ఎల్లలు లేని ప్రపంచం

మొన్న శనివారం. పొద్దున్నే మా మావగారు,”శారదా! ఇవాళ గోంగూర పచ్చడి చేస్తానన్నావు! తోటలో నించి కోసి తెస్తా కొంచెం ఎండెక్కగానే,” అన్నారు.  (ప్రస్తుతం మా అత్త మామలు మాతోనే వుంటున్నారు.)

మళ్ళీ, “అలాగే ఆకుకూర వేసి పప్పు చేస్తావు చూడు, అది కూడాబాగుంటుంది.! ఇవాళ చేయి!”

 “అలాగేనండి!”-నేను.

 “నేను స్నానం చేసి వరకు కూరలు కోయకు! నేనొచ్చి కోసి పెడతాను!”

 “అలాగేనండి! తొందరేం లేదు. మెల్లిగా షేవింగూ స్నానమూ చేసి రండి!”- నేను.

మా పూర్వీకులది తెలంగాణా! నేను పుట్టి పెరిగిందీ అంతా హైదరాబాదు. మేము మద్రాసు నిండి హైదరాబాదు వెళ్ళేటప్పుడు, చెన్నై ఎక్స్ప్రెస్ హైదరాబాదు పొలిమేరల్లోకి చేరగానే మురళీ, “అన్నట్టు, మీ అమ్మని దోసకాయ పప్పూ, గోంగూర పచ్చడీ చేయమంటావా??” అంటారు.

వాళ్ళది తిర్నెల్వేలి దగ్గరున్న చిన్న పల్లెటూరు. తమిళం ఇంగ్లీషు తప్ప వేరే భాషే రాదు. మేమిద్దరం పేళ్ళి గురించి మా మా ఇళ్ళల్లో ప్రస్తావించగానే రెండు వైపులా కొంచెం నసిగారు. “అబ్బా! తమిళులా? వాళ్ళతో మనమెలా నెగ్గుతాం?” అని మా వైపు అంటే, మా అత్తగారైతే నా పెద్ద చదువూ, చిన్న వయసులో పెద్ద ఉద్యోగమూ చూసి “ఇంత చదువు చదివిన కోడలు మన ఇంట్లో ఇముడుతుందా! పైగా భాష కూడా రాదు!” అని భయపడ్డారట. ఇప్పుడు ఎవరికైనా ఈ విషయం చెప్పినా నమ్మరు! అలాగుంటుంది మా ప్రవర్తన.

మొత్తం మా బంధు వర్గంలో ఎవరూ నన్ను “తెలుగమ్మాయి!” అని వెక్కిరించిందో నొప్పించిందో లేదు, మురళీ వాళ్ళ నానమ్మతో సహా! నేను అన్నంలో కూర కలుపుకోవటం వాళ్ళకి వింతగా అనిపిస్తే, భోజనం మొదట్లోనే కంచం నిండా సాంబారు వొంపుకోవటం నాకు విచిత్రంగా అనిపించేది. అదేదో దెబ్బలాడుకోవాల్సిన విషయంగా వాళ్ళకి కానీ నాకు కానీ అనిపించలేదు. మా పిల్లలిప్పుడు ముందు సాంబారన్నం తిని, తరువాత కూరన్నం తింటారు! “గోంగూర పచ్చడి “పెండలాగుంది,” అని వాళ్ళనలేదు, “పొద్దున్నే పప్పూ-అన్నం ఎలా తింటారు (వెణ్-పొంగల్)” అని నేననలేదు.

నేను వరలక్ష్మీ పూజకి కలశం పెట్టి పూజ చేసుకొని, దసరా నవరాత్రికి బొమ్మల కొలువు పెట్టి పేరంటం పిలుస్తాను. నేను మర్చిపోయినా మా అత్తగారు ఉగాదికి ఫోన్ చేసి గుర్తు చేస్తారు. మాకూ బోలెడు ఆబిప్రాయ భేదాలూ, అప్పుడప్పుడూ వచ్చే ఈగో-కాంఫ్లిక్టులూ వున్నాయి, ప్రతీ ఇంట్లో లాగే. వాటితో సర్దుకోవటం కూడా మేమే ఎలాగో కష్టపడి నేర్చుకున్నాను. “ఛీ! ఈ తెలుగు వాళ్ళ పిల్ల మాకెలా దాపురించింది” అని వాళ్ళనుకోలేదు. “ఈ తమిళుల ఇంట్లోకెలా వచ్చి పడ్డానురా దేవుడా,” అని నేనూ అనుకోలేదు. నేనూ మురళీ ఇద్దరమూ తెలుగూ-తమిళమూ చక్కగా మాట్లాడతాము. ఇక్కడ రెండు సంఘాల్లోనూ మాకు సభ్యత్వం వుంది.

ఇక్కడ నాకు చాలా  స్నేహితుల్లో కన్నడ మాట్లాడేవాళ్ళూ, ఉత్తర భారతీయులూ,ఒకరిద్దరు పాకిస్తానీలూ కూడా వున్నారు. మళ్ళీ కల్చరల్ తేడాలు పెద్దగా నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నిజానికి ,ఉత్సాహంగా వాళ్ళ వంటకాలూ, వాళ్ళ భాషలూ నేర్చుకోవటానికి ప్రయత్నించాను కూడా. మాకు తెల్సిన పాకిస్తానీ జావేద్, “రాజకీయ నాయకులే అనవసరంగా సెగలూ పొగలూ రాజేస్తారండీ! మనలాటి మామూలు మనుషులకి పెద్ద విరోధమేమీ వుండదు!” అన్నాడు.

మన విభిన్న సంస్కృతులని చూసి గర్వపడే మనం, ప్రాంతీయ ద్వేషాలకెప్పుడు దిగజారాం? రవీంద్రుని గీతాంజలిని తలచుకుని గర్వపడ్డ సమాజం, “మా ప్రాంతం వాడు కాదని” నన్నయ్య విగ్రహాన్ని నీళ్ళలో తోసి వేసే స్థితికెలా వచ్చింది?

తెలంగాణా సమస్యలో నన్ను చాలా రోజులుగా ఒక ప్రశ్న బాధిస్తుంది. తెలంగాణా “ఇవ్వటం” ఏమిటి? ఎవరికి ఇస్తాం? ఒక దేశంలోని భూభాగం ఆ దేశ పౌరులందరికీ చెందినదే కదా? దాన్ని అచ్చంగా కొంత మందికి “ఇచ్చెయ్యటం” సాధ్యమయ్యే పనా? సాధ్యమైనా సరైనదేనా??

“ఒకే దేశం గా పిలవబడే ఒక పెద్ద భూభాగాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న “రాష్ట్రాలుగా” విభజిస్తాం! అలా రాష్ట్రాలుగా విభజించటం పరిపాలనా సౌలభ్యం (administrative convenience) కొరకే కానీ. ప్రజలని ప్రాంతీయ వాదనలూ, భాషా ద్వేషాలతో విడదీయటానికి కాదు! విభజించటానికీ విడదీయటానికీ చాలా తేడా వుంది. మనం ఆ తేడా తెలుసుకోలేకపోతున్నాం.

కొన్నాళ్ళ తరువాత, ముస్లిములూ/క్రిస్చియనులూ/వేర్వేరు కులాల వారూ “మేము సాంస్కృతికంగా, భాషా పరంగా వేరు, రాజకీయ నాయకులెవ్వరూ మా వర్గాల్లోంచి లేరు,  మాకూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, ” అంటే ఇవ్వడానికి వీలవుతుందా? ఒకవేళ వీలైనా, దేశ భవిష్యత్తుకి అది అంత మంచిదా?

నిజమే, నేను తెలంగాణకి చెందిన స్త్రీనే అయినా తెలంగాణ రైతుల కష్టాలతో నాకు పెద్దగా పరిచయం లేదు. వాళ్ళ వాదనలో నిజానిజాలూ, బలా బలాలూ కూడా తెలీదు. అయితే ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు.

 ద్వేషం, వైషమ్యం, విరోధం, రాజకీయ నాయకులూ- ప్రపంచంలోని ఏ సమస్యనీ తీర్చవు/తీర్చరు. ప్రతీ సమస్యని మరింత జటిలం చేయటం మాత్రమే అవి చేయగలిగే పని. పెద్దవైనా చిన్నవైనా సమస్యలు తీర్చగలిగే శక్తి “సామరస్యపు ధోరణీ”, “ఒకరి నుంచి ఒకరం మంచి విషయాలు నేర్చుకోవటం,” “పరస్పర సహకారం”, “గౌరవం” ఇలాటి చాదస్తపు భావాలకే వుంది!

 ఏ రాజకీయ నాయకుడూ ఏ ప్రాంతాన్నీ అభివృధ్ధి చేయడు. కాబట్టి “మీ ప్రాంతం పాలకులే అంతా! అందుకే మీ వాళ్ళే అభివృధ్ధి చెందుతున్నారు” అన్న వాదనలో పెద్దగా న్యాయం లేదు. రాజకీ నాయకుడు అభివృఢ్ధి చేసేది ఒకే ఒక వర్గం- తన వర్గం. ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో వున్నా మామూలు మనుషుల వల్లనే అభివృధ్ధి చెందింది.

“ఈ క్రీం వాడితే మీ చర్మ సౌందర్యం పదింతలవుతుంది,” అన్న వ్యాపారస్తుని మాటల్లో ఎంత నిజం వుందో, “నాకు అధికారం వస్తే మీ సమస్యలన్నీ పోయినట్టే” అన్న రాజకీయనాయకుని మాటల్లో అంతే నిజముంది.

 ఏ రాజకీయ నాయకుడికీ ప్రజలు ఐకమత్యంతో వాళ్ళ వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోవటం ఇష్టం వుండదు. లేని భయాలని రేకెత్తించి, లేని భూతాలని చూపించి, లేని భేదాలని సృష్టించి, ప్రజల్లో రక రకాల వైషమ్యాలూ, విభేదాలూ, పోట్లాటలూ రగిలించి తమ పబ్బం గడుపుకోవటమే వాళ్ళ వృత్తీ/ప్రవృత్తీ!

అది అర్ధం చేసుకొని, మన మధ్య వున్నవి భేదాలే కానీ విభేదాలు కావనీ, పక్క మనిషిలోని మంచిని అనుకరించి చెడుని వదిలెయ్యటమా, లేక చెడునే భూతద్దంలో చూసి ఒకరినొకరు నరికేసుకోవటమా అన్నది మన మన విఙ్ఞతతో తేల్చుకోవాల్సిన విషయం.

ఆడవారూ-మగవారూ,

పేదలూ-ధనికులూ,

ఆంధ్రులూ-తమిళులూ, కన్నడిగులూ, మలయాళీలూ

దక్షీణ భారతీయులూ – ఉత్తర భారతీయులూ

భారతీయులూ-ఇతరులూ

పిల్లలూ-పెద్దలూ

ఇలా వర్గీకరించుకుంటూ, విభేదించుకుంటూ పోతే ఇది అనంతం! దాదాపు ఆరు బిలియన్ల వర్గాలు తేలుతాయి.

ప్రపంచమంతా ఒక్కటే, మనం ప్రపంచ పౌరులం అన్న భావన వెల్లి విరియాల్సిన కాలంలో ప్రాంతీయ ద్వేషాలకు చోటుండాలా?

రాజకీయ నాయకులు నా దేశ ప్రజలలో లేని తేడాలని పెద్దగా చూపిస్తూ మమ్మల్ని మానసికంగా విడదీయటాన్ని నేను ఖండిస్తున్నాను. నాకు సుబ్రహ్మణ్య భారతీ, బంకించంద్ర చటర్జీ,

రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులూ, రవి వర్మా, స్వాతి తిరుణాల్, బిస్మిల్లాహ్ ఖాన్, జాకిర్ హుసేన్, పురందర దాసులు, జయదేవుల వారూ ఇంకా ఎందరో ఎందరో ఆరాధ్య దైవాలు. “వాళ్ళది మీ తెలంగాణా కాదు! వాళ్ళని గౌరవించాల్సిన పని లేదు” అన్న రాజకీయనాయకులని నేను నమ్మను. వాళ్ళు ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడినా నాకనవసరం.

భరత మాత అందమైన చీరలో పడుగూ పేకలా కలిసిపోయిన రంగు రంగుల దారాలం మనం. అలాగే కొనసాగి ఆ చీరని అందంగా ముందు తరాలకి బహూకరిస్తామో, ఏ దారానికాదారం విచక్షణారహితంగా వేరుపడి పీలికలు పీలికలుగా వదిలేస్తామో కాలమే చెప్పాలి.

చివరిగా మా చిన్నమ్మాయి అనన్య తన ఇంగ్లీషు హోం వర్కు కొరకు రాసిన చిన్న పద్యం మనకందరికీ ఇప్పుడు అవసరమనిపించింది.

Dear God

I give thanks for the happy events we experience

I pray for the strength to pick us up from the bad ones

I give thanks for the dreams and desires

I pray that we can reach higher than the stars

I give thanks for the nature; for the trees, mountains and rivers

I pray that we can preserve the unspoken beauty of it

I give thanks for the cultural diversity and variety

I pray that we can rejoice in one voice

I give thanks for faith and religion

I pray that we can learn to accept and respect- each and every one

I give thanks for the gifts

I pray that we can learn to give and not always get.

Ananya Muralidharan

11 thoughts on “ఎల్లలు లేని ప్రపంచం

 1. చాల బాగా చెప్పారు మీరు..ప్రతి పదం నిజం. ఎలా కుల్చుకుంటూ పొతే చివరికి ఎక్కడ మిగులుతము?

  ఈ పోస్ట్ చదువుతుంటే, నేను ఎప్పుడో రాసిన ఒక పోస్ట్ గుర్తుకువచ్చింది..ఇక్కడ paste చేస్తున్న.నేను ఎప్పుడో, ఎక్కడో ఒక కధ చదివాను. ఎవరు రాసారో, ఎక్కడ చదివానో కూడా గుర్తులేదు. కానీ మనసుకు బాగా అత్తుకుంది. దాని సారాంశం ఇది.
  ఒక చిన్న బాబు తన కుటుంబంతో పల్లెటూరు నుంచీ పట్నానికి బదిలీ అవుతాడు. ఆ చిన్న వయసులో స్కూల్ కి వెళ్లీ , సాయంత్రం ఇంటికి రాగానే “హమ్మయ్య నా ఇంటికి వచ్చేశాను“ అన్న secured feeling. ఇంటర్మీడియేట్ కి వేరే ఊరిలో ఉన్న కాలేజీ,hostel ల్లో join అవుతాడు. సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు “ఇది నా ఉరు” అన్న అదే secured feeling. డిగ్రీకి పక్క రాష్ట్రములో ఉన్న collegeల్లో join అవుతాడు. Train లో సెలవులకు వస్తున్నప్పుడు చాలా రాష్ట్రాల మీదుగా ప్రయానిస్తాడు.ఆంధ్రాలోకి ప్రవేశించగానే “ఇది నా బాష, నా రాష్ట్రము” అనుకుంటాడు. ఆ తర్వాత PG చేయ్యటానికి వేరే దేశం వెళ్తాడు. మల్లీ సెలవులకే వస్తున్నప్పుడు flight ఇండియాలో land అవ్వగానే, “ఇది నా దేశం, నా ప్రజలు” అనుకుంటాడు. ఉద్యోగరీత్యా space లోకి వెళ్తాడు. తిరిగి వస్తూ space rocket భూమి మీద దిగగానే, “ఇది నా భూమి, నా మనుషులు” అనుకుంటాడు.
  మనిషి చుట్టూ గీసుకున్న వృత్త వ్యాసం పెరుగుతుందే కానీ, మనిషి పొట్టకు కావాల్సిందే తిండే, మనసుకు కావాల్సిందే మమతే.
  http://alochanalu.wordpress.com/2011/01/09/%e0%b0%ae%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b1%81-%e0%b0%ae%e0%b0%ae%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6-2/

 2. ప్రవీణ గారూ,
  మీ పోస్ట్ చాలా బాగుంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  చంద్రమోహన్ గారూ,
  ధన్యవాదాలు.
  ఇక్కడ హోమ్ వర్కులో చాలా క్రియేటివ్ రైటింగ్ ప్రాజెక్టులుంటాయండీ!
  అనన్య మిగతా రచనల కోసం వీలైతే ఇక్కడ చూడండి.
  http://www.anu-mystories.blogspot.com
  దిలీప్
  ధన్యవాదాలు.
  శారద

 3. మీ నేషనల్ ఇంటెగ్రేషన్ స్పూర్తి బాగుందండి, ఐతే తెలబాన్లకు అవి వంటబట్టాలి కదా! వాళ్ళకు వంటబట్టకుంటే లాఠీతోనైనా తలంటేసి వంటబట్టించాల్సిన చారిత్రక అవసరం ఈనాడు మన భుజస్కంధాలమీద వుంది.
  ప్రవీణ్గారు తెలబాన్లని స్పేస్‌లోకి పంపితే … చంద్రుడు అందరికీ( ఆంధ్రోళ్ళకు కూడా) వెన్నెల పంచి తెలంగాణ ద్రోహి ఆటోమేటిక్‌గా అయిపోయాడు కాబట్టి కూల గొట్టేస్తారేమో! 🙂 వీళ్ళు అంత త్వరగా మారుతారన్న నమ్మకం నాకు లేదు, వీళ్ళదేదో అందరూ దోచారు అని రక్తంలో నాటుకుపోయేలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగిపోయింది. 🙂

 4. చాలా బాగారాశారండీ. కాకపోతే నాకు కొంచెం తేడాలున్నాయి. చెప్పడానికి ప్రయత్నిస్తాను.

  ౧.>>విభజించటానికీ విడదీయటానికీ చాలా తేడా వుంది. మనం ఆ తేడా తెలుసుకోలేకపోతున్నాం – ఇది సూపర్ప్ . పర్ఫెక్టు.
  కానీ, రాష్ట్రాలుగా విభజించటం పరిపాలనా సౌలభ్యం మాత్రమే కాదండి. అందులో రాజకీయ సౌలభ్యం కూడా ఉండి ఉంటుందేమో. ఒక్కసారి చూడండి. ఒట్టి పరిపాలనా సౌలభ్యం అయ్యుంటే, స్టోరీ ఇలా ఉండదు.

  ౨. రాజకీయ నాయకులని, మార్కెటింగ్ హెడ్సుని నేను మరీ అంత నెగటివ్‌కీ తీసెయ్యలేను. సరియైన నాయకులు, మార్కెటింగ్ హెడ్సు ప్రమోట్ చేసేది -“సామరస్యపు ధోరణీ”, “ఒకరి నుంచి ఒకరం మంచి విషయాలు నేర్చుకోవటం,” “పరస్పర సహకారం”, “గౌరవం” లాంటి చాదస్తపు భావాలే. మీరన్నట్టు ఇవి ఇప్పుడు చాదస్తపు భావాలంటున్నారేంటో జనాలు. అందుకేనేమో మార్కెటింగ్ హెడ్సూ కొన్ని పరిస్థితుల్లో – ద్వేషం, వైషమ్యం, విరోధం – పెంపొందిస్తారు. మీరు గమనిస్తే, ఈ మధ్య ఒకే గ్రూపు చెందిన రెండు సబ్బు ఉత్పత్తులనో, పౌడర్ ఉత్పత్తులనో కూడా, చాలా బాహాటంగా తిట్టినంత పని చేస్తున్నారు – తమ ప్రకటనల్లో. ఇంకొద్దిగా, దీనిలోతుని పసిగట్టాలి మనం.

  ౩.కానీ బ్రాడ్‌గా, యస్ – “ఏ రాజకీయ నాయకుడికీ ప్రజలు ఐకమత్యంతో వాళ్ళ వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోవటం ఇష్టం వుండదు. లేని భయాలని రేకెత్తించి, లేని భూతాలని చూపించి, లేని భేదాలని సృష్టించి, ప్రజల్లో రక రకాల వైషమ్యాలూ, విభేదాలూ, పోట్లాటలూ రగిలించి తమ పబ్బం గడుపుకోవటమే వాళ్ళ వృత్తీ/ప్రవృత్తీ!” – రైట్. ఐతే, మరి సమస్యల మాటో? ఈ వ్యవస్థని ఎంచుకున్నదీ, అసలు ఓ రాజకీయమూ, రాష్ట్రమూ అనే ఆలోచనలు సైతం – నిర్భయంగా జీవించడానికీ, భేదాలని పరిరక్షించడానికీ, వైషమ్యాలు/విభేదాల వల్ల నష్టం కలగకుండా ఉండటానికేనేమో, ఒక్కసారి ఆలోచించండి.

  కుదిరితే, తెలంగాణా సమస్యలు తెలుసుకోండి. అప్పుడు మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం.This is not a must. ఎందుకంటే, ఏ సమస్యకీ – ద్వేషం పరిష్కారం కాదు అన్నంత వరకూ ఎప్పుడూ ఏకాభిప్రాయమే. ఎటొచ్చి, ఎవడు ఎవడిని ద్వేషిస్తున్నాడు అనేది, ద్వేషంలో ఉన్నవాళ్ళకి తెలీదు. కనీసం మనకి ఈ ద్వేషులు రెండువైపులా కనపడుతున్నారో లేదో చూసుకోవాలి. అంతే. రెండు వైపులా ఉంటారు – నాకు తెలిసినంత వరకు. అందుకే, ద్వేషాన్ని ప్రేమతో జయించమన్నారు. అనటం తెలీకే. ప్రేమించడం చాలా కష్టం.

 5. రేరాజ్ గారూ,
  నిజానికి రాజకీయమే సమాజానికి ఒక సౌలభ్యం! ఒక వర్గం మంచి చెడ్డలు చూసుకోవటానికి ఆ వర్గంలోని అందరూ ఒక్కుమ్మడిగా పాల్గొనే కన్నా ఆ వర్గానికి కొందరు “రెప్రెజెంటేటివ్స్” వుండటం అన్నది స్థూలంగా దాని ప్రిన్సిపుల్. ఐతే ఏ సౌలభ్యమైనా ఒక లెవెల్ దాటితే సౌలభ్యంకన్నా న్యూసెన్స్ గా ఆ తరువాత చేటుగా పరిణమించటం కద్దు.(ఏ సౌలభ్యమైనా- టీవీ- వ్యాపార సంస్కృతీ- సంప్రదాయాలూ- ఫేస్ బుక్కూ- ఏదైనా ఈ ఎవల్యూషంకి మినహాయింపు కాదు). మన రాజకీయాలు- మార్కెటింగూ ఆ దశ చేరుకుంటున్నాయా?

  నిజానికి సైకాలజిస్టులు మనిషి మనసు వీలైనంతగా తనని తను ప్రశాంతంగా వుంచుకోవటానికే ప్రయత్నిస్తుంది అంటారు. అందుకే సామాన్యంగా మనుషులకి సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవటం, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకటం ఇష్టంగా వుంటుంది. అయితే “పరాయి” స్పీషీస్ ని చూసినప్పుడు రకరకాల ఇన్సెక్యూరిటీలు పుట్టుకు రావటం కూడా సహజమే. ఇక్కడ రాజకీయ నాయకులు చేసేది ఏమిటంటే వీలైనంత వరకూ ప్రతీ వ్యక్తికీ పక్క వాణ్ణి పరాయిగా (like a threat) ప్రొజెక్ట్ చేయటం. This might grow into uncontrollable levels if unchecked.

  I totally agree with your last point. ప్రేమించమని చెప్పటం చాలా తేలిక. ప్రేమించటం చాలా కష్టం. పరాయిలని అటుంచండి, సొంత కుటుంబ సభ్యులనే ప్రేమించలేని individualistic societies వైపు తోసుకుపోతున్నాం అందరమూ.

  తెలంగాణా సమస్యలకి రాష్ట్రాన్ని విభజించటమే పరిష్కారం అయితే, సో బీ ఇట్. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఒక రాష్ట్రం ప్రజలకి ఇంకొక రాష్ట్ర ప్రజల పొడే గిట్టకపోతే మాత్రం we might be heading for bigger crises. Needless to say ఇది అన్ని రాష్త్రాల ప్రజలకూ వర్తిస్తుంది.

  శారద

 6. $రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఒక రాష్ట్రం ప్రజలకి ఇంకొక రాష్ట్ర ప్రజల పొడే గిట్టకపోతే మాత్రం

  రాజకీయ నాయకులకు కూడా అవకాశము ఇచ్చారు కాని, కేవల౦ వారి మాటలు నమ్మి మాత్రమే ‘విభజన’ కు లేదా ‘సమైక్యత’ కు హడావుడి పడలేదు.

 7. భరత మాత అందమైన చీరలో పడుగూ పేకలా కలిసిపోయిన రంగు రంగుల దారాలం మనం.

  చాలా బాగా చెప్పారు.మీ పాప కవిత కూడా ఎంతో బావుంది.
  ఇదే మొదటిసారి అనుకుంటా మీ బ్లాగ్ చదవడం
  మిగతావి కూడా నెమ్మదిగా చదువుతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s