రాగాల వారాంతం
శారద
ఆగస్టు పదిహేను-పదహారు వారాంతం మా అడిలైడ్ లో చాలా రాగాలు పలికించింది.
ఆగస్టు పదిహేను-పదహారు వారాంతం మా అడిలైడ్ లో చాలా రాగాలు పలికించింది
శనివారం (ఆగస్టు పదిహేను): సుప్రసిధ్ధ నేపథ్య గాయకుడు శ్రీ మనో గారి సంగీత కార్యక్రమం జరిగింది. తెలుగు తమిళ కన్నడ సంఘాల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దాదాపు మూడు నాలుగు గంటలు చాలా పాటలు పాడి ప్రేక్షకులని సంతోషపెట్టారు.
అయిదున్నర ప్రోగ్రాం ఆరింటికి మొదలవుతుందా లేక ఆరున్నరకా అని అయిదున్నరకే వచ్చి కూర్చున్న కొందరు బుధ్ధిలేని ప్రేక్షకులు పందాలు వేసుకుంటుండగా ఆరుంపావుకి కార్యక్రమం మొదలయింది.
కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అన్ని భాషల్లోనూ ఆయన్ని గురించిన వ్యాఖ్యానం ఇచ్చారు. తెలుగు భాషలో మాట్లాడటనికి స్టేజి ఎక్కిన వక్త, అచ్చం తెలుగు టీవీ యాంకర్ లా చలాకీ గా,
“హల్లో అండీ! హౌఆర్యూ అండి? ఇవాళ చాలా హేప్పీ డే అండి. ఎందుకంటే పాప్యులర్ సింగర్ మనో గారు కేం టు సింగ్ ఇన్ అడిలైడ్ అండి! ఆయన మెనీ లేంగ్వేజస్ లో ఆల్మోస్ట్ ట్వెంటీ టూ థౌజండ్ సాంగ్స్ సింగ్ చేసారన్నమాట. సో లెటజ్ ఎంజాయ్ ది ప్రోగ్రాం అండీ!” అంటూ ప్యూర్ టెల్గూ లో మాట్లాడారు.తరువాత వచ్చిన కన్నడ సంఘ ప్రతినిధి నమ్రతతో, “నమస్కార! ఈగ నమ్మ కన్నడ మక్కళు…” అంటూ కన్నడ కస్తూరి లో సౌమ్యంగా మాట్లాడుతూ మనో గారి మొదటి కన్నడ పాటతో మొదలుపెట్టి సంక్షిప్తంగా ఆయన పాటల వివరాలను ఆసక్తికరంగా చెప్పారు. తరువాత వచ్చిన తమిళ సంఘం ప్రతినిధి కొంచెం హడావిడి చేసినా, కల్తీలేని అరవం లో చక్కటి వ్యాఖ్యానం ఇచ్చారు.
ఏ స్పీచిలూ హంగామా లేకుండా మనో గారు “హర్ ఘడి బదల్ రహీ హై రూప్ జిందగీ” అనే పాటతో ప్రారంభించారు. తరువాత తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఒక్కొక్క సోలో పాడారు. తరువాత ఔత్సాహికులైన ఆడిలైడ్ కళాకారిణులతో కలిసి కొన్ని యుగళ గీతాలు పాడారు.
“మాటే మంత్రమూ” అనే సీతా కోక చిలుకలోని పాటకి ఆయనతో గొంతు కలిపి పాడే అవకాశం నాకు దక్కింది.
స్థానిక ఆర్కెస్ట్రా తో కూడా కలిసి ఆయన కొన్ని పాటలు పాడారు. మరీ కొత్తవి, మరీ పాతవి కాకుండా ఆయన చక్కటి పాటలు ఎన్నుకున్నారు. “ముకాబలా”, “శంకర్ దాదా” పాటలకి ప్రేక్షకులనుండి అనూహ్యమైన స్పందన లభించింది. అయితే కొత్త పాటల సాహిత్యం మీద నాకంతగా సదభిప్రాయం లేకపోవటం వల్ల వాటినంతగా ఆస్వాదించలేకపోయాను. “లక్సు పాపా లక్సు పాపా లంచి కొస్తావా” లాటి సాహిత్యం లో ఏమందం వుందో కానీ ఆ అందం నాకైతే కనిపించటం లేదు.
రిహార్సల్ కని శనివారం ఉదయం ఆయనని కలిసాను.
“ఏ పాటండి మీరు పాడేది?” అని అడిగారు.
పాట చెప్పగానే తన దగ్గరున్న ఐ-పాడ్ లో ట్రాక్ కోసం వెతికారు. ట్రేక్ దొరకగానే దాన్ని స్టీరియో లో పెట్టి, నేను ఎక్కడ నించి పాటెత్తుకోవాలో, ఏ చరణం దగ్గర ఎంత గేప్ ఇవ్వాలో వివరించారు. ఆలా అందరితో అన్ని పాటలూ వివరించి ప్రేక్టీసు చేయించారు. ఏ భేషజాలూ లేకుండా స్థానిక కళాకారులని అలా ప్రోత్సహించటమూ, ఆ ఙ్ఞాపక శక్తీ, ఆయన సింప్లిసిటీ చాలా బాగనిపించాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన అందరు కళాకారులనూ కలుపుకుని “వందే మాతరం” పాడేరు.
మొత్తం మీద చక్కటి కార్యక్రమమే అయినా మంచి ఆడిటోరియమూ, సమయ పాలనా, హుందాగా ప్రవర్తించే శ్రోతలూ వుండి వుంటే ఇంకా రక్తి కట్టి వుండేది
ఆదివారం(ఆగస్టు పదహారు) : సిక్కిల్ గురుచరణ్- కర్ణాటక సంగీతంలో ఉదయిస్తున్న తార! ఆయన సంగీతం నేను 2008 డిసెంబర్ లో మద్రాసు మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ హాల్ లో విన్నాను. ఆ రోజు ఆయన పాడింది సరిగ్గా గంటన్నర. కానీ ఆ గంట సేపు శ్రోతలని కదలకుండా కుర్చీలో కట్టి పడవేసారు.
సాధారణంగా కర్ణాటక సంగీతం కచేరీలో సంప్రదాయం ప్రకారం వర్ణం పాడినతరువాత, విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడతారు. గురుచరణ్ మద్రాసు కచేరీలో వర్ణం తరువాత పాడటానికి మామూలు కీర్తనలేవీ పాడకుండా, మలహరి రాగం లో “శ్రీ గణనాధ సింధూర వర్ణ” అనే గీతాన్ని పాడారు. ఇది పిల్లలకి సంగీతం పాఠాల్లో మొదట్లో నేర్పించే బాల పాఠం. ఇలాటి చిన్న సరళమైన గీతాన్ని ఆయన దాదాపు ముప్పై నిమిషాలు ఆలపించారు! ఆ రోజు ఆయన పాడిన తిల్లాన కూడా చాల బాగుంది.
అడిలైడ్ కచేరీలో ఆయన సావేరి రాగంలో వర్ణం తరువాత మోహన కల్యాణిలో ముత్తయ్య భాగవతార్ గారి “సిధ్ది వినాయకం” పాడారు. ఆ రోజు ముఖ్య రాగంగా అయన “కర్ణాటక దేవ గాంధారి” రాగాన్నెన్నుకుని, మైసూరు వాసుదేవాచార్యుల కీర్తన “భజరే రే మానస” అద్భుతంగా పాడారు. “రాజకుమారం, రామం” అన్న వాక్యం దగ్గర ఆయన చేసిన స్వర కల్పనా ఉయ్యాల మీద కూర్చున్న అనుభూతినిచ్చాయి.
అర గంట టీ విరామంలో అందరూ ఇళ్ళకెళ్ళి పోతారని అనుకుని, ఎవరూ వెళ్ళకుండా ఆడిటోరియంలోనే వుండటం చూసి పొంగి పోయి, శ్రోతలకొక కానుకగా రాగం తానం పల్లవి సమర్పించుకున్నారు. లతాంగి, నళినకాంతి, రేవతి రాగాల్లో రాగం తానం పల్లవి శ్రోతలనెంతో అలరించింది. అయితే తానానికి మృదంగ సహకారం కూడా తోడయింది. సాధారణంగా అలా జరగదనుకున్నాను. పల్లవి దగ్గరే మృదంగం తోడవుతుందని నేననుకోవటం. తిల్లాన పాడకుండా మూడు కాలాల్లో తిరుప్పుగళ్ పాడేరు. మొత్తం మీద చాలా కాలం గుర్తుండి పోయే కచేరీ.
గురుచరణ్ , అమ్మమ్మలిద్దరూ (సిక్కిల్ నీలా – కుంజుమణి- వేణు విద్వాంసులు) మా శ్రీవారు మురళీధరన్ గారి గురువులవ్వటం ఇంకొక విశేషం. ఇప్పుడిద్దరూ బాగా పెద్ద వాళ్ళైనా మద్రాసు వెళ్ళిన ప్రతీ సారీ వాళ్ళ దర్శనం చేసుకుని ఒక కొత్త పాట నేర్చుకుని (బోలెడన్ని తిట్లూ దీవనలూ మూట కట్టుకుని) మరీ వస్తారు మురళి.
రెండేళ్ళ క్రితం సంగీతం టీచరు తిట్టిందని చిన్నబోయిన మా మధూని చూసి నవ్వుతూ “ఇంత పెద్దయిన నన్ను మా టీచర్లు ఎలా తిడతారో విను” అని తన క్లాసు రికార్డు చేసిన కేసెట్టు పెట్టారు.
“ఎన్నప్పా వాసికిరే! పడ పడా అని అడిక్కిరదు ” (ఏమిటబ్బాయ్ నువ్వు వాయించేది? పడ పడా అని కొడుతున్నట్టుంది) అన్న వాళ్ళ టీచరు చిరాకు విని మా అమ్మాయిలిద్దరూ తల్చుకుని తల్చుకుని నవ్వుతారు.
—————————————————————
రెండు రకాల సంగీతాలనీ ఆస్వాదించాను. కానీ కాల పురుషుడి పద ఘట్టనలూ, వివిధ రకాల సంస్కృతుల తాకిడులూ తట్టుకుని నిలబడగలిగే సంగీత సాహిత్యాలే ఒక జాతి సంస్కృతికి నిదర్శనాలేమో, అని అనుకున్నాను.