మళ్ళీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు “పడవ కాందిశీకుల” సమస్య పెను భూతంలా నిలబడింది, నన్నేం చేస్తావంటూ!
మళ్ళీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు “పడవ కాందిశీకుల” సమస్య పెను భూతంలా నిలబడింది, నన్నేం చేస్తావంటూ!
పెద్ద “హ్యూమన్ ట్రాజెడీ”. ఎవరికీ సరైన పరిష్కారం తెలియని సమస్య, ఆస్ట్రేలియా, ఇండొనీషియా ప్రభుత్వాలు ఉమ్మడిగా తల పట్టుకుంటున్న సమస్య.
అక్టోబరు మధ్యలో ఒక శిధిలావస్తలో నున్న పడవనూ, దాని పైనున్న రెండువందల యాభై అయిదుగురు శ్రీలనంక తమిళ కాందిశీకులనూ ఇండోనీషియా తీర ప్రాంతం వద్ద పట్టుకున్నారు. వీరి కొరకు ఇండొనీషియా ప్రభుత్వం తీరంలో ఒక తాత్కాలిక షెల్టర్ ని నిర్మించింది.
ఈ పడవ ఇండొనీషియా తీరం వదిలి ఆస్ట్రేలియాకి “ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్” ని మోసుకొస్తుందని ఉప్పందగానే, ఆ పడవని పట్టుకుని ఆపెయ్యాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండొసీషియా ప్రభుత్వాన్ని అడిగింది. ఇండొనీషియాకి ఆస్ట్రేలియా చాలా సార్లు చేసిన ఆర్ధిక సహాయం దృష్ట్యా, ఇండొనీషియా ప్రభుత్వం ఆ అభ్యర్ధనను మన్నించి వెంటనే తన నావిక దళాన్ని రంగం లోకి దింపి పడవను ఇండొనీషియ పన్నెండు మైళ్ళలోపే పట్టుకుంది. (ఏ దేశ తీరానికైనా పన్నెండు నాటికల్ మైళ్ళ (22 కిమీలు) దూరం ఆ దేశానికే చెందినదే (టెరిటోరియల్ వాటర్స్). అది దాటింతరువాత (ఇంటర్నేషనల్ వాటర్స్) ఏ ప్రభుత్వపు ఆంక్షలూ పని చేయ్యవు. అలాగే పన్నెండు నా.మైళ్ళ లోపల వుండే వాళ్ళ సమస్యలన్నీ ప్రభుత్వం సమస్యలౌతాయి. అందుకే ఇమ్మిగ్రషన్ అధికారులు దొంగతనంగా వొచ్చే పడవలని పన్నెండు నాటికల్ మైళ్ళవతల నిలబెడితే, వెళ్ళే పడవలని పన్నెండు నా.మైళ్ళ లోపలే అరెస్టు చేస్తారు.)
ఈ పడవని ఆపి అందులో వున్న వారిని తీరంలో వుంచాలని అనుకున్న రెండు ప్రభుత్వపు అంచనాలనీ తారు మారు చేస్తూ, ఆ పడవలోంచి వాళ్ళు దిగమని మొండికేసారు. పడవ మీద వున్న వాళ్ళందరూ “అడుగు ముందుకేసారో, పడవ పేల్చేస్తామని” బెదిరించారు. వేళితే ఆస్ట్రెలియాకే వెళ్తామనీ, ఇండొనీషియాలో దిగమనీ తెగేసి చెప్పారు.ఈ ఇంజను చెడిపోయి, నీళ్ళల్లో నిస్సహాయంగా నిలబడ్డ పడవలో ఆస్ట్రేలియా చేరటానికి వాళ్ళంతా తలా పదిహేను వేల అమెరికన్ డాలర్లు వెచ్చించారు.
ఈ పడవ ఇలాగుండగా, ఇండోనీషియా తీర ప్రాంతంలో ఇంకొక పడవ మనుషులతో సహా మునిగి పోయే పరిస్థితిలో వుందని భోగట్టా అందిన ఆస్ట్రేలియన్ నావిక దళం వెళ్ళి ఆ పడవ మీద ఉన్న డెభ్భై అయిదుమందినీ ఆస్ట్రేలియన్ కస్టంస్ పడవ “ఓషేనిక్ వైకింగ్” మీదకి చేర్చారు. ఆ పక్కనే వున్న రీయౌ దీవుల గవర్నర్ అబ్దుల్లా వాళ్ళని తమ దేశంలో కాలు పెట్టనివ్వమని నిర్మొహమాటంగా చెప్పారు.
మళ్ళీ ఇండోనీషియానే అడిగింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కొంచెం గొణుగుతూనే ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ ఈ పడవ వాళ్ళు కూడా ఆస్ట్రేలియా తప్ప ఇంకెక్కడా దిగమని పడవలోనే మగ్గుతున్నారు!
ఏం చేయాలో అర్ధం కాక ప్రధాని కెవిన్ రాడ్ ప్రభుత్వం తల పట్టుకుంది.
తీరానికి చేర్చిన తరువాత వాళ్ళ మీద దర్యాప్తు సాగుతుంది. వాళ్ళు “ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్” అని తేలినట్టయితే వారిని వెనక్కి పంపేస్తారు. నిజంగా ప్రాణ భయంతో పారిపోతున్న కాందిశీకులని తేలితే వారికి పునరావాసం కల్పిస్తారు.
చాలా వరకు ఆస్ట్రేలియన్ ప్రజలు కాందిశీకులని సహృదయంతో రానివ్వమని ప్రభుత్వానికి లేఖలు రాస్తారు. కానీ మారుతున్న ఆర్ధిక పరిస్థితులూ, తగ్గుతున్న ఉద్యోగా భద్రతా, వీటన్నిటి వల్లా, వీళ్ళని రానివ్వకూడదనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతోంది.
రానివ్వకపోతే మూక ఉమ్మాడిగా ఆత్మ హత్యలు చేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళకేమైనా అయితే మానవ హక్కుల సంఘం ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తుంది. రానిస్తే వెల్లువౌతున్న ప్రజా నిరసన.
ఇప్పటికింకా దాదాపు రెందు లక్షల మంది శ్రీ లంక తమిళులు శిధిలమౌతున్న పడవల్లో దూర ప్రాంతాలకి ప్రయాణిస్తున్నారని భోగట్టా!
వీళ్ళందరి పరిస్థితికీ ఎవరు కారణం? మూడవ ప్రపంచపు దేశాల్లో ఎంత యుధ్ధాలు జరిగితే తమకంత మంచిదని రెండు వర్గాల వాళ్ళకూ మారణాయుధాలు చవకగా అమ్ముతూ, ఎకడా యుధ్ధ జ్వాలలు ఆగకుండా వాటిల్లో ఆజ్యం పోస్తూ పౌరోహిత్యం చేసే అగ్ర రాజ్యాలదా? మారణాయుధాలతో తీరిపోయేది మనమే కానీ సమస్యలు కాదన్న సంగతి గుర్తించకుండా తమ తోటి ప్రజలని శలభాల్లాగా అగ్నికి ఆహుతి చేసే నాయకులదా? మనిషికీ మనిషికీ చర్మపు రంగుతో సహా అన్ని రకాల తేడాలనూ, ఆ తేడాల వల్ల మనసుల్లో పుట్టే అభద్రతా భావాలనూ సృష్టించిన ప్రకృతిదా?
అసలీ సమస్యకి పరిష్కారం ఏది?ఎవరికైనా తెలుసా?