సూత్రం

“జీవితమే ఒక నాటక రంగం” అన్నారొక మహా కవి.

నిజమేనేమో! నాటకంలోని పాత్రలలా మనలనందరినీ కలిపి ముడివేసే “సూత్రం” ఏదైనా వుందా? చాలా సార్లు మన జీవితాల్లో జరిగే సంఘటనలని విశ్లేషించుకుంటే మనందరికీ కలిగే సందేహమే ఇది. ఇద్దరు ఏమాత్రం ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళూ, ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళూ అయిన వ్యక్తులని ఏదో ఒక చిన్న సంఘటన ఒకే తుఫానులోకి నెట్టటం వినటానికి ఎంత విచిత్రంగా వున్నా చాలా సార్లు జరిగే విషయమే. ఈ విషయాన్నే దృశ్య కావ్యంగా మలచారు నాగేశ్ కుకునూర్, “డోర్” అన్న సినిమాలో.

ఒక హీరోని దృష్టిలో పెట్టుకునీ, ఆయన అభిమానులనీ,ఆ హీరోకున్న మెగాలోమేనియానీ, ప్రేక్షకుల వోయెరెస్టిక్ ఆశలనీ మాత్రమే సంతృప్తి పరచటానికి సినిమాలు వచ్చే వాతావరణంలో వున్నాం మనం. (మన సినిమాలకి పై మూడూ కాక ఇంకే విధమైన పర్పస్ వున్నట్టు నాకైతే అనిపించదు.)
పై మూడూ కాకుండా మానవ సంబంధాలలోని క్లిష్టతనూ, అందులో కొన్ని సార్లు ఉండే నిస్సహాయతనూ ఎలెవేట్ చేసే కథను నమ్ముకుంటే ఎంతో సున్నితంగా సినిమా తీయొచ్చు. కుకునూర్ ఇంతకు ముందే అలాటి సినిమాలు తీసారు. “ఇక్బాల్” సినిమా గురించి విన్నాక “అబ్బా! మొన్నేగా లగాన్ చూసాం. మళ్ళీ క్రికెట్ గురించి ఇంకో సినిమానా? మన సినిమా వాళ్ళకి ఏ పిచ్చి పడితే ఇక అదే!” అనుకున్నాను. కానీ “ఇక్బాల్” సినిమా చూసాక నాకు చాలా నచ్చింది. ఆ మంచి అభిప్రాయంతోటే మొన్న లైబ్రరీలో “డోర్” సినిమా కనపడితే తీసుకున్నాను. నిజంగానే నన్ను ఈ సినిమా కూడా నిరాశ పరచలేదు.
హిమాచల్ ప్రదేశ్ లోని ముస్లిం యువతి జీనత్ (గుల్ పనాంగ్), రాజస్థాన్ లోని హిందూ యువతి మీరా (అయేషా టకియా) ఏ మాత్రమూ ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళు.  ఇద్దరూ నూతన వధువులే. జీనత్ ఆధునిక భావాలు కలిగి స్వతంత్రంగా బ్రతికే యువతి అయితే, మీరా అత్త మామల చాటు అమాయకురాలు.జీనత్ భర్త ఆమిర్, మీరా భర్త శంకర్ సౌదీ అరేబియా లో ఉద్యోగం చేయటానికి బయల్దేరతారు. దురదృష్టవశాత్తూ శంకర్ ఒక చిన్న సంఘటనలో మరణిస్తాడు. ఆ నేరం ఆమిర్ పై మోప బడుతుంది. అక్కడి ప్రభుత్వం అతనికి మరణ దండన విధిస్తుంది. ఆ వార్త విని అటు మీరా, ఇటు జీనత్ కుప్ప కూలి పోతారు. అయితే, మృతుడి విధవరాలు గనక క్షమిస్తే ఆమిర్ కి మరణ దండన తప్పుతుంది. ఈ విషయం తెలుసుకున్న జీనత్ మీరాని వెతికి క్షమార్పణ పత్రాలపై ఆమె సంతకం తీసుకొస్తానని రాజస్థాన్ బయలుదేరుతుంది. ఆ ప్రయాణంలో ఆమెకి తారసపడతాడు ఒక వీధి నాటకాల్లో వేషాలు వేసే విదూషకుడు (శ్రేయస్ తల్పాడే). విధవ రాలిగా దుర్భర జీవితాన్ని గడుపుతున్న మీరాని అతి కష్టం మీద ఆచూకీ తీసి కలుసుకుంటుంది జీనత్. కానీ మీరాతో సంగతంతా చెప్పే ధైర్యం చేయలేకపోతుంది. వాళ్ళిద్దరి భవిష్యత్తూ ఏమయిందన్నదే మిగతా కథ.

ముందుగా చెప్పుకోవాల్సింది కథా, స్క్రీన్ ప్లే గురించి. ఆడవాళ్ళ గురించి ఇంత ఎమోషనల్ కథ రాసేటప్పుడు కొంచెం ఎక్కువ డ్రెమటైజేషనూ (నాటకీయత), నటీ నటుల నుంచి వచ్చే ఓవర్ యాక్షనూ వంటి ప్రమాదాలుంటాయి. కానీ ఎక్కడా అతి చేయకుండా సినిమా అంతా మనసుకి హత్తుకునేలా వుందంటే, అది కేవలం స్క్రీన్ ప్లే గొప్పతనమూ, దర్శకుడి ప్రతిభా, నటీ నటుల సహకారం! కథలో మొదటి భాగం చాలా త్వర త్వరగా సాగుతూ రెండో సగంలో వచ్చే ఎమోషనల్ డ్రామాకీ రంగాన్ని సిధ్ధం చేసుకుంటుంది.
రెండో భాగం తీరికగా ఇద్దరు యువతుల స్నేహాన్నీ, వాళ్ళిద్దరి మధ్యా మారుతూ వచ్చే సంబంధాన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. మేకప్పు ఎక్కువగా లేకుండా అమాయకంగా కనిపిస్తూ ఎంతో పరిణతి కలిగిన యువతిలా బాగా నటించారు అయేషా. గుల్ పనాంగ్ కుడా ఆ పాత్రకు ఉండల్సిన ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ని తెర పైకి చక్కగా తీసుకొచ్చారు.  “నీ భర్త చనిపోయి నువ్వు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నావు. అందుకు కారణమైన నా భర్తని క్షమిస్తావా?” అని అడగటం ఎంత కష్టమైన విషయం! అదీ ఒక సెన్సిటివ్ మనిషికి! ఆ మానసిక సంఘర్షణ చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేసారావిడ. కథకి కెటలిస్ట్ గా పనికొచ్చి చక్కటి నటన చూపారు శ్రేయస్. (అతను “ఇక్బాల్”, “వెల్కం టు సజ్జంపూర్” చిత్రాల్లో కూడా చాలా బాగా నటించారు, కాబట్టి అందులో వింతేమీ లేదు!) అన్నట్టు నెగెటివ్ చాయలున్న ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు నగేశ్ కుకునూర్. ఈ సినిమాకి నేపధ్య సంగీతం గురించి ఎక్కువగా చెప్పుకోవల్సిందేమీ లేదు. మన దృష్టంతా కథ మీదే కేంద్రీకరిస్తాం కాబట్టి సంగీతాన్నంతగా పట్టించుకోం. రాజస్థానీ పరంపరా గీతం “కేసరియా బాల్మా” అక్కడక్కడ వినిపిస్తూ వుంటుంది. రాజస్థాన్లో వచ్చే చాలా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఏదీ లేకుండా నిశ్శబ్దమే మాట్లాడుతుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని పచ్చదనం అందాలూ, రాజస్థాన్ లోని ఎడరిలోని ఒంటరితనామూ కథకి నేపథ్యం గా బాగా పనికొస్తాయి.

2006 లో విడుదలైన ఈ సినిమా జయాపజయాల గురించి నా కంతగా తెలియదు.

మంచి కథా బలమూ, భేషజాలకి పోని నటీ నటులూ, తెలివైన సాంకేతిక వర్గమూ, వీళ్ళందరినీ ఒక్క తాటిపైన నడిపించ గలిగే దర్శకుడూ వుంటే మంచి సినిమాలు రావటం పెద్ద కష్టమేమీ కాదు. అప్పుడు సినిమా కేవలం రెండు గంటల కాలక్షేపం మాత్రమే కాక మన ఆలోచనలని కొంచెమైనా రిఫైన్ చేసే సాధనంగా పనికొచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే అలాటి సినిమాని ఆదరించగలిగే ప్రేక్షకులు కూడా కావాలి మరి. “చెత్త సినిమాలు తీస్తున్నారు” అని సినిమా రంగాన్ని దుయ్య బట్టే ముందు “మనమెలాటి ప్రేక్షకులం” అని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో మరి!

4 thoughts on “సూత్రం

 1. ఈ సినిమా నా అల్ టైం ఫేవరెట్స్ లో ఒకటి. ముఖ్యం గా చివర్లో రైల్వే స్టేషన్ సీన్ మనసుని ఎక్కడో తడుముతుంది.
  మంచి సినిమాని మన బ్లాగ్మిత్రులకి పరిచయం చేసారు.

 2. శంకర్ గారూ, & కొత్తపాళీ గారూ,
  ధన్యవాదాలు.
  తృష్ణా
  నిస్సందేహంగా మీరు నాకంటే చాలా లోతుగా విశ్లేషించారండీ! నేనిది ఎలా మిస్సయానో అర్ధం కావటంలేదు. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  శారద

కొత్తపాళీకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s