సంఘంలో నీతికీ స్త్రీవాదానికీ, స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యానికీ సంబంధం వుందా? అసలు స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం వుండాలా? వొద్దా?
దాదాపు ఇరవై యేళ్ళ కింద మా పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడూ సేలం దగ్గర మా అత్తగారింట్లో సెలవులు గడిపే దాన్ని. మా అత్తగారింట్లో అప్పట్లో “విమెన్స్ ఎరా” అనే పత్రిక వచ్చేది. నేను దాన్లో కథలు చదివేదాన్ని. వాటిని “heart warming stories” అని పిలిచే వాళ్ళు. అన్ని కథల్లో దాదాపు ఒకటే వస్తువు ఉండేది. (ఇప్పుడూ అంతేగా?)
ఇద్దరు అమ్మాయిలు- స్నేహితురాళ్ళు. ఇద్దరూ మంచి చదువు చదువుతూ వుంటారు. ఎప్పుడు క్లాసులో ఒకళ్ళు ఫస్టు, ఇంకొకళ్ళు సెకండు వస్తూ వుంటారు. పెద్దవుతారు. ఇద్దరిలో ఒకరు (సాధారణంగా సెకండొచ్చే అమ్మాయి!) చాల పెద్ద ప్రొఫెషనలవుతుంది. సంఘంలో పెద్ద పేరూ, డబ్బూ, అన్నీ సంపాదించుకుంటుంది. కానీ పెళ్ళి కాదు! ఒకవేళ పెళ్ళయితే భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని వుంటాడు. కొడుకు చదువబ్బక డ్రగ్ అడిక్ట్ అవుతాడు. కూతురూ చదువబ్బక వీలైతే పెళ్ళి కాకుండా గర్భవతి కూడా అవుతుంది!. మొత్తానికి ఆమెకి జీవితంలో మనశ్శాంతి వుండదన్నమాట.
అదే ఇంకో ఫస్టు వచ్చే అమ్మాయి, పెళ్ళవగానే “నేను ఉద్యోగం వదిలేసి ఇంటినీ, మిమ్మల్నీ, పిల్లల్నీ చూసుకోదల్చుకున్నాను” అని చెప్తుంది. అలాగే చేస్తుంది. ఆమె పిల్లలు రత్నాలు, ఆమె ఇల్లు స్వర్గం, ఆమె భర్త- ఇక అతని సౌఖ్యం గురించి పుస్తకాలే రాయొచ్చు! చాలా యేళ్ళ తరువాత ఇద్దరు స్నేహితురాళ్ళూ కలుస్తారు. ఒకరినికొరు చూసుకొని ఆశ్చర్య పోతారు. అప్పుడు రెండో ఆమె మొదటి ఆమెని అడుగుతుంది, “నా జీవితం ఎందుకిలా అయింది” అని! దానికామె అంటుంది, “మూర్ఖురాలా! పవిత్రమైన స్త్రీ జన్మ ఎత్తి ఉద్యోగమూ, డబ్బూ అంటూ ఎండ మావుల వెంట పరుగులు తీసావు. నీ స్వార్థమే తప్ప ఇంట్లో వాళ్ళ అవసరాలు గమనించలేదు. నీ ప్రేమకై ఎదురుచూసి అది లభించక వాళ్ళా ప్రేమను ఇంకొక చోట వెతుక్కున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరు” అంటూ ద్రౌపదీ దేవి సత్యభామకి ఇచ్చిన లెక్చరు లాటిదే ఇస్తుంది. ఆమె వెంటనే పోస్టులో తన రెజిగ్నేషన్ లెటరు పంపేసి, పని మనిషిని మానిపించి ఇల్లు తుడుస్తూ వుంటుంది. ఆమె భర్త ఆమె వైపు మురిపెంగా చూస్తూ వుంటాడు!
నేనూ, నా స్నేహితురాలొకామె ఈ కథలు చదివి తెగ బాధ పడేవాళ్ళం. నేనేమో ఎమ్మెస్సీ ఫిజిక్సూ, ఆమేమో ఎలెక్ట్రికల్ ఎంజినీరింగూ! పైగా ఎన్నో పోటీ పరీక్షల్లో నెగ్గి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో చిన్న వయసులోనే గెజిటెడ్ రాంకు ఉద్యోగాలు! మరి ఉద్యోగాల్లో వున్న ఆడవాళ్ళ గురించి ఇలా రాస్తే ఏడుపు కాక ఇంకేం వస్తుంది. పైగా మా ఇంట్లో అందరు ఆడవాళ్ళూ ఉద్యోగస్తులే! (మా అమ్మతో సహా!). ఆ అమ్మాయైతే ఆ మేగజీన్ కి “Men’s era” అనీ, ఆ కథలకి “blood boiling stories” అనీ పేరు పెట్టేసింది.
తరువాత నాకు బసవరాజు (జ్యేష్ట) గారి కథల పుస్తకం ఒకటి దొరికింది. సరళమైన సెన్స్ ఆఫ్ హ్యూమరుతో చాలా బాగుంటాయి ఆయన కథలు. కానీ, మళ్ళీ అదే టైపు! టెంతు వరకూ చదువుకుని ఇల్లూ వాకిలీ చూసుకునే స్త్రీల సంసారాలూ కుటుంబాలూ బాగుంటాయి, పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసే స్త్రీల కుటుంబాలు బాగుండవు. (కాబట్టి implied meaning ఏమిటంటే ఆడవాళ్ళు ఇంటి పట్టున వుంటే సంఘం బాగుంటుంది.)
ఈ మధ్య ఇంకేదో రెండు మూడు పుస్తకాల్లో (అనైతికం లో కూడా!) ఇదే చదివాను. విద్యాధికులై వృత్తి మీద ఇష్టం వుండే ఆడవాళ్ళు మూడొంతులు పెళ్ళీ సంసారమూ లేక “మోడు” ల్లాగా మిగిలిపోతారు (వినటానికే ఎంత ఎబ్బెట్టుగా వుంది ఆ మాట!). ఒకవేళ పెళ్ళయినా వాళ్ళ వల్ల కుటుంబాలకేమీ సుఖం వుండదు. ఇప్పుడు కూడా ఇలాటి స్టీరియో టైపింగు చూస్తే (చదివితే!) మనసు బాధతో మూలుగుతుంది.
ఎందుకని చాలా వరకు విద్యాధికులైన స్త్రీలనీ, పెద్ద ఉద్యోగాలు చేసే స్త్రీలనీ చూస్తే చాల మందికి ఒకరకమైన అసహనం? విద్యాధికులైన స్త్రీలు అహంభావులై వుంటారనీ, అన్ని విలువలనీ ధిక్కరిస్తారనీ, ఇల్లూ వాకిలీ పట్టించుకోరనీ, పిల్లలని గాలికొదిలేస్తారనీ, అత్త మామలని గ్యారంటీగా ఇంట్లోంచి తరిమేస్తారనీ అందరికీ ఎందుకంత నమ్మకం? అమాయకంగా వుండే ముగ్ధలకూ, “అబ్బ! నేను లేకపోతే మా ఇంట్లో వాళ్ళు మంచి నీళ్ళు కూడా తాగలేరొదినా” అని మురిపెంగా విసుక్కునే స్త్రీలకీ వున్న ఆదరణా, ఫాలోయింగూ, ధైర్యంగా వుంటూ తమ నిర్ణయాలు తామే తీసుకునే తెలివైన ప్రొఫెషనల్ స్త్రీలకి వుండదు.
అసలు ఏ మనిషికైనా వృత్తి ఎందుకు? వృత్తిలో ఒక మనిషి పొందాలనుకునేది ఏమిటి? ఆ పొందాలనుకునే విషయాలు ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ వేర్వేరు గా వుంటాయా?
ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ తేడా ఏమిటి?- ప్రకృతి నిర్దేశించిన ధర్మాలకనుగుణంగా ఇద్దరికీ వేర్వేరు శరీర నిర్మాణాలూ, వేర్వేరు జెనెటిక్ కోడింగులూ, సంఘంలో, కుటుంబంలో నిర్వహించవలసిన వేర్వేరు బాధ్యతలూ, అన్నీ అందరికీ తెలిసినవే. వీటి అధారంగా ఆడా-మగా ఒక్కటే అని ఎవ్వరం అనలేము. అయితే అవసరాలు మాత్రం ఇద్దరికీ ఒక్కటే. ఆకలి దప్పికా మొదలైన శారీరక అవసరాలతో పాటు, ప్రేమించబడాలీ, గౌరవించబడాలీ అన్న ఆశా, ఐడెంటిటీ కొరకూ, గుర్తింపు కొరకూ వెంపర్లాటా, తమని తాము నిరూపించుకోవాలన్న ఆసక్తీ ఇవన్నీ ఆడా మగా అందరికీ వుంటాయి.
మగవాడికి ప్రకృతి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత ఇస్తే, కుటుంబానికి కావల్సిన అవసరాలు (మానసికమైన అవసరాలూ, తిండీ, ఆరోగ్యమూ చూసుకోవటం వంటివి) తీర్చే బాధ్యత ఆడదానికి అప్పగించింది.
ఆ రకంగా ఆలోచిస్తే వృత్తి మనకి మొదట పొట్ట నింపుకోవటానికి. అవునా? అయితే ఒక ధనికుడైన మగవాణ్ణీ, లేదా తర తరాల ఆస్తి వున్న మగవాణ్ణీ ఏ పనీ లేకుండా ఇంట్లో వుంటే సంఘం హర్షించదు. “నీకు కడుపు నిండి పోయింది కాదా? ఇంకా మళ్ళీ ఇంకో వృత్తెందుకూ?” అని మనం ప్రశ్నించం. ఎందుకంటే వృత్తికి పొట్ట నింపే లక్షణమే కాక ఇంకా చాలా వున్నాయి. అంతెందుకు, మగవాడు “నా బాధ్యత కుటుంబం పొట్ట నింపటం వరకే, అంతకు మించి నేనేమీ పెట్టుకోను,” అని చేతులు ముడుచుకుని వుంటున్నాడా? లేదు, తన స్వధర్మం తో పాటు, సంగీతమనీ, సాహిత్యమనీ, ఫిలాసఫీ అనీ, కళలనీ తనని తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే వున్నాడు, చేసుకోవాలి కూడా.
ఆడవాళ్ళైనా అంతే! కేవలం కుటుంబంకోసమే కాకుండా మిగతా విషయాలకీ, ఆసక్తులకీ ఉపయోగించుకోదగ్గ శక్తి యుక్తులు ఆడవాళ్ళ దగ్గరా వుంటాయి. ఆ శక్తి యుక్తులనుపయోగించుకుంటూ సంఘంలో తమదైన గుర్తింపు పొందాలన్న తపనా వుంటాయి. (మగవాళ్ళకి లాగే!). అంతే కానీ, నువ్వు ఇంటి పట్టునే వుండి, నీ తెలివి తేటలనీ సమయాన్ని, ఇంకా ఇడ్లీలు ఎలా మెత్తగా వొండొచ్చు, ఇంట్లో వాళ్ళకి ఉపచర్యలు ఎంత బాగా చేయ్యొచ్చు, అన్న ప్రశ్నలకే వాడుకో. సాయంత్రం మేమొచ్చే సమయానికి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూనే వుండు అనటం ఏమంత న్యాయం? అలా వుండే ఆడవాళ్ళని తప్పు పట్టటంలేదు నేను. అందరు ఆడవాళ్ళూ అలా వుంటేనే సంఘానికీ, కుటుంబానికీ క్షేమం అన్న ప్రతిపాదనని తిరస్కరిస్తున్నాను.
ఆడవాళ్ళు ఇల్లు వదిలేసి ఉద్యోగాలకి వెళ్తే సంఘంలో నేరాల సంఖ్య పెరుగుతుందన్న అసందర్భమైన ప్రతిపాదన చాలా సార్లు వినపడుతుంది.. రెండు తరాల కింద స్త్రీలంతా ఇంటి పట్టునే వున్నారు. మరి అప్పుడు నేరాల సంఖ్య సున్నా అయిందా? సంఘంలో నేరాలు పెరగటానికి వస్తు సంస్కృతీ, వెర్రి తలలు వేస్తున్న మీడీయా, మితిమీరిన ఆత్మ పరాయణత్వం ఇంకా చాలా చాలా కారణాలు వున్నాయి. అవన్నీ వదిలేసి “ఆడవాళ్ళు ఉద్యోగాల వెంట పరిగెత్తితే ఇంతే మరి” అనే సన్నాయి నొక్కులు వింటే విసుగు కాక ఇంకేం వస్తుంది?
చాలా కథల్లో (చాలా ఏమిటి, దాదాపు అన్ని కథల్లోనూ!) ఉద్యోగాల వెంట పరిగెత్తే స్త్రీలని డబ్బు వెంట పరిగెత్తే వాళ్ళు గానూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళ్ళుగానో, అత్త మామలని తరిమేసే రకాలుగానో (ఈ మధ్య వీళ్ళు బహుశా సినిమా హీరోయిన్ల కంటే పాప్యులర్ అనుకుంటా!) చూపిస్తారు. ఆర్ధిక స్వాతంత్ర్యమూ, సెల్ఫ్-ఎక్స్ప్రెషనూ దొరికితే స్త్రీలు కుటుంబాలకి విలువ ఇవ్వరన్న అపోహ ఇంకా రచయితలని వదులుతున్నాట్టు లేదు. ఆర్ధిక స్వాతంత్ర్యమూ, వ్యక్తిత్వమూ వుండి, స్వేఛ్ఛా ప్రియురాలూ అయిన స్త్రీ పురుషుణ్ణి గౌరవించదన్న అపోహ మనని ఎప్పటికి వొదులుతుందో ఏమో! నిజానికి తనకంటూ ఒక వ్యక్తిత్వమూ, స్వేఛ్ఛా, స్వయం నిర్ణయాధికారమూ వున్న మనిషే (ఆడైనా- మగైనా!) పక్క మనిషికి గౌరవం ఇస్తాడు/ఇస్తుంది!
వృత్తిని ప్రేమిస్తూ, ఉద్యోగాన్నీ, ఇంటి బాధ్యతలనీ సమానంగా చాకచక్యంతో నిర్వహించుకుంటూ, టైం మేనేజ్ మెంటుని ఇరవై నాలుగ్గంటలూ అమలులో వుంచుతూ వుండే స్త్రీల గురించి నాకు తెలిసినంతవరకూ పాజిటివ్ గా చూపిస్తూ వచ్చిన కథ ఒక్కటైనా లెదు. (నేనైతే చదవలేదు!) కానీ అలాటి ఆడవాళ్ళూ ఉన్నారు! అలాటి భార్యల వ్యక్తిత్వాలని అప్రీషియేట్ చేస్తూ వాళ్ళకి సహకరించే భర్తలూ వున్నారు. అలాటి స్త్రీ పురుషులకి సాహిత్యంలో ఎటువంటి చోటూ వున్నట్టు కనపడదు
Lol. కథలలో రచయితల ఉద్దేశాలను బట్టి నీతులు మారుతుంటాయి. మీరు చదివిన కథలు అలా ఉంటే, నేను చదివిన కథలు మరోలా ఉన్నాయి.నిజం చెప్పాలంటే, మీరు చదివిన కథలకు పక్కా వ్యతిరేకం అవి.
క్లాసులో ఇద్దరమ్మాయిలుంటారు. ఒకమ్మాయి, ఫస్టు వస్తూంటుంది, మహా తెలివైనది. ఆ అమ్మాయి, కాలేజిలో ఉన్నంతవరకూ మహా చురుకైనది. జల జల పారే జలపాతం లాంటిది. చెంగున చెంగున దూకే లేడిపిల్ల లాంటిది. మరో అమ్మాయి యేదో యావరేజ్. ఓ పది సంవత్సరాలు కాలం గిర్రున తిరుగుతుంది. ఇదివరకు చెప్పుకున్న, జలపాతం, చెంగున ఎగిరే లేడిపిల్ల లాంటి అమ్మాయి, పెళ్ళి చేసుకుని గంపెడు సంసారముతో, తనని నిత్యం బాదలు పెట్టే భర్తతో రొప్పుతూ రొష్టుతూ బతుకుతుంటుంది. ఈ యావరేజు అమ్మాయేమో, ఉద్యోగం చేసి, తన కాల్లమీద తాను నిలబడి, కారులోంచి దిగుతూ, మీద పడుతున్న కేశాలను అలవోకగా వెనక్కు తోసుకుంటు ఉంటుంది. అలా తోసుకుంటు తోసుకుంటూ, ఒక రోజు తన పాతమిత్రురాలిని చూసి బాదపడుతుంది. ఆమె యేం కోల్పోయిందో తెలియజేసి, మగజాతిని కాసేపు కడిగేసి, స్త్రీకి స్వాతంత్ర్య ఎంత అవసరమో, మొగుడున్నా లేకపోయినా ఎలా అబ్దుతంగా బతకొచ్చో చెబుతుంది.
మగవారంతా అలానే ఉంటారా? ఆడవాల్లంతా ఇలానే ప్రవర్సిస్తారా? ఉద్యోగము లేకుండా ఇంట్లో గృహిణిగా బతికే ఆడవారు అంత దారుణమైన స్థితిలో ఉన్నారా? ఉద్యోగాలు చేసే వారు అంత గొప్పగా బతుకుతున్నారా?
మరో కథలో అయితే, అలివిమాలిన ఆదర్శాలు ఏకరువు పెడతారు రచయిత్రి/రచయితలు. ఆ అలివిమాలిన ఆదర్శాలకు పాపం మగవారు ఒప్పుకోరు. అంతే .. ఆవిడ, స్త్రీజాతి మొత్తాన్ని ఉద్దరించడానికి గాను పెట్టె సర్దుకుని, ఉదయిస్తున్న సూర్యుడి వైపు నడుస్తూ వెల్లిపోతుంది.
మొదట్లో ఇలాంటి కథలు కొన్ని చదివినా, ఆ తరువాత వారు చెప్పే ఆదర్శాలు, వారి వాదనలు చూసి విసుగొచ్చి చదవడం మానేసా.ఇది నా అనుభవం.
🙂 🙂 🙂
సినిమాలలో నటించే స్త్రీలు, మోడలింగ్ చేసే స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గురించి విన్నాను. కానీ డాక్టర్, సైంటిస్ట్ లాంటి ఉద్యోగాలు చేసే స్త్రీలకి తమ వృత్తి పెళ్లికి అవరోధం ఎలా అవుతుంది?
ఇంకో విషయంలో శారద గారి పాయింట్‌ని అంగీకరిస్తున్నాను. రెండు తరాల క్రిందటే కాదు, పల్లెటూర్లలో ఇప్పుడు కూడా ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉంటున్నారు. పల్లెటూర్లలో కూడా నేరాలు ఎక్కువగానే జరుగుతున్నాయే. పల్లెటూర్లలో వెనుకబడిన కులాలకి చెందిన స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని వార్తలు పేపర్లలో చదవడం లేదా?
చాలా బాగా రాశారు.. అందరు ఆడవాళ్ళూ అలా వుంటేనే సంఘానికీ, కుటుంబానికీ క్షేమం అన్న ప్రతిపాదనని తిరస్కరిస్తున్నాను. — Totally agreed
“వృత్తిని ప్రేమిస్తూ, ఉద్యోగాన్నీ, ఇంటి బాధ్యతలనీ సమానంగా చాకచక్యంతో నిర్వహించుకుంటూ, టైం మేనేజ్ మెంటుని ఇరవై నాలుగ్గంటలూ అమలులో వుంచుతూ వుండే స్త్రీల గురించి నాకు తెలిసినంతవరకూ పాజిటివ్ గా చూపిస్తూ వచ్చిన కథ ఒక్కటైనా లెదు. (నేనైతే చదవలేదు!) కానీ అలాటి ఆడవాళ్ళూ ఉన్నారు! అలాటి భార్యల వ్యక్తిత్వాలని అప్రీషియేట్ చేస్తూ వాళ్ళకి సహకరించే భర్తలూ వున్నారు. అలాటి స్త్రీ పురుషులకి సాహిత్యంలో ఎటువంటి చోటూ వున్నట్టు కనపడదు”
వాళ్ళ జీవితాలు ఎలాగూ బాగానే ఉన్నాయి, ఇంకెందుకూ వాళ్ళని గురించి రాయడం? 🙂
నవ్వులాట పక్కన బెడితే – చాలా బాగా రాశారు. నాకెందుకో మీ వ్యాసం చదివినంత సేపూ పి. సత్యవతిగారి పెద్దకథ, పెళ్ళిప్రయాణం బాగా గుర్తొచ్చింది.
మొదటి వ్యాఖ్య రాసిన ఆకాశరామన్న గారికి – అయ్యా, మధ్యతరగతి భారతీయ కుటుంబాల్లో పెళ్ళి తరవాత అమ్మాయి ఏంచేస్తుందీ అనే నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అత్తారింటి వాతావరణం మీదనో, లేక భర్త ప్రిఫరెన్స్ పైననో మాత్రమే ఆధారపడి ఉన్నది, ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. దీనికి వ్యతిరేకంగా కనిపించే ఉదహరణలు – they are exceptions that prove the rule.
నవలలేమిటి? సినిమాలు కూడా అంతే కదా. పెళ్లి కాని స్త్రీ కష్టపడి సంపాదించి తల్లితండ్రులని పోషిస్తున్నట్టు చూపిస్తారు కానీ పెళ్లైన స్త్రీ భర్త కింద sub-oridinateగానే ఉంటున్నట్టు చూపిస్తారు. నవలలోలాగే కొన్ని సినిమాలలోనూ పెళ్లైన తరువాత స్త్రీలు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు చూపించారు.
ఒక నటుడుగా ఇలాంటి నాటకాలు చూసినప్పుడు చాలా బాధపడేవణ్ణి (ఓ నాటకం లో అయితే మొగుడు బెల్టుతో తన భార్యని కొట్టి “ఉద్యోగానికి వెళ్ళు! డబ్బుతే!” అంటూ కొడుతూ వుంటే ఆ కొడుకు మానసిక వ్యాధికి గురై నట్టు చూపిస్తాడు. నా భార్య కూడా వుద్యొగస్తురా లే గాని (ఇప్పుడు నా కూతురు కూడా) వాళ్ళకి నేనెప్పుడూ ఒకటే చెప్తాను. “మీకు ఎప్పుడు ఇబ్బంది ఒస్తే అప్పుడు మానేయండి. ఎంతలో వుంటే అంతలోనే సర్ధుకుందాం” అని. సుమారు తొంభైతొమ్మిది శాతం ఇలాగే వుంటారు. ఎవడో తాగు బోతువాడు తప్ప. కొంత మంది రచయతలు భార్య కారక్టర్ చెడిపోయినట్టు (ఉద్యోగంలోకి వెళ్ళేక) కూడా చూపిస్తారు. ఇంట్లో వుండి మొగుడు అలా వెళ్ళ గానే పరాయి వాళ్ళతో కులుకే వాళ్ళు నాకు తెల్సిన వాళ్ళు బోల్డు మంది వున్నారు
ఎప్పట్లాగే స్పందలకి ప్రతి స్పందించటంలో నేను లేటు!
ఉన్న ఒక్క బ్లాగులో అప్పుడప్పుడూ రాసుకుని వ్యాఖ్యలకి జవాబివ్వటానికే నాకింత కష్టంగా వుంది, ఆయనెవరో మూడేసి ఐడీలతో బ్లాగులు మెయింటెయిన్ చేసారంటే “అంత టైమెక్కడిదబ్బా!” అని ఆశ్చర్యపోయాను!
@ఆకాశరామన్న గారూ
“ఉద్యోగము లేకుండా ఇంట్లో గృహిణిగా బతికే ఆడవారు అంత దారుణమైన స్థితిలో ఉన్నారా? ఉద్యోగాలు చేసే వారు అంత గొప్పగా బతుకుతున్నారా?”
ఇక్కడ నేను చర్చించదలచుకుంది “ఆడదానికి గృహిణిగా జీవితం మంచిదా, లేక ఉద్యోగం మంచిదా” అని కాదండీ. అది చాలా వ్యక్తిగతమైన నిర్ణయం! నేను చెప్పదలచుకున్నది “ఉద్యోగస్తులైన ఆడవాళ్ళని స్టీరియోటైపింగ్ గురించి!” , especially the negative thinking surrounding employed, independent women. మీకా స్టీరియోటైపింగ్ కనపడకపోతే, that’s good.
@ మహేశ్ గారూ,
ఫేస్ బుక్కు లోనేమో లైకారు, ఇక్కడేమో నవ్వారు ఈ నవ్వుల కర్ధమేమిటో. I hope it is not making fun of me!
@ప్రవీణ్
చదివి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@కృష్ణ ప్రియ గారూ
ధన్యవాదాలు.
@కొత్తపాళీ గారూ,
“పాజిటివ్” అంటే సమస్యలు లేవని కాదండీ! వాళ్ళని ఎప్పుడూ విలణిలుగా, స్వార్థపరులుగా, డబ్బు వెనక పరిగెత్తే వాళ్ళుగా చూపిస్తారన్న ఉద్దేశ్యంతో అన్నాను. Frankly, I don’t see what is wrong in running after money, but that is a different matter. సత్యవతి గారి కథ నేను చదవలేదు. ఎక్కడ దొరుకుతునో చెప్పగలరా?
@వోలెటి గారూ,
Exactగా నా పాయింటూ అదేనండీ. ఆడవాళ్ళూ, (మగవాళ్ళైనా) ఆర్ధిక స్వాతంత్ర్యమూ, సొంత ఆలోచనా వున్నందువల్ల “చెడి పోరు” (whatever we mean by ceDipOvaTam). దానికింకా చాలా ఫాక్టర్లు కావాలి.
శారద
పింగుబ్యాకు: అనువాద వి’శారద’ | జాజిమల్లి