దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను “స్పర్ష్” (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు.దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను “స్పర్ష్” (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు. చాలా నచ్చింది నాకా సినిమా!. ఆ సినిమాలో అంధుడైన స్కూల్ ప్రిన్సిపాల్ గా నసీరుద్దిన్ షా నటన గురించి (దాన్ని నటన అనొచ్చా?)ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
ఆ తరువాత వదలకుండా నసీరుద్దిన్ షా నటించిన సినిమాలు చాలా వరకూ చూస్తూనే వున్నాను. అతని నటన ఎందుకో నటనలా అనిపించనే అనిపించదు. నిజంగా ఆ పాత్ర లాటి ఒక వ్యక్తి మనకి పరిచయం అయిన భావన!
“మండీ” “పార్” ‘ఇజాజత్” లాటి సినిమాల్లో సీరియస్ పాత్రలతోపాటు, “కర్మా”, “త్రిశూల్”, “మొహ్రా” లాటి డొక్కు సినిమాల్లోని పాత్రలుకూడా ఆయన చేయి పడేసరికి కొంచెం “బిలీవబుల్” గా మారతాయి. “ఇజాజత్” సినిమా సమీక్షలో, ది హిందూ పత్రిక, “Shah is perfect by sheer habit” (అలవాటు చొప్పున షా గొప్పగా నటించారు) అని పేర్కొంది. నాకా వాక్యం అయన ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలకీ వర్తిస్తుందనిపిస్తుంది.
“మిర్చ్ మసాలా” లో సమాజంలో వుండే దౌర్జన్యాన్ని పొరలు పొరలుగా చూపించటం ఒక విశేషమైతే, విలన్ గా షా చూపించిన సాఫ్ట్ క్రూరత్వం ఒక ఎత్తు. ఇలాటి సాఫ్ట్ విలనీనే అంతకు ముందొచ్చిన “బేజుబాన్” (తెలుగులో “యవ్వనం కాటేసింది” అనుకుంటా) లో కూడా చూస్తాం.
కేవలం ఆయన గొంతుకని మాత్రమే వాడుకున్న “పార్టీ” లాటి సినిమాలు కూడా వున్నాయి.
వెకిలి వేషాలు, కోతి చేష్టలూ లేకుండా మన ఇంట్లో మనిషి మాట్లాడుతున్నంత సింపుల్గా నవ్వించటం “జానే భీ దో యారో” (ఇంత గొప్ప హ్యూమర్ మళ్ళీ నేనే సినిమాలోనూ చూడలేదు), “కథా” లో కనబడుతుంది. మొన్నీ మధ్యనే వచ్చిన “జానే తూ యా జానే నా” లో కూడా కేవలం చిత్ర పటంలోనించే ఆయన చక్కిలిగింతలు పెట్టారు.
ఇంతకీ నాకు షా గురించి
రాయలని ఎందుకనిపించిందంటే ఈ మధ్యనే నేను మళ్ళీ “మాసూం”, “ఇక్బాల్”, “ఇష్కియా” చూసాను. మూడిటిల్లోనూ, కథా, కథనాలూ, పాటలూ, చిత్రీకరణా అన్నిటికంటే నాకు షా నచ్చాడు!
చిన్నప్పుడు మనకు పిచ్చి పిచ్చిగా నచ్చిన సినిమాలు పెద్దయ్యాక చూస్తే కొన్నిసార్లు మనకంతగా నచ్చవు. ఆ మధ్య ” వసంత కోకిల” చూసి ఇంత ఓవర్ యాక్షన్ వున్న సినిమా నాకెలా నచ్చిందబ్బా అనుకున్నాను. కానీ “మాసూం” చూస్తే నాకు ఇరవై యేళ్ళ తరువాత కూడా అంతే నచ్చింది.
సాధారణంగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క “సెంట్రల్ షాట్” వుంటుందని నా అభిప్రాయం. అంటే ఆ సినిమాకంతా అది defining షాట్ లా గన్నమాట.
మాసూం సినిమాలో తన కొడుకు అర్ధరాత్రి కనిపించకుండా పోయినప్పుడు షా తన స్నేహితుడికి (సయీద్ జెఫ్రీ) ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన ఇంటి నౌకరు “అయ్యగారు నిద్ర పోతున్నార”ని చెప్తాడు. “తెలుసు, అయినా నిద్ర లేపు. ఇది చాలా అర్జంటు” అని షా జవాబిస్తాడు. మళ్ళీ ఆ నౌకరు “ఇప్పుడు చాలా రాత్రయింది కదా. అయ్యగారు నిద్రలో వున్నారు” అని నసుగుతాడు. షా వెంటనే కోపంగా గొంతు పెంచి “చాలా రాత్రయిందీ, అతను నిద్ర పోతున్నాడనీ నాకు బాగా తెలుసు, అయినా నిద్ర లేపమంటున్నాను కదా! ఆర్ధం కావటం లేదా?” అని అరుస్తాడు. అంతలోనే నిస్సహాయంగా భార్య ని పిలిచి, “వాడొస్తే నువ్వు ఫోన్ లో సంగతంతా చెప్పు, నేను బట్టలు మార్చుకొస్తాను” అని పైకి వెళ్ళి పోతాడు. ఒక్కటే క్షణంలో ఉక్రోషం, కోపం, చిరాకూ, నిస్సహాయతా అతని మొహం లో, గొంతులో ఎంత గొప్పగా మారతాయంటే, మనం నిజంగా బిడ్డ తప్పిపోయిన తండ్రినే చూస్తున్నాం అని భ్రమ పడతాం. ఇదే మాసూం లో సెంట్రల్ షాట్ అనిపిస్తూవుంటుంది నాకు.
కథలన్నీ ఇరవైల్లో వున్నవాళ్ళ గురించే, నడి వయసులోకి వస్తున్న వాళ్ళ గురించేముంటుంది, అనుకునే మన సినిమాల్లో, “ఇష్కియా” లో షా పాత్ర ఒక గొప్ప మార్పు. చిన్న వాళ్ళైన అర్షాద్ వర్సీ, విద్యా బాలన్ ల కంటే ఆయన తెరని చాలా subtle గా డామినేట్ చేసారు. “దిల్ తో కచ్చా హై జీ” పాటలో ఆయన మొహం లో ఒక cute అమాయకత్వం భలే బాగుంది.
మొత్తానికి, ఆయన నటన చూస్తుంటే నాకు సినిమాలా కాకుండా బాగా దగ్గరి స్నేహితుల జీవితాన్ని పరిశీలిస్తున్నట్టనిపిస్తుంది.
అన్నట్టూ ఆయన నటించిన “Being Cyrus” అనే off-beat సినిమా కూడా చాలా బాగుంటుంది.
మీరు నవతరంగం కు రాయొచ్చుకదా!
ఈ వ్యాసాన్ని నవతరంగంకి పంపగలరా….admin@navatarangam.com
navatarangam@googlemail.com
‘Being Cyrus’ .. ఈ సినిమాని చూడాలని చాలా అనుకున్నా కానీ కుదరలేదు.. CD కూడా దొరకడం లేదు .. Still searching… And, ishquiya లో ఆయన నటన super!
మహేష్,
దీన్ని నవతరంగంకి మెయిల్ చేస్తాను. చిరునామా ఇచ్చినందుకు ధన్య వాదాలు.
ప్రదీప్,
Being Cyrusలో Saif కూడా surprise package! ఈ సినిమా ending కూడా చాలా unpredictable గా బాగుంటుంది.
regards
Sharada
వ్యాసం బ్రహ్మాండంగా ఉంది.అసలు ఒక్క సినిమా చెప్పండి, నసీరుద్దీన్ షా సరీగ్గా చేయనిది.
He is a COMPLETE Actor.
మరీ నసీరుద్దీన్ని నెత్తినెత్తుకోవాలని, కమల్ని కొట్టినట్టున్నారు.మనో భావాలు దెబ్బతింటాయి మరి!
తక్క, యస్!చాలా మంచి యాక్టర్.బావుంది.