“గుట్టల కొద్దీ పుస్తకాలు చదువుతావు కదా? ఇన్ని పుస్తకాల్లో నీకు చాలా నచ్చిన పాత్ర ఏది?” అని చాలా యేళ్ళ క్రితం ఒక కజిన్ నన్ను అడిగాడు.తడుముకోకుండా “స్కార్లెట్!” అని చెప్పాను.
“స్కార్లెట్టా”? నమ్మలేనట్టడిగాడు తను.
మొన్నా మధ్య ఇదే ప్రశ్న మా పిల్లలిద్దరూ అడిగారు. మళ్ళీ అదే జవాబు చెప్పాను. వాళ్ళిద్దరూ మార్గరెట్ మిచెల్ రాసిన “గాన్ విత్ ద విండ్” పుస్తకం చదవలేదు కానీ, సినిమా చూసారు. నా జవాబు విని కెవ్వుమన్నారు.
“ఛీ!ఛీ!నాట్ స్కార్లెట్! స్కార్లెట్ అసలు మంచి అమ్మాయే కాదు. మూడు సార్లు పెళ్ళి చేసుకుంది. ఆమె అంటే నీకిష్టమేమిటమ్మా,” అంది పెద్దది మధు. చిన్నది, అనూ అయితే “అందులో చెల్లెలి బాయ్-ఫ్రెండు నే దొంగిలించింది. ఐ హేట్ హర్!” అంది అక్క వైపు అనుమానంగా చూస్తూ! నాకు నవ్వాగలేదు.
ఇద్దరికీ అదే అదునుగా మనుషులని జడ్జ్ చేయటం మంచి అలవాటు కాదనీ, స్కార్లెట్ పాత్రని ఎలా అర్ధం చేసుకోవాలో వివరించాను.
“మనింట్లో పుస్తకం వుందిగా! నేను చదవొచ్చా?” ఆశగా అడిగింది అను. దానికింకా పన్నెండేళ్ళే కావటంతో కొన్ని పుస్తకాలివ్వను. సరే నని పుస్తకం తీసిచ్చి చదివి జాగ్రత్తగా ఇచ్చేయమని హెచ్చరించాను.
స్కార్లెట్ ప్రసక్తీ, “గాన్ విత్ ద విండ్” పుస్తకం ప్రసక్తీ వచ్చినప్పుడల్లా ఇంచుమించు ఇలాటిదే సంభాషణ జరుగుతుంది. ఆ పుస్తకం గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు విన్నాను.
” మిల్స్ ఎండ్ బూన్ ల కంటే కొంచెమే బాగుండే ప్రేమ కథ” అని కొట్టేసిన వాళ్ళూ వున్నారు. నాకైతే చాలా నచ్చటమే కాదు, చాలా ఆలోచించాను కూడా ఆ పుస్తకం గురించి.
నేను చిన్నప్పుడు స్వాతి మాస పత్రికలో వచ్చే మాలతీ చందూర్ గారి “పాత కెరటాలు” శీర్షికని చాలా ఇష్టంగా చదివేదాన్ని. ప్రపంచ సాహిత్యంతో నా పరిచయానికి అక్కడే బీజాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. “అంకుల్ టామ్స్ కేబిన్”, “వదరింగ్ హైట్స్” లాటి పుస్తకాలనీ, వాటిల్లో వుండే పాత్రల్నీ నేనక్కడే కలుసుకున్నాను. హైస్కూల్లో వున్నప్పుడో, కాలేజీలో వున్నప్పుడో (గుర్తు లేదు) ఆ పేజీల్లోనే గాన్ విత్ ద విండ్ గురించి చదివి చాలా ఆకర్షితురాలినైనాను.
ఆ తర్వాత హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లొ ఎమ్మెస్సీ చదువుతుండగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో సమ్మర్ జాబ్ ఏదో చేసాను. ఎండాకాలం సెలవులు కావటంతో హాస్టల్ లో రూం ఖాళీ చేయాల్సొచ్చింది. మా ఇంటికీ, యూనివర్సిటీకి దాదాపు రెండు గంటల పైనే ప్రయాణం. లైబ్రరీలో అనుకోకుండా “గాన్ విత్ ద విండ్” పుస్తకం కనిపించింది. ఇక దాదాపు వారం రోజులు ఇంట్లో బస్సులో ఇంకో మనిషితో మాట్లాడితే ఒట్టు! ఇప్పుడైతే అంత ఏకాగ్రతతో చదివే ఓపికా లేదు, పరిస్థితీ లేదు, అసలంతగా మన మనసుల్ని కట్టి పడేసే పుస్తకాలే కనపడటం లేదు.
అమెరికాలో అట్లాంటా నగరానికి చెందిన మార్గరెట్ మిచెల్ “గాన్ విత్ ద విండ్” రాసారు. 1936 లో రాసిన ఈ పుస్తకానికి 1937 లో పులిట్జర్ పురస్కారం లభించింది. ఈ పుస్తకం ఆధారంగా 1939 లో వచ్చిన సినిమాకి ప్రజలు బ్రహ్మ రథం పట్టటమే కాకుండా పది అకాడమీ అవార్డులని సంపాదించి, వివియన్ లీ నీ ఆకాశానికి ఎగరేసింది.
కథంతా స్కార్లెట్ గురించే. అమెరికాలో పద్దెనిమిది వందల అరవై-డెభ్భైల్లో జరిగిన సివిల్ వార్నీ, మారిపోతున్న పరిస్థితులనీ, చేజారిపోతున్న కలలనీ అన్నిటినీ స్కార్లెట్ కళ్ళతోనే చూస్తాం మనం.
జార్జియా రాష్ట్రంలో టారా అనే ఎస్టేటు యజమాని గెరాల్డ్-ఓ-హారా ముగ్గురు కూతుర్లలో పెద్దది పదిహేనేళ్ళ స్కార్లెట్ -ఓ-హారా. తెలివి తేటలూ, గడుసుతనమూ, అమాయకత్వమూ, అహంకారమూ అన్నీ సమ పాళ్ళలో కలిసిన సెలయేరులాటి అమ్మాయి. అందం కంటే ఆకర్షణ, ఆకర్షణ కంటే ఒక రకమైన జీవ శక్తీ ఎక్కువ ఆమెలో. అయితే చుట్టు పక్కల కౌంటీల్లో ఎక్కడా ఆమెకున్నంత సన్నని నడుం లేదని ప్రతీతి.
స్కార్లెట్ పక్క ఎస్టేటు “ట్వెల్వ్ ఓక్స్” కి చెందిన ఆష్లీ విల్క్స్ ని గాడంగా ప్రేమిస్తుంది. అతనూ తనని ఇష్టపడుతున్నాడనీ, ఏదో ఒక రోజు పెళ్ళి ప్రస్తావన తెస్తాడనీ ఆశ పడుతుంది. స్నేహితులు “ఆష్లీ తన దగ్గరి బంధువైన మెలనీ ని పెళ్ళాడుతున్నాడని” చెప్పటం తో కథ ప్రారంభమవుతుంది. ఆ వార్తతో ఎంతో ఆశా భంగం చెందిన స్కార్లెట్ మర్నాడు “ట్వెల్వ్ ఓక్స్” లో జరగబోయే పెద్ద పార్టీలో ఆష్లీని ఈ విషయమై నిలదీయాలనీ, అవసరమైతే అతనితో లేచి పోవాలనీ నిర్ణయించుకుంటుంది. “ఒక అందమైన గౌను తో ప్రపంచాన్నే గెలవొచ్చు అనే అమాయకపు ఆలోచన తో స్కార్లెట్ నిద్ర పోయింది,” అంటారు రచయిత్రి ఆ సందర్భంలో.
కానీ ఆష్లీ ఆమె ప్రస్తావనని తిరస్కరిస్తాడు. ఆమె జీవ శక్తినీ, సజీవ చైతన్యాన్నీ తట్టుకునే శక్తి తనకి లేదని ఒప్పుకుంటాడు. స్కార్లెట్ పట్టరాని కోపంతో ఆష్లీని నానా మాటలూ తిట్టి చేయి కూడా చేసుకుంటుంది. అక్కడే విశ్రాంతిగా కూర్చున్న రెట్ బట్లర్ ఆమె కప్పుడు పరిచయమౌతాడు. తమ సంభాషణనీ, గొడవనీ చాటుగా విన్నాడని రెట్ పై మండి పడుతుంది స్కార్లెట్.
ఆష్లీ మీదా, అతను పెళ్ళాడబోయే మెలనీ మీదా ఉక్రోషంతో స్కార్లెట్ ఆ రోజు పార్టీలో మెలనీ అన్న చార్ల్స్ హేమిల్టన్ ని ఆకర్షించి పెళ్ళి ప్రస్తావన దాకా తీసికెళ్తుంది. ఆష్లీ చెల్లెలైన ఇండియా కి చార్ల్స్ తో పెళ్ళి చేయాలని పెద్దలందరూ అనుకుంటుంటారు. తను చార్ల్స్ ని పెళ్ళాడితే అటు విల్క్స్ కుటుంబానికీ, ఇటు హేమిల్టన్ కుటుంబానికీ బుధ్ది చెప్పినదాన్నవుతాను, అనుకుంటుంది. ఆ రోజే యుధ్ధం మొదలైనట్టు వర్తలొస్తాయి.
స్కార్లెట్-చార్ల్స్ ల పెళ్ళీ, ఆష్లీ-మెలనీ ల పెళ్ళి వెంట వెంటనే అవుతాయి. యుధ్ధానికి మగవాళ్ళందరూ వెళతారు. యుధ్ధం మొదలు కూడా కాకుండా చార్ల్స్ జబ్బు పడి మరణిస్తాడు. ఒక కొడుకుని కంటుంది (వేడ్ హేమిల్టన్) పదహారేళ్ళకే విధవరాలైన స్కార్లెట్. ఆనాటి సంఘంలో విధవరాళ్ళ ప్రవర్తనా నియమావళి స్కార్లెట్ని ఎంతో అసహనానికి గురి చేస్తుంది.
నానాటికీ నిరాసక్తంగా తయారవుతున్న కూతుర్ని చూసి భయ పడుతుంది తల్లి ఎలెన్. కొద్ది రోజులు మార్పుకై అట్లాంటా నగరానికి పంపిస్తుంది. అక్కడ మెలనీ ఇద్దరూ దూరపు బంధువులతో ఒంటరిగా కలిసి వుందనీ, ఆమెకి తోడుగా వుండటానికి వెళ్ళమనీ చెప్తుంది.
అట్లాంటా లో యుధ్ధాన్ని చాలా దగ్గరగా చూస్తుంది స్కార్లెట్. ఆ యుధ్ధ వాతావరణంలోనే రెట్ తో స్నేహం చేస్తుంది. రెట్ కి ఉరంతా చెడ్డ పేరున్నా స్కార్లెట్ లెక్క చేయదు. అతను తనకోసం తెచ్చే బహుమతులూ, తన పట్ల చూపించే అభిమానమూ, ఆసక్తీ, అతను తన స్వేచ్చా ప్రియత్వాన్ని ప్రోత్సహించటమూ, అన్నీ కలిసి స్కార్లెట్ ని అతనికి దగ్గర చేస్తాయి. యుధ్ధానికి అందరు మగవాళ్ళు వెళ్ళినా రెట్ బట్లర్ వెళ్ళకపోవటం ఊళ్ళో అందరినీ చాలా బాధ పెడుతుంది.
యుధ్ధంలో కాంఫెడరేట్స్ ఓడిపోయి తిరిగి వొస్తున్నారనీ, యూనియన్ ఆర్మీకి వదలటం ఇష్టం లేక ఊళ్ళకి ఊళ్ళూ తగలపెడుతున్నారనీ తెలియగానే స్కార్లెట్ ఒక చిన్న బండిలో అప్పుడే ప్రసవించిన మెలనీనీ, తన కొడుకు వేడ్ నీ తీసుకుని టారాకి బయల్దేరుతుంది. సహాయం చేస్తానన్న రెట్ మధ్యలోనే మనసు మారి యుధ్ధంలోకెళ్ళి పోతాడు.
తన బరువు-బాధ్యతలన్నీ దించుకుందామని ఎంతో ఆశగా ఇల్లు చేరుకున్న స్కార్లెట్ టారాలో పరిస్థితి చూసి కుప్ప కూలి పొతుంది. మరణించిన తల్లీ, తల్లి మరణంతో మతి భ్రమించిన తండ్రీ, ఏమీ తెలియని ఇద్దరు చెల్లెళ్ళూ, విల్క్స్ కుటుంబమూ, ఇందరి బాధ్యతనీ స్కార్లెట్ సణుగుతూనే తలకెత్తుకుంటుంది. ఆ బాధ్యతలు నిలబెట్టుకోవటానికీ, టారాని కాపాడుకోవటానికీ ఆమె కపటోపాయంతో చెల్లెలి ప్రేమికుణ్ణి పెళ్ళాడుతుంది. పెళ్ళయింతరువాత పడిపోతున్న భర్త వ్యాపారాన్ని చేతిలోకి తీసుకొని నిలబెడుతుంది. డబ్బు కొసం, డబ్బు వల్ల వచ్చే భద్రతా భావం కోసం నానా గడ్డీ తింటుంది.
భర్త అనుకోని పోట్లాటలో చనిపోతే రెట్ బట్లర్ ని పెళ్ళాడుతుంది స్కార్లెట్. రెట్ మీద ప్రేమా-ద్వేషమూ కూడిన భావనలతో స్కార్లెట్ తన మనసే తను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. రెట్ మాత్రం ఆమెనీ, ఆమె కోప తాపాలనీ చిన్న పిల్లల ప్రవర్తనలా పరిగణించి నవ్వేస్తూ వుంటాడు. ఆమెకి మానసిక పరిపక్వత కలిగి, తను ఎంతో ప్రేమించేది తన భర్తనే అని తెలిసేసరికి, రెట్ కి స్కార్లెట్ మీద మనసు విరిగి పోతుంది. తనకెంతో ఆప్తురాలైన మెలనీ మరణంతో విచలితురాలైన స్కార్లెట్ ఇంటికొచ్చేసరికి ఆమెని వదిలేసి వెళ్ళటానికి సిధ్ధంగా వున్న రెట్ కనిపిస్తాడు.
“My dear, I don’t give a damn,” అన్న మాటలతో ఆమెని వదిలి తలుపు తెరుచుకుని వెళ్తాడు రెట్.
“రేపు, రేపు దీన్ని గురించి ఆలోచిస్తాను, ఇప్పుడు కాదు. రెట్ తిరిగి నా దగ్గరకి రాక తప్పదు. Tomorrow is another day” అనుకుంటుంది స్కార్లెట్.
ఈ పుస్తకమంతా స్కార్లెట్ విశ్వ రూపం. పదిహేనేళ్ళ అమాయకత్వం నించి, వ్యాపారం నడిపే గడుసుతనం వరకూ ఆమె వ్యక్తిత్వాన్నీ అన్ని రంగుల్లో చూస్తాం. ఆశా భంగం, కోపం, ఒక రకమైన మేనిప్యులేటివ్ నెస్సూ, స్త్రీ సహజమైన వన్నెలూ, ఎవరినీ లెక్క చేయని స్వేచ్చా ప్రియత్వమూ, అన్ని రంగులతో స్కార్లెట్ చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఆమె చేసే పనులూ, ఆమె ఆలోచనలూ చిరాకనిపించినా ఆమెని అసహ్యించుకోలేం. అన్నిటికంటే ఎన్ని సార్లు కిందపడ్డా పైకి లేచే ఆమె ధైర్యాన్నీ, ఎంత దుఃఖంలోనైనా బాధ్యతలనించి తప్పించుకోని ఆమె నిజాయితీని అభినందించకుండా వుండలేం! అందుకే ఈ కథలో సివిల్ వారూ, నీగ్రోల హక్కులూ, దక్షిణ అమెరికాలోని ప్లాంటేషన్లలో తీరికా, డబ్బుతో కూడిన జీవితమూ, అవన్నీ కరిగిపోవటమూ, ఇవన్నీ వున్నా, అంతా స్కార్లెట్ గురించే!
స్కార్లెట్ పాత్రకీ, రెట్ పాత్రకీ ఆధారమైన వారెవరై వుంటారా అన్న విషయం మీద చాలా పరిశోధన జరిగింది. చాలా మంది మార్గరెట్ మిచెల్ కొంతా, ఆవిడ అమ్మమ్మగారైన ఆన్ స్టిఫెన్స్ కొంతా కలిసి స్కార్లెట్ గా అవతరించి వుండొచ్చు అని ఊహించారు.
దీనికి సీక్వెల్ రాయమంటే రాయనన్నారు మిచెల్. ఆమె ఇంకే పుస్తకాలూ రాయలేదు.
” గాన్ విత్ ద విండ్” సినిమా గురించి రాస్తే అది మళ్ళీ ఇంత వ్యాసమవుతుంది! ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తాను.
ఆ సినిమాలో క్లార్క్ గేబిల్ షర్టు బటన్లు తీసేసి కనిపిస్తాడొక సీనులో. లోపల బనీను (వెస్ట్) లేని అతన్ని చూసింతరువాత ఆ సంవత్సరం అమెరికాలో వెస్ట్ ల అమ్మకం బాగా పడిపోయిందట. ఇందులో నిజమెంతో ఆ దేవుడికే తెలియాలి!
————————
నాకు కూడా స్కార్లెట్ అంటే చాలా ఇష్టం. ఆమె నిర్భీతి , తాను నమ్మిందే చేసే ఆ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తుతుంది.
మీరు గాన్ విత్ దివిండ్ గురించి కూడా రాయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నమండీ…
చివరి జోక్ మాత్రం నాకు తెలియదు.
కల్పనా,
స్కార్లెట్ మాత్రమే కాదు, కొంచెం మానసికంగా బలంగా ఉండే పాత్రలేవైనా ఆకర్షణీయంగానే వుంటాయేమో. పగతో రగిలిపోయే హీత్ క్లిఫ్ అయినా, అసలు కథలో తను బ్రతికి లేకపోయినా నవలనంతటినీ శాసించే రెబెక్కా అయినా, ప్రేమలోని ఇంటెన్సిటీతో చచ్చిపోయిన దేవదాసైనా మనకందుకే నచ్చుతారనుకుంటా.
మీరంటుంటే రాయాలనే అనిపిస్తుంది, గాన్ విత్ ది విండ్ సినిమా మాత్రమే కాదు, ఆఫ్ హ్యూమన్ బాండేజ్ గురించీ, రేజర్స్ ఎడ్జ్ గురించీ, మూన్ ఎండ్ ది సిక్స్ పెన్స్ గురించీ, డాఫ్నీ డ్యు మారియర్ గురించీ….
The list goes on – Wishful thinking 🙂
ధన్యవాదాలు
శారద
Madam!
I came to know your blog, only today! Pardon me. I’ve not yet read your post. Pardon me, again!
I write this comment completely out of selfish reason. No, I’m not asking you to write to http://pustakam.net because I’m involved in it. I request you to write to it, because it is for book lovers.. people who genuinely love to read and love to talk about what they read.
We’d be glad, if you join us. Otherwise too, we’d be glad to keep reading about what you read.
If you feel like, you may drop an email either at purnima.tammireddy@gmail.com or editor@pustakam.net
Apologies for any intrusions. 🙂
Regards,
Purnima
పూర్ణిమ గారూ,
మీకు నేను తెలియకపోయినా, నాకు మీరు బాగా తెలుసండీ:) మీ పుస్తకం సైటు చూస్తూ వుండటం వల్ల.
నా బ్లాగు చూసినందుకు ధన్య వాదాలు 🙂 and no, it is not an intrusion at all.
Rest I have sent in an email to you.
regards
శారద
Email? I didn’t get any! Also, I subscribed to the comments of this post. Didn’t get that notification too. Something’s fishy!
శారద గారు,
నేను కూడా చిన్నప్పుడు ఈ పుస్తకం చదివి ఇలానే ఇంప్రెస్స్ అయ్యాను. సినిమా చూసి వచ్చాక అర్థం కావడం కోసం పుస్తకాన్ని చదివాను. మొదలుపెట్టాక కింద పెడితే ఒట్టు. మా అమ్మతో చివాట్లు తిన్నా లెక్క చెయ్యకుండా పుస్తకం చదివాను. నాకు కూడా స్కార్లెట్ అంటే చాలా ఇష్టం. తను లేకపోతె టారాలో ఎవరూ కూడా దానిని రక్షింపలేక పోయేవారు. ఇప్పటికీ ఆ సినిమా వస్తే వివియన్లీ ని చూస్తూ మైమరిచిపోతూ వుంటాను. ఒక మాయాబజారు సినిమా లాగా ఈ సినిమా, పుస్తకం అలా మనసును దోచేసుకుంటాయి. చాలా బాగా రాశారు. ధన్యవాదాలు.
చాలా విపులంగా వివరిమ్చారు ” గాన్ విత్ ద విండ్ ” నవల గురించి. ఇక ఈ సినిమా నా లైబ్రరరీలో ఉన్నది చూసాను కూడ. మాలతీ చందూర్ గారి ” పాతకెరటాలు ” ఇప్పటికీ అందరినీ ఆలరిస్తూ ఉన్నది..వారి చలువ వలన ప్రపంచ సీరియస్ నవలా రచయతలను, వారి నవలలు తెలుసుకోగలుగుతున్నాము..ముఖ్యంగా నాలాంటి వారికి.
పైన కొందరి వ్యాఖ్యానాలు చూసాక నాకో విషయం అర్థమైనది.. ఒక స్త్రీ హృదయాన్ని మరో స్త్రీనే కరెక్ట్ గా ఆవిష్కరించగలదు అన్న నానుడికి పైన మరికొందరు రాసిన వ్యాక్యానాలే నిదర్శనం అనుకుంటాను. మగరచయతల నవలలో స్త్రీ పాత్రలన్ని మగవాడి పర్సప్షన్లోనే ఉంటాయి. అంటే మగవాడు తనకు ఎలా ఉంటే బాగుంటుందో..తనకు నచ్చే విదంగానే స్త్రీ పాత్రని సృష్టిస్తాడు. అక్కడ సరైనా స్త్రీ అంతరంగం కనపడదు..!రచయత్రి రచనలోనే వారి వారి సరైన మనోభావాలు కనపడతాయి, దానికి ఉదాహరణె ఇక్కడి కొన్ని వ్యాక్యానాలనిపిస్తుంది.
మీరన్నది చాలా వరకు నిజమేనండి. చాలా వరకు మగవారు ఆడవాళ్ళని గురించి రాసేటప్పుడు ఒక రకమైన wishful thinking తో రాస్తారు. ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తారో అనేకన్నా, ఏం ఆలోచిస్తే వాళ్ళకు నచ్చుతుందో అన్న perspective లోనే వుంటాయి.
మీరెప్పుడైనా ఏ హీరోయినైనా (సినిమాలో కానీ కథలో కానీ నవలలో కానీయండి, ఆఖరికి బ్లాగుల్లో కానీయండి) ఫిజిక్స్ లేబులోనో, కెమిస్ట్రీ లేబు లోనో, మేథమేటీక్స్ ఒలింపియాడ్ లోనో పరిచయం కావటం చూసారా? చూసివుండరు. ఎప్పుడూ హీరోయిన్ మల్లె మొగ్గలు కోస్తూనో, మాలలు కడుతూనో, ఇంటి ముందు వాకిట్లో తెల వారు జామున ముగ్గులేస్తూనో, పప్పు రుబ్బుతూనో, ముగ్ధలా లంగా ఓణీల్లో, జడనిండా మల్లెపూలతో గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూనో పరిచయం అవుతారు. (ఇంకే సెట్టింగ్ లోనైనా హీరోయిన్ కనిపిస్తే నాకు చెప్పండి :)) ఎందుకంటే ఆడవాళ్ళు (ముఖ్యంగా ప్రేమించతగ్గ అలాటీ సెట్టింగ్‌లో వుంటేనే మగ వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి. Perhaps it makes them feel secure, I don’t know. అందుకే మీరన్నట్టు చాలావరకు ఆడవాళ్ళ అంత రంగాల గురించి రచయిత్రులే కొంచెం బాగా రాయగలరు. అయితే మళ్ళీ అది “నిజంగా వాళ్ళ అంతరంగాలని చూపిస్తే మగవాళ్ళ నించి ఆదరణ ఎక్కువగా వుండదు.” చాలా జనాదరణ పొందాలంటే చాలా వరకు ఇలాటి ముగ్ధలని సృష్టించటమే దారి.
Sarada garu,
dayachesi Malathichandur ( patha keratalu) gari la english novel parichayalu cheyandi. enduko na anthata naaku chadavabuddigadu. visleshatapoorvaka vyasam la baavuntunyi. eenela mee vyasam kosam eduruchoostu
కవిత గారూ,
తప్పకుండానండి! ఇప్పటికే పరిచయం చేయ తగ్గ ఇంగ్లీషు పుస్తకాలు చాలానే వున్నాయి. వీలైనతవరకూ నాకు నచ్చిన పుస్తకాల గురించి ఆలోచనలు పంచుకోవాలనే ఆశ.
కిందటి వారం నా లేప్ టాప్ కూడా రిపేరయి వచ్చింది కాబట్టి ఇంకొంచెం తరచుగానే రాయగలననే అనుకుంటున్నాను.
మీ అభిమానానికి కృతఙ్ఞతలు
శారద
I came to know about your blog today through article in Vasundhara (Eenadu). You are doing really great work for Telugu Literature. My heart congratulations to you. Wishing you all the best.
keep it up truly good i impressed carry on
all the best