గురు సాక్షాత్ పరబ్రహ్మాః

మా వారు, మురళీధరన్ గారు సిక్కిల్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి పొందిన సిక్కిల్  కుంజుమణి,నీలా గార్ల ప్రియ శిష్యులు.

మద్రాసు వెళ్ళిన ప్రతీసారీ వారి ఇంటికి వెళ్ళి పలకరించి వస్తారు మురళి. వీలైతే ఒక్కటైనా కీర్తన కూడా నేర్చుకుంటారు. 1992 లో మా పెళ్ళి జరిగిన రోజు కూడా సాయంత్రం ఇద్దరం కలిసి ముందుగా వారింటికే వెళ్ళాము.

నన్ను ఆ రోజు పరిచయం చేయగానే వాళ్ళడిగిన ప్రశ్న, “పాడువాళా?” అని. (పాడుతుందా?) “ఏదో, కొంచెం” అని నసుగుతూ చెప్పాను. తీక్షణంగా ఒక చూపు చూసి వదిలేసారు.

ఆ రోజుల్లో వాళ్ళ ఇంటి గోడల మీద ఫోటోలన్నీ చాలా కుతూహలంగా చూసాను. అద్భుతమైన ఫోటోలు. దేశ విదేశాల్లో బహుమతులు అందుకుంటూ, వేణువు వాయిస్తూ…
మళ్ళీ పదిహేడేళ్ళ తరువాత మొన్న వాళ్ళింటికి వెళ్ళాను. ఈ ట్రిప్పులో వెళ్ళటం వీలు పడదనుకుని ఆఖర్న బయల్దేరే రోజు వాళ్ళకి ఫోన్ చేసారు మురళి. కానీ ఫోన్ లో నీల గారు ” అక్కకి అసలు ఆరోగ్యం బాలేదు” అని చెప్పగానే, “ఇవాళ రాత్రికే మా ప్రయాణం. కాబట్టి సాయంత్రం నేనొక్కసారి వచ్చి మామి ని చూస్తాను,” అని అన్నారు.

గురువుగారి మీద ఆయనకున్న ఆపేక్షకి సంతోషిస్తూనే, నేనూ వస్తానని అన్నాను. మా ఇంటికి వాళ్ళ ఇల్లు నడక దూరమే కాబట్టి నడుచుకుంటూ కొన్ని పళ్ళు కొనుక్కుని వెళ్ళాం.

మేం వెళ్ళేసరికి నీల గారు కాఫీ తాగుతూ వున్నారు. కాసేపు మామూలు కబుర్లయ్యాక, “ఒక పాట వాయించు”అని ఆర్డర్
వేసారు. “ఫ్లూట్ తీసుకురాలేదండీ” నసిగారు ఆయన. ఇంట్లో అందరి మీదా అన్నిటికీ లేస్తూ వుండే మురళీని వాళ్ళ గురువుగార్ల ముందు చూస్తే నాకూ పిల్లలకీ నవ్వాగదు. “నాది ఇస్తాలే వాయించు” అని లోపల్నించి ఒక ఫ్లూట్ తెచ్చి ఇచ్చారు.
“అంటే, ఈ మధ్య ఎక్కువగా ప్రాక్టీసు లేదు,” అంటూనే “బంటు రీతి కొలువు ఇయవయ్య రామా” కీర్తన వాయించారు. తరువాత వేటు నా మీదే పడుతుంది కాబట్టి గబగబా ఆలోచిస్తున్నాను. నేనేం పాట పాడాలీ అని.

నాకు బాగా వచ్చిన రాగం, తిలంగ్ లో పురందరదాస కృతి “రామ రామ రామ సీతా రామా యెన్నిరో” పాడాలనుకున్నాను. కానీ ఆ పాట తాళం నాక్కొంచెం వీకు. మామి చూస్తేనేమో లెక్క తప్పకుండా తాళం వేస్తున్నారు. తప్పు దొర్లిందంటే తోలు వల్చే ప్రోగ్రాం వుంటుంది.

అప్పటికే ప్రియ శిష్యుణ్ణీ “ఒక చోట తాళం తప్పావు, అయినా పర్వాలేదులే, ఈజీ గా సర్దేసావు,” అని సరి దిద్దుతున్నారు. మళ్ళి, “నువ్వు రోజూ సాధన చేస్తున్నట్టుగానే వుందే! సెభాష్. నేర్చుకున్న విద్య ఎన్నటికీ మరచిపోకూడదు,” అని మెచ్చుకుంటున్నారు.
ఇంతలో అనుకున్నట్టే ఆవిడ నన్ను “నువ్వూ ఒక పాట పాడమ్మా” అన్నారు. ఆది తాళం అయితే వీజీ, ఏ తప్పులూ దొర్లవని, బెహాగ్ లో “నారాయణ తే నమో నమో” అందుకున్నాను. పాట రెణ్ణిమిషాలు కాగానే ఆవిడ ఫోనెత్తి ఎవరితోనో మాటలు మొదలు పెట్టారు.
నాకు నిజంగానే నిరాశ కలిగింది. బానే పాడుతున్నా కదా, అనుకున్నాను. మా వారి వైపు చూస్తే ఆయనసలు నా వైపే చూడటం లేదు. సరే పోనీలే ఏం చేస్తాం అనుకుని పాట పూర్తి చేసాను.

సరిగ్గా నా పాట అయిపోయే సరికి ఆవిడ ఫోన్ కాల్ కూడా అయిపోయింది. ఫోన్ పెట్టేసి నా వైపు చూసి, “ఏమీ అనుకోకమ్మా! చాలా బాగా పాడావు. రికార్డు చేసుకోవాలని వుంది. అందుకే మా అబ్బాయిని రికార్డు ప్లేయరో, మొబైల్ ఫోనో తీసుకు రమ్మని ఫోన్ చేసాను. ఇప్పుడే వస్తాడు. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇదే పాట పాడు.”

ఇది నేనే మాత్రం ఊహించని కాంప్లిమెంటు. నేను తేరుకునే లోగానే పైన పోర్షన్లో వుంటున్న వాళ్ళ కుమారుడూ, కోడలూ వచ్చారు. మొబైల్ ఫోన్లో పాట రికార్డు చేసారు.

తరువాత ఆవిడ మా ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. “ఇద్దరూ ఇలాగే సంగీత సాధన చేస్తూ బిడ్డలని కూడా సంగీతం దారిలో పెట్టండి,” అని ఇద్దరినీ, “దీర్ఘ సుమంగళీ భవ” అని నన్నూ దీవించారు.

మంచం మీద పడుకున్న కుంజుమణి మామి మాత్రం ఒక్కసారి కళ్ళు తెరిచి చూసారు. “మామీ! నేను మురళీని. గుర్తు పట్టారా?” అని అడిగితే, గుర్తున్నావన్నట్టు తలాడించారు.

నేను ఎప్పట్లాగే గోడల మీద ఫోటోలు చూడడంలో నిమగ్నమయ్యాను. ఎన్నెన్నో ఫోటోలు. గత కాలపు వైభవానివీ, సంగీత సరస్వతీ అవతారాలా అనిపించేట్టు  వున్నఅక్క చెళ్ళెల్లిద్దరివీ ఙ్ఞాపకాలు!

“హాయిగా లైట్ లైట్ గా అన్నమాచార్య కీర్తన పాడావు కాబట్టి బ్రతికి పోయావు. అదే ఏ త్యాగరాజ కీర్తనో దీక్షితార్ కృతో అందుకుని వుంటే తెలిసేది! లైను లైనుకీ గమకం సరి పోలేదని నిన్ను నిలబెట్టేవారు,” అని ఉక్రోషంగా మురళీ ఇంటికి వెళ్ళే దారంతా గొణుగుతూనే వున్నారు.

5 thoughts on “గురు సాక్షాత్ పరబ్రహ్మాః

 1. శ్రీమతి శారదగారికి, నమస్కారములు.

  మీ (రి)ద్దరూ అదృష్టవంతులే. సంగీతం సాధన గొప్ప వరం. సంగీతం అనే పదాన్ని “స్వయం + గీతం” అని అనుకున్నామే అనుకోండి. అప్పుడు, స్వయం = నాయొక్క; గీతం= భావాలు, కలిపి, నాయొక్క భావాలు; లేదా, నాలోని భావాలు అని అర్ధం వస్తుంది. నిజంగా చెప్పాలంటే త్యాగరాజాదిగా ఎందరో మహానుభావులు,తమలోని భావాలను పైకి వినిపించినవే ఈ “కృతులు”. కాబట్టి, మనలోని భావాలను, అందంగా ఆలాపించుకోవటమే సంగీతం. అది మన మనస్సుకు ప్రశాంతిని ఇస్తుంది. “మరుగేలరా ఓ రామా…” అనే కీర్తన మన యొక్క “ఆత్మ శోధన”కు సంబంధించినదే. దీనిపై, నేను వ్రాసిన వ్యాసాన్ని( ఆధ్యాత్మికం ) నా బ్లాగ్ లో మీకు వీలుంటే చదవండి.

  భవదీయుడు,
  మాధవరావు.

   • శ్రీమతి శారదగారికి, నమస్కారములు.

    నా బ్లాగ్ చిరునామానూ క్రింద ఇస్తున్నాను. వీలున్నప్పుడు చదివి, మీ అభిర్ప్రయాల్ని తెలియచేయగలరు.

    భవదీయుడు,
    మాధవరావు.

    http://madhavaraopabbaraju.wordpress.com/

 2. శారదగారూ,
  ఎంతో బావుంది మీ సంగీతాభిమానం ! అంతటి మహానుభావుల వద్ద విద్యనభ్యసించిన మీ వారూ, ప్రశంస పొందిన మీరూ ధన్యులే!

  జీవితంలో సంగీతాన్ని ఒక భాగంగా మలుచుకోగలిగిన వారు ఎంతో అదృష్టవంతులు. మీరూ ఆ కోవలో వారే! మనఃపూర్వక అభినందనలు!

 3. చాలా బాగుందండి మీ దంపతుల సంగీతాభిమానం. నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. పాడడానికి గాత్రం లభించండం నిజంగా అదృష్టం. మీశ్రీవారు వేణువు విద్వాంసులా..!! నేను కూడ ఒకప్పుడు వేణువే నేర్చుకున్నాను 1994 నుండి ఓ మూడేళ్ళపాటు..తర్వాత నా వృత్తిలో బిజీ అవడం వలన సాధన చేయలేకపోయాను..ఇప్పటికీ అది నన్ను మదిలో బాదపెడుతూ ఉంటుంది..! నిజంగా అటువంటి గురువుల వద్ద సంగీతవిద్య నభ్యసించడం మీశ్రీవారు ధన్యజీవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s