పేజీల్లోంచి తెర పైకి

(గాన్ విత్ ద విండ్ – II )

చాలా సార్లు గొప్పగా వున్న పుస్తకం తెరపైన అంత గొప్పగా రాదు. లేదా, పుస్తకం లో గొప్పగా అనిపించిన పాత్ర తెర పైన పేలవంగా తేలిపోతుంది. దీనికి చాలా కారణాలుండొచ్చు. అన్నిటికంటే బలమైన కారణం, నవల ఎంత పెద్దగా వున్నా ఫరవాలేదు. సినిమా అలా కాదు, రెండూ రెండున్నర గంటల్లోనే ఎంత పెద్ద కథ ఐనా చెప్పి ముగించాలి.  నవలలో రచయిత తన భావావేశాన్నీ, ఊహలనీ రంగరించి ఒక చిత్రపటాన్ని మనముందు ఆవిష్కరించాలనుకుంటాడు. ఇదే చిత్ర పటాన్ని యథా తధంగా ఆవిష్కరించాలంటే నటీ నటులకీ, దర్శకుడికీ కొంచెం కత్తి మీద సామన్న మాటే మరి.

అలాగే రచయిత చాలా ప్రేమతో ఒక పాత్రని తీర్చి దిద్దొచ్చు. కానీ తెర మీద సంగీతమూ, ఫోటోగ్రఫీ, ఇతర పాత్ర ధారులూ ఆ ముఖ్యమైన పాత్ర మీదినించి మన దృష్టి మరల్చ వచ్చు. అప్పుడు రచయిత ఊహించినట్టు ఆ పాత్ర తెర మీదకి రాదు. హేరీ పాటర్ సినిమాలు ఇందుకు మంచి ఉదాహరణ. పాటర్ పాత్రధారి పేలవమైన నటనతో ఆ సినిమాలో హేరీ పాటర్ తప్ప అందరూ బాగానే అనిపించి రచయిత్రికీ నవల(ల)కీ గొప్ప అన్యాయం చేసేస్తారు.

నవలకి దీటుగా నిలబడి ప్రజాభిమానాన్ని పొందిన సినిమా భారతీయ భాషల్లో “దేవదాసు”  కావొచ్చు. ఆంగ్ల సాహిత్యం, సినిమా చరిత్రల్లో అలాటి పేరు ప్రఖ్యాతులు పొందినవే “గాన్ విత్ ద విండ్” నవలా, సినిమా.

నవల రాసింది 1936 లో అయితే సినిమాని డేవిడ్-ఓ-సెల్జ్నిక్ 1939 లో నిర్మించారు. పది అకాడమీ అవార్డులతో, ప్రపంచంలోని వంద అత్యుత్తమైన చిత్రాలలో ఎప్పటికీ వుండే చిత్రంగా (Time less classic) పేరు పొందింది. “ది మేకింగ్ ఆఫ్ గాన్ విత్ ద విండ్” అనే పుస్తకమే రాసారంటే ఈ సినిమా ఎంత విజయవంతమైందో ఊహించుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ సినిమా సాధించినన్ని లాభాలు ఇంతవరకూ ఏ చిత్రమూ సాధించలేదని హాలీవుడ్ సినీ ప్రముఖులంటారు.

సిడ్నీ హోవార్డ్ స్క్రీన్ ప్లే తో విక్టర్ ఫ్లెమింగ్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా వుంటుందంటే నవలలోంచి తీసేసిన భాగాలు మనకు గుర్తుకు కూడా రావు!ఇంతకీ మొదలు హౌఆర్డ్ రాసిన స్క్రీన్ ప్లే విక్టర్ కి నచ్చలేదట! అందుకని డేవిడ్, విక్టర్ ఇంకా బెన్ హెక్ట్ అనే రచయితా మళ్ళీ స్క్రీన్ ప్లే రాసారట.

మూడు గంటలకి పైగానే నడిచే ఈ సినిమాని అప్పట్లో చాలా పెద్ద సినిమా అని చెప్పు కునేవారు.  ఈ సినిమా మూల కథ కోసం ఇక్కడ చూడండి.

నాకైతే ఈ సినిమాలో అన్నిటికంటే నచ్చింది వివియన్ లీ! ఆమె స్కార్లెట్ పాత్రకి వందకంటే ఎక్కువ శాతమే న్యాయం చేకూర్చింది.

ఈ సినిమా గురించి చాలా విశేషాలే వాడుకలో వున్నాయి. ఈ సినిమా హీరోయిన్ పాత్ర కొరకు చాలా మంది నటీమణులు (బెట్టీ డేవీస్ తో సహా) పోటీపడ్డారు. అసలు సినిమాకి హీరోయిన్ నిర్ణయించుకోకుండానే షూటింగ్ మొదలైపోయిందిట. డేవిడ్ కి మొదట వివియన్ నచ్చలేదు.  అయినా లెక్క చేయకుండా ఆమె ఏజెంటు అట్లాంటా దహనం షూట్ చేస్తున్న స్థలానికి  ఆమెని తీసికెళ్ళారు. విక్టర్ ఆమెని చూసీ చూడగానే “ఆమె ఆకుపచ్చ కళ్ళని చూసి, ఎన్నాళ్ళకు నాకు స్కార్లెట్ కనిపించింది” అనుకున్నాను అని చెప్పారు.

నిజంగానే వివియన్ అద్భుతంగా నటించింది. ఒక్క క్షణం కుదురుగా వుండలేని కళ్ళూ, కాళ్ళూ, సొట్టలు పడే బుగ్గలతో పిచ్చి అందంగా వుంది వివియన్. ఆమెకి ఈ సినిమాకి ఆస్కార్ కూడా లభించింది.

(పిడకల వేట 1: ఈ సినిమాలో కంటే “A streetcar named desire” (1951) లో వివియన్ చాలా గొప్పగా నటించింది. కొద్ది రోజుల వరకూ మరిచిపోలేము! ఆ సినిమా చాలా గొప్ప సినిమా. కేవలం నలుపు తెలుపుల లైటింగ్ తో ఎలియా కజాన్ ఎంత టెన్షన్ తీసుకొస్తాడంటే చూస్తేనే తెలుస్తుంది.)

 ఈ సినిమాతో ఆడవాళ్ళందరి గుండెలనీ కొల్లగొట్టిన అందగాడు క్లార్క్ గేబుల్! వెటకారపు నవ్వుతో, అందంగా వెనక్కి దువ్విన జుట్టుతో, సన్నని కోర మిసపు కట్టుతో, రెట్ బట్లర్ ని మన ముందు సాక్షాత్కరింప చేసాడు. ఆయనకి ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ ఆక్టర్ నామినేషన్ లభించింది.

 కథంతా రెట్-స్కార్లెట్ల ప్రేమ కథే అనిపించటానిక్కాబోలు, స్కార్లెట్ కి తన ఇతర భర్తలతో కలిగిన సంతానం ఈ సినిమాలో కనిపించరు.

 “నేను నటించిన అన్ని పాత్రల్లోకీ ఏష్లీ అంటే నాకసహ్యం” అన్నారు, ఆ పాత్ర ధారి లెస్లీ హొవార్డ్. అది కొంచెం విచిత్రమే! ఎందుకంటే ఆయన ఈ పాత్రకి అతికినట్టు సరిపోయారు. ఏష్లీ లాగే లెస్లీ చాలా సౌమ్యుడూ, సున్నితంగా అనిపించే అందగాడు (నా ఉద్దేశ్యం లో).

(పిడకల వేట 2: లెస్లీ హొవార్డ్ ఇంకా అతికినట్టు పాత్రకి నప్పిన చిత్రం- “Of Human Bondage”. ఆ సినిమాలో పాత్రధారులు, లెస్లీ హౌఆర్డ్, బెట్టీ డేవీస్ ల గురించి ముందు ముందు చదువుదాం.)

 

నవలలో రెట్ ఆఖరికి, “My dear, I don’t give a damn” అని చెప్పి తలుపు తెరుచుకుని మంచులోకి నడిచి వెళ్ళిపోతాడు. దీన్నీ సినిమాలో కొంచెం మార్చారు. Frankly my dear, I don’t give a damn అంటాడు గేబుల్ తన ట్రేడ్ మార్కు వెటకారపు చిరు నవ్వుతో.

 పోతే damn అన్న మాటున్నందుకు  ఆ రోజుల్లో చాలా మంది అభ్యంతరాలు లేవదీసారట. భగవంతుడి దయ వల్ల వాళ్ళీ రోజు బ్రతికి లేరు. లేకుంటే మన హీరోయిన్లు ఎంతో సాఫిస్టికేటేడ్ గా బట్టలేసుకుని (లేదా విప్పదీసీ- రెండూ ఒకటే!) నోరు తెరిస్తే “దొబ్బేయ్ చెత్త నా కొడకా” అనటం వింటే ఉరి పోసుకుని చచ్చే వాళ్ళు!

5 thoughts on “పేజీల్లోంచి తెర పైకి

  1. బాగుందండి మీ గమనిక. నేను రూట్స్ సినిమా చూచి కొంచం డిసప్పాయింట్ ఆయ్యాను. నామటుకు నాకు నా ఊహలో కుంటే లాగా ఉన్న కుంటే పాత్రధారి సినిమాలో కనిపించలేదు.”గాన్ విత్ ద విండ్” సినిమా, నవల రెండూ కలిపికన్నా విడి విడి గా నే ఎక్కువ ఆనందించాను.

  2. బాగుంది. నవల చదివే సాహసం ఇంకా చెయ్యలేదు. కానీ సినిమాని ఫిలడెల్ఫియాలో పెద్ద తెరమీద చూసే అవకాశం దక్కింది. ఈ సినిమా పాత్ర ధారుల గురించి నేను విన్న ఒక విషయం – ముఖ్య స్త్రీప్రాత్రలు రెండు సంపాదించేటందుకు ఆ ఇద్దరు నటీమణులు తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించారుట. రెండు మగ పాత్రలకీ గేబుల్‌నీ హోవర్ద్‌నీ మెడలు వంచి ఒప్పించారుట. చేసిన తరవాత కూడా వారిద్దరూ ఆ సినిమాగురించి ఎక్కువ మాట్లాడేవారు కాదుట.

  3. పాతకెరటాల్లో మాలతీచందూర్ గారి వ్యాసం చదవటమేనండి. ఈ సినిమా కొన్నాకానీ చూడటమ్ కుదరలేదు. ఇప్పుడైనా చూడాలి. ఈ నవల గురింఛి మీఋ రాసిన టపా కూడా చూశాను.బాగా రాసారు.

    నవతరంగంలో మీరు రాసిన నమ్కీన్ చిత్ర సమీక్ష నాకు బాగా నచ్చేసింది. ఆ తరువాత నేను రాసిన “రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్” సినిమాకు మీరు కామెంట్ రాసినప్పుడు మీ బ్లాగ్ మొదటిసారి చూశాను. చాలా చాలా నచ్చేసింది. వీలైనప్పుడలా మీ పాతటపాలు చదువుతున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s