల మనస్తత్వాల గురించీ, వాళ్ల సాంఘిక పరిస్థితుల గురించీ, వాళ్లల్లో అంతర్లీనంగా వుండే సంబంధాల గురించీ, ఆ సంబంధాల వెనుక వుండే సాంఘిక, ఆర్ధిక, రాజకీయ శక్తుల గురించీ అంతా మనకు అర్థమై పోతుంది, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక తడి గుడ్డని పిండి నీళ్లు తీసినట్టు ఆ ఒక్క సంఘటననించీ ఎంతో అవగాహన వెలికి తీస్తారు చేహోవ్. చాలా కథలకి అసలు క్లైమాక్స్ అన్నదే వుండదు. చాలా విషయాలను పాఠకుల ఊహకే వదిలేస్తూ, subtlety అనే మాటకు అర్ధాన్నిస్తారు చెహోవ్.
ఉదాహరణకి, ఒక కథలో ఒక ఎనిమిదేళ్ల బాలుడు పల్లెటూళ్లో వున్న తాతకి వుత్తరం రాస్తాడు. కథంతా మూడు పేజీల ఉత్తరం మాత్రమే. ఇంకే వివరణలూ, వ్యాఖ్యానాలూ, పాత్రలూ, సంఘటనలూ వుండవు. ఆ ఉత్తరంలో ఒక చిన్నపిల్లవాడి అమాయకపు భాషలో ఆ నాటి మాస్కో నగరంలోని దుర్భర దారిద్ర్యం, నిస్సహాయతా మనకి కళ్లకి కట్టినట్టు కనిపిస్తాయి. ఇంకొక కథలో ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తరువాత రైలు స్టేషన్లో ఒకర్నొకరు గుర్తు పట్టుకొని పలకరించుకుంటారు. మాటల్లో వారికి వాళ్ల సాంఘిక స్థాయిల్లో చాలా అంతరం వచ్చిందని అర్ధం అవుతుంది. అప్పటిదాకా చిన్నప్పటి అల్లరి తలచుకుంటూ పగలబడి నవ్వుకున్న వాళ్లిద్దరూ తమ ఉద్యోగాల్లో వున్న అంతరాలు తెలుసుకోగానే మొహమాటంగా ఎక్కువ మాట్లాడుకోకుండా, అడ్రసులూ ఏమీ ఇచ్చి పుచ్చుకోకుండా వెళ్లి పోతారు. మూడే మూడు పేజీల ఈ చిన్న కథలో మనకి ఆ ఇద్దరు వ్యక్తులూ, వాళ్ల భార్యలూ, వాళ్లందరి మనస్తత్వాలూ, బలహీనతలూ, వాటి వెనక వున్న కారణాలూ అన్నీ అర్ధమవుతాయి.
ఏ వివరణలూ, సంజాయిషీలూ తీర్పులూ లేకుండా జీవితాన్ని నడిపించే సూత్రాలగురించి, వాటి వెనక వుండే సాంఘిక శక్తులనీ మనకి అంత సున్నితంగా పరిచయం చేయడమే ఆయన కథల్లోనున్న ప్రత్యేకత.
విలియం సోమర్సెట్ మాం’ (1874 – 1965): చెహోవ్ మనిషిని సంఘానికీ, ఆర్థిక శక్తులకీ బందీ అని భావిస్తే, సోమర్సెట్ మాం’, మనిషిని కట్టిపడేసిది అతని అంతరాత్మే అని అభిప్రాయపడ్డారు. నిజానికి సోమర్సెట్ మాం’ కథా రచయితగా కంటే నవలా రచయిఉతగా, నాటక రచయితగా ఎక్కువ పేరు పొందారు. చాలా మామూలు భాషలో, సులభ శైలిలో వుండే ఆయన రచనలు ఆయన కాలంలో “ఫాషన్” గా చెలామణీ అయ్యేవి కావు. ఆయన రచనలు మొదలుపెట్టే సమయానికి వర్జీనియా వూల్ఫ్ చైతన్య స్రవంతి శైలి చాలా ప్రాచుర్యంలో వుండేది. ఆయన రాసిన “ఆఫ్ హ్యూమన్ బాండేజ్”, “ది రేజర్స్ ఎడ్జ్” కాలాతీతమైన విఖ్యాతి పొందినప్పటికీ, ఆయన దాదాపు పది కథా సంకలనాలను ప్రచురించి, కథా రచనల్లో కూడా తనదైన ముద్ర వేసారు.
కథలో ఒక తుపాకీ వుందంటే, అది కథ ముగిసే సమయానికి పేలాల్సిందే, అన్నారు మాం’. ఆయన రాసిన కథల్లోనూ అటువంటి బిగువూ, తర్కానికి నిలబడే సంఘటనలూ నిండి వున్నాయి.
మాం’, చెహోవ్ దాదాపు సమ కాలికులే అయినా వాళ్ళ జీవితాల్లో చాలా అంతరం వుంది. బహుశా ఈ అంతరమే వాళ్ళ శైలిలో ప్రతిఫలిస్తూ వుండి వుండవచ్చు. చెహోవ్ నిరుపేద కుటుంబంలో పుట్టి దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తే, మాం’ విద్యాధికులూ, శ్రీమంతులూ అయిన న్యాయవాదుల ఇంట జన్మించారు. ఆయన జననం 1874 లో పారిస్ నగరంలోని బ్రిటిష్ ఎంబసీలో జరిగింది. చిన్నతనంలో తండ్రీ, తాతల్లాగే ఆయనా న్యాయవాది అవుతారనుకూనారంతా, కానీ ఆయనకి చిన్నతనం నించీ వున్న నత్తి కారణంగా, ఆ ఆశలని వదిలేసుకున్నారు. చిన్న వయసులో తల్లి తండ్రులని పోగొట్టుకుని ఇంగ్లండులో బంధువుల ఇంట పెరిగారు. తన బాల్యాన్నంతా ఆయన తను రాసిన “ఆఫ్ హ్యూమన్ బాండేజ్” లో యథా తథంగా చిత్రించారు. చెహోవ్ లాగానే ఆయన ముందుగా వైద్య వృత్తిలో చేరినా చివరికి రచయితగా స్థిరపడ్డారు. ఆయన ముందు కథలూ, నవలల రచయితగా కంటే నాటక రచయితగా ఎక్కువ పేరు పొందారు. ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో ఆయన నాటకాలు లండన్ నగరంలో విరివిగా ప్రదర్శించబడేవి. ప్రేమని గురించి అద్భుతంగా చిత్రించిన “ఆఫ్ హ్యూమన్ బాణ్డేజ్” తరువాత ఆయన దాదాపు పదేళ్ళు కథా రచనలకి దూరంగా వున్నారు. అదే కాక ఆయన రాసిన “ది రేజర్స్ ఎడ్జ్”, “మూన్ అండ్ ది సిక్స్ పెన్స్” కాలాతీతతమైన నవలలు.
ఈ నవలలూ నాటకాలూ ఒక ఎత్తయితే, ఆయన రాసిన కథలు ఒక ఎత్తు. స్థూలంగా ఆయన ఏ మనిషి ప్రవర్తననీ, ఆలోచనలనీ అన్ని వేళలా సరిగ్గా అంచనా వేయలేమంటారు. చూడటానికి అమాయకంగా పిరికిగా కనిపించే మనిషి కోపంలో హత్య చేయటానికి కూడా వెనుకాడక పోవచ్చు. పిసినారిలా, స్వార్థ పరుడిలా కనిపించే ఇంకో మనిషి తన సుఖాలన్నీ పక్క మనిషికోసం త్యాగం చేయవచ్చు. “అవతలి మనిషిని నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నానని అనుకునే వాడు మూర్ఖుడు” అంటారాయన. అదే విధంగా మనిషికీ మనిషికీ మధ్య వుండే సంబంధాలను ఇదమిధ్ధంగా సూత్రీకరించలేం. అవి బయటి శక్తుల మీద ఎంత ఆధారపడి వున్నా, అంతకంటే ఎక్కువగా వ్యక్తిత్వాల మీద ఆధారపడి వుంటాయి. ఆ రకంగా చూస్తే మనిషి తనకి తానే బందీ.
స్వతహాగా డబ్బు బాగానే వున్న కుటుంబం నించి రావటంతో ఆయన కథల్లో సుఖంగా బ్రతికే మనుషులూ, తీరికగా, సౌకర్యంగా వుండే జీవన శైలీ, ఎక్కువగా సంఘర్షణ లేకపోవటం కనపడుతూ వుంటాయి. ఎక్కువగా మధ్య తరగతి ఇంగ్లండు జీవితం గురించి రాసినా, ఆయన అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యమంతా తిరిగి మలేషియా, సింగపూర్, ఇండియాల గురించి కూడా చాలా కథలు రాసారు. అయితే ఒక్క విషయం. ఈ కథల్లో ఆ రోజుల్లో యూరోప్ దేశాల్లో వున్న జాత్యహంకారం, బ్రిటీష్ సామ్రాజ్య వాద ధోరణులూ, యూరోప్లో వున్నది మాత్రమే నాగరికత అనే అభిప్రాయాలూ అంతర్లీనంగా వుండి మనలని కొంచెం చికాకు పెడతాయి. కానీ భారతీయ తత్వ శాస్త్రంతో ఆయన ఎంతో ప్రభావితులై దానిని గురించి “ది రేజర్స్ ఎడ్జ్” లో విపులంగా చర్చించారు.
మాం’ ఎక్కువగా ప్రపంచమంతా పర్యటిస్తూ తను చూసిన మనుషుల గురించి విశ్లేషిస్తూ కథలు రాసేవారు. దీని వల్ల ఆయన ఎన్నో చిక్కులూ, కోర్టు వ్యాజ్యాలూ కూడ ఎదురుకున్నారు. తమను కథల్లో కెక్కిస్తున్నాడని చాలా మంది స్నేహితులకి ఆయన మీద కొంచెం కోపంగా కూడా వుండేది. పుస్తకాలు చదవటం ఒక వ్యసనం లాటిదని అభిప్రాయపడుతూ ఆయన, “పుస్తకాలు చదివే అలవాటున్న మనిషి ఎప్పుడు ఏదో చదువుతూనే వుంటాడు. ఏ పుస్తకమూ దొరక్క పోతే, కనీసం టెలిఫోన్ డైరెక్టరీ అయినా సరే,” అన్నారు. చేహోవ్ లాగే మాం’ కూడా తన పాత్రల ప్రవర్తన గురించీ, మనుషుల్లో వుండే బలహీనతల గురించీ ఏ రకమైన సంజాయిషీలూ వివరణలూ ఇవ్వరు. “ఇదిలా వుంది, ఇదిలా జరిగింది” అని మాత్రమే చెప్తారు. మిగతా ఆలోచనలన్నీ పాఠకుల మేధస్సుకే వదిలేస్తారు.
మనిషి మనసుని అనేక కోణాల్లో బహిర్గతం చేస్తూ ఆయన రాసిన కథలు కథకులకూ, పాఠకులకూ కూడ ఆలోచింప చేస్తాయి.
ఓ.హెన్రీ (1862-1910) : దాదాపు ఆరు వందలకు పైగా కథలు రచించి, కథా రచనలో అగ్రగణ్యుడైన ఓ.హెన్రీ అసలు పేరు సిడ్నీ విలియం పోర్టర్. ఆయన 1862 లో అమెరికా లోని నార్త్ కెరోలినాలో జన్మించారు. మూడేళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకున్న విలియం తాతగారింట పెరిగారు. ఆయన విద్యాభ్యాసం దాదాపు పదిహేనేళ్ళ వయసు వరకూ మెనత్త వద్దనే సాగింది. ఆ తరువాత ఆయన మందుల దుకాణంలో పనిచేసి, ఫార్మసిస్టు లైసెన్సు కూడా సంపాదించారు. ఆరోగ్యరీత్యా ఆయన తరువాత టెక్సాస్ లోని ఆస్టిన్ నగరానికి వలస వెళ్ళారు. ఆస్టిన్ లో సంగీతం సాహిత్యం లాటి రకరకాల కార్యక్రమాలతో ఉత్సాహంగా గడిపారు. ఉదర పోషణార్ధం ఆయన టెక్సస్ జెనరల్ లాండ్ ఆఫీస్ లో ఉద్యోగం చేసారు. ఆ ఉద్యోగానికి ఇతర కారణాల వల్ల రాజీనామా ఇచ్చి ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకు లెక్కలు చూడటం కష్టమయ్యేది. లెక్కల్లో అవకతవకలు జరిగాయని ఆయన మీద బాంకు దావా వేసింది. అప్పటికి కేసు కొట్టివేసినా అయిదారేళ్ళ తరువాత అదే కేసుని తిరగతోడటం తో ఆయనకు జైలు శిక్ష తప్పలేదు. అప్పటికే ఆయన పోస్ట్ పత్రికలో పని చేస్తూండేవారు. కేసునుండి తప్పించుకోవటనికి ఆయన1896లో అమెరికా వదిలి పారిపోయారు. కాని 1897 లో మృత్యుముఖం లో వున్న భార్యని చూడటంకోసం ఆస్టిన్ తిరిగివచ్చి పోలీసులకి లొంగిపోయారు. కేసు విచారణ ముగిసి 1898లో ఆయనకు అయిదేళ్ళ జైలు శిక్ష పడింది. ఒహైయో జైలులో ఆయన జైలు ఆస్పత్రిలో మందుల శాఖలో పని చేసారు. 1901లో విడుదలయ్యేనాటికే ఆయన బోలెడు కథలు రకరకాలైన కలం పేర్లతో రాసి ప్రచురించారు. దాదాపు ఆరూ వందల కథలను ప్రచురించిన ఆయన నలభై ఏడేళ్ళ వయసులో, 1910 లో మరణించారు. తాగుడు లాటి వ్యసనాల బారిన పడటంతో ఆయన చివరి రోజులు దారిద్ర్యమూ, అనారోగ్యాలతో బాధ పడ్డారు.
తన రచనలన్నీ ఆయన చాలా కలం పేర్లతో రాసారు కానీ, ఆఖరికి ఓ.హెన్రీ పేరుతో ఆయన రాసిన కథలు సుప్రసిధ్ధమైనాయి. ఆయన చాలా వరకు జీవితం చేతిలో ఓడిపోయిన వాళ్ళూ, నిర్భాగ్యుల గురించి రాసారు. అయితే అది కరుణ రసంతో కాకుండా సున్నితమైన హాస్యంతో కూడినవై ఉంటాయి. బ్రతుకులో వుండే కష్ట నష్టాలూ, ఆకలీ, రోజూ వారీ సమస్యలని గురించి ఒక ప్రహసనంలా రాయటం ఆయన ప్రత్యేకత. ఆయన కథలన్నీ చిన్న నిడివితో ఊహించని కొస మెరుపుతో వుండి చివరి దాకా ఉత్సాహంతో చదివిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో ఈ కొస మెరుపు (ట్విస్ట్) కథలకి కి ఓ.హెన్రీ పెట్టింది పేరు.
కూలీ నాలీ జనం, అర్ధికంగా నిలదొక్కుకోలేని కళా కారులూ, దొంగలూ, పేదవాళ్ళూ, ఇంకా అన్ని రకాలుగా అణిగిపోయిన వాళ్ళ ఆశలూ, సంతోషాలను గురించి ఆయన ఎక్కువగా రాసారు. దుర్భరమైన దారిద్ర్యంలో వున్నప్పుడు చిన్న విషయాలే ఎక్కువ ఆనందాన్నిస్తాయి. ఆయన కథల్లో ఈ ఆనందాన్ని ఎక్కువగా చిత్రిచారు. ఆ కథల్లో వున్న మామూలు మనుషులతో మనల్ని మనం అయిడెంటిఫై చేసుకొని నవ్వుకోగలుగుతాం.
“రాన్సం అండ్ ది రెడ్ ఛీఫ్” అనే కథలో ఇద్దరు చిల్లర దొంగలు ఒక ధనికుని కొడుకుని అపహరించి డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ ఆ రాలుగాయి వాళ్ళని పెట్టిన హింసకి తట్టుకోలేక వాళ్ళే తిరిగి డబ్బిచ్చి ఆ పిల్లాణ్ణి వదిలించుకుంటారు. “గిఫ్ట్ ఆఫ్ మేగి” అనే కథలో ఇద్దరు నిరుపుఏదలైన దంపతులు ఒకరికొకరు క్రిస్ట్మస్ బహుమతులు కొనాలనుకుంటారు. భర్త దగ్గర వున్న అందమైన గడియారం కొరకు స్ట్రాప్ కొనాలని భార్య తన అందమైన జుట్టుని అమ్మి వేస్తుంది. భార్య నిడుపాటి జడలోకి దంతపు దువ్వెన కొరకు భర్త తన దగ్గరున్న గడియారాన్ని అమ్మి వేస్తాడు.
ఇలాటి చిన్న చిన్న కథల్లో ఓ.హెన్రీ మామూలూ మనుషుల మ్నస్తత్వాలనూ, వాళ్ళ సమస్యలనీ అద్భుతంగా చిత్రీకరించి కథా రచయితలకు గురువైనాడు. అమెరికా ప్రభుత్వం 1918 నించీ ఆయన పేరుతో “ఓ.హెన్రీ అవార్డు” ప్రతీ యేటా ఒక రచయితకిచ్చి సన్మానిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా (తెలుగుతో సహా) చాలా మంది చిన్న కథకులకి ఓ.హేన్రీ కథలే స్ఫూర్తి. సుప్రసిధ్ధ హిందీ చలన చిత్రం “రైన్ కోట్” కథ కూడా ఆయన కథల స్ఫూర్తి తోనే రాయబడింది.
గీ ద మొపాస్సా (1850-1893):
ఫ్రెంచి కథకుల్లోకెల్లా గొప్పవాడిగా చెప్పుకోబడ్డ గీ-ద-మొపాస్సా (Guy de Maupassant), తన నలభై మూడేళ్ళ జీవితంలో మరచిపోలేని కథలని రాసారు. ఆయన ఎక్కువగా నీతికీ అవినీతికీ మధ్య వున్న సన్నటి గీతని గురించి ప్రశ్నిస్తూ రాసారు. ఆయన పాత్రలు స్త్రీ పురుష భేదాల్లేకుండా నీతికి మనం సాధారణంగా చెప్పుకునే నిర్వచనానికి సవాలుగా నిలుస్తాయి. ఒకే సారి ఆయన కథలు పది చదివితే మనకి ఫ్రెంచి సమాజంలోని వ్యక్తుల శీలాన్ని గురించి అనుమానం రాక మానదు. సంఘ నీతికి అతీతంగా వుండే వారి ప్రవర్తనకి ఆయన సంజాయిషీలు గానీ సమర్ధనలు గానీ వుండవు. కేవలం నీతిని ధిక్కరించే ఒక సంఘటనలో పాత్రల మానసిక స్థితిని గురించి లీలా మాత్రంగా వర్ణనలుంటాయి, అంతే! ఈ రకమైన నీతి ధిక్కారం సంఘం మీద తిరగబడటానికో, లేక విప్లవం కోసమో కాక కేవలం వ్యక్తిగత కారణాల వల్ల వుంటూంది. అటువంటి వ్యక్తుల గురించి ఆ రోజుల్లో మర్యాదస్తులమని చెప్పుకునే వాళ్ళ సానుభూతి ఆశించటం సాహసమే అయి వుండాలి !
మొపాస్సా ఫ్రాన్స్ దేశంలో 1850 లో జన్మించారు. ఆయన తల్లి లారె సుప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత ఫ్లాబర్ట్ చిన్ననాటి స్నేహితురాలు. బహుశా అందువల్లనే ఫ్లాబర్ట్ మొపాస్సా జీవితంలో చాలా శ్రధ్ధ తీసుకున్నారు. ఆయన రచనల్లో కూడా ఫ్లాబర్ట్ ప్రభావం చాలా కనబడుతుంది. ఆ రోజుల్లో ఫ్లాబర్ట్ రాసిన “మేడం బొవరీ” నీతి అవినీతుల నిర్వచనాలని ధిక్కరిస్తూ చాలా దుమారన్నే లేపింది.
మొపాస్సా చిన్నతనంలోనే అతని తల్లి తండ్రులిద్దరూ విడి పోయారు. పదమూడేళ్ళ వరకూ ఆయన తల్లితో పాటూ సముద్రపు ఒడ్డూన పల్లెటూళ్ళో గడిపారు. పద్నాలుగేళ్ళ వయసులో పాఠశాలకెళ్ళినా, ఎక్కువ రోజులు వుండ లేకపోయారు. ఫ్రెంచి-జర్మన్ యుధ్ధంలో ఏడాది పాటు సైనికునిగా పాల్గొని, అటు పిమ్మట పారిస్ నగరంలో ఉద్యోగంలో స్థిర పడ్డారు. దాదాపు పదేళ్ళ తరువాత ఉద్యోగం మారి, పత్రికా సంపాదకులుగా పని చేసారు. 1880 లో ప్రచురించబడ్డ “బౌల్ ది స్యూ” అనే కథ సుప్రసిధ్ధమైంది. ఇదే ఆయన రాసిన మొదటి చిన్న కథ.
ఈ కథలో ఫ్రెంచి-జర్మనీ దేశాల మధ్య యుధ్ధ సమయంలో కొంతమంది మర్యాదస్తులూ, ఒక వేశ్యా కలిసి ఒకే బండిలో ప్రయాణిస్తూ వుంటారు. ముందుగా బండిలోని మిగతా స్త్రీ పురుషులందరూ ఆ వేశ్యని ఎవగింపు మాటలతో చూపులతో హింసిస్తారు. కానీ ఆమె ఒక బుట్ట నిండుగా తినుబండారాలని వెలికి తీయగానే ఆమెతో స్నేహం కలుపుతారు. దురదృష్టవశాత్తూ ఆ బండి దారి తప్పి జర్మనుల చేత చిక్కుతుంది. జర్మను సైన్యాధికారి, ఆ వేశ్య తనతో ఒక రాత్రి గడిపితే వాళ్ళందరినీ వదిలేస్తానని నిర్బంధిస్తాడు. దానికావిడ నిరాకరిస్తుంది. ముందుగా అందరూ ఆ వేశ్యని సమర్ధించినా, రెండు రోజులు గడిచేసరికి అందరూ మెల్లిగా ఆమెకి నీతి-అవినీతికీ మధ్య పెద్ద దూరం లేదనీ, ఆపధ్ధర్మంగా ఒప్పుకున్నా ఎటువంటి తప్పూ ఉండదనీ మెత్తటి మాటలు చెప్పి ఒప్పిస్తారు. ఆమె విధిలేక ఒప్పుకొని అందరినీ విడిపిస్తుంది. ఒక రాత్రి గడిచాక వాళ్ళందరూ తిరిగి వాళ్ళ బండిలో ప్రయాణమౌతారు. ఈ సారి అందరూ మళ్ళీ ఆమెతో మాటలు మానేసి ఏవగించుకుని తమ మర్యాదను నిలబెట్టుకున్నామనుకుంటారు. వాళ్ళ హిపోక్రసీని చూసి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. దీన్ని చదవగానే మనకి మనుషుల ముసుగుల మీదా, అవసరం వచ్చినప్పుడూ పక్క మనిషిని నిస్సంకోచంగా తోడేళ్ళ ముందుకి తోసే స్వార్థం మీదా ఏవగింపు కలగకుండా వుండదు.
ఈ కథ తరువాత ఆయన వెను దిరిగి చూడలేదు. ఆ తరువాత పదేళ్ళ కాలంలో ఒకదాన్ని మించి ఒకటి కథలు రాసారు. సంవత్సరానికి కనీసం రెండు మూడు సంచికలైనా ఆయన కథలవి వచ్చేవి. ఈ కథా సంకలనాల వల్ల డబ్బూ, పేరూ వచ్చి పడ్డాయి. సాధారణంగా ఆయనకి ఒంటరితనమంటే ఎక్కువ ఇష్టం వుండేది. అందుకే తన సొంత పడవలో ప్రపంచమంతా చుట్టబెడుతూ వుండేవారు.
ఇరవై యేళ్ళ వయసులో సోకిన సిఫిలిస్ వ్యాధి వల్ల ఆయన తన చివరి రోజులు ఆయన మానసిక వ్యాధులతో బాధ పడ్డారు. మతి పూర్తిగా భ్రమించిన ఆ స్థితిలో ఆయన కొన్ని అద్భుత, భయానకమైన కథలు రాసారు కాని అవంతగా పేరు పొందలేదు. మానసిక వ్యాధితోనే ఆయన నలభై మూడేళ్ళ వయసులో మరణించారు. సూటిగా, ఆలోచింపచేసి, మనసుల్ని కదిలించే ఆయన కథలు తరువాత తరాల కథకులందరినీ చాలా ప్రభావితం చేసాయి.
ఈ నలుగురే కాక ప్రపంచ సాహిత్యంలో ఏ “ఇజాలూ”,
“సిధ్ధాంతాల” జోలికీ పోకుండా మనిషిని కేవలం మనిషిగానే అర్ధం చేసుకుని విశ్లేషిస్తూ తద్వారా సంఘ స్వరూపాన్ని పరిచయం చేసే కథకులు కోకొల్లలు. ఎందరో మహానుభావులందరికీ వందనములు.
***********************************************
కథలో ఒక తుపాకీ వుందంటే, అది కథ ముగిసే సమయానికి పేలాల్సిందే – ఇది తరుచూ కనిపించే కొటేషనే కానీ నాకు వివాదాస్పదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చైతన్యస్రవంతిధోరణిలో రాస్తున్నప్పుడు సందర్భశుద్ధిలేని ఆలోచనలు వచ్చినట్టే గదిలో తుపాకీ కేవలం ఒకనాటి వైభవాన్నో జీవనసరళినో సూచించేది కావచ్చుకద.
ఏ మనిషి ప్రవర్తననీ, ఆలోచనలనీ అన్ని వేళలా సరిగ్గా అంచనా వేయలేమంటారు – ఇది నాకు బాగా మనసున నాటిన విషయం. అనుభవపూర్వకంగానైతేనేమీ కథల్లో చదివి అయితేనే నమ్మగలిగిన సంగతి.
సిధ్ధాంతాల” జోలికీ పోకుండా మనిషిని కేవలం మనిషిగానే అర్ధం చేసుకుని విశ్లేషిస్తూ తద్వారా సంఘ స్వరూపాన్ని పరిచయం చేసే కథకులు కోకొల్లలు – యస్యస్యస్… 🙂
చాలా మంచి వ్యాసం అందిచ్చారు శారదా. అభినందనలు.
మంచి వ్యాసం. Keep writing more such articles 🙂
ఇంచుమించు ఒకే కాలంలో జీవించి ఆధునిక కథానికకి నిర్వచనం ఇచ్చిన నలుగురు దిగ్దంతుల్నీ చాలా బాగా సమీక్షించారు ఇక్కడ. వారి వారి రచనా దృక్పథంలోని అంతస్సూత్రాలని సరళంగా ఆవిష్కరించిన తీరు బావుంది.
చాలా బాగుందండీ వ్యాసం.
అహా ! ఎంత బావుందండీ మీ వ్యాసం ! థాంక్స్.
మీరు చాలా బాగా రాశారు. ఎంతో మంచి విలువైన విషయాలు తెలిశాయి. చదివినందుకు తృప్త్నిచ్చింది. ఇక నాకు తెలిసింది రాస్తున్నాను. మీకు తెలుసోలేదో నాకు తెలియదు.
సోమర్సెట్ మాం గారు ది రేజర్స్ ఎడ్జ్ లో ప్రధాన పాత్రకి ఇన్స్పిరేషన్ గా రమణ మహర్షిని తీసుకొన్నాడని చదివాను. వేస్ట్ లో ఈ నవల చాలా మందిని ఆకట్టుకొనిందని చదివాను. ఆయన రమణ మహర్షి దగ్గర కొన్ని రోజులు గడిపారు. ఆతరువాత ఆపుస్తకం రాశారు. ఈ పుస్తకం చదివిన తరువాత ఒక ప్రఖ్యాత హాలివూడ్ నటిమణి అమేరికా నుంచి భారతదేశానికి రమణ మహర్షిని చూడటానికి వచ్చింది.
చాలా బాగుంది. మీ నుంచి మరిన్ని అనువాద కథలు ఆశిస్తున్నాను. మీరు మంచి సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు.