కలకంఠి

చదువుకున్నా, చదువుకోకపోయినా, జీవితమూ సమస్యలూ, చుట్టూ వుండే మనుషుల పట్ల వాళ్ళకుండే అవగాహనా, ధైర్యమూ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి.

ఒక రెండేళ్ళ క్రితం లైబ్రరీలో టాగూరు కథల పుస్తకం చదివాను. నాకాయన కథల్లోని స్త్రీ పాత్రలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. చదువుకున్నా, చదువుకోకపోయినా, జీవితమూ సమస్యలూ, చుట్టూ వుండే మనుషుల పట్ల వాళ్ళకుండే అవగాహనా, ధైర్యమూ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి. నిజ జీవితంలో అలాటి ఆడవాళ్ళని కలిస్తే బాగుండుననీ అనిపిస్తుంది.

ఆ మధ్య మా  స్నేహితుల కుటుంబంలో ఒక పాతికేళ్ళ అమ్మాయితో పెళ్ళి సంబంధాల విషయమై మాట్లాడాల్సి వచ్చింది. “గుండమ్మ కథ” సినిమాలో జమున చెప్పినట్టు, గొంతు వరకూ చదువుకుని, పెద్ద వుద్యోగం చేస్తూ “చాలు బాబో!” అన్నంత డబ్బు సంపాదించుకుంటూంది తను. లేయర్స్ చేయించిన జుట్టూ, అందంగా కత్తిరించిన కనుబొమ్మలూ, “వెరీ ట్రెండీ” అనిపించే బట్టలూ, నిచ్చెనల్లాంటి చెప్పులూ, పెదాలకూ, కళ్ళకూ కొత్త కొత్త రంగులూ, ఒకటేమిటీ ఆధునిక స్త్రీకుండాల్సిన అన్ని హంగులూ వున్నాయి. పాపం తనకి పెళ్ళంటే ఇష్టం లేదట.

 ఫలానా పెళ్ళికొడుకంటే ఇష్టం వుండకపోవచ్చు, ఏకంగా పెళ్ళంటే ఇష్టం లేకపోవటమెందుకో మరి. ఆ సంగతే కుతూహలంగా అడిగాను. అయిష్టం కాదాంటీ, భయం అంది. కొత్త వ్యక్తితో సర్దుకోగలనో లేదో అని భయం, ఏదైనా సమస్యలొస్తే తీర్చుకోగలనో లేదో అని భయం, అత్త మామలు ఎలా వుంటారో అని భయం, కెరీర్ దెబ్బ తింటుందేమో నని భయం. ఆమె భయాల లిస్టు వింటుంటే నాకు భయం పెరిగిపోయింది.

 ఇంత చదువూ చదివి, పెద్ద ఉద్యోగం చేస్తూ, పది మందిలో మెలుగుతూ, ఈ విచిత్రమైన భయమేమిటో? అక్కడికీ ఉండబట్టలేక  అన్నాను, “ఏదైనా సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కోవటం నేర్పించేదే చదువు. అంతేకాని సమస్యలనించి దూరంగా పారిపోవటం అంత మంచి పరిష్కారం కాదేమో!,” అని . ఇంకొకరి వ్యక్తిగత విషయాల్లో అంతకంటే జోక్యం మంచిది కాదని వదిలేసాను.

 ఇంతకీ నాకు టాగుర్ కథల్లోని స్త్రీ మూర్తులూ, భయస్తురాలైన ఆ అమ్మాయీ ఎందుకు గుర్తొచ్చారంటే  సుందరి మామి, కౌసల్య అక్క లని కలవటం వల్ల. (వాళ్ళిద్దరి అనుమతితోనే ఇది రాస్తున్నాను, అయినా పేర్లు మార్చాను.).

 నాకు కిందటి తరాల బంధువులని కలుసుకోవటం, పాత కాలపు కబుర్లు చెప్పించుకోవటం, పాత ఫోటోలు చూడటం చాలా సరదా. ఇప్పటికీ మనకి కావల్సిన చాలా విషయాలు వాళ్ళ జీవితాల్లోంచి నేర్చుకోవచ్చు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

 మా అత్తవారి వైపు అంతా తమిళులు.  వాళ్ళనీ ఇలాగే పాత కాలం కబుర్ల కొరకూ, ఫోటోల కొరకూ వేధిస్తుంటాను. ఇంట్లోనూ బంధు వర్గంలోనూ నా ఆసక్తినీ, కుతూహలాన్నీ మెచ్చుకున్నారే కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలడుగుతున్నానని ఎప్పుడూ కోపగించుకోలేదు.

 చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన మా అత్తగారు, అక్కతో పాటు మేనమామ ఇంట్లో పెరిగారు. వాళ్ళదేం దురదృష్టమో గాని, ఆ ఇంట పుట్టిన ఇద్దరు ఆడపిల్లలూ చిన్నతనంలోనే పోయారు. (మా అత్తగారి తల్లీ, వాళ్ళ అక్కగారూ). అందుకే వీళ్ళిద్దరూ, ఆ ఇంకో ఆవిడ కూతురూ, అందరూ మేనమామ ఇంట్లోనే పెరిగారు. ఈ ముగ్గురి ఆడపిల్లల పెంపకం అంతా మేనమామా, ఆయన భార్యా చూసుకునే వారు. బోలెడు డబ్బున్న కుటుంబం కావటంతో వాళ్ళు వీళ్ళ ముగ్గురికీ చదువులు చెప్పించి పెళ్ళిళ్ళూ వెనకాడకుండా చేసారు. ఇప్పటికీ మా అత్తగారికి అత్తయ్యంటే చాలా ప్రేమా, గౌరవమూను.

  వీళ్ళ చిన్నతనంలో ఆ మేనమామలందరూ ఉమ్మడి కుటుంబం లో వుండే వారు కాబట్టి ఇల్లంతా సందడిగా వుండేది.  అలాటి  పెద్ద కుటుంబంలో  దూరపు బంధువులు బాబూ, ఆయన శ్రీమతి కౌసల్య  . ఇద్దరు కొడుకులతో వాళ్ళ సంసారం మామూలుగా, హాయిగానే వుండేది. ఉన్నట్టుండి బాబు చెడు సావాసాలకీ, వ్యసనాలకీ లోనయ్యాడు. దానికి  తోడు పనిచేసే ఫేక్టరీలో ఆక్సిడెంట్ అవటం వల్ల కాళ్ళూ చేతులూ పడిపోయి చిన్న వయసులోనే మంచం బారిన పడ్డాడు.

 ఎంతో కొంత చదువుకున్న కౌసల్య కొంచెం కూడా భయపడలేదు. ఆ ఫేక్టరీ వాళ్ళు నడుపుతున్న స్కూలులో టీచర్ ఉద్యోగం సంపాదించుకుంది. కదలలేని స్థితిలో వున్న భర్తని చూసుకుంటూ, ఇద్దరు కొడుకులని పెంచుకుంది. నేను మొదటిసారి తనని పదేళ్ళ కింద కలిసాను.

 అనుకోకుండా వచ్చిన మమ్మల్ని చిరునవ్వుతో “రా రా లోపలికి! అబ్బో! ఇవాళ మా మురళీ భార్యని కూడా వెంట పెట్టుకొచ్చాడే” అంటూ ఆహ్వానించిన ఆవిడని నేనెప్పుడూ మరిచిపోలేను. పొడవుగా, కొంచెం చామన చాయతో మంచి కళగా వున్న నవ్వు మొహం, ఎంత మెంటల్ టెన్షన్లో కూడా ధీమాగా వుండగలిగే ఆమె వ్యక్తిత్వమూ,  మాట తీరూ అభినందించకుండా వుండలేం.

మా ట్లాడుతూనే చక చకా టిఫినూ కాఫీలిస్తూ, అందరినీ గమనిస్తూ, మళ్ళీ మంచం మీది నించి భర్త అదలింపులు వింటూ, వాటికేమీ రియాక్టవకుండా జవాబిస్తూ ఒక్క క్షణం సవ్యసాచి లాగనిపించిందావిడ.

 అప్పుడే స్కూల్ నించి వచ్చి అలిసిపోయి వున్నా, రెండు చేతులా అందరికీ అన్నీ అందిస్తున్న మనిషిని “వాళ్ళకి కాఫీలిచ్చావా? ఇడ్లీల్లో కారప్పొడి వేసావా? కారప్పొడి లో నూనె వేసావా?” అంటూ మంచం మీదినించి ఆయన పెట్టే నస చూస్తుంటే నాకు ఒళ్ళు మండింది. పైగా దానికితోడూ ఆ మనిషికి ఒళ్ళంతా అనుమానం అని తరువాత మా అత్తగారు చెప్పినప్పుడు నా ఒళ్ళు మంట ఇంకా పెరిగిపోయింది.

వెళ్ళేప్పుడు మా అత్తగారు దగ్గరగా కూర్చుని, “బాబూ! కౌసల్య మనసు కష్ట పెట్టకురా” అని ఎందుకు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారో అప్పుడర్ధమయింది నాకు.

 ఇప్పటికీ నాకామెను తలచుకుంటే ఆశ్చర్యమే! పెళ్ళి మీదా, భర్త మీదా, జీవితం మీదా ఆమెకున్నది నమ్మకమా? గౌరవమా?ఏ ధైర్యంతో ఆవిడ అన్నిటినీ ఎదుర్కుంటుంది? చిన్న కష్టానికే మనుషులం self-pity తో కుంగి పోతాం. బ్రతుకు మీదా, చుట్టూ పక్కల వాళ్ళ మీదా ఆశ వదిలేసుకుని అర్ధం లేని కోపాలనీ, ద్వేషాలనీ పెంచుకుని కష్టపడతాం. ఆమె మాత్రం అలుపు లేకుండా అలా అలలతో పోరాడుతూనే వుంది.

 ఈ మధ్యనే ఆమె పెద్ద కొడుకు ఒక ఆఫ్రికన్ అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా పెళ్ళాడాడని తెలిసినప్పుడు బాధగా మూలిగింది మనసు. ఆ కొడుకైనా తల్లి కష్టాన్నర్ధం చేసుకుని ఆమెని సుఖపెట్టే కోడలిని తీసుకురాకూడదా అనిపించింది ఒక్క క్షణం. ఆవిడ మాత్రం మామూలుగానే వున్నారు. దాని గురించెక్కువగా మాట్లాడలేదు. అన్నిటి గురించీ తరచి తరచి అడిగి, మాట్లాడే నేను, ఈ విషయం రెట్టించకుండా వచ్చేసాను.

సుందరి మామి!!

మా అత్తగారి ప్రాణ స్నేహితురాలు. ఇద్దరి స్నేహం వయసు దాదాపు అరవై యేళ్ళు. ఫోన్లో మాట్లాడటమే కాని ఎక్కువగా కలవలేదు ఆవిడని. ఎప్పుడు పలకరించినా, “నువ్వు హిందీ పాటలు బాగా పాడతావని సచు చెప్తుంది. ఒకరోజు నీ పాట వినటానికే రావాలి నేను,” అంటూ వుంటారు. (సచు మా అత్తగారి ముద్దు పేరు.)

మా అత్తగారికి తన జీవితంలో జరిగిన ప్రతీ చిన్న విషయాన్నీ, విశేషాన్నీ నాతో పంచుకోవటం చాలా ఇష్టం. ఆవిడ సుందరి మామి జీవితాన్ని గురించి అంతా నాతో చాలా సార్లు చెప్పారు.

చిన్నప్పట్నించీ ఇద్దరు స్నేహితురాళ్ళకీ హిందీ పాటల పిచ్చి! వైజయంతీమాల ఆరాధ్య దైవమే! తమిళనాడులో ఎక్కడో చిన్న పల్లెటూరు శ్రీ విల్లి పుత్తూరు. అక్కడ పెరిగిన ఇద్దరు ఆడపిల్లలకి హిందీ భాష మీద అంత పట్టు ఎలా వచ్చిందో మరి! ఇద్దరూ పాటల పుస్తకాలు మెయింటెయిన్ చేసే వారనీ, ఇంటినిండా వుండే అన్నలూ తమ్ముళ్ళూ ఆ పుస్తకాన్ని ఎప్పుడూ దాచి పెడుతూ వుండే వారనీ  ఇద్దరూ ఇప్పటికీ తలచుకొని నవ్వుకుంటూ వుంటారు.

ఇద్దరికీ దాదాపు ఒకే సారి పెళ్ళిళ్ళయ్యాయి. అంతే కాదు, ఇద్దరి భర్తలూ క్లేస్ మేట్సే! అయితే ఇద్దరు అబ్బాయిలు పుట్టింతరువాత సుందరి మామి భర్త గతించారు. ఇద్దరు అబ్బాయిలనీ అన్నగారి సహాయం తో పెంచారు సుందరి మామి.

చిన్నబ్బాయికి జువెనైల్ డయాబిటీస్ అని తెలిసి కొంచెం జాగ్రత్తగా వుండేవారట. అతని కొరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేయటం అన్నీ నేర్చుకున్నారావిడ. అన్నిటికంటే దురదృష్టం పెద్దబ్బాయిని మృత్యువు కాటేయటం. ఇంకా పెళ్ళి కూడా కాకుండా అప్పుడే చదువు ముగించి ఏదో ఉద్యోగానికని ఇంటర్వ్యూ కెళ్ళినతను మామూలుగా ఇంటికి రాలేదు.

“ఆ దెబ్బకి అది కోలుకుంటుందనుకోలేదు!” అంటారు మా అత్తగారు. కానీ మెల్లిగా నిల దొక్కుకున్నారు. చిన్న కొడుకు చదువూ పెళ్ళి ముగించి ఇప్పుడు కాస్త హాయిగా వున్నారు.

మూడు వారాల క్రితం మద్రాసులో నాతో, “రేపు మూడింటికి ఇంటికొస్తాను! ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే వుండు!” ఆర్డర్ వేసారు.

మర్నాడు అన్నతో కలిసి మా ఇంటికొచ్చి నన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. “మనిద్దరం లోపల పాటలు పాడుకుందాం రా” అని లోపలికి తీసికెళ్ళారు. “ఒక్క పాట పాడండి మామీ,” అని మురళీ చాలా బతిలాడితే “కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే” పాట పాడేరు. ఆ పాట విని నేనూ, మా పిల్లలూ నోరావలించి వింటూ వుండి పోయాం. డెబ్బై యేళ్ళ వయసులో ఆ గొంతులో మాధుర్యమూ తగ్గలేదు, వణుకూ లేదు. అసలు, it was just awesome.  ఆ తరువాత ఇద్దరమూ పోటీలు పడి రెండు గంటల సేపు పాడాము. “ఒరుత్తి మగనాయ్” పాట ఎంత మంది గొంతులో విన్నా, అన్నిటి కంటే సుందరి మామి పాటే నచ్చింది నాకు.

“మళ్ళీసారి వచ్చినప్పుడూ మా ఇంటికొచ్చి భోజనం చేయాలి మరి!” అని నాకు గట్టి వార్నింగిచ్చి వెళ్ళారు. బహుశా సంగీతంలో, పాడటం లోనే ఆవిడ ధైర్యాన్నీ, మనశ్శాంతినీ పొందారేమో అనిపించింది. జీవితం చేతిలో అన్ని దెబ్బలు తింటూ కూడా అంత పాజిటివ్ ఆటిట్యూడ్ నీ, అంత ఇంట్రస్టునీ, ఇష్టాన్నీ వుంచుకోవటం గొప్ప విషయమే కదా!

కష్టాలతో పోరాడటం, ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం ఇవేవీ ఎవరికీ కొత్తా కాదు, వింతా కాదు. ఆ పోరాటం లో కూడా వ్యక్తిత్వం లోని పరిపక్వతనీ, మొహం మీది చిరునవ్వునీ, మనసులోని ధైర్యాన్నీ, జీవితం మీది ఇష్టాన్నీ పోగొట్టుకోకుండా వుండటం మాత్రం నిస్సందేహంగా విశేషమే! చిన్న చిన్న విషయాలకే నిరాశ పడి సెల్ఫ్-పిటీ లో మునిగి పోయే నాలాటి వాళ్ళు అలాటి స్త్రీల దగ్గర్నించి ఎంతైనా నేర్చుకోవాల్సి వుంది అని అనుకుంటాను ఎప్పుడూ.

6 thoughts on “కలకంఠి

  1. మంచి విషయం తెలియజేసారు. ధృఢమైన మనస్సు, గుండె నిబ్బరం, మంచి ఆలోచనా విధానం ఉన్నవాళ్ళు అలా సమస్యలకి ఎదురీది బ్రతుకుతారు. దుర్భల మనస్తత్వం ఉన్నవారు నిత్యం క్రుంగిపోతుంటారు. ఇప్పుడు అందరిలోను సున్నితత్వం పెరిగిపోయింది. ఏదిఏమైనా పెద్దవాళ్ళ అనుభవాలు మనకు మంచి పాఠాలు. వారిని చూసి, అడిగి నేర్చుకోవాలి. మా నాన్నగారు కూడా నాకన్నా స్థిరత్వంతో ఉంటారు. నేను అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.

  2. శ్రీమతి శారద గారికి, నమస్కారములు.

    మనిషి-మనసు-వ్యక్తిత్వం-ప్రపంచం-కష్ట,సుఖాలు-ఎదుర్కోవటానికి కావాల్సిన మానసిక శక్తి–సంగీతం. వీటన్నిటితో కలబోసినదే జీవితం. చక్కగా వివరించారు. “బహుశా సంగీతంలో, పాడటం లోనే ఆవిడ ధైర్యాన్నీ, మనశ్శాంతినీ పొందారేమో అనిపించింది”. అని మీరు పైన వ్రాశారు. మీ మరొక వ్యాసం:గురు సాక్షాత్ పరబ్రహ్మ లో కూడా “సంగీతాన్ని” గురించే ప్రస్తావించారు. దీనిపై నా స్పందన వ్రాసిన తరువాత, ఈ వ్యాసం చదివాను. అక్కడ సంగీతం గురించి నేను ప్రస్తావిస్తే, ఇక్కడ, మీరు సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి ప్రస్తావించారు. అదీ సంగీతం యొక్క గొప్పతనం.

    భవదీయుడు,
    మాధవరావు.

  3. మీ వ్యాసం చదువుతూ ఉంటే పాతకాలపు నలుపు – తెలుపు చిత్రం చూస్తున్నట్లుంది..! నిజంగా అలాంటి మనుషులున్నారా అనిపిస్తుంది…! ప్రస్తుత ఈ పోటి ప్రపంచంలో మీవ్యాసంలో వివరించిన గుండె నిబ్బరం వుండి, మానసిక దృడత్వం కలిగిన మనుషులుండడం గగనమే అనుకుంటాను. మీరు ఇలాంటి విషయాలను ఆదారంగా చేసుకొని, విపత్కర పరిస్థితులెదురైనప్పుడు ఎలా వాటిని ఎదుర్కొన్నారో..?? బయట సమాజం ప్రవర్తన, ఇత్యాదిక విషయాలను జొప్పిస్తూ ఒక మంచి నవల వ్రాస్తే ఇప్పటికాలపు మనుషులకు కొంత ఉపయోగరంగా ఉండవచ్చునేమో అని నా ఆలోచన..దయచేసి మరోలా భావించకండి. మీరు వ్రాసిన వ్యాసాన్ని బట్టి చూస్తే చాలా నేర్చుకోతగ్గ విషయాలున్నావి అందులో అనిపిస్తుంది. ఆ దిశలో ఒక సారి ఆలోచించి చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s