చాలా వరకు భారతీయ భాషల్లో సినిమాలు ఎక్కువగా మగవాళ్ళ గురించే వుంటాయి. మగవాళ్ళు, వాళ్ళ సమస్యలూ, వాళ్ళ జీవితాలూ, వీటి చుట్టే తిరుగుతాయి. సాధారణంగా స్త్రీ పాత్రలు హీరోయిన్లయితే పాటలు పాడటానికీ, పెద్ద వయసున్న స్త్రీలైతే, చెంగు నోట్లో కుక్కుకోని ఏడవటానికే వుంటారు. చెల్లెలో, ప్రియురాలో, తల్లో, అత్తో, ఏ పాత్రైనా, కథలో “వుండటం” తప్ప మరేమీ పెద్దగా చేయరు. Things happen to them. They do not “do” anything on their own, including taking decisions. ఒక వేళ స్త్రీ పాత్రలకేవైనా సమస్యలొస్తే వాళ్ళు ఒక కొడుకును కని, ఆ కొడుకు పెద్దయ్యి సంస్య తీర్చే వరకూ సహనంతో, చిరునవ్వుతో ఆ కష్టాలన్నీ భరిస్తూ వుంటారు తప్పితే వాళ్ళంతట వాళ్ళు ఏమీ చెయ్యరు. ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్లు కొంచెం బాగుపడినమాట నిజం, కానీ అదొక పది-ఇరవై శాతం సినిమాల్లో వుంటుందేమొ.
అందుకే ఈ విషయంలో బాలచందర్, మణి రత్నం (ఈ మధ్య శేఖార్ కమ్ముల) చాలా నచ్చుతారు నాకు. వాళ్ళ కథల్లో స్త్రీలు ఊరికే ప్రేక్షకుల్లా జీవితాన్ని అనుభవించడం కాకుండా సొంత బుర్ర ఉపయోగిస్తారు. తప్పో ఒప్పో, వాళ్ళకు తోచినది చేస్తారు.
మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన “కణ్ణత్తీల్ ముత్తమిట్టాల్”(2002) నిజానికి నాకందుకే చాలా నచ్చింది. కథకి బేక్ గ్రవుండ్ శ్రీలంక తమిళుల సంఘర్షణగా ఎన్నుకున్నా దాని గురించి ఎక్కువగా చూపెట్టలేదు.అంతే కాదు, ఆ యుధ్ధంలో ఏ ఒక్క పక్షాన్నీ సమర్ధించలేదు.
శ్రీలంక తమిళ స్త్రీ శ్యామ (నందితదాస్), తమిళ విప్లవకారుడు దిలీప్ (జే.డీ.చక్రవర్తి)ల పెళ్ళితో కథ మొదలవుతుంది. శ్రీలంక సైన్యం చేతిలో దిలీప్ హతుడయ్యాక శ్యామ శ్రీలంక శరణర్ధులతో పాటు రామేశ్వరం చేరుకుంటుంది. అక్కడ ఒక ఆడ పిల్లని ప్రసవించి తిరిగి యుధ్ధం లో పాల్గొనేందుకు శ్రీలంక చేరుకుంటుంది. ఆమె ప్రసవించిన కూతురు (అముద) తిరు చెల్వన్ (మాధవన్), ఇందిర (సిమ్రన్) ల పెంపకం లో పెరుగుతుంటుంది.
తన తొమ్మిదో పుట్టినరోజున,తను పెంపుడు కూతుర్నని తెలిసిన ఆముద తల్లి కోసం వెతికిన వెతుకులాటే మిగతా సినిమా. దర్శకుడు చాలా సున్నితంగా, ఎక్కువ మెలోడ్రామా చూపించకుండా, తల్లీ-కూతుర్ల అనుబంధాన్నీ, తండ్రీ-కూతుర్ల అనుబంధాన్నీ, చిన్న పిల్లల సున్నితత్వాన్నీ, యుధ్ధ సమస్యలనీ తెరకెక్కించాడు.
నాకు కథలో ఒక్కటే కాకుండా చాలా పొరలు వుంటే నచ్చుతుంది. కథలో ఇలా ఎక్కువపొరలు వున్నప్పుడూ కథనంలో చాలా నేర్పు వుంటేగానీ బిగి సడలకుండా తెరకెక్కించడం వీలవుతుంది. అందులో యుధ్ధంలో చిక్కుకున్నది ఒక స్త్రీ కావటం, ఆమె కన్నదీ ఇంకొక ఆడపిల్లే కావటం అన్నది కథనాన్ని సున్నితంగా చేయటంలో దోహద పడ్డాయనిపిస్తుంది.
ఈ సినిమాలో రెండు మంచి షాట్లున్నాయి.. మొదటిది, తిరు చెల్వన్ కూతురితో నిజం చెప్పటం. అముద తండ్రి చుట్టూ గుండ్రంగా తిర్గుతూ ఆడుకుంటూ వుంటుంది. ఆమెతో మెల్లిగా తండ్రి “నువ్వు మా సొంత కూతురివి కాదు” అంటాడు. అముద వెంటనే, “నాన్నా! తమిళ్ పరీక్షలో తక్కువ మార్కులొచ్చినంత మాత్రాన అంత మాటంటావా? ఈసారి బాగానే తెచ్చుకుంటాగా” అంటుంది, ఆట ఆపకుండానే. ఆ సంఘటనతో ఆ చిన్నారి అమాయకత్వాన్ని గొప్పగా ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు. అంతే కాదు, ఆ షాట్లో కెమెరా తండ్రి మీదా, కూతురి మీదా మార్చి మార్చి ఫోకస్ అవుతుంది, వాళ్ళిద్దరి పెర్స్పెక్టివ్లూ చూపిస్తున్నటు.
కానీ ఈ సినిమా అంతటికీ గొప్ప షాట్ – అముద తన నిజం తల్లిని కలుసుకున్నప్పుడొస్తుంది. నిజం తల్లి కనిపించగానే అడిగేందుకు ఇరవై ప్రశ్నలు కాగితం మీద రాసి పెట్టుకుంటుంది. ఒకటి తరువాత ఒకటి అడుగుతూ, మధ్యలో “నేను పుట్టగానే నన్నెత్తుకున్నావా?” అని అడుగుతుంది. శ్యామ, “లేదు. ఒక్క సారి వేలితొ ముట్టుకున్నాను అంతే” అంటుంది. తల్లి తనని పుట్టగానే ఒక్క సారి కూడా ఎత్తుకోలేదని తెలిస్తే ఒక తొమ్మిదేళ్ళ పాప మనసు ఎంత క్షోభ పడుతుందో తలచుకుంటే మనకు మనసు కరిగిపోతుంది. అముద బాధగా మొహం పెంపుడు తల్లి గుండెలో దాచుకుని ఆ ప్రశ్నల కాగితం విసిరేస్తుంది. “మిగతా ప్రశ్నలు అడగవా?” అన్న ఆమె ప్రశ్నకు లేదని తలాడిస్తుంది, కన్నీళ్ళతో. ఇంక మిగతా ప్రశ్నలూ-సమాధానాలు అర్ధం లేవనా? అప్పుడు సిమ్రన్, బిడ్డని పొదివి పట్టుకుని, “పోనీ! ఇప్పుడు ఎత్తుకోవచ్చుగా” అంటుంది. నాకైతే దర్శకత్వ పరంగా, కథా పరంగా, ఇది చాలా గొప్ప షాట్ అనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్ గా కాని నాకు ఆ సంఘటన ఎన్ని సార్లు చూసినా కళ్ళలో నీళ్ళూ, గుండెలో బాధా వస్తాయి. “మంచి కాలం వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాం” అన్న తండ్రి మాటలకు, “ఎప్పుడు నాన్నా, ఎప్పుడు? ” అనే అముద ప్రశ్నతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో తిరు చెల్వన్ పాత్రకి సుప్రసిధ్ధ తమిళ రచయిత “సుజాత” స్ఫూర్తి అంటారు. తిరు చెల్వన్ పాత్రలో మాధవన్ చక్కటి నటన చూపించారు. సిమ్రన్ నట జీవితంలో బహుశా ఇంత గొప్పగా నటించిన పాత్రా, ఇంత నటనకి అవకాశం వున్న పాత్రా ఇదొక్కటే కవొచ్చు. అలాగే అముదగా నటించిన కీర్తన కూడా చాలా మంచి నటన చూపించింది. ఈ అమ్మాయి తమిళ నటీ నటులైన సీత-పార్తిబన్ ల కూతురు.
వైరముత్తు రాసిన పాటల్లో “ఒరు దైవం తంద పూవే” పాట చాలా బాగుంది.
“కాట్రు పోలై నీ వందాయో, శ్వాసమాగ నీ ఇన్రాయో” (గాలిఆ వచ్చింది నీవే, నా శ్వాసగా మారింది నీవే) అనే వాక్యాలు చాలా బాగున్నాయి.
ప్రేక్షకాదరణ ఎంతగా లభించిందో కానీ, ఈ సినిమాకి విమర్శకుల అప్రీసియేషనూ, అవార్డులూ బాగానే వచ్చాయి. తెలుగులో “అమృత” అన్న పేరుతో విడుదలైంది. కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందినట్టు లేదు.
చాలా వరకు శ్రీలంక తమిళుల సమస్యపై మిగతా వారు అంతగా స్పందించరేమో. అందులో అసహజమైనదేమీ లేదు. నేనైనా తమిళుల ఇంటి కోడల్ని కాబట్టి వారి సమస్యలకి స్పందిస్తున్నానేమో!
“కణ్ణత్తీల్ ముత్తమిట్టాల్” (చెంప మీద ముద్దు పెడితే) అన్నది సుబ్రహ్మణ్య భారతి రాసిన “చిన్నంజీరు కిళియే కణ్ణమ్మా చిత్తిరం పేసుదడి
” అన్న పాటలోనిది. సుబ్రహ్మణ్య భారతి అనగానే ఆ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గుర్తొస్తుంది. దాన్ని గురించి ఇంకొక టపాలో…
Meeru Amrutha cinema gurinchi chakkani review post chesaaru. adi exactly right. Idi Mani rathnam and a.r rahman la kalaa khadam. Mee review lo Meeku Balachandar, Mani Ji and sekhar movies lo Ladies nu goppaga choopistaaranna maata kotavarake nizamanipistundi. Mani Sir movies lo Heros Heroine la venuka tirugutoo vaari bhaavalanu gowravinchadam chodavachu ( viz geetaanjali, donga donga , dilse , amrutha , iddaru, sakhi etc.,) Kaani Balachandar movies lo Lady Characters Independent Ideas unnaa avi magavaani chutoo pitchigaa tirugutaayi ani balamaina vaadana undi mari idi chaalaa movies lo choodavachuu. Sekhar characterizes his heroines similar to balachandar ( anand, godaavari lo Heroine hero kosam pade paatlu daarunam, somebody told sekhar heroines behaves like ladydogs) . idi meeku nachaka povachu . nenu balachandar movies chaala choosaanu . antuleni katha adbhutam. ok .
coming to review amrutha(in telugu Version) is my fav movie and no one can make a such movie on ” valasavaadam”.
Expecting some more reviews
మంచి సినిమాని గుర్తుచేశారు.
chala baaga raasarandi. I too like this movie.
సమస్య మనది కాకపోయినా ఇది హృదయాన్ని హత్తుకొనే కథ ఉన్న సినిమా. ప్రేమానుబంధాలు ఎక్కడైనా ఒక్కటే కదా. 100 రోజులు ఆడకపోతేనేమి మన హృదయాలలో ఉంది కదా. మణిరత్నం అంజలి సినిమా చూసారా. నాకు నచ్చిన వాటిలో అదొకటి. Nice post.
చాలా బాగుంది. 90లలో మణిరత్నం తీసిన సినిమాల మీద, చూడ్డానికి బావుంటాయని తప్ప మంచి సినిమాలు అన్న అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. ఈ సినిమా గురించి మీరు చెప్పిన తీరు ఆసక్తి కలగజేస్తోంది
Sarada garu
please, meeru atleast weekly once aina oka article vrayagalaru. request only. I’ll be disappointed if I do not find anything new in your page atleast once a week.
మీరు యెంత వ్రాసినా ఈ సినిమా గురించి సరిపోవటం లేదు .. 🙂 . బయటి వారి ద్వార నిజం తెలిస్తే కలిగే ప్రమాదాలు తెలిసాక సినిమా చూడటం వల్లనేమో …అద్భుతం అంటారే, అలా నచ్చింది.
అమృత సినిమాని నేను 20 సార్లు చూసుంటా. అంత బాగుంది.