వినదగు నెవ్వరు చెప్పిన
శారద
రోజువారీ జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తుంటాం.
ప్రతీ వ్యక్తి తనదంటూ ఒక ముద్ర వేసి కానీ వదలరు. ఒకరినించి ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో నేర్చుకుంటే, ఇంకొకరినించి ఎలా ప్రవర్తించకూడదో, ఆలోచించ కూడదో నేర్చుకుంటాం.
ఈ సంవత్సరం మార్చి నెల ఆరో తారీఖున మా వూళ్ళో త్యాగరాజ ఆరాధన జరిగింది. సాధారణంగా ఈ కార్యక్రమంలో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో అడిలైడ్ కళాకారులందరూ కలిసి పంచ రత్న కృతులు పాడతారు. టీ విరామం తరువాత రెండో భాగంలో ఒక్కొక్కరూ ఒక్కొక్కటి చొప్పున ఇతర త్యాగరాజ కీర్తనలు పాడతారు. అయితే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా జరిగింది. పంచ రత్న కృతుల తరువాత, రెండో భాగం లో శ్రీ మైసూర్ నాగరాజా గారి వయొలిన్ వాద్య కచేరీ జరిగింది. ‘మైసూర్ బ్రదర్స్ ‘ గా ప్రఖ్యాతి గాంచిన వయొలిన్ విద్వాంసులిద్దరిలో నాగరాజా అగ్రజులు. వారి తమ్ముడు
మంజునాథ గారితో కలిసి ఆయన ఇదివరకే ఒకటి రెండు సార్లు అడిలైడ్ వచ్చారు. అయితే ఈ సారి తమ్ముడు బెల్జియం లో కచ్చేరి ఇస్తూ వుండటం వల్ల, ఆయనొక్కరే వచ్చారు. ఆయన తో పాటు మృదంగ విద్వాంసులు శ్రీ బెంగుళూరు అర్జున్ కుమార్ కూడా వచ్చరు. మైసూర్ బ్రదర్స్ గురించి ఇక్కడ చూడండి.
మంజునాథ గారితో కలిసి ఆయన ఇదివరకే ఒకటి రెండు సార్లు అడిలైడ్ వచ్చారు. అయితే ఈ సారి తమ్ముడు బెల్జియం లో కచ్చేరి ఇస్తూ వుండటం వల్ల, ఆయనొక్కరే వచ్చారు. ఆయన తో పాటు మృదంగ విద్వాంసులు శ్రీ బెంగుళూరు అర్జున్ కుమార్ కూడా వచ్చరు. మైసూర్ బ్రదర్స్ గురించి ఇక్కడ చూడండి.
ఇలాటి కార్యక్రమాలన్నీ ఇక్కడ ‘ శృతి అడిలైడ్ ‘ ఆధ్వర్యంలో జరుగుతాయి. చాలా కొద్దిమంది మెంబర్లమే వున్నా ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ కమిటీలో వుండటానికి అందరమూ వంతులు తీసుకుంటూ వుంటాం. బయటి వూర్లనించి వచ్చే కళాకారులకి కమిటీ మెంబర్ల ఇళ్ళల్లోనే భోజనమూ వసతీ సదుపాయాలూ ఏర్పాటు చేస్తాం. (మాకెప్పుడూ డబ్బు ఇబ్బందులే మరి!).
ఈ సారి వ్యక్తిగత కారణాల వల్ల నాగరాజా గారినీ, అర్జున్ కుమార్ గారినీ మా ఇంట్లో ఎకామడేట్ చేయమని అడిగారు మమ్మల్ని, కమిటీ వారు. ఇది కూడా మాకేమీ కొత్త కాక పోవటం వల్లనూ, స్వతహాగా సంగీత కళాకారుల మీద మాకున్న అభిమానం వల్లనూ సరే నన్నాం.
శనివారం కచేరీకి వారు బుధవారం రాత్రి వచ్చారు. ఇలా కళాకారులు మన ఇంట్లో వున్నప్పుడూ, వారిని ఎయిర్ పోర్టు నించి తీసుకు రావటం, వారికి ఒక పూటా ఊరు చూపించటం లాటి పనులు వుంటాయి. అవి తను చేసేట్టు మురళీ, వాళ్ళ అన్న పానాదులు చూసేట్టు నేనూ, ఒప్పందం చేసుకున్నాం. నాగరాజా గారూ, అర్జున్ కుమార్ గారూ స్వతహాగా చాలా హాస్య ప్రియులవ్వటం వల్ల వాళ్ళున్న నాలుగు రోజులూ మమ్మల్ని రాత్రి పొద్దు పోయే వరకూ తెగ నవ్వించారు.
మురళీ ఒక్కపూట తనకి “బెహాగ్ రాగం” లోని మెళకువలు నేర్పించమని అభ్యర్ధిస్తే కాదనకుండా ఒప్పుకున్నారాయన. ఆ రోజు సాయంత్రం దాదాపు రెండు గంటలు వాళ్ళ సాధన సాగింది. ఏ మాత్రం విసుగూ, గర్వమూ లేకుండా ఆయన చాలా ఓపికగా మురళీ ఫ్లూటు టెక్నిక్స్ ని సరిదిద్దారు. ఆ సందర్భంగా అయన కళకారులకొక ముఖ్యమైన సూచన చేసారు. “నీకొచ్చిన సంగీతం వాయించటానికి ఏ మాత్రం సంకోచ పడొద్దు. కొత్త సంగతి అద్భుతంగా అనిపిస్తుంది. వాయించు! తప్పులు పోతాయేమోనని బెంగగా వుంటుంది. పోతే పోనీ! సంకోచం మాత్రం వదిలిపెట్టు. మామూలు కళాకారుడికీ, గొప్ప కళాకారుడికీ అదే తేడా” అన్నారు. మురళీ ఫ్లూటు గానాన్ని చాలా అభినందించి, వీలైతే సంవత్సరానికి రెండు నెలలు తమ దగ్గరికి మైసూరు రమ్మని సూచించారు.
వేదిక మీద ఇద్దరే కళాకారులుంటే నిండుగా వుండదనీ, లోకల్ గా ఎవరైనా కంజీరా వాయించటానికి దొరుకుతారా అని వారడిగారు. అంతకు ముందు ఒక
కచేరీలొ మృదంగం వాయించిన శ్రీ శివ కుమార్ కంజీరా కూడా బాగా వాయిస్తాడని చెప్పాము. వెంటనే కచేరీ రికార్డింగు చూసి, నిజమే, అతనికి చక్కటి తాళ ఙ్నానం వుంది, పిలుద్దాం అనుకొని పిలిచారు. కచేరీకి ముందు ఒకసారి అతన్ని పిలిచి ప్రాక్టీసు చేసారు.
కచేరీలొ మృదంగం వాయించిన శ్రీ శివ కుమార్ కంజీరా కూడా బాగా వాయిస్తాడని చెప్పాము. వెంటనే కచేరీ రికార్డింగు చూసి, నిజమే, అతనికి చక్కటి తాళ ఙ్నానం వుంది, పిలుద్దాం అనుకొని పిలిచారు. కచేరీకి ముందు ఒకసారి అతన్ని పిలిచి ప్రాక్టీసు చేసారు.
కచేరీ రోజు వాళ్ళకి తినటానికి ఉప్మా చేసి పెట్టి నేను పిల్లలని తీసుకుని హాల్ కెళ్ళీపోయాను (మా పిల్లలిద్దరూ పంచ రత్న కృతుల టీం లో పాడతారు.) వాళ్ళని సరిగ్గా టీ బ్రేక్ సమయానికి మురళీ హాలుకి తీసుకొచ్చారు. ఆ రోజు కచేరీ అద్భుతంగా జరిగింది. ఆ రోజు త్యాగరాజ ఆరాధనని పురస్కరించుకొని ఆయన మామూలు కచేరీలా కాకుండా దాదాపు అన్నీ త్యాగరాజ కీర్తనలే వాయించారు. నాసికా భూషణి లో “మారవైరి రమణి” మొదటిసారి విన్నాను!
కచేరీ తరువాత నేను వాళ్ళ భోజనం ఏర్పాట్లు చూడటానికి గ్రీన్ రూం లో వున్నాను. వాళ్ళు కచేరీ ముగించి వచ్చారు. వాళ్ళ వెంట వచ్చిన వారెవరో “కచేరీ చాలా బాగా జరిగిందండీ” అంటే వాళ్ళు అక్కడే నిలబడ్డ నన్ను చూపిస్తూ “అంతా శారదా మేడం ఉప్మా చలవ! ఆ ఉప్మా తింటే ఎవరైనా చక్కగా వాయిస్తారు” అని చెప్పారు.
అందరూ వెళ్ళాక బోజనం వడ్డిస్తూ, నేను “నాకు నాసికాభూషణి చాలా నచ్చిందండీ. చాలా గొప్పగా వాయించారు,” అన్నాను. అప్పుడు ఆయనన్న మాటలు నేనీ జన్మకి మరిచిపోలేను!
“నాదేముందండీ? మన వాగ్గేయకారులు అంత గొప్ప బాడీ-ఆఫ్-నాలెడ్జ్ మనకిచ్చి పోయారు. నేను చేసేదల్లా దాన్ని నలుగురికీ పంచి పెట్టటమే! వారిది ఘనత కానీ నాదేముంది, అయాం జస్టే మీడియం,” అన్నారు. ఆ క్షణం లో ఆయన హ్యుమిలిటీకీ, నిరహంకారానికీ అబ్బుర పడ్డాను. (ఆ తరువాత ఇంత గొప్ప బాడీ-ఆఫ్-నాలెడ్జ్ మనకుండగా “నన్ను కొరికేయ్, నన్ను రక్కేయ్” లాటి సంగీతం వింటూ తలలూపుతున్న మన అఙ్ఞానానికి జాలి కూడా కలిగిందనుకోండి, అది వేరే సంగతి!). శివకుమార్ నాతో తర్వాత ఉద్వేగంగా “అంత గొప్ప కళాకారులతో వేదిక మీద కంజీరా వాయించిన అనుభూతి ఇహ ఎప్పటికీ మరిచిపోనేమో, గ్రేటెస్ట్ ఎక్స్పీరియెన్స్ ఆఫ్ మై లైఫ్” అన్నాడు.
ఆదివారం మధ్యాహ్నం వరకూ వాళ్ళు ఇంటికొచ్చిన ఔత్సాహిక కళాకారులతో మాట్లాడుతూ, సూచనలిస్తూ గడిపారు. వాళ్ళని విమానం ఎక్కించి నలుగురమూ అలసటతో మొద్దుల్లా నిద్ర పోయాము. వాళ్ళు వెళ్ళి రెండు నెలలైనా, పిల్లలు “ఆ అంకుల్స్ మనని ఎంత నవ్వించారు కదా,” అనుకుంటూ వుంటారు. ఇండియా చేరగానే, వాళ్ళు మాకు ఫోన్ చేసి వాళ్ళు క్షేమంగా చేరిన సంగతి తెలియ పరిచారు.
నేనైతే ఆ నాలుగు రోజులు వాళ్ళ దగ్గర్నించి చాలా విషయాలు నేర్చుకున్నాను. వున్నదానితో సంతృప్తి పడటం, వచ్చిన విద్య ని చూసుకుని భేషజాలకి పోతూ, అహంకరించకుండా, ఎప్పటికీ మన వ్యక్తిత్వాలూ ఆబిప్రాయాలకంటే కళే గొప్పదని గుర్తించటం, కొత్త వారిని కూడా నిష్కల్మషంగా అభిమానించటం, తమకొచ్చిన విద్యని దాచుకోకుండా తమకంటే తక్కువ స్థాయి కళాకారులకి చేయూత నివ్వటం, ఇలా….
ఆ తరువాత నెల రోజులకి మహరాజపురం సంతానం గారి పుత్రుడు, శ్రీ మహారజపురం రామచంద్రన్ కచేరీ కెళ్ళాము. ఆ కచేరీని ఆర్గనైజ్ చేసింది స్థానిక తమిళ పాఠశాల. అందువల్ల ఆయన అన్నీ తమిళ్ పాటలే పాడేరు. కానీ కడివెడు పాలల్లో చిన్న ఉప్పు రవ్వ పడినట్టు, సుబ్రహ్మణ్య భారతి రాసిన ” సింధు నదియిన్ మిసై నిలవినిలే” పాటతో కచేరీ అంతా పాడయింది.
భారతి గొప్ప కవి. “సింధు నది మీద వెన్నెలలో, అందమైన కేరళ స్త్రీలతో కలిసి, సుందరమైన తెలుగు భాషలో పాట పాడుతూ, పడవ షికారు చేయాలి” అని రాసిన భావుకుడు. రామచంద్రన్ గారేమో “సుందర తెలుంగు” అనే మాటని ప్రతీ సారీ “సుందర తమిళీల్” అని పాడేరు. ఎవరి భాష వాళ్ళకి తీయగానే వుంటూంది, నిజమే. కానీ “మనమంతా ఒకటే” అన్న సుహృద్భావాన్ని పెంచటానికి రాసిన అందమైన పాటలో ఈ భాషా ద్వేషాలేమిటి? నాకైతే చెడ్డ చిరాకెసింది. He totally missed the point అనిపించింది. పైగా ప్రతీ చోటా వీలైనన్ని సార్లు “ఈలం” మాటని ప్రయోగించారు. భారతి దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో రాసిన అద్భుతమైన కవితలు ఇలా శ్రీలంకలో తమిళుల పోరాటానికి వాడుకోవటం కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. సంగీతాన్ని రాజకీయం చేసిన చేదు భావన![కానీ, ఆ మధ్య ఒక శ్రీలంకకి చెందిన స్నేహితురాలు ఒక కచేరీలో “ఎన్రుం తనియుం ఇంద సుతంతిర దాహం” (ఈ స్వతంత్ర్య దాహం ఎన్నటికి తీరేను?) వింటే జాలేసిన మాట కూడా నిజం. ]
వచ్చే నెల జూన్, ఇరవయ్యో తారీఖున మా వూళ్ళో శ్రీ టి.యం. కృష్ణా గారి కచేరీ కోసం అందరమూ ఎదురుచూస్తున్నాం. మరి అదెలా జరుగుతుందో చూడాలి!
చాలా బావుందండి. మీ పోస్ట్ చదువుతుంటే అడిలైడ్‌లో ఉండి కచేరి విన్నట్టు ఉంది.
Too sad to read about the Ramachandran experience – as you rightly said, it is misplaced chauvinism.
మైసూర్ నాగరాజ్ ఈనాటి వయొలినిస్టులలో ఎన్నదగినవారు. ఎప్పుడో పదిపదిహేనేళ్ళ క్రితం ఆయన ఫిలడెల్ఫియాలో కచేరీ చేసినప్పుడు, మా మిత్రులు వాళ్ళని హోస్ట్ చేశారు. ఆ హోస్టెస్ గారు కూడా వారిని మీరు చెప్పినట్టే మెచ్చుకున్నారు. పదిహేనేళ్ల తరవాత పేరెన్నికగన్న విద్వాంసుడైనా అలా భేషజం లేకుండ ఉండడం నిజంగా గొప్పే.
mee blog mee rachanalu baagunnayi.congratulations