“హల్లో షరాడా! నైస్ సీయింగ్ యూ హియర్”
“హల్లో షరాడా! నైస్ సీయింగ్ యూ హియర్”
పదేళ్ళుగా ఇక్కడే వుంటున్నా వీళ్ళ “షరాడా” అనే పిలుపు నాకూ, నా “శారద” అన్న పేరు వీళ్ళకూ అలవాటు కాలేదు! పేపర్లోంచి చిరాగ్గా తలెత్తి చూసాను. నాతో పాటే పని చేసే డేవిడ్.
డిఫెన్స్ ఆపెరేషన్స్ రీసెర్చి సింపోసియం కోసం మెల్బోర్న్ వొచ్చాను. టీ, లంచ్ బ్రేకుల్లో నాకు అందరితో ఏం మాట్లాడాలో పెద్దగా తోచదు. అందుకే ఒక మూల పుస్తకం పట్టుకుని కూర్చున్నాను.
అతను కూర్చుంటాడేమోనని పక్కకి జరిగి చోటిచ్చాను. అతనితో నేనింతకుముందు కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టుల్లో పని చేసాను. చాలా తెలివైన వాడు. మా ఇద్దరికీ మా డివిజన్ లో ‘మేథమెజీషియన్స్” (mathemajicians) అని పేరు పెట్టారు! ఆఫీసు పనివిషయం తప్ప పెద్దగా మాట్లాడటానికేమీ వుండదు. అయినా నేను ఒంటరిగా బోరవుతున్నానేమోనని వచ్చి పలకరించి వుంటాడు.
అంత వరకూ సింపోసియంలో వచ్చిన రీసెర్చి గురించీ, మేము ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల గురించీ మాట్లాడుకున్నాము. తరువాత నా చేతిలో పేపరూ, రాజకీయాలూ వీటి మీదకి మళ్ళింది.
“రాత్రి కాంఫరెన్స్ డిన్నర్కి వస్తున్నావా” అనడిగాడు.
నాకు పార్టీల్లో పది మందితో మాట్లాడాలంటే గుండె దడా, కాళ్ళల్లో వణుకూ, చేతుల్లో చెమటా లాటి సమస్యలుండటంతో నేను వీలైనంత వరకూ కాన్ఫరెన్సు డిన్నర్లు ఎగ్గొడతాను. దానికి తోడు శాకాహార భోజనం సమస్య వుండనే వుంది. అందుకే వీలు కాకపోవచ్చని నసుగుతూ చెప్పాను.
“కాదు, కాదు! ఇవాళ డిన్నర్లో కిం బీజ్లీ వచ్చి ప్రసంగిస్తున్నాడు. నువు తప్పకుండా రావాలి వినటానికి,” అన్నాడు. ఆ మాటతో నాకు కుతూహలం పెరిగింది.
ప్రొఫెసర్ కిం బీజ్లీ ఆస్ట్రేలియాలో లేబర్ పార్టికి నాయకుడు. 1996 నించీ 2001 వరకూ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పని చేసారు. రాజకీయాల్లోంచి రిటైరయి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో రాజకీయ శాస్త్రమూ, అంతార్జాతీయ సంబంధాలూ బోధిస్తున్నారు. లేబర్ పార్టీ ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా, డిప్యూటీ ప్రైం మినిస్టరుగా బాధ్యతలు నిర్వహించారు. వాక్చాతుర్యానికీ, తెలివి తేటలకీ ఆయన మారు పేరు.
సరే వెళ్దామనుకున్నాను కానీ, పార్టీ అయింతరువాత నేనొక్కదాన్నీ అర్ధ రాత్రి ఒంటరిగా నేనుండే హోటల్ కి రావాలి. నాతో వచ్చిన మిగతా కోలీగ్స్ వేరే హోటల్ లో వున్నారు. ఎవరినైనా తోడు రమ్మని అడగాలంటే మొహమాటంగా అనిపించింది.
“రాత్రి డిన్నర్ లో కలుద్దామయితే” అంటూ డేవిడ్ వెళ్ళబోతున్నాడు. ఈసారి జాగ్రత్తగా వివరించాను. నాకు రాత్రి పూట ఒంటరిగా బయటికెళ్ళటం అంత ఇష్టం వుండదని.
“అదంత సమస్య కాదు. నేను తీసికెళ్ళి దిగబెడతాను. ఆరున్నరకల్లా రెడీ గా వుండు.” టైమవటంతో కాన్ ఫరెన్స్ హాల్లోకి నడిచాము.
ఆ సాయంత్రం డిన్నర్కి సింపుల్ గా స్కర్టూ షర్టులో నన్ను చుసి, “యూ లుక్ వెరీ నైస్” అంటూ నవ్వాడు డేవిడ్. అప్పటి దాకా సైంటిస్టుగానే మాట్లాడిన నాకు కొంచెం మొహమాటంగా అనిపించింది.
భోజనమూ, ప్రొఫెసర్ బీజ్లీ స్పీచీ అంతా బాగా జరిగాయి. సాధారణంగా శాకాహార భోజనం అనగానే విసుగ్గా చూస్తారు. కానీ ఈ సారి భోజనం చాలా నచ్చింది. డిన్నర్ హాల్లోకి రాగానే నన్ను మిగతా కొలీగ్స్ తో వదిలేసి డేవిడ్ వెళ్ళిపోయాడు. మా ఆఫీసులోనే పని చేసే సుసాన్ కళ్ళు చెదిరేంత అందమైన సెక్సీ గౌను వేసుకొచ్చింది. సగం పైగా ఒళ్ళు కనిపిస్తున్న ఆ గౌనులో ఆమె చాలా అందంగానే వున్నా, ఆమె పక్కన కూర్చోవాలంటే నాకు కొంచెం సిగ్గనిపించింది. కానీ చాలా మంది మగవాళ్ళు వొచ్చి, “ఇక్కడ కూర్చోవచ్చా” అని అడిగితే నవ్వు కూడా వచ్చింది.
రాత్రి పదిన్నరకి సుసాన్ బయటికొచ్చే సుచనలేమీ కనిపించలేదు. మెల్లిగా డేవిడ్ ని వెతుక్కుంటూ వెళ్ళాను. నన్ను చూడగానే, “డు యూ వాంట్ టు గో?” అంటూ లేచి తన కోటు తీసుకుని వచ్చాడు.
ఇద్దరం బయటికొచ్చి ఫెడరేషన్ స్క్వేర్ వైపు నడవటం మొదలు పెట్టము. “అమెరికన్లు ఎంతటి త్యాగ ధనులు” అన్న కిం బీజ్లీ మాటలను తలచుకుంటే నాకు నవ్వాగటం లేదు.
రాజకీయాలూ, ఆఫిసు పనీ, ఆఫిసు రాజకీయాలూ మాట్లాడుకుంటూ నడిచాము. చలికాలం వెళ్ళిపోయి వసంతం వచ్చేసినా మెల్బోర్న్ చలి గజ గజా వణికిస్తూంది.
“పోనీ నా కోటు వేసుకుంటావా?” డేవిడ్ అడగటంతో చిరాకొచ్చింది. బయట ఆడదాన్నని నాకేదో కన్సెషన్లు ఇవ్వటమూ, షివల్రీ చూపించటమూ నాకంతగా నచ్చవు. అయినా మొత్తం మీద నాకా సాయంత్రం చాలా బాగా గడిచిందనిపించింది.
మాటల్లోనే హోటలొచ్చేసింది.
“రేపు కాన్ ఫరెన్సు ఆఖరి రోజు, ఎయిర్ పోర్టుకెలా వెళ్తావు?” అడిగాడు డేవిడ్.
“ఇంకా ఏదీ ఆలోచించుకోలేదు.”
“నీకేమీ ప్రోబ్లెం లేకపోతే ఇద్దరమూ కేబ్ షేర్ చేసుకోవచ్చు.”
చాలా సార్లు ఎయిర్ పోర్టు నించి టేక్సీలు షేర్ చేసుకుని వెళ్ళటం అలవాటే కాబట్టి, సరేనన్నాను.
మర్నాడు కాన్ ఫరెన్సు ముగిసి మెల్బోర్న్ డిఫెన్సు ఆఫీసు మెయిన్ గేటు వైపు నడుస్తున్నాము.
“ఇందాక పేపరు చాలా బాగుంది కాదా,” అంటున్నాడు డేవిడ్. నేను వింటున్నాను.
“అతని కేలిక్యులేషన్ చూస్తుంటే నాకొక డర్టీ జోకు గుర్తొస్తుంది,” ఇంకా అన్నాడు.
ఒంటరిగా వున్నప్పుడు నాకు మగవాళ్ళు చెప్పే బూతు జోకులు వినటం ఇష్టం వుండదు. విననట్టు మొఖం పక్కకి తిప్పుకున్నాను. అయినా అర్ధం చేసుకోనట్టు, “ఇది విను…” అంటూ ఒక అసహ్యమైన జోకు చెప్పి పడీ పడీ నవ్వడం మొదలు పెట్టాడు.
నేనే మాత్రం నవ్వకుండా మొఖం కఠినంగా పెట్టుకుని నడిచాను.
ఆ తరువాత ఇంక మరెందుకో నాకతనితో మాట్లాడాలనిపించలేదు. ఎయిర్ పోర్టులో, విమానంలో అంతా పుస్తకం లోనో లేప్ టాప్ లోనో తల దూర్చేసి గడిపాను.
నాకు నేనే చాలా కాంట్రడిక్షన్ల ముళ్ళ చెట్టులాగనిపిస్తాను అప్పుడప్పుడు. మగవాళ్ళు నాతో అతి మర్యాదగా, పేట్రనైజింగ్ గా వుంటే వొళ్ళు మంట. పోనీ తమ తోటి మగవాళ్ళతో మాట్లాడినట్టు మొరటుగా మాట్లాడితే ఆడదానిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటంలేదని కోపం!
“ఎలా వేగేది నీతో! ఏం చేసినా నీకు కోపమే. నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను,” అంటాడు స్వీట్ హోం లో బుచ్చి బాబు లాటి వాడు, మా ఆయన (తమిళం లోనే!) నిజమేనేమో!
—————–
వ్యక్తిగత ప్రైవసీ కొరకు పేర్లు మార్చేను.
అంత గా అభివృద్ధి చెందినా దేశం లో ప్రజల పరిస్థితి ని గమనిస్తూనే వుంటాం అయినా అతనూ ఎక్కువ ఏమి చేయలేదు కదా !..
అక్కడ మానభంగాలు కామన్ anta కదా so manchode
సుధ గారూ,
ఇక్కడ మాన భంగాల కంటే sexual freedom ఎక్కువండీ! ఎంత ఎక్కువంటే మనం జడుసుకునేంత.
రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో జరిగే నేరాలు మామూలే. డేట్ రేప్స్ కి గురయ్యేది ఎక్కువగా టీనేజీ అమ్మాయిలు.
కానీ ఆఫీసుల్లో యూనివర్సిటీల్లో అంతా ప్రశాంతంగా మామూలుగా వుంటారు. రౌడీ జోకులు మనకు అలవాటు వుండవు కానీ ఇక్కడ ఆడా మగా అంతా వాటిని ఈజీ గానే తీసుకుని నవ్వేస్తారు.
ఇంకా నిజం చెప్పాలంటే మామూలు జీవితంలో (పగటి పూట పని చేసే చోట్లలో) ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువ గౌరవంగా చూస్తారు.
మేమంతా ఒకసారి కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాము. సిగ్నల్ దగ్గర ఒక అమ్మాయి చాలా (ఊహించలేనంత చాలా :)) చిట్టి పొట్టి లాగూతో వెళ్తుంది. ఇండియాలో అయితే కారులో వున్న మగవాళ్ళు కొందరైనా ఈలలు వేయటమో నవ్వటమో చేసే వారే. ఇక్కడ అసలు ఎవ్వరూ పట్టించుకోను కూడా లేదు!
బస్సుల్లో, రోడ్ల మీదా వెకిలి వేషాలు కూడా చాలా తక్కువే.
కార్తీక్ గారూ,
సరిగ్గా నా పాయింటూ అదే! అతనేమీ అసహ్యంగా ప్రవర్తించలేదు. వాళ్ళ సంస్కృతిలో ఆడా మగా suggestive jokes చెప్పుకొని నవ్వుకోవటం మామూలే. నాకెందుకంతగా కోపం వస్తుందన్నదే నాకు అర్ధం కాని విషయం. అందుకే నాలో అన్నీ కాంట్రడిక్షన్లే అని అనుకుంటాను.
శారద
అక్కడి సంస్కృతిని కళ్ళుకు కట్టినట్లుగా వివరించారు.
🙂
రేరాజ్ గారూ,
దీని భావమేమి తిరుమలేశా? 🙂
కార్తీక్ గారూ, రవి చంద్ర గారూ,
ధన్య వాదాలు. మీకు కుతూహలంగా వుంటే ఇదే బ్లాగ్ సైట్లో “తెలుపు-నలుపు” అని నేను ఆస్ట్రేలియన్ జీవిత విధానం మీద రాసిన కామెంటరీలున్నాయి.
శారద
మీ పరిచయం చూసి ఈ టపాలోకోచ్చేను.
చివరి లైను చదివి చాలా నవ్వుకొన్నాను. మీ రెండు సమస్యలు టపా వ్రాసేకా ఈ నాలుగు సంవత్సరాల్లో తగ్గాయా. అయినా మీరిలా వ్రాస్తే వ్యాఖ్యలు వ్రాయడానికి భయపడతారు .. ఎవరు అని అడగకండి, పురుష బ్లాగర్లు. కాబట్టి మీరు ఈ పోస్ట్ పై అప్డేట్ పెట్టాల్సిందే 🙂
@ బయట ఆడదాన్నని నాకేదో కన్సెషన్లు ఇవ్వటమూ, షివల్రీ చూపించటమూ నాకంతగా నచ్చవు
మరి సైంటిస్ట్ గారంటే మాటలా. ఇది కేవలం అంతర్గత భయం వల్ల , లేదా ఆత్మాభిమానం వల్ల వచ్చిన ఫీల్ మాత్రమె.
@ ఆ తరువాత ఇంక మరెందుకో నాకతనితో మాట్లాడాలనిపించలేదు. ఎయిర్ పోర్టులో, విమానంలో అంతా పుస్తకం లోనో లేప్ టాప్ లోనో తల దూర్చేసి గడిపాను.
నిజానికి మీకు అతనిపై అనుమానం వచ్చిందా ? పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు 🙂