ఈ పై మూడు పదాలూ ఒకదానికొకటి సంబంధం లేనివని నా అభిప్రాయం. కానీ చాలా చోట్ల వాటి మధ్య లేని సంబంధం వున్నట్టూ,ఒకదానికొకటి కారణాలన్నట్టూ చూసి నాకేదో అర్ధం కాలేదనుకుంటున్నాను. “స్త్రీవాదాన్ని నమ్మిన వాళ్ళూ, ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నవాళ్ళూ తేలిగ్గా నీతి తప్పుతారు.” ఇలాటి బ్లాంకెట్ వ్యాఖ్యానం తప్పుడు వ్యాఖ్యానం అన్న మాట ఎంత నిజమో, దీనితో ఏకీభవించేవారు బహు కొద్దిమంది అనే మాటా అంతే నిజం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే-
కొన్నేళ్ళ క్రితం నేను వీరేంద్రనాథ్ గారు రాసిన “అనైతికం” నవల మొదలు పెట్టి అంతగా నచ్చక పక్కన పెట్టేసాను. నాకెందుకో ప్రపంచంలో అందరు స్త్రీలూ అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి తహ తహలాడుతున్నట్టు రాస్తే పెద్దగా నచ్చదు. ఈ విషయం గురించి మాట్లాడుతూ నా స్నేహితురాలొకామె, “ఇంటి పనీ, ఆఫీసు పనీ, అత్త వారి చాకిరీ, పిల్లల బాగోగులూ చూసుకుంటూ నాకు నా భర్తతో సంబంధం పెట్టుకోవటానికే సరిగ్గా టైం చాలటం లేదు. ఇహ ఇంకో అక్రమ సంబంధం కూడానా? అంత టైమే వుంటే కాస్త టీవీ చూసుకుందునే!” అని జోకింది. అలాటి భావనతోనే “కథలో వున్న అందరు ఆడవాళ్ళూ మగవాళ్ళూ అక్రమ సంబంధాలకై ఎగబడటం ఏమిటి? ఇంపాజిబుల్!” అని పుస్తకం పక్కన పెట్టేసాను.
అయితే కొద్ది రోజుల క్రితం మనసులో మాట సుజాత గారి అభిప్రాయం చదివి, “అరె! నేను మంచి పుస్తకం మిస్సయానేమో! ఈ సారి దొరికితే చదవాలి,” అనుకున్నాను. అనుకోకుండా ఈ మధ్యే లైబ్రరీలో దొరికింది. చదివాను. అయితే ఈసారీ నాకు పుస్తకం అంతగా నచ్చలేదు. వీరేంద్రనాథ్ గారి నవలనే తప్పుపట్టేంత గొప్పదానివా అని అందరూ ఆక్షేపించినా పరవాలేదు.
Let me make one thing clear. నా అభ్యంతరం ఈ కథలో అక్రమ సంబంధాలున్నందుకు కాదు. అలాటి సంబంధాలు పెట్టుకోవటమా మానటమా అన్నది ఆయా వ్యక్తులకీ వాళ్ళ కుటుంబాలకీ సంబంధించిన విషయం. అప్పటికే వున్న సంబంధాన్ని ఎంతవరకూ గౌరవించాలి, కొత్త సంబంధాన్నీ పాత సంబంధాన్నీ ఏ పాయింట్ దగ్గర కలపాలీ అన్నది కేవలం వ్యక్తిగత నిర్ణయం. అలాటి సంబంధాలు పెట్టుకునేటప్పుడు వాటి పర్యవసానాలు తట్టుకునే శక్తీ ఆ వ్యక్తులు తెచ్చుకోవాలి. ఈ కథలో అహల్య చేసిందీ అదే. కాబట్టి నాకు అహల్య కథతో గొడవేమీ లేదు.
నిజానికి మొత్తంగా కథా, కథనమూ నచ్చాయి. నచ్చనిదల్లా అహల్య కథ మీద రచయిత (శ్యామల పాత్ర ద్వారా) చేసిన కంక్లూజన్సూ, వ్యాఖ్యలూ! నాకీ కథలో ఏ మాత్రం నచ్చని పాత్ర శ్యామల!
చివరి నించి నరుక్కొద్దాం!
ఆఖర్న శ్యామల చాలా ఆవేశంగా ఇచ్చిన ఉపన్యాసంలో..
“నిజంగా కష్టాల్లో వున్న స్త్రీలకోసం…” అంటూ చాలా కష్టాలే ఏకరువు పెడుతుంది. అయితే అందులో “వైవాహిక జీవితంలో మానసికమైన ఒంటరితనం” వుండదు. అంటే భర్త తన్నటమో, కిరసనాయిలు పోసి తగలబెట్టటం వంటి శారీరక హింసలేనా హింసలంటే? పైకి దెబ్బలు కనపడకుండా కుటుంబాల్లో జరిగే ఎమోషనల్ పించింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలూ, ఇవేవీ కష్టాలూ కాదు, వాటి గురించి ఆలోచించాల్సిన పనీ లేదూ, అదసలు తీర్చాల్సిన సమస్యే కాదన్నమాట.! నాకది సరిగ్గా అనిపించదు. నిజానికి ఈ కథలో అచ్చమ్మది ఎంత కష్టమో అహల్యదీ అంతే కష్టం. అచ్చమ్మ కష్టాన్నైనా అర్ధం చేసుకునే వాళ్ళుంటారేమో కానీ, అహల్య ఒంటరితనాన్ని అర్ధం చేసుకునే వాళ్ళు దొరకటం చాలా కష్టం. అందుకే అహల్య కష్టాలు కేవలం అతి ఆలోచనల వల్ల వచ్చినవీ, అని శ్యామల తీసి పడేయటం అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఆడైనా మగైనా, శరీరానికే కాదు, మనసుకీ తగిలే దెబ్బలు కూడా చాలా నొప్పినే కలిగిస్తాయి.
“నా భర్త నన్ను మాటల్తో హింసిస్తున్నాడు,” అంటే, “మాటలే కదా? వాతలు పడేటట్టు కొట్టటం లేదు కదా? నీదేమంత పెద్ద కష్టం కాదులే,” అనే మాటలు ఎంత అర్ధం లేకుండా అనిపిస్తాయి? శ్యామల తల్లిని “… దిగులుతో సమస్యలు తెచ్చి పెట్టుకుంది. వాటిని తీర్చుకోవటానికి అక్రమ సంబంధాలు పెట్టుకుంది….” అంటూ జడ్జ్ చేయటం అంత బాగాలేదు. అసలు ఒక మనిషి పడుతున్న కష్టాన్ని “పెద్దదీ” “చిన్నదీ” అంటూ ఎలా categorise చేస్తాం? “నాకిది కష్టంగా వుంది” అని ఒకళ్ళంటే వాళ్ళ తత్వానికది కష్టంగా వుందనే అర్ధం. “లేని వన్నీ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు” అన్న వాదన సరైనది కాదు.
వివాహ వ్యవస్థలో వున్న లొసుగులని ఒప్పుకుంటూ శ్యామల…..” ఆ సమస్యకి పరిష్కారం వ్యవస్థ రద్దు చేయటం కాదు. రహస్య సంబంధాలు పెట్టుకోవటం అసలే కాదు. తనకేది ఆనందం ఇస్తుందో ఖచ్చితంగా తెలుసుకోగలగడం. అటువంటి ఆనందాన్ని ఆరోగ్యమైన రీతిలో నిర్భయంగా పొందటం” అంటుంది. “ఎవరికేది ఆనందం ఇస్తుందో” అన్న ప్రశ్నకి ఎవరమూ పర్మనెంటు సమాధానం ఇవ్వలేము. ఆకలితో బాధ పడేవాడికి ఆ క్షణంలో అన్నం తప్ప వేరేదీ ఆనందం ఇవ్వదు. ప్రేమకీ, అప్రిసియేషన్ కీ, గౌరవానికీ మొహం వాచిన మనిషికి నాలుగు మంచి మాటలూ, కొంచెం ఆప్యాయతా తప్ప ఇంకేదీ ఆనందాన్నివదు. అలాటి ప్రేమ రాహిత్యంలోనే మనుషులు అక్రమ సంబంధాలకీ, చీరల షాపింగులకీ, భజనలకీ అలవాటు పడతారు. వాళ్ళ జీవితాల్లో నిండిన ప్రేమ రాహిత్యాన్ని అర్ధం చేసుకోకుండా వాళ్ళందరి సమస్యనీ దుప్పటి కిందికి నెట్టేయటం న్యాయమా?
నిజమే, వైవాహిక జీవితీంలో భాగస్వామి ఇన్సెన్సిటివ్ గా వుండటం, కుటుంబ సభ్యులు ఒకరిపైన ఒకరు విచిత్రమైన రీతుల్లో జరిపే జులుం, ఇవన్నీ వ్యవస్థ తీర్చాల్సిన కష్టాలు కావు. ఎవరికి వారు ఆలోచించుకొని తీర్చుకోవాల్సిన సమస్యలు. అంతే కాని అవసలు సమస్యలే కావు పొమ్మనటం సరి కాదు. వాటిని తీర్చుకోగలమో లేదో కానీ ముందు తరాలకి పక్క మనిషి ఇష్టాఇష్టాలని గౌరవించటం, ప్రేమించటం, వగైర విలువలని నేర్పి కొంత వరకు తగ్గించుకోగలం.
తల్లి పెట్టుకున్న అక్రమసంబంధాన్ని ఈసడించిన శ్యామలకి ఆమెనా సంబంధం వైపు తోసిన తండ్రి మీద కానీ, ఆమె వల్నరబిలిటీని వాడుకున్న పెదనాన్న మీద కానీ అసహ్యం కలగకపోవటం విచిత్రం!
“.. ఆర్ధిక బలహీనత కారణంగానో ఇంకే కారణంగానో వివాహం కాని 35 ఏళ్ళు దాటిన స్త్రీకి జీవనభృతి కల్పించాలి. విడాకులు తీసుకున్న ఆడవాళ్ళకి ప్రభుత్వమే ఏదో విధంగా ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించాలి.”
This is disgusting at its best. పెళ్ళి అనేది ఆడదానికి వృత్తి కాదు! జీవనోపాధీ కాదు. ఆడది పెళ్ళినీ వైవాహిక బంధాన్నీ తన పోషణ కొరకు గౌరవించదు. అదే నిజమైతే ఉద్యోగస్తులైన ఆడవాళ్ళు “ఇంత లోప భూయిష్టమైన” వైవాహిక బంధంలోఎందుకు వుంటున్నారూ? భర్తో, తండ్రో, అన్నో, ప్రభుత్వమో ఆడదానికి జీవన భృతి కల్పించటమేమిటి? తన తిండి తను సంపాదించుకునే శక్తి ప్రతీ ప్రాణికీ వుంది, ఆడదానికీ వుంది, మగవాడికీ ఉంది. అంతే కాని, “నువ్వా?నువ్వా? ఎవరు నా బాధ్యత వహిస్తారు?” అని అడగటం చాలా అవమానంగా అనిపిస్తుంది.
మనుషులు (ఆడైనా మగైనా) ఇష్టంతో (చాలావరకు) తమ sense of belongingని తృప్తి పరచుకొనేటందుకు తమ మీద తామే impose చేసుకునే ఒక కమిట్మెంటు పెళ్ళి. దాన్ని గౌరవిస్తున్నామంటే వేరే దారీ, పోషణకి మార్గం లేకా కాదు. మనకు మనమే పెట్టుకున్న నియమాన్ని గౌరవించటమంటే మనని మనమే గౌరవించుకోవటం కావటం వల్ల.
“….విడాకులు తీసుకున్న స్త్రీకి ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తుందన్న రూలే వుందనుకో, పది సంవత్సరాలపాటు భర్త చేతిలో బాధలనుభవించకుండా రెండేళ్ళకే బయటపడతారు కదా…”
భర్త చేతిలో బాధలు పడుతున్న భార్యైనా, భార్య చేతిలో నరకం చూస్తున్న భర్తైనా జీవనోపాధి భయంతో కలిసి వుండటం లేదు.ఎప్పటికైనా రోజులు బాగుపడతాయన్న ఆశతో కలిసి వుంటున్నారు. లేదా సంఘ భయంతో కలిసి వుంటున్నారు. వివాహమే జీవనోపాధీ, వృత్తీ అయినప్పుడు ఆడవాళ్ళ జీవితాలెంత నరకంగా వుండేవో ఒక్కసారి మన కిందటి తరం ఆడవాళ్ళని చూస్తే తెలుస్తుంది!
“…వివాహ వ్యవస్థని కాదని ‘పైటల్ని కాల్చేయాలనీ స్లోగన్స్ ఇస్తే ఏం లాభం?”
అంటుంది శ్యామల చివరికి. ఇది చదివి నేను చాలా కంఫ్యూజ్ అయాను. ఎందుకంటే ఎక్కడా అహల్య (ఆ మాటకొస్తే అచ్చమ్మ కూడా) ఇందులో “స్త్రీ వాదం” గురించి మాట్లాడదు. “హ్మ్మ్మ్…. మగవాడు నన్నింత బాధ పెడతాడా?” అని భర్త మీద పగ సాధించటాని కో, లేక స్త్రీవాదం మీద మోజుతో నో అహల్య బావగారితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఒక రకమైన ఒంటరితనంతో, ప్రేమ కొరకు వెంపర్లాడుతూ ఆ క్షణంలో తన దగ్గరున్న మగవాడికి దగ్గరయ్యింది. సముద్రంలో పడి కొట్టుకు పోతున్నప్పుడు గడ్డి పోచను కూడా పట్టుకుంటాం. అక్కడా ఏ వాదాలా ప్రసక్తీ లేదు. అదే విధంగా ఉద్యోగం, ఆర్ధిక స్వాతంత్ర మూ ఉందన్న ధీమాతో కూడా నీతి తప్పలేదు. అహల్య నీతి తప్పటం అన్నది కేవలం ఆమె వ్యక్తిగత కారణల వల్ల జరిగింది. దాని పర్యవసనాలని కూడా ఆమె హుందాగా స్వీకరించింది. (ఎప్పుడూ, “అంత మంచి భర్త వుండగా బావగారితో సంబంధం పెట్టుకున్న నీచురాలిని! నా పాపానికి నిష్కృతి లేదు,” అని అనుకోలేదు తను!) ఇదే రకంగా “ఆర్ధిక స్వాతంత్రం” గురించి కూడా చాలా ఆలోచించదగ్గ వ్యాఖ్యానాలు చేస్తారు రచయిత. (నాకైతే అవి కొంచెం కూడా నచ్చలేదు!) అహల్య అనైతికత లో “స్త్రీ వాదమూ”, “ఆర్ధిక స్వాతంత్ర్యమూ” చేసిన తప్పులేవిటో నాకైతే అర్ధం కాలేదు. మరి నేను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయానా?
ఆర్ధిక స్వాతంత్ర్యం వున్న ఆడదాని పట్ల అందరికీ (మేధావులైన రచయితలతో సహా!) ఒక రకమైన అసహనం వుంటుందా? వుంటుందనే అనిపించింది నాకీ పుస్తకం చదివాక. దాని గురించి త్వరలోనే.
నీతికీ, స్త్రీవాదానికీ సంబంధం ఉంది. కానీ ఆర్థిక స్వాతంత్ర్యం కొంచెం కంఫ్యూజ్ కలిగించే విషయం. ఎందుకంటే ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడా భర్త చాటు భార్యలుగా ఉంటున్నారు. మా అమ్మగారు చదివినది ఆంధ్రా యూనివర్శిటీలో MSc. చేస్తున్నది బ్యాంక్ ఉద్యోగం. కానీ ఆమె కూడా పాత కాలం స్త్రీలాగ పూజలూ, పురస్కారాలకే ప్రాధాన్యత ఇస్తారు. మా నాన్నగారు కూడా పూజలూ, పురస్కారాలూ చేసేవారు కానీ ఆడవాళ్లకే పూజలూ, పురస్కారాల వైపు ఇంక్లినేషన్ అధికంగా ఉంటుంది. చదువులు పెరిగినా, ఉద్యోగాలు చేస్తున్నా సంప్రదాయాలు మారడం లేదు.
మీకెలా ధన్యవాదాలు తెలపాలో అర్ధం కావడం లేదు. ఆ నవల మీదున్న నా అసహ్యం అంతా ఇంతా కాదు. యండమూరి రచనలంటే నాకిష్టమే కానీ ఈ నవల మాత్రం నాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఇంతకు ముందు వ్రాసాను. మీరు బాగా విశ్లేషించారు. చాలామందికి ఉద్యోగం చేసే ఆడవారంటే చులకనే. అదే అభిప్రాయం ఆయనకు కూడా ఉందేమో అనిపిస్తుంది. ఈ నవలని చదివినపుడు, ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటే స్త్రీలు తేలికగా పురుషులకు లొంగిపోతారు అనే భావాన్ని కలిగించారు. మీరు వ్రాసిన విధానం నాకు ఎంతో నచ్చింది. ధన్యవాదాలు.
అయినా స్త్రీలకి మనం చెప్పుకుంటున్నంత ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని నేను అనుకోను. http://streevimukti.stalin-mao.net.in/83385123 ఇందులో ఆ విషయం వ్రాసాను. యండమూరి లాంటోడే ఒకడు ఓ సినిమా నిర్మించాడు. ఉద్యోగం చేసే స్త్రీలని వాళ్ళ బాస్‌లే చెరుస్తారని చెప్పడం ఆ నిర్మాత ఉద్దేశం. ఆ సినిమానే వనితా చానెల్‌వాళ్ళు సిగ్గు లేకుండా ప్రసారం చేశారు.
నవల చదివి చాల రోజులయ్యింది.ఒక్కటే గుర్తు ఉంది,
యండమూరి స్త్రీ నిస్సహాయత, మగవాడి స్వార్ధం ని కళ్ళకు కట్టినట్లు గా చూపించారు . అనైతికం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడమే నా??..అక్రమ స్నేహాలు కూడా చక్క గా సాగిపోతున్న రోజులివి ….నవలలో నాయికకు ఉన్నా స్టాక్ మార్కెట్ పరిజ్ఞానము ను ఉపయోగించు కుంటూ, ఆమె విలువను గుర్తి౦చిన వాడిలా నటిస్తూ, ఇక మిగిలినవన్నీ పెద్ద కష్టమేం కాదు.
స్త్రీ వాదం అని డబ్బా కొట్టుకొనే నారీమణులు కూడా ఇందుకు మినహాయింపు కాదు అని నా ఉద్దేశ్యం. కాకపోతే మ౦చి , గొప్ప స్నేహితులన్న భ్రమ లో ఉంటున్నరనుకొంటాను…ఇంకా నయ్యం ఆయన ఆ అక్రమ సంబంధాన్ని రాయడం చేతకాక ప్రేమ, దోమ అన్న దిక్కుమాలిన భావ జాలం తో జనాలని వెధవల్ని చేసే ఉద్దేశ్యం తో వ్రాసినట్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు
Good anayalysis madam. I too dont appreciate this novel. కొందరు చాలా బాగుందన్నాక చదివినా కూడా నాకు మళ్ళీ చిరాగ్గానే అనిపించింది. అక్కడ అంతమంది చెప్తున్నారు కదా నాకే సరిగా అర్ధం కావడం లేదేమో అని ఊరుకున్నాను.
యండమూరి నవల నేను చదవలేదు కానీ రివ్యూలు చదివిన తరువాత ఒక్క ముక్క అర్థమయ్యింది. యండమూరి చదువుకున్న స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పదలచుకుని ఉండొచ్చు. ఈ పాయింట్‌ని నేను అంగీకరించలేను. మా బంధువులలోని స్త్రీలు కూడా బాగా చదువుకున్నవాళ్లే. వాళ్ల దగ్గర అక్రమ సంబంధాలని అడ్వొకేట్ చేస్తూ మాట్లాడితే తిడతారు లేదా చెప్పుతో కొడతారు. భర్త కట్నం కోసం కొడితే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం లేని స్త్రీలు ఉన్న దేశం ఇది. ఇక్కడ ఎంత మంది స్త్రీలకి భర్తని మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకునే ధైర్యం ఉంటుంది?
శారద గారు,
నాకు కూడా అనైతికం నచ్చలేదు. నేను కూడా రాద్దామనుకున్నాను కదా అని మొదట మీ వ్యాసం తర్వాత చదువుదాములే అనుకున్నాను కానీ మళ్ళీ వుండలేక చదివేశాను.బాగా విశ్లేషించారు.
Well narrated Sarada gaaru. Thanks!
కొన్నేళ్ల క్రితం కెనడాలో ఉంటున్న నా స్నేహితురాలు చెప్పిన వాక్యాలు ఇవి:
>>>>>
Feminism does not mean wearing skimpy clothes and sleeping with many. Male workers and female workers are not equally paid in many capitalist countries. There are many such issues related to feminism.
>>>>>
Well said anyaa, Thatz true!
ఈ లింక్ చదువు: http://radicalfeminism.stalin-mao.net.in/39703438 ఇందులో చదువుకున్న స్త్రీలపైనా విమర్శలు కనిపిస్తాయి.
లింక్ అడ్రెస్ మారినది: http://streevimukti.stalin-mao.net.in/39703438
యండమూరి స్త్రీవాదం , ఆర్ధిక స్వత౦త్రమ్ , నీతి అన్న విషయాలు కన్నా, మగ వాడి నైజాన్ని, ఆడ వాళ్ల బలహీనతలను మాత్రమే ఎక్కువగా వివరించారు. కాని ఆయన వీటికి సంబంధాలు ఉన్నట్లు చెప్పారని మీరు నమ్మితే , అసలు ఈ నవలా కాలానికి నేటికి నీతి, ఆర్ధిక స్వాతంత్ర్యం , స్త్రీ వాదం రూపాంతరాలు గమనించండి ..
శ్యామల అంత చక్కగా మాట్లాడింది అంటే (” ఆ సమస్యకి పరిష్కారం వ్యవస్థ రద్దు చేయటం కాదు. రహస్య సంబంధాలు పెట్టుకోవటం అసలే కాదు. తనకేది ఆనందం ఇస్తుందో ఖచ్చితంగా తెలుసుకోగలగడం. అటువంటి ఆనందాన్ని ఆరోగ్యమైన రీతిలో నిర్భయంగా పొందటం” అంటుంది)
ఆమె తల్లి సరిగానే పెంచినది అని అర్ధం. పొరపాటు ఒక్కసారే చేస్తారు తెలివైన వాళ్ళు. అహల్య చేసినది కూడా అదే కదా …భర్త నుండి విడివడిన తర్వాత ఇంకా బోల్డు మంది ప్రేమ చూపించే వారు కనిపించి ఉంటారు ..కానీ ఆమెకి విచక్షణ తెలిసింది
ఆ పుస్తకం ఏ పబ్లిషర్ దగ్గర దొరుకుతుంది? చూస్తే గానీ స్పష్టంగా చెప్పలేను.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
ఈ వ్యాసం రెండవ భాగం- ఆర్ధిక స్వాతంత్ర్యం గురించి అభిప్రాయాలు ఒకటి రెండు రోజుల్లో పెడతాను. (సమయాభావం).
శారద
meeru raasina vyakyaanam chaala baagundi. i agee with you.