2003 జనవరి ఇరవై
“అమ్మా! ఏం చేస్తున్నావ్?” నాలుగన్నరేళ్ళ అను అడిగింది.
“వచ్చే వారం స్కూలు తెరుస్తున్నారు కదా? అక్క యూనిఫాం, స్కూల్ బాగూ అన్ని రెడీ చేస్తున్నాను.”
“నా ముయిఫాం ఏది మరీ? నేను కూడా చైల్డ్ కేర్ వదిలేసి స్కూల్ కెళతా!”
“ముయిఫాం కాదమ్మా! యూనిఫాం. నువ్వు స్కూలు కెళ్ళాలంటే ఇంకా ఆరు నెలలాగాలి. జూన్ లో నీ పుట్టినరోజు అవుతుంది కదా? అప్పుడు నువ్వు కూడా స్కూల్ కెళ్ళొచ్చు.”
(ఇక్కడ అకడెమిక్ సంవత్సరం జనవరి ఆఖరి వారం నించి డిసెంబరు మొదటి వారం వరకూ వుంటుంది. అయిదేళ్ళు నిండిన పిల్లలనే స్కూల్లో చేర్చుకుంటారు. జూన్ లోపల ఎప్పుడు అయిదేళ్ళూ నిండినా స్కూల్ కి పంపొచ్చు. జూన్ తరువాత అయిదేళ్ళు నిండితే మాత్రం వచ్చే జనవరి వరకూ ఆగాల్సి వుంటుంది. అదృష్టవశాత్తూ మా అమ్మాయి సరిగ్గా జూన్ నాలుగున పుట్టటం తో ఇవతల పడింది. లేదంటే ఇంకో ఆరు నెలలు నన్ను కాల్చుకు తినేది!)
పెద్ద పెట్టున ఏడుపు లంకించుకుంది. “నేనూ అక్కతో స్కూలు కెళతా” అంటూ. ఓపిగ్గా సముదాయించాను. వినలేదు. ఉన్నట్టుండి నా మీద అభియోగాలతో సిధ్ధమయింది.
“యూ డోంట్ లవ్ మీ! డు యూ? యూ లవ్ మధూ మోర్ దెన్ మీ, డోంట్ యూ? యూ borned హెర్ బిఫోర్ మీ! షీ గోస్ టు స్కూల్. ఎవిరీబడీ గోస్ టు స్కూల్.వై డిడ్ యూ born మీ సో లేట్? ఈ కాంట్ గో టు స్కూల్”, అంటూ లబ లబ మంటున్న దాని మాటలకి ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్నా. ఆ ఎండాకాలం మా ఊరొచ్చిన మా అమ్మయితే దాని మాటలకి పగలబడి నవ్వింది. “దీనికిన్ని మాటలొచ్చే! దాని ఇంగ్లీషు వినవే!” అంటూ.
అన్నట్టు borned అన్న మాటకి అర్ధమేమిటని నన్ను అడగొద్దు! అది తనే కనిపెట్టిన కొత్త పదం. దాని ఉద్దేశ్యం కనటం అన్న మాట. (అలా పిల్లల చేత కని పెట్టబడిన మాటలు మా ఇంట్లో చాలానే వాడుకలో వున్నాయి. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?)
“అమ్మా! షాపింగ్ లిస్టు నేను రాయనా?” ఉత్సాహంగా అడిగింది.
“సరే రాయి.”
“టెల్ మీ!”
“ముందుగా బ్రెడ్డు, తర్వాత butter.”
“బ్రె-డ్, బ-ట్ట. రాసేసాను. వాట్ నెక్స్ట్?”
“రాసావా? ఏదీ చూపించు?”
పేపరు అందుకుని చూసాను.
brd, bt అని రాసుంది.
ఇప్పటికీ దాని మాటలూ, దాని అమాయకత్వం, చిలిపి చేష్టలూ తలచుకుంటే నవ్వొస్తుంది నాకు. నిన్న కాక మొన్న జరిగినట్టుంది.
అప్పుడే ఏడేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు అను పన్నెండేళ్ళ “రచయిత్రి”!
నిన్న రాత్రి ప్రైమరీ స్కూల్ గ్రేడ్యుఏషన్!
ఇంకా “అమ్మా! ఇవాళ అప్పా ఊళ్ళో లేరుగా? నీకు భయమేస్తుంది. నీ దగ్గర పడుకోనా?” అని అడిగే అను వచ్చే జనవరి నించి ఎనిమిదో తరగతి!
కాలం ఇంత వేగంగా ప్రవహిస్తుందెందుకు?
ఈ ప్రశ్న వేసుకోవల్సిన సందర్భాలింకా ముందు ముందు ఎన్నో వున్నాయి!
పిల్లలు యూనివర్సిటీ ముగించినప్పుడూ ఇంకా అదృష్టమూ, భగవత్కృపా కలిసొచ్చి వాళ్ళ జీవితాల్లో milestones సునాయాసంగా చేరుకున్నాప్పుడూ, బోలెడన్ని సందర్భాల్లో ఇదే ప్రశ్న వేసుకుంటామేమో..
“కాలం ఇంత వేగంగా ప్రవహిస్తుందెందుకు?”
In front is crocodile’s festival…
I know!
చిన్నప్పటి ముచ్చట్లు భలే ఉన్నై. పిల్లల్తో ఇదే పేద్ధ ఇబ్బంది. చూస్తూ చూత్సూనే పెద్దవాళ్ళైపోతారు 🙂
same pinch…:)