పప్పు ధాన్యాలతో ముగ్గుమా బొమ్మల కొలువుప్రతీ సారీ బొమ్మల కొలువు ఐపోయి బొమ్మలు సర్దేయగానే నాకు మొదట వచ్చే భావన, “ఇంకో సంవత్సరం అయిపోయింది! పిల్లలిద్దరూ ఇంకో యేడు పెద్దై పోయారు” అనే ఒకలాంటి దిగులు.
బొమ్మల కొలువూ పేరంటాలూ, దసరా పండగా అన్నీ ముగిసిపోయి దీపావళి దగ్గర పడుతుంది. అయినా ఆ పేరంటంలో నా కెదురైన ప్రశ్నలకీ సందేహాలకీ జవాబులు దొరకనే లేదు. ప్రతీ సారీ బొమ్మల కొలువు ఐపోయి బొమ్మలు సర్దేయగానే నాకు మొదట వచ్చే భావన, “ఇంకో సంవత్సరం అయిపోయింది! పిల్లలిద్దరూ ఇంకో యేడు పెద్దై పోయారు” అనే ఒకలాంటి దిగులు.

మా అడిలైడ్ నగరంలో బొమ్మల కొలువుల హడావిడే హడావిడి. దాదాపు ఏడెనిమిది కుటుంబాలు అందమైన బొమ్మల కొలువులు పెట్టి శని ఆదివారాలు పేరంటానికి పిలవటం జరుగుతుంది. మళ్ళీ ఈ కో-హోస్టులందరూ వాళ్ళలో వాళ్ళు టైం అడ్జస్టు చేసుకుని ఒకళ్ళ పేరంటం ఇంకొకళ్ళు ఏదీ మిస్సవకుండా వెళ్తారు. ఇది ఆపరేషన్ రీసెర్చి లోలా చేసినట్టు ఎవరు ఏ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అని లెక్క కడతారా అని మా వారు వెక్కిరిస్తూ వుంటారు. బొమ్మల హడావిడి తో పాటు పాటల హడావిడి అంతా ఇంతా కాదు. సంగీతం టీచర్లు పోటీలు పడి వాళ్ళ వాళ్ళ విద్యార్థులకు అమ్మవారి మీద ఒకటో రెండో కీర్తనలు నెర్పిస్తారు. ఆ పిల్లలు పాడిన పాట పాడకుండా నాలుగు రోజులూ నెట్టుకొస్తారు.

గుళ్ళో తొమ్మిది రోజులూ పూజా, సాంస్కృతిక కార్యక్రమాలూ వుంటాయి. మా కుటుంబానికి ఒక రోజు కేటాయిస్తారు. నలభై అయిదు నిమిషాల కార్యక్రమంలో మేం నలుగురం తెలుగూ తమిళ శ్రోతలని సమానంగా సంతోష పెట్టటానికి ప్రయత్నిస్తాము. 

ఈ సంవత్సరం మా పెద్దమ్మాయి మధువంతి, గౌడ మల్ హార్ రాగంలో “సారస ముఖి సకల భాగ్యదే”, మా చిన్నమ్మాయి అనన్య రవిచంద్రిక రాగంలో “నిరవధి సుఖదా నిర్మల రూపా” అనే కీర్తనా పాడేరు. మా వారు తన ఫ్లూట్ మీద “వాతాపి గణపతిం భజే”, ఊతుక్కాడు వారి “ఎన్న తవం సైదనై” అనే పాటా వాయించారు. నేను అమృతవర్షిణిలో “ఆనందామృతాకర్షిణీ, అమృతవర్షిణి” పాటా, అరుణగిరినాథర్ తిరుప్పుగళ్ పాడేను. మా వూళ్ళో గుళ్ళో పాటలకి చప్పట్లు కొట్టరు! ఎందుకంటే అదంతా భగవంతుడికొరకే అన్న భావంతో.

ఆడ పిల్లలున్న వాళ్ళు (నా లా) పిల్లలకి అందమైన బట్టలూ నగలూ వేసి సంబరపడతారు. “ఆడ పిల్లలుంటే ఆ పండగ సందడే వేరు” అని అందరూ అంటూంటే నేను మురిసిపోవటంలో తప్పేమిటి చెప్పండి?

నిజానికి దసరా బొమ్మల కొలువులూ, వరలక్ష్మీ వ్రతాలూ స్త్రీత్వాన్ని సెలెబ్రేట్ చేస్తూ, ఆడవాళ్ళకి దైనందిన జీవితమ్నించి ఆట విడుపు ఇవ్వటానికీ ఏర్పడ్డ పండుగలు. కానీ భర్త బ్రతికి వున్న స్త్రీలు మాత్రమే తాంబూలమూ పసుపు కుంకుమా అందుకోవటానికి అర్హులు అన్న సాంప్రదాయిక నియమం నాకెందుకో అంతగా నచ్చదు.

మా స్నేహితుల్లో ఒకావిడ కొత్తగా కేన్ బెర్రా నించి వచ్చారు. వృధ్దురాలైన తల్లీ, ఇరవై యేళ్ళ కూతురితో ఆవిడ ఒంటరిగా వుంటూ వుంటరు. ఎప్పుడు పలకరించినా చిరు నవ్వుతో పలకరించే ఆవిడంటే అందరికీ అభిమానమే. ఆవిడా మా ఇంటికి పేరంటానికి కూతురితో వచ్చారు. అందరికీ తాంబూలం ఇవ్వబోతున్నాని తెలియగానే ఆవిడ గబ గబా లేచి బయటకి వెళ్ళారు. నాకు మనసు చివుక్కుమంది. వాళ్ళ అమ్మాయికి తాంబూలం ఇచ్చి, కొంచెం జంకుగానే పిలిచాను, “మీరూ వచ్చి తాంబూలం తీసుకొండి” అని. ఆవిడ ఎప్పట్లానే చిరు నవ్వుతో “మా అమ్మాయి కిచ్చావు కదా, అంతే చాలు శారదా” అన్నరు. ఇంకా ఆ విషయం మీద ఆవిడని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక నేను వదిలేసాను.

కానీ తరువాతంతా నాకు భయం వేసింది. నేనావిడని కావాలని అవమానించానని ఆవిడ అనుకున్నారా? నా గొంతులో జంకుని గుర్తు పట్టి ఆవిడ ఇంకా నొచ్చుకున్నారా? నేను మామూలుగా పిలిచి వుంటే ఆవిడ వచ్చి తీసుకునే వారా? ఆవిడతో ఆ విషయం ప్రస్తావించటం కూడా నా కిష్టం లేదు.

ఇంకా నాకు నా నమ్మకాలూ అభిప్రాయం ప్రకారం ఆవిడకి తాంబూలం ఇవ్వటం సరైన పనో, లేక ఆవిడ నమ్మకం ప్రకారం ఇవ్వకుండా వుండటం సరైన పనో అర్ధం కావటం లేదు. 

ప్రశ్నలూ జవాబుల సంగతలా ఒదిలేస్తే మా పిల్లలు చక్కగా మెట్లు పెట్టి పై మెట్టు మీద దేవతలనీ, తరువాత మనుషులనీ, తరువాత పశు పక్ష్యాదులనీ పెట్టటం, వాటికి రోజూ దీపం వెల్గించి నైవేద్యం పెట్టటం అన్నీ బాగా ఎంజాయ్ చేసారు.

పండగైన మర్నాడు బొమ్మలన్నీ సర్ది లోపల దాచేసింతరువాత మా పిల్లలిద్దరూ “బొమ్మలన్నీ తీసేస్తే ఇల్లంతా బోసి పోయిందమ్మా” అనుకున్నారు.

ఇంకో పదేళ్ళయి నా బొమ్మలు రెండూ వాళ్ళ జీవితాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతే నా ఇల్లెంత బోసి పోతుందో ననుకున్నాను.

5 thoughts on “

  1. మీ బొమ్మల కొలువు చాలా బాగుందండి .
    అలా తాంబూలము ఇవ్వక పోవటము నాకూ బాగని పించదు. కాని ఈ మద్య అందరూ పసుపు,కుంకుమ ఇవ్వటములేదుకాని తాంబూలము ఇస్తున్నారండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s