మా వూళ్ళో ప్రతీ నెలా (ఫిబ్రవరి నించి నవంబరు వరకూ) నాలుగో శుక్రవారం
సంగీతం కచేరీలు జరుగ్తాయి. వీటిని 4FM (4th Friday Music) అని పిలుస్తాము.మా వూళ్ళో ప్రతీ నెలా (ఫిబ్రవరి నించి నవంబరు వరకూ) నాలుగో శుక్రవారం
సంగీతం కచేరీలు జరుగ్తాయి. వీటిని 4FM (4th Friday Music) అని పిలుస్తాము. వీటిని organize చేసేది నేనూ, మా వారు మురళీ కావటం వల్ల ఇవి మా ఇంట్లోనే జరుగుతాయి. వీటి కొరకు మా ఇంట్లో మైకులు వగైరా సామగ్రీ వున్నాయి. ఈ కచేరీల్లో స్థానిక ఔత్సాహిక కళాకారులు నెలకొక్కరు చొప్పున గంటా- గంటన్నర సేపు సంప్రదాయ కర్ణాటక సంగీతంలో కచేరీ చేయాల్సి వుంటుంది. ఈ కచేరీల గురించి చదవాలంటే ఇక్కడ నొక్కండి.
http://4thfridaynightconcerts.wordpress.com/
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నా కచేరీ తోనే ప్రారంభించాం. దాని గురించి చెప్పుకోవల్సిన విశేషాలేమీ లేవు.
మార్చి నెల కచేరీ మొన్న 26 న జరిగింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న స్థానిక యువకుడు చి. ప్రశాంత్ అద్భుతంగా దాదాపు రెండు గంటలు కచేరీ చేసాడు. రీతిగౌళలో అట తాళ వర్ణం తో మొదలు పెట్టి, పూర్వీ కల్యాణి, శుధ్ధ ధన్యాసినీ చక్కగా రాగం, స్వరం తో పాడాడు ఆ అబ్బాయి.
ఈ సందర్భంగా నేను రెండు చక్కటి త్యాగరాజ కృతులు విన్నాను. వాటి గురించే ఈ వ్యాసం.
ఎంత చక్కగా పాడినా తెలుగు సరిగా ఉచ్చరించలేకపోతే త్యాగరాజ కీర్తనల్లో అందమే మనకందదు. కానీ, అర్ధం తెలిసి, చక్కటి పలుకుతో వాటిని పాడినప్పుడు వింటే ఆ ఆనందమే వేరు. కింద రెండూ కీర్తనలనీ ఇస్తున్నాను.
——————————-
రాగం – ఆరభి
తాళం- ఆది
పల్లవి || చాల కల్లలాడుకున్న సౌఖ్యమేమిరా
అను పల్లవి || కాలము బోను, మాట నిలుచును కల్యాణ రామా- నాతో || చాల కల్లలాడుకొన్న||
చరణం || తల్లి తండ్రి నేనుండ తక్కిన భయమేలరా యని
పలుమారు నీవెంతో బాసలు జేసి
ఇలలో సరివారలలో ఎంతో బ్రోచుచుండి
పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో చాల….||
———-
ఈ పాటలో, “కాలము బోను మాట నిలుచును” అనే వాక్యం చాలా లోతుగా అనిపిస్తుంది. చిన్న చిన్న పదాలతో లోతైన అర్ధాలు తీయటం ఆయన ప్రత్యేకతేమో ! అంతే కాదు, అను-పల్లవి చివరలో “నాతో” అనే మాట తగిలేంతవరకూ అది “అబధ్ధాలాడకూడదు” అను మనందరికీ చేస్తున్న ఉద్బోధలాగుంటుంది. “నాతో” అనే మాట పడగానే అది, రాముని మీద ఆయన సంధించిన నిందాస్త్రమైపోయింది! మరీ ఆఖరి సంగతిలో “చాలా” (స-రి-రి-మ-మ-ప-ప-ద) అనుకుంటూ పాడితే అచ్చం ఎవరో తిడుతున్నంత సంతోషం వేస్తుంది! 🙂
ఇంకా ఈ పాటలో “తల్లి తండ్రి నేనుండ” అనే ప్రయోగం విని కొంచెం ఆశ్చర్య పడ్డాను. “తల్లి తండ్రి వలె నేనుండ” అనో, లేదా “తల్లి తండ్రి నేనై యుండ” అనో అనకుండా, “తల్లి తండ్రి నేనుండ” అన్నాడేమిటా అని. తాళం సరిపోదనా? ఇంకేవైనా నిగూడ అర్ధాలున్నవా? తెలిస్తే ఎవరైనా చెప్పగలరు.
ఆ కచేరీలో విన్న రెండో మంచి త్యాగరాజ కీర్తన-
———————-
రాగం – బేగడ తాళం – దేశాది
పల్లవి|| తన వారి తనము లేదా-తారకాధిపానన వాదా?
అను పల్లవి || ఇనవంశ రాజుల కీగుణము లెన్నడైన గలదా, నాదుపై || తనవారి ||
చరణం 1 || పేర పేర బిల్చి హారములు ప్రేమ మీర మీదొసగ లేదా నాదుపై || తనవారి||
చరణం 2 || అలనాడు అన్న మారగించు వేళ బలు వానరుల పంక్తి నుంచ లేదా || తనవారి||
చరణం 3 || రామ రామ రామ రచ్చ సేయకవే తామసంబదేల, త్యాగరాజ నుత || తనవారి||
————————-
“తనవారి తనము” అనే మాట ఎంత కొత్తగా బాగుంది కదా?
అను పల్లవి కూడ చాల విచిత్రంగా అనిపించింది. ఎవరైన మనని ఆక్షేపించినప్పుడు “మా ఇంటా వంటా లేవటువంటి గుణాలు” అంటాం. అదే ఇంకెవరినైనా ఆక్షేపించినప్పుడు, “మీ వాళ్ళంతా ఇంతేలే!” అంటాం. ఇక్కడ తారు మారైంది. “మీ ఇంటా వంటా లేని ఈ పాడు బుధ్ది నీకెక్కడినించి వచ్చింది?” అన్నట్టుంది. ఈ పాటలో “పేర పేర బిల్చి” హారాలు పెట్టటమేంటో, ఎవరికో నాకు తెలియ లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.
పదహారేళ్ళ మా పెద్దమ్మాయి కళ్ళు పెద్దవి చేసి, ఎర్రటి మొహం తో తండ్రిని నానా మాటలూ తిట్టినప్పుడు నేను నవ్వుతూ, “మిమ్మల్ని మీ అమ్మ కూడా ఇన్ని తిట్లు తిట్టి వుండదు” అని వెక్కిరిస్తూ వుంటాను. త్యాగరాజ స్వామి రాములవారిని తిట్టినప్పుడు బహుశా ఆయన కూడా అలానే అనుకుని వుంటారేమో “దేవుడా! మా అమ్మ కూడా నన్నిలాంటి మాటలనలేదు” అని.
meeru avi record chesi upload cheste baagundunu
చాలా బావుంది మీ సంగీత సేవ.
“త్యాగరాజ స్వామి రాములవారిని తిట్టినప్పుడు బహుశా ఆయన కూడా అలానే అనుకుని వుంటారేమో “దేవుడా! మా అమ్మ కూడా నన్నిలాంటి మాటలనలేదు” అని.”
భగవంతుడికి భక్తులతో ఎప్పుడూ ఉండేదే గదండీ ఇది? 🙂
I have seen this blog now. so I am posting this very late.
“Thalli thandri nenunda” nenunda ane padaniki ardham ramudu cheppinatluga anukovali.