మధువంతి

  • మధువంతి- ధర్మవతి రాగంలోంచి పుట్టిన అందమైన రాగం. చాలా వరకు హిందుస్తానీ సంగీతంలో ఉపయోగించినా, కొన్ని కర్ణాటక సంగీతంలో పాటలు కూడా వున్నాయి. రాగానికి అందం చాలావరకు ప్రతి మధ్యమం లో, కాకలి నిషాదం లో వుంటుంది. “కండనాల్ ముదలాయ్ కాదల్ పెరుగుదడీ” అనే పాటా, “రస్మ్-ఎ-ఉల్ఫత్” అనే హిందీ సినిమాలో పాటా వింటే చాలా వరకు మధువంతి అర్ధమౌతుంది.

 

మధువంతి- మా పదిహేడేళ్ళ అమ్మాయి! మేమిద్దరం ఎంతో ఇష్టపడ్డ రాగం పేరు పెట్టుకున్నాం. (అసలు చిన్నదానికి షహాన అని పెట్టాలనుకున్నాం కానీ, కారణాంతరాల వల్ల వీలుపడలేదు!) నిన్న మా మధు మొదటిసారి కర్ణాటక సంగీత పధ్ధతిలో కచేరీ చేసింది. ఎన్నో రోజులనించీ ఎదురు చూస్తున్న క్షణం వచ్చిందనిపించింది నాకు!

“నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ” అన్నట్టు, సంగీతం మెట్లెక్కటానికి వెళ్ళే దారిలో ఇది మొదటి అడుగు మాత్రమే! అయినా బిడ్డ వేసే మొదటి అడుగు తల్లికి అపురూపమే కదా?

అందుకే నా సంతోషాన్నీ రిట్రోస్పెక్షన్నీ పంచుకోవటానికే ఈ టపా!

పిల్లలిద్దరికీ చిన్నప్పట్నించి నేను కొంచెం పాడటం నేర్పినా, ఇద్దరూ ఇక్కడ అడిలైడ్లోని శ్రీమతి సుమా మంజునాథ్ వారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. అదనంగా మధు సింగపూర్ లోని మా బంధువు శ్రీమతి రసికా విశ్వనాథ్ వద్ద కూడా నేర్చుకుంటుంది. వీళ్ళిద్దరూ కాక పిల్లలిద్దరికీ తండ్రి చాలా శ్రధ్ధగా వాళ్ళ విద్యని మెరుగు పెడతారు.

మధు కచేరీ చక్కగా చేసింది. దాదాపు గంటన్నర సేపు ఒక్క మృదంగం మాత్రమే తోడుగా గొంతు సాఫీగా సాగాలంటే కష్టమే. అందులో తను మొదటి విజయం సాధించింది.

ముందుగా షహాన రాగంలో “కరుణింప” అనే వర్ణం ఆది తాళంలో రెండు కాలాల్లోనూ పాడింది. తరువాత చిన్న రాగం ఆలాపన చేసి నాట్టైలో “మహా గణపతిం” పాడింది. ఈ పాటకి తను స్వరకల్పన కూడా చేసింది. తరువాత చిట్టై స్వరంతో పాడటం ఆనవాయితీ కాబట్టి బిళహరి రాగంలో తిరువొట్రియూర్ త్యాగయ్య గారి “సారస దళ నయనా నన్ను సరగున బ్రోవగ రాదా” పాడింది. తరువాత చక్రవాకంలో “సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామా” పాడింది. (త్యాగరాజ కీర్తనల గురించి మాట్లాడితే నాకు పూనకం వస్తుంది!!)ఆ తరువాత తన మెయిన్ పీస్ గా అభోగి రాగం ఆలాపన చేసి దీక్షితార్ వారి “శ్రీ లక్ష్మి వరాహం” పాడింది. దీనికీ ఇంకొంచెం వివరంగా స్వర కల్పన చేసింది. ఇక తరువాత అంతా చిన్న చిన్న పాటలు పాడింది. బెహాగ్ లో “నారాయణ తే”, తిలంగ్ లో “రామ రామ రామ సీతా”, పహాడీ లొ” పాయోజీ మైనే రాం రతన్ ధన్ పాయో”, రాగమాలిక లో “కురైన్ ఒన్రుం ఇల్లై” పాటలు పాడింది. మృదంగ సహకారం శ్రీ అరవింద్ రాజగోపాలన్ ఇచ్చారు.

 

మధు మొదటిసారి అయిదేళ్ళప్పుడు స్టేజీ ఎక్కి “వందే మాతరం” పాడింది. అది విన్న అడిలైడ్ హిందూ సొసైటి వాళ్ళు దాన్ని ఇంకొక ప్రోగ్రాంలో అదే పాట పాడమని అహ్వానించారు.చిన్నగా బొమ్మలా పట్టు లంగా రెండు పిలక జడలతో ఒక్కతీ ధైర్యంగా యూనివర్సిటీ పెద్ద ఆడిటోరియంలో పాడినప్పుడు దానికంటే నాకు ఎక్కువ భయం వేసింది. “నాన్నా, నేను నీ పక్కన కూర్చోనా?” అని అడిగితే, “వద్దు” అంది కూడా! మళ్ళీ నిన్న రాత్రి ఆ రోజు గుర్తుగా దేశ్ రాగం లో చిన్న ఆలాపన చేసి “వందే మాతరం” ఇంప్రొవైస్ చేస్తూ పాడింది. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయంటే నా తప్పంటారా?

 

ఆఖర్న తన పేరుతోనే వున్న రాగం మధువంతిలో లాల్ గుడీ జయరామన్ గారి థిల్లాన పాడి, “రామ చంద్రాయ” తో మంగళం పాడింది.

వేసిన అడుగు చిన్నది, చేయాల్సిన ప్రయాణం పెద్దది. పాటలూ, స్వరాలూ బాగున్నా, రాగం ఆలాపన ఇంక చాలా చాల…. మెరుగు పర్చుకోవాలి. ఇలాటివే ఇంకా చాలానే వున్నాయి దిద్దుకోవాల్సిన విషయాలు.

కానీ, కైలీ మినో, జస్టిన్ బైబర్, మైకెల్ బూబుల్ ప్రభంజనాన్ని తట్టుకుని మా ఇంట్లో త్యాగరాజ స్వామీ, దీక్షితార్ లు నిలబడ్డందుకు నేను భగవంతుడికి రోజూ ధన్యవాదాలు అర్పిస్తాను. నాలుగు రోజుల కింద పుస్తకాలు సర్దుతూ మధు “అమ్మా! నిధి చాల సుఖమా, సెవెన్ బీట్ సైకిల్, సరిపోవటంలేదు, కొంచెం చూపించు” అంటూ వంటింట్లోకొచ్చి, చెప్పించుకుని, “గా దా పా- దపమగా, గా, గా, రీ, రీ,సా..” అంటూ కూని రాగం తీస్తుంటే మళ్ళీ దేవుణ్ణి తలచుకున్నాను.

ఈ సంవత్సరం మా మధు పన్నెండో తరగతి. భయంకరమైన పోటీ, ప్రెషరూ! అవన్నీ తట్టుకొని బాగా చదవాలని, మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశతో,

మధు-అను వాళ్ళ అమ్మ.

7 thoughts on “మధువంతి

  1. నిజ్జంఘా మనస్ఫూర్తిగా మీ మధు,అనూలను ఆశీర్వదిస్తున్నానండి. అదృష్టవంతులు. మన ఆశలకు పిల్లలపై రుద్దకూడదు అన్నది ఒకవాదమైతే, మన ఆశలను,కలలను పిల్లలు ఇష్టపడి వాటిని సాకారం చేయటానికి ప్రయత్నించటం ఒక ఏత్తైతే, పిల్లలకు ఏ కళైనా అబ్బటం అనేది నిజమైన అదృష్టం అని నా అభిప్రాయం. మీ టపా చదివి చాలా ఆనందం కలిగింది. ఆ మధ్యన ఒక చోట హేమమాలిని, పిల్లలిద్దరితో డాన్స్ ప్రోగ్రాం ఇస్తున్న ఫోటోలు కనిపిస్తే ఇదే ఆనందం కలిగి నా బ్లాగ్లో పెట్టను.
    God bless madhuvanti(beautiful name!).

  2. మధు, అను ఇద్దరికి ఆశీర్వాదాలు. మన విజయాలకంటే మన పిల్లల చిన్ని చిన్ని విజయాలే మనకు ఆనందం, గర్వంతో కూడిన భాష్పాలు ఇస్తాయి. మీ టపాలోని ప్రతి మాట అర్ధమైంది. మీ పిల్లలు మీకు మరిన్ని సంతోషాలను ఇవ్వాలని , ఇస్తారని కూడా కోరుకుంటున్నాను..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s