హైస్కూల్లో వున్నప్పుడు మొదటిసారి “ది బ్లూ కార్బన్కల్” కథ చదివి హోమ్స్ కి వీరాభిమానినైపోయాను.
తరువాత ఎమ్మెస్సీ ముగించి, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు, ఒక స్నేహితుడు కోనన్ డొయల్ రాసిన అన్ని షెర్లాక్ హోమ్స్ కథలూ నవలలూ ఇచ్చారు. ఇక చూడండి!
పొద్దున్నే లేవటం, పుస్తకం చదవటం, కష్టం మీద ఆఫీసు
కెళ్ళటం, సాయంత్రం హాస్టల్ కి రాగానే మళ్ళీ పుస్తకం మీద పడటం, ఫ్రెండ్సందరూ బలవంతంగా మెస్సుకి లాక్కెళ్ళేంతవరకూ పుస్తకం మీదినించి కళ్ళు తిప్పకపోవటం, తిండి తినగానే మళ్ళీ రూం కొచ్చి పడటం, కళ్ళు నిద్రలో కూరుకుపోయేంతవరకూ చదవటం, దాదాపు పదిహేను రోజులు ఇదే దినచర్య. స్నేహితులంతా విసుక్కున్నారు. ఆ పుస్తకాల
మీద అంత పిచ్చేమిటని.
ఆ తరువాత పెళ్ళయి, మురళీ లండన్ వెళ్ళి నా కొరకు హోమ్స్ సంతకంతో పాటు 221 B, Bakers street అని ముద్రించిన విజిటింగ్ కార్డు సావనీర్ గా తెచ్చారు. నిజానికి లండన్ నగరంలో ఆ చిరునామా లేదు కానీ బేకర్ స్ట్రీట్ లో హోమ్స్ మ్యూజియం వుంది. ఆ మ్యూజియం కి 1990 లో 221 B అనే చిరునామాని కౌన్సిల్ ఇచ్చింది.
నేను నాలుగేళ్ళ క్రితం లండన్ వెళ్ళినప్పుడు స్ట్రాండ్ మేగజీన్ వారు ప్రచురించిన ఒరిజినల్ హోమ్స్ కథలు (ఆ పత్రికలో వచ్చినట్టే!) కూడా కొన్నాను. అంత ఇష్టం నాకు హోమ్స్ కథలన్నా, నవలలన్నా!
పాపం నిజానికి, సర్ అర్థర్ కోనన్ డొయల్ ఇంకా వేరే పుస్తకాలూ కథలూ రాసినా, ఆయనకి షెర్లాక్ హోమ్స్ రూప కర్త గానే పేరుంది. ఒకానొక సిరిస్ లో, హోమ్స్ ని చంపేసి I killed the bastard అని నిట్టూర్చాడాయన. కానీ ప్రజలనుండి తీవ్రమైన ప్రతి స్పందన రావటం తో మళ్ళీ “రిటర్న్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్” రాసి హోమ్స్ ని పునరుద్ధరించాడు.
ఇప్పుడీ సోదంతా ఎందుకంటే మొన్ననే నేను గై రిచీ తీసిన షెర్లాక్ హోమ్స్ (2009) సినిమా చూసాను. సినిమా చూడటానికి జూడ్ లా అంటే నాకున్న ఇష్టం ఒక కారణమైతే, హోమ్స్ తెర మీద పుస్తకంలో అనిపించినంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాడా అన్న కుతూహలం, ఇంకొక కారణం.
సినిమాలో హోమ్స్ గా రాబర్ట్ డౌనీ (జూనియర్), డాక్టర్ వాట్సన్ గా జూడ్ లా నటించారు.
లార్డ్ బ్లాక్ వుడ్ (మార్క్ స్ట్రాంగ్)ని హోమ్స్, వాట్సన్ పట్టుకుని పోలీసులకి అందించటంతో కథ ప్రారంభమవుతుంది. క్షుద్ర విద్యలని ఉపాసిస్తూ, హత్యలు చేసినందుక్కానూ బ్లాక్ వుడ్ కి ఉరి శిక్ష విధిస్తుంది న్యాయ స్థానం. ఉరి తీసిన తరువాత బ్లాక్ వుడ్ మరణించినట్టుగా ధృవీకరిస్తాడు డాక్టర్ వాట్సన్. అయితే అనూహ్యంగా బ్లాక్ వుడ్ బ్రతికి తిరిగి రావటమే కాక, మరిన్ని హత్యలు కొనసాగిస్తూ వుంటాడు. హోమ్స్ అతణ్ణి ఎలా పట్టుకుని ఆట కట్టించాడన్నదే మిగతా కథ.
ఇందులో పిట్ట కథగా ఐరీన్ ఆడ్లర్ హోమ్స్ ని వెంబడిస్తూ వుంటుంది. ఆడ్లర్ గా రేషెల్ మెక్ ఆడమ్స్ చక్కని నటననే చూపించినా, నాకెందుకో ఇది చాలా అసంపూర్తి గా అనిపించింది. అంటే హోమ్స్ ని వెంబడించటానికీ, తరువాత మళ్ళీ వదిలిపెట్టి పోవటానికీ, ఆమె చెప్పిన కారణాలు అంత బలంగా అనిపించలేదు. హోమ్స్ లాటి హీరోకి ఒక ఫిమేల్ ఇంటెరెస్టు వుండకపోతే కథ బోరు కొడుతుందని ఈ అంశం జొప్పించారేమో అనిపించింది.
హోమ్స్ గురించి ఎక్కువగా పరిచయం లేని వారికి- ఐరీన్ ఆడ్లర్ హోమ్స్ మెచ్చిన ఒకే ఒక స్త్రీ. “నన్ను ఓడించిన ఒకే ఒక్క స్త్రీ” అని ఆమెని వర్ణిస్తాడు హోమ్స్. “ఎ స్కాండల్ ఇన్ బొహేమియా” అనే కథలో ఆమె హోమ్స్ ని చిత్తు చేసి పారిపోతుంది.
అయితే ఈ సినిమాలో ఒక విచిత్రం గమనించాను. మాటల్లో ఒకసారి వాట్సన్ హోమ్స్ తో “ఆమె ఇదివరకే నిన్ను రెండు సార్లు ఓడించింది,” అంటాడు. నాకు తెలిసి ఒక్క పైన చెప్పిన కథలోనే హోమ్స్ ఆమెని కలుస్తాడు. ఇంకే కథలోను వాళ్ళు ఎదురు పడరు. సినిమాలో అలా ఎందుకుందో మరి!
ఈ సినిమాలో నాకు అన్నిటి కంటే నచ్చినది హోమ్స్, వాట్సన్ ల మధ్య interaction. హోమ్స్ restless energy నీ వాట్సన్ cool ness నీ దర్శకుడూ నటులూ చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఏ మాత్రం నచ్చనిది వాళ్ళిద్దరి యాసలు! వాళ్ళ భాషలో ఇంగ్లండు యాస (ఒక రకమైన ట్యూనుతో వుంటుంది) కొంచెం కూడా వినిపించలేదు. ఆటు అమెరికన్ ఇంగ్లీషుకీ, ఇటు ఇంగ్లండు ఇంగ్లీషుకీ మధ్య ఎక్కడో వుండి విచిత్రంగా వుంది.
రాబర్ట్ డౌనీ హావ భావాల్లో ఎందుకో డస్టిన్ హాఫ్ మేన్ లాగనిపించాడు. హోమ్స్ లాటి విపరీతపు అలవాట్లున్న స్నేహునికీ, ప్రేమించిన అమ్మాయికీ మధ్య నలిగిపోతూ, స్నేహ ధర్మాన్ని నిర్వర్తించే డాక్తరుగా జూడ్ లా బాగా నటించాడు.
అన్నట్టు, హాన్స్ జిమ్మర్ ఇచ్చిన సంగీతమూ, perfect timingతో వచ్చే సున్నితమైన హాస్యం కూడా చాలా బాగున్నాయి.
ఎవరైనా మిస్సయి వుంటే చూడొచ్చు.
షెర్లాక్ హోమ్స్ గురించి వివరంగా రాసారు. ధన్యవాదాలు. చూడడానికి తప్పక ప్రయత్నిస్తాను.
http://www.pranahita.org/2010/02/nera_parisodhana_part_1/
ఆసక్తి ఉన్నవారు పై లింకును చూడవచ్చు.
నాకు జెరెమీ బ్రెట్‌తో Granada TV వారు తీసిన హోమ్‌స్ సీరియల్స్ చాలా ఇష్టం. స్కూల్లో చదివేటప్పుడే నేను ఆ కథలూ, నవలలూ అన్నీ డజన్ల సార్లు చదివేశాను. కోనన్ డాయిల్ ఇతర Prof. Challenger కథలూ, sci-fi & historical నవలలూ కూడా బాగానే ఉంటాయి.
Good one…
మీ అంత కాకపోయినా నేను కూడా షెర్లాక్ అబిమానినే, సినిమాలో లండన్ టవర్ బ్రిడ్జిని అద్బుతంగా చూపారు.
ఈ సినిమా నాకు అస్సలు నచ్చలేదు. అందులోనూ ముఖ్యంగా డౌనీ మరీ నచ్చలేదు. చూడంగానే తుప్పొదిలేట్టు ఒక రివ్యూ రాద్దామనుకున్నాను గానీ నచ్చని విషయాల్ని గురించి అంత శ్రమ వెచ్చించడానికి బద్ధకమేసి మానేశా. కానీ నచ్చిందన్న మీ దృక్కోణం తెలుసుకోడం బాగుంది.
SRRao గారూ,శివ గారూ
వ్యాసం నచ్చినందుకు సంతోషం.
రోహిణీ ప్రసాద్ గారూ,
మీరిచ్చిన అనువాదం లింకు బాగుంది. కానీ మిగతా భాగాలు వచ్చినట్టు లేదు. లేక నేనే మిస్సయ్యనా?
కన్నగాడు గారూ,
నాకెందుకో లండన్ నగరం బ్లాక్ అండ్ వైట్ లోనే చాలా అందంగా అనిపిస్తుంది. లండన్ నగరం లో ఆ దట్టంగా మబ్బులు కమ్మిన ఆకాశమూ, ఎప్పుడూ అలుముకుని వున్నట్టు అనిపించే fog, ఒక రకమైన gloominess రంగుల్లో కంటే బ్లక్ అండ్ వైట్ లో రియలిస్టిక్ గా అనిపిస్తుంది నాకు. మీరన్నట్టు సినిమాలో లండన్ నగరం అందంగా వుంది. There is no accounting for tastes 🙂
కొత్తపాళీ,
నిజానికి ఏ సినిమా కూడా పుస్తకంలోని పాత్రకి పూర్తిగా న్యాయం చెయ్యలేదేమో. మరీ హోమ్స్ లాటి విలక్షణమైన పాత్ర పుస్తకం లో చాలా dominatingగా వుండి మిగతా పాత్రలన్నిటిని కొంతవరకు obscure చేస్తుంది. సినిమాలో సంగీతమూ, ఇతర నటీ నటులూ, ఫోటోగ్రఫీ అన్నీ మన అటెన్షన్ కోసం పోటీ పడతాయి. దానితో dominating character తేలిపోయినట్టనిపిస్తుంది. అందువల్ల కొన్నిసార్లు పుస్తకం లో పాత్ర తెర పైన మనకంతగా నచ్చదు. (This is just my theory. Could be wrong :)!) కొన్నిసార్లు డేనియల్ రేడ్ క్లిఫ్ లాటి నటులు తమ pedestrian acting skills తో కూడా మనకా అసంతృప్తి మిగల్చ గలరనుకోండి, అది వేరే విషయం. 🙂
శారద