జూన్ 2010 నాటికి మా అత్త మామలకు పెళ్ళయి సరిగ్గా యాభై సంవత్సరాలు.
ఆ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికే జులై లో ఇక్కణ్ణించి మేమూ, ఇంగ్లండు నించి మా ఆడపడుచూ మద్రాసు చేరుకున్నాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మేమొక చిన్న డిన్నర్ పార్టీ కూడా ఏర్పాటు చేసాము. ఆ పార్టీకి దగ్గరి కుటుంబ సభ్యులూ, స్నేహితులూ హాజరైనారు. చాలా సంతోషంగా గడిచిపోయింది ఆ సాయంత్రం. ఇలాటి సందర్భాల్లో మన వాళ్ళు తప్పకుండా బహుమతులు తెస్తారు. అందుకే మేము ఆహ్వాన పత్రికలో బహుమతులేమీ తేవొద్దనీ, ఒకవేళ తప్పకుండా తేదల్చుకుంటే ఆ డబ్బు “సేవాలయ” అనే స్వచ్చంద సంస్థకి చెక్కుల రూపంలో ఇవ్వవల్సిందనీ అభ్యర్ధించాము. దాదాపు అందరూ మా ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవటం వల్ల సేవాలయ సంస్థకి విరాళాల రూపంలోనే బహుమతులిచ్చారు. ఆ చెక్కులన్నీ తీసుకుని ఒక రోజు నేనూ మా ఆడపడుచూ సేవాలయ ఆశ్రమానికి వెళ్ళాం.
వి.మురళీధరన్ గారు అందర్లానే ఇంజినీరింగ్ పుర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా విదేశల్లో పని చేస్తూ వుండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇంకొంతమంది స్నేహితులతో కలిసి మద్రాసు దగ్గర కసవు అనే పల్లెటూరు లో “సేవాలయ” అనే ఆశ్రమాన్ని తెరిచారు. సేవాలయ గురించి ఇక్కడ చదవండి.
గాంధీ, సుబ్రహ్మణ్య భారతీ, వివేకానంద ల ముగ్గురి ఆలోచనల సమాహారమే ఈ ఆశ్రమం అని చెప్పారు మురళీధరన్ గారు, వారి శ్రీమతి భూవన గారూ.
వాళ్ళ కార్యక్రమాలు-
అ)కసవు, ఇంకా చుట్టు పక్కల పల్లెటూళ్ళలో వుండే పిల్లలకి ఉచిత విద్యా బోధన
ఆ)ఆ విద్యార్థుల్లో అనాథలైన వారికి హాస్టల్ వసతి.
ఇ)విద్యార్థులకోసం రోజూ ఉచితంగా భోజన సదుపాయం.
ఈ) ఆ ఆశ్రమానికి ఆనుకుని వున్న పొలంలో సేద్యం.
ఉ) పిల్లలు నిరాదరించిన వృధ్ధుల కోసం వృధ్ధాశ్రమం.
ఈ ఆశ్రమం నడపటానికి బయటినించి కొన్ని విరాళాలు సేకరిస్తారు. కొంత వారి డబ్బే ఉపయోగిస్తారు. ఆ సంస్థ లో చదువుకున్న విద్యార్థులు మళ్ళీ అదే స్కూల్లో టీచర్లుగా, కంప్యూటర్ అసిస్టెంట్లుగా, ఆఫీసు అసిస్టెంట్లుగా పని చేసి సేవలందిస్తారు. సేద్యం చేసి పండించిన ధాన్యాలని ఆశ్రమ వాసుల కోసం వాడతారు. అలాగే పాల కోసం కొన్ని ఆవులనీ గేదెలనీ పెంచుతారు. కింద ఫోటోలో వున్నది అక్కడే చదువుకుని ఆ ఊరి అబ్బాయిని పెళ్ళాడి అక్కడే టీచరుగా పని చేస్తున్న యువతి.
మేము ఆశ్రమమంతా తిరిగి చూసాము. కార్పొరేట్ స్కూళ్ళంత అందంగా కాకపోయినా, శుభ్రంగా, పేదగా వుంది. పిల్లలు మాత్రం చదువు నేర్చుకుంటున్న ఉత్సాహంతో గట్టిగా తమిళంలో ఎక్కాలు వల్లె వేస్తున్నారు. ఫిజిక్స్ లేబూ, కెమిస్ట్రీ లేబూ, కంప్యూటర్ లేబూ వున్నాయి.
మధ్యాహ్న భోజనం పిల్లలకోసం చేసిందే భువన గారూ, మురళీధరన్ గారూ తింటారు. అదే మాకూ వడ్డించారు.
అన్నిటికంటే అద్భుతమైన దృశ్యాన్ని కంప్యూటర్ లేబ్ లో చూసాను. ఒక పద్దెనిమిది ఇరవై యేళ్ళ అమ్మాయి ఒక పాత కంప్యూటర్ తో ఎందుకో కుస్తీ పడుతుంది. వెలిసిపోయి, పాతదైనా, శుభ్రంగా వున్న చీర, బాగా నూనె రాసి బిగించి అల్లిన జడా, బయటెక్కడైనా చూస్తే పల్లెటూరి పేద అమ్మాయి లాగుంది. కంప్యూటర్ మానిటర్ నించి బోలెడు వైర్లూ, కేబుల్సూ వేళ్ళాడుతున్నాయి. మానిటర్ మీద ఆమెకి కావాల్సినదేదో రావటం లేదు. పెద్ద హాలులాటి లేబ్ లో ఒక మూలన ఉండి ఎంత ఏకాగ్రతతో పని చేసుకుంటుందంటే ఆమెకి ఆ రూంలో ఇంకా చాలా మంది పిల్లలు చేస్తున్న గోలా వినబడటం లేదు, హాల్లోకి ఎవరో అపరిచితులు వచ్చిందీ తెలియటం లేదు.
నుదుటికి పట్టిన చెమట తుడుచుకుని, టేబిల్ కింద జొరబడి ఒక్కొక్క కేబుల్ నీ పరీక్షించింది. ఏవో సవరణలు చేసి బయటికొచ్చింది. కీ బోర్డు మీద టక టక లాడించింది. మానిటర్ వైపు చూసి పెదవి విరిచింది. మళ్ళీ కంప్యూటార్ ఆఫ్ చేసి టేబిల్ కింద జొరబడింది. మళ్ళీ అదే ప్రొసీజరు.
ఈ సారి విజయం! ఆమె అనుకున్నదేదో మానిటర్ స్క్రీన్ మీద వచ్చింది. వెలిగిపోతున్న మొహం తో తల పైకెత్తి “వందాచ్చి” (వచ్చింది) అని జనాంతికంగా అని, కొంచెం దూరంలో ఉన్న నన్ను చూసి సిగ్గు పడి పోయింది. ఆ క్షణంలో ఆ అమ్మాయిని చూసి నేను, భారత దేశం బ్రాహ్మోస్ మిస్సైల్ గురించీ, చంద్రయాన్ ప్రాజెక్టుల గురించి కంటే ఎక్కువ గర్వ పడ్డాను.
ఎంత బతిలాడినా ఒక్క ఫోటో తీయటానికి ఒప్పుకోలేదు, ‘ఒణ్ణూం ఇల్లెంగే!’ అంటూ. ఇప్పటికీ నాకా అమ్మాయిని తలచుకుంటే చెప్పలేని సంతోషం తో పాటు సిగ్గుతో ఎర్రబడిన ఆ అమ్మాయి మొహం తలచుకుంటే నవ్వూ వస్తాయి.
బయటికొచ్చి వృధ్ధాశ్రమానికెళ్ళి అందరినీ పలకరించాము. నేనంటే మొదటి సారి కానీ మా ఆడపడుచు ఇంతకు ముందే వచ్చి వుండటంతో గుర్తు పట్టి మాట్లాడారు. వాళ్ళ దైనందిన కార్యక్రమాల గురించీ, ఏక్టివిటీస్ గురించీ చెప్పారు.
కసవు గ్రామంలో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇటుక బట్టీలుంటాయి. ఆ ఇటుక బట్టీల్లో చిన్న పిల్లల్ని పనిలోకి తీసుకుంటారు. ఆ అలవాటు మానిపించి వాళ్ళని చదువుల వైపు మళ్ళిస్తే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా ఆ పల్లెలంతటికీ మంచి చేయగలరన్నదే వాళ్ళ స్ట్రేటజీ అని చెప్పారు మురళీధరన్.
చివరికి వచ్చేటప్పుడు నా ఫీడ్ బేక్ అడిగారు. పరిసరాల శుభ్రతకి ఇంకా కొంచెం ప్రయత్నాలని ఎక్కువ చేయాలని చెప్పాను. మొత్తం మీద నాకా ఆశ్రమమూ, ఊరికే వాళ్ళకి దాన ధర్మాలు ఇవ్వకుండా చదువు చెప్పిస్తూ వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నమూ చాలా నచ్చాయి.
శ్రీమతి శారదగారికి, నమస్కారములు.
మీ వ్యాసాన్ని చదివాను. ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించవచ్చు అనే నానుడి ఈ వ్యాసం ద్వారా ఋజువవుతున్నది.
భవదీయుడు,
మాధవరావు.
chakkati aalochana. gifts/money vaadestamu. Ila aithe baagaa vuntundi.
cleanliness improve cheyalante inka resources avasaramivundochchu. basic gaa students and old people baagaa sahakarinchalante vaallaki okatiki padisaarlu cheppali. iddari aalochana sthayi /sakti okate kabatti!(?)
mee pillalu vachchara meetho? vaallemannaru? i mean about donating and cleanliness of the area.
కవిత గారూ,
ముందస్తుగా ఇన్ని రోజులూ ఈ వ్యాఖ్య చదవటం మిస్సయినందుకు మన్నించండి. వ్యాఖ్య చూసానేమో కానీ, మీరడిగిన ప్రశ్న మాత్రం నా రాడార్ లోంచి జారి పోయింది.
మా పిల్లలిద్దరూ సేవాలయ చూడటానికి వచ్చారు. మా పెద్దమ్మాయి ఒక మోస్తరుగా, చిన్నమ్మాయి కొంచెం కష్టపడుతూ తమిళం (తెలుగు కూడా) మాట్లాడగలరు కాబట్టి అక్కడ పిల్లలూ, వృధ్ధులతో బాగానే మాట్లాడారు. అలాగే మేము డబ్బు సేకరించి వాళ్ళకి విరాళాలివ్వటం కూడా వాళ్ళకి నచ్చిన విషయమే.
ఇక్కడ ఒక విషయం చెప్తాను. మేము బెంగుళూరులో ఉన్నప్పుడు “నవజీవన” అనే బాలికల అనాథాశ్రమానికి రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. మా అపార్ట్మెంట్స్ లో వుండే వాళ్ళనడిగి పాత బట్టలూ, పుస్తకాలూ, చెప్పులూ వంటివి సేకరించి ఇచ్చేవాళ్ళం. అందుకని మా పెద్దమ్మాయి మధుకి మా కార్యక్రమాలన్నీ చిన్నప్పట్నించీ అలవాటే.
శారద
శారద గారూ, మీ మెయిల్ ఐడీ ఇవ్వగలరా ప్లీజ్! కొంచెం పని ఉంది! ఇక్కడ ఇవ్వలేకపోతే నా బ్లాగులో ఒక కామెంట్ వదలండి! మాడరేషన్ ఉంది.