మానవత్వపు పరిమళం

మానవత్వపు పరిమళంమనం కొంతమందిని చూసింది చాలా కొద్ది కాలమైనా, వాళ్ళల్లో వున్న ఏదో ఒక అనిర్వచనీయమైన మంచితనం వల్ల వాళ్ళని మరిచిపోలేం! మనల్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసి,మన బ్రతుకులో పెద్ద ప్రాముఖ్యత వున్న వాళ్ళ పక్కనే ఇలాంటి వాళ్ళకి కూడా చోటుంటుంది.

అలాటి కొంత మంది మనుషుల గురించి……

1993 లో మద్రాసు దగ్గర సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం చేస్తూ వున్నాను. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మల్లెపూల దండతో ఇంటికొచ్చేవాడు తాత. బక్కగా, మొహంలో అలసటతో, సీరియస్ గా వుంటూ ఏమీ మాట్లాడేవాడు కాదు. తలుపు వేసుంటే గొళ్ళేనికి పూల మాల తగిలించి మరునాడు డబ్బు తీసుకునేవాడు. పెళ్ళయి రెండేళ్ళవుతుంది. ఉన్నట్టుండి నా ఒంట్లో వొస్తున్న మార్పులని పసిగట్టాడు.

మా ఇంటి గుమ్మానికి స్కూటర్ లోపలికి తెచ్చుకోవటానికి రేంప్ వుండేది. అది కొంచెం వెడల్పు ఎక్కువగా వుండటం వల్ల మెట్ల మీద చోటు చాలా కొంచెమే వుండేది. తాత సైకిలు బెల్లు చప్పుడు విని నేను తలుపు తెరిచి మెట్లు దిగి వొచ్చి పూల దండ అందుకునేదాన్ని. ఉన్నట్టుండి తాత పరిగెడుతున్నట్టు వచ్చి నా కంటే ముందే మెట్లెక్కేయటం మొదలు పెట్టాడు. ఎందుకబ్బా, అనుకున్నాను. ఇంకొక రెండు నెలలు గడిచి నాకు నడవటం కొంచెం భారంగా వుండాటం మొదలయింది.

 ఒక రోజు నేను మెట్లు దిగబోతుంటే తాత, “నేను వొచ్చి ఇచ్చే వరకూ ఆగలేవా? ఈ పరిస్థితిలో నువ్వా మెట్లు దిగి రానక్కర్లేదు. నేనొచ్చి పూలు ఇచ్చే వరకూ అక్కడే వుండు!” అని గయ్యి మన్నాడు. తాత మొహంలో కోపానికీ ఆ గొంతులో చిరాకుకీ నాకు పట్టలేనంత నవ్వొచ్చింది.

 సరే! అలాగేలే! రేపణ్ణించి ఇక్కడే వుంటా! నువ్వే పూలు తెచ్చివ్వు!” అన్నాను. “ఏం పెద్ద చదువులో, ఏం పెద్ద ఉద్యోగాలో! కొంచెం కూడా బుధ్ధి లేని పిల్లలు,” అని సణుగుకుంటూ వెళ్ళిపోయాడు.

 డెలివరీకి హైదరాబాదు వెళ్తున్నాను కాబట్టి రెండు నెలలు పూలు తేవొద్దని చెప్పాను. మధు నెత్తుకొని మద్రాసు తిరిగి రాగానే కూరగాయల మార్కెట్టులో నన్ను చూసి, అదే చిరాకు మొహంతో “వచ్చావా? రేపణ్ణించి పూలు తెస్తాలే.” అన్నాడు.

 మర్నాడు ఇంటికొచ్చి, “ఏదీ! పాపను చూపించు” అని అడిగాడు. ఆడపిల్లని చెప్పి చూపించగానే, “అయితే రేపణ్ణించి రెండు మూరలు పూలు తేనా?” అని అడిగాడు. “అది పుట్టి రెండే నెలలయింది కాబట్టి దానిదింకా గుండే! జడ వేసినప్పుడు రెండు మూరలు పూలు తెద్దువుగాన్లే,” అంటే ఇబ్బందిగా నవ్వి వెళ్ళిపోయాడు.

 తరువాతెందుకో తాత రావటం మానేసాడు. మార్కెట్లో కనిపించాడు పూలు అమ్ముతూ. మామూలుకంటే ఎక్కువగా అలిసినట్టున్నాడు. ఏమయింది తాతా అంటే, కాలు విరిగిందమ్మా, సైకిలు తొక్కలేక పోతున్నాను, అన్నాడు. మనసంతా బాధగా మూలిగింది. “పాపకి జడలేస్తున్నావా? రెండు మూరలు పూలివ్వనా?” అని అడిగి మళ్ళీ తనే నవ్వగలిగాడు.

 తరువాత మేమా వూరు వదిలి బెంగుళూరు వెళ్ళీ, ఇలా దేశాలు పట్టి పోయినా, నాకు తాతా, అతను రోజూ తెచ్చి ఇచ్చిన మల్లె పూలలాంటి సున్నితమైన మనసూ గుర్తొస్తూనే వుంటాయి. తాతని గురించి నేనింకే వివరాలూ కనుక్కోలేదనుకుంటే ఒక రకమైన అసహనం కలుగుతుంది నా మీద నాకే.

     **************

 1996 లో బెంగుళూరులో వున్నాం. మా మధు రెండేళ్ళ పిడుగయి నన్ను పరుగులెత్తిస్తున్న రోజులు. ఉన్నట్టుండి మామూలుగా వచ్చిన జ్వరమే febrile convulsionsలోకి దిగి పిల్లని చేతుల మీద వేసుకుని ఎం.ఎస్.రామయ్య ఆసుపత్రికి పరిగెత్తాల్సొచ్చింది.

 అడ్మిట్ చేసుకుని ఐ.సీ.యూ లొ వుంచి మమ్మల్ని బయట కూర్చో మన్నారు. అర్ధరాత్రి, ఒంటి గంటో, రెండో అయి వుంటుంది. ఇద్దరమే, నేనూ మురళీ. బిక్క మొహాలేసుకుని కూర్చున్నాము బయట బెంచీల మీద. నాకైతే కన్నీళ్ళు ఆగటం లేదు. మురళీ కాలు గాలిన పిల్లిలా వరండా అంతా పచార్లు కొడుతున్నారు.

 ఇంతలో నా పక్కనెవరో వచ్చి కూర్చున్నారు. ఎవరా అని చూస్తే ఒక ఆటో డ్రైవరు. ఎవరినో అక్కడ దించటానికి వొచ్చినట్టున్నాడు. నా కన్నీళ్ళు చూసి ఎంత ధైర్యం చెప్పాడో మరిచిపోలేను. నాకు కన్నడం వొచ్చేది కానీ అంత బాగా కాదు. అతను మాత్రం కన్నడంలోనే, “ఏడవొద్దు సిస్టర్! పాపకి బాగయిపోతుంది. నువ్వు ఏడుస్తుంటే సార్ చూడూ, ఎంత అధైర్యపడుతున్నాడో. ఏమీ కాదు. నా మాట నమ్ము.” అని ఆ రాత్రంతా మాతోనే వున్నాడు. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏం భయం లేదని చెప్పేదాకా మాకు కాఫీలు తెస్తూ, మాట్లాడుతూ, అన్న లాగో తమ్ముడి లాగో మా వెంటే వుండి తెల్ల వారు ఝామున ఇంటికెళ్ళాడు.

 నా బాధలో నేనుండి అతనికి ఆ రోజు ధన్య వాదాలైనా చెప్పానో లేదో గుర్తు లేదు నాకు. అతన్ని మాత్రం నేనెప్పటికీ మరిచిపోలేను. పక్క మనిషికి ధైర్యం చెప్పి చేయందించటానికి మనమా మనిషికి సంబంధించిన వాళ్ళమై ఉండక్కర్లేదు, చదువూ, ఉద్యోగం వేటితో పని లేదు. స్పందించే మనసుంటే చాలు.

 వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వున్నారు.

 చెల్లెలూ మరిదీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే, భర్తను కష్టం మీద ఒప్పించి వాళ్ళ పిల్లలిద్దర్నీ తన పిల్లలతోపాటూ చదివించి పెళ్ళిళ్ళు చేసిన అమృతా ఆంటీ,

 తమకి అయిదేళ్ళ కొడుకు వున్నా ఒక్క అనాధకైనా జీవితం ఇవ్వాలన్న ఆశయంతో పూనాలోని అనాథాశ్రమం నించి పాపాయిని తెచ్చి పెంచుకుంటున్న రాజగోపాలన్ దంపతులూ,

 ఇక్కడ అడిలైడ్ లో డెంటిస్టు గా యమ బిజీ గా వుంటూ యేడాదికి నెల రోజులపాటు కొలంబియా, ఇండొనీషియా లాటి దేశాల్లో వైద్య శిబిరాల్లో సేవలందించే డాక్టర్ మల్లిక గారూ,

 ఇష్టపడిన ఆస్ట్రేలియన్ డాక్టరుని పెళ్ళాడి, హనీమూన్ కి తమిళనాడు దగ్గరి ఒక చిన్న గిరిజన ప్రాంతంలో పతీ సమేతంగా ఆరు నెలలు వైద్య సేవలందించిన డాక్టరు జయా-బ్రెండన్…

 చెప్పుకుంటూ పోతే ఎంతమందో!

 వీళ్ళేవ్వరూ వేదికలెక్కి సంఘ సేవ గురించి ఉపన్యాసాలివ్వరు. వాళ్ళు చేసే వాటిని గురించి డబ్బా కొట్టుకోరు. చుట్టూ వున్న జీవితాల్లో వున్న చీకట్లని పార దోలటానికి చిన్న దీపాలు వెలిగించే ప్రయత్నాలు మాత్రం చేస్తారు.

 అలాటి మనసున్న మనుషులని తలచుకోవటానికే ఇది.

9 thoughts on “మానవత్వపు పరిమళం

  1. పింగుబ్యాకు: మానవత్వపు పరిమళం | indiarrs.net Featured blogs from INDIA.

  2. మానవత్వం పరిమళించే మంచి మనసున్న మనుషులు తారసపడటమే అరుదు వారికి శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఇంకేం చెప్పగలను ?

  3. కవిత, శివప్రసాద్, పరిమళం,మధురవాణి, పద్మార్పిత,అశ్వినిస్రీ, కొత్తపాళీ,
    నాతో పాటు అనుభవాలనూ, అనుభూతలనూ పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    ఇంతకంటే చెప్పేదేముంది.
    శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s