మెల్బోర్న్, సిడ్నీలలో జీవితం తో పోలిస్తే అడిలైడ్ లో జీవితం పల్లెటూళ్లలో ఉన్నట్టు ప్రశాంతంగా, ఏ కుదుపులూ లేకుండా వుంటాయి. అసలు ఇలాటి పేరుతో ఒక నగరం వుందన్న విషయమే చాలా మందికి తెలియదని మా అడిలైడ్ జనాలు కృంగి పోతూ వుంటారు.
అలాటి మేమూ వార్తల్లోకెక్కాము. మొన్నటి శుక్రవారం (16 ఎప్రిల్
2010) రాత్రి సంభవించిన భూకంపం తో.
శుక్రవారం రాత్రి పదకొండున్నరకి మంచి నిద్రలో వున్నాను. ఉన్నట్టుండి పెద్ద చప్పుడు, ఇల్లంతా కదిలిన భావనతో లేచాను. మురళీని లేపి, “ఏదో పెద్ద చప్పుడయింది చూడు” అని చెప్పాను. “హెబ్బే! హేవీ లేదు, ఏదో పెద్ద విమానం చాలా దగ్గరినించి వెళ్ళిందేమో. పడుకో” అని మళ్ళీ నిద్రలోకి జారిపోయారు. నేను విమానం కాదేమో, పెద్ద ట్రక్కు పక్కనించి వెళ్ళి ఇల్లు రిజొనేట్ అయి వుంటుందనుకున్నాను. ఇల్లంతా వణికిపోయినంత రిజొనెన్స్ ఇచ్చేంత పెద్ద ట్రక్కా ఏమిటి అనుకుంటూ మళ్ళీ నిద్రపోయాను.
శనివారం పొద్దున్నే నేనూ మురళీ వాకింగ్ వెళ్ళినప్పుడు గుర్తు చేసి, అడిగాను. “రాత్రి ఏదో పెద్ద శబ్దమయినట్టనిపించింది. నిజమా కలా?”అని.
“కలేమీ కాదమ్మా! నిజమే! నిద్దట్లో లేపి మరీ అడిగావు,” అన్నారు. అంత పెద్ద శబ్దమూ, ఇల్లంతా కదిలిన ఫీలింగూ గురించి చర్చింకుంటూ ఇంటికొచ్చాము. రాగానే మా మధు, “అమ్మా! రాత్రి మనూళ్ళో భూకంపం వచ్చింది. ఫేస్ బుక్ లో అందరూ అదే చర్చిస్తున్నారు. వందల కొద్దీ ఫేస్ బుక్ గ్రూపులు కూడా తయారయ్యాయి,” అని చెప్పింది ఉత్సాహంగా!
వార్నీ! రాత్రి మనం పెద్ద శబ్దమనుకున్నది భూకంపమన్నమాట! వార్తల్లో చూస్తే రిక్టరు స్కేలు మీద 3.8 కొలతతో భూకంపం వచ్చిందని తెలిసింది.
“మీరు ముగ్గురూ భూకంపం వచ్చినా లేవరు, మొద్దు నిద్రలు,” మురళీని, పిల్లలనీ అన్నాను.
“సరేలే! రోజూ నీ గురకలతోనే నిద్రపోతున్నాను. ఈ భూకంపం ఒక లెక్కా!” మురళీ రిటార్టిచ్చారు.
“అప్పా! దట్ ఈజ్ ఎ వెరీ రూడ్ జోక్ ఆన్ ఏ లేడీ!” అంటూ మా పిల్లలిద్దరూ తండ్రి మీద యుధ్ధానికి బయల్దేరారు. 🙂
అప్పట్నించి మా వూళ్ళో ఒకటే హాట్ టాపిక్, “భూకంపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావ్?” అన్నదే! “శుక్రవారం రాత్రి పదకొండున్నరకి పార్టీలో వుండకుండా నిద్రపోతున్నావంటే నీకేమీ సోషల్ లైఫ్ లేదన్నమాట!” అన్న కేప్షనుతో మా ఆఫీసులో పోస్టరొకటి వెలిసింది!
తాజా వార్త- నిజంగా నిద్రపోయిన వాళ్ళు, “ఛ! మన జీవితాల్లో జరిగిన ఒకే ఒక్క ఎక్సైటింగ్ సంఘటన మిస్సయ్యామే” అని బాధ పడుతున్నారట.
a good service to express the feels and emotions of people in differenttimes and at different places and ccasions.
tsdivakarrao
Good job.
అయ్యో. పిల్లా మేకా అంతా క్షేమమని తలుస్తాను.
Hayyo! 3.8 level ke antha scenaa, maa desam (NZ) raandee, pagalu raathree teda lekunda bhukampaala pandagale! Mee Muralee gaaru, pillale kaadu, maalati kumbhakarnulu gooda gurretti nidrotaaru illu vuyyaalestunte bhukampalatho maa NZ lo. Ha — Haaa—Haa
న్యూజి లాండ్ భూకంపాలగురించి విన్నానండీ కవిత గారూ! మా వూళ్ళో ఇంకేమీ పెద్ద విశేషాలుండవు కాబట్టి దీన్ని గురించే మాట్లాడుకున్నామంతా! 🙂
కొత్తపాళీ గారూ, అంతా క్షేమమేనండీ. కవిత గారు చెప్పినట్టు 3.8 పెద్ద ప్రమాదమేమీ కాదు.
అందరికీ ధన్యవాదాలు.
శారద