కానీ….

చాలా సినిమాలు నేను పాటల కోసమే చూస్తాను. ఆ పాటల్లో ఎంత లీనమై పోతానంటే అసలు కథను కూడా పట్టించుకోను. అలాటి కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు సంగీత దర్శకులూ, గాయనీ గాయకులేనేమో అనిపిస్తుంది కూడా.

అలాటి ఒక చిత్రమే 1991 లో రిలీజయిన “లేకిన్”. నిజానికి ఈ సినిమా ఆడియో కేసెట్టు నాకు 1990 లోనే దొరికింది. సినిమా మాత్రం దాదాపు పదేళ్ళ తరువాత చూసాను.

   

 ఈ సినిమా నిర్మించింది సుప్రసిధ్ధ నేపధ్య గాయని లతా మంగేష్కర్. చిత్రానికి దర్శకత్వం వహించింది గుల్జార్. దాదాపు అరవై యేళ్ళ వయసులో లతా ఈ సినిమాకి గాయనిగా జాతీయ అవార్డు అందుకుంది. దానితో పాటు గుల్జార్ కి జాతీయ అవార్డూ, సంగీత దర్శకత్వం వహించిన హృదయ్నాథ్ మంగేష్కర్ కి జాతీయ అవార్డూ కూడా సంపాదించి పెట్టిందీ సినిమా. వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియా ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు.

 రాజస్థాన్ లోని ఒకానొక మారు మూల ప్రదేశం లో ఒక పాడుపడ్డ భవంతిలోనున్న సామాగ్రి లెక్కలు చూడటానికొస్తాడు సమీర్ యోగి (వినోద్ ఖన్నా). అతనికి ఆ యెడారి దారుల్లో పదే పదే తారసపడుతుందొక అమ్మాయి, రేవా (డింపుల్ కపాడియా). పైగా, కనపడ్డ ప్రతీ సారీ, “నీ కోసమే ఎదురు చూస్తున్నాను” అంటుంది. అతనికేమీ అర్ధం కాదు. అతని స్నేహితులు అతని అనుభవాలని విని, సమీర్ భ్రాంతికి లోనవుతున్నాడనీ, అలాటి అమ్మాయి ఆ చుట్టు పక్కలెవరూ లేదనీ అంటారు. ఆ అమ్మాయి కోసం వెతుకుతూ వెళ్ళిన సమీర్ రేవాకి అక్క ఐన తారాని  (హేమా మాలిని) కలుస్తాడు. రేవా ఎవరు? ఆమెకీ సమీర్ కీ ఏమిటి సంబంధం? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా కథా, నటీ నటులూ, గొప్ప ఫోటో గ్రఫీ ఒక యెత్తూ, ఈ సినిమాకి హృదయ్ నాథ్ ఇచ్చిన సంగీతం ఒక ఎత్తూ! నన్నడిగితే ఈ సినిమాకి హృదయ్ నాథ్ హీరో. హిందుస్తానీ సంగీతాన్ని అద్భుతంగా ఉపయోగించి గొప్ప గొప్ప పాటలు సమకూర్చారాయన. ఈ సినిమా పాటలు నచ్చిన సంతోషం తో కొన్ని రోజులు నేను హృదయ్ నాథ్ స్వర పర్చిన మరాటీ పాటలు కూడా విన్నాను.

 మచ్చుకి, హిందుస్తానీ తోడి లో స్వరపర్చిన ఈ పాట వినండి. తమ్ముడు హృదయ్ నాథ్ తో కలిసి లతా ఈ పాట పాడటం, అది మనం వినటం ఒక గొప్ప అనుభూతి. హిందుస్తానీ తోడి కర్ణాటక సంగీతంలో శుభ పంతు వరాళికి దగ్గరగా వుంటుంది.

 http://www.youtube.com/watch?v=n4tvbTKvK0c

 బిలాస్ఖానీ తోడీ- భైరవీ థాట్ లోని ఇంకొక అందమైన రాగం. ఉదయం వేళల్లో పాడే ఈ రాగాన్ని ఆశా భోంస్లే, సత్యశీల్ దేష్ పాండే గొంతుల్లో వినండి ఇక్కడ.

 http://www.youtube.com/watch?v=iTd9JxGjskA

 మోహన్ రాగం (భూపాలీ) లోని చతుశృతి రిషభాన్నీ, చతుశృతి ధైవతాన్నీ కోమలం చేసి స-రి-గ-ప-ద-స, రి-ని-ద-ప-గ-రి-స అని పాడితే వచ్చేదే బిలాస్ ఖానీ తోడి. వినటానికచ్చం హిందుస్తానీ తోడి లాగే వున్నా, నిషాదం ఫ్లాట్ గా అయిపోవటం చేత దీన్ని భైరవీ థాట్ లో వుంచుతారు. (హిందుస్తానీ భైరవి = కర్ణాటక సింధు భైరవి). నాకు తెలిసినంత వరకూ కర్ణాటక సంగీతంలో బిలాస్ ఖాని తోడి కి సమాంతరమైన రాగం లేదు. ఇది తప్పైతే ఎవరైనా సరి దిద్దగలరు.

  మోహనం (హిందుస్తానీ భూపాలి) చాలా కామన్ గా ఉపయోగించబడే రాగం. పెంటాటోనిక్ స్కేల్ లో ఏదో మనిషి మనసుకి నచ్చే అప్పీలుంది. అందుకే మోహనం, హంసధ్వని, హిందోళం, శుధ్ధ సావేరి, అభోగి అంత పాప్యులర్  రాగాలు. మోహనం లోని స-రి-గ-ప-ద-స ల కి శంకరాభరణం (హిందుస్తానీ  బిలావల్) స్కేల్ అవరోహణ చేరిస్తే (స-ని-ద-ప-మ-గ-రి-స) బిళహరి పుడుతుంది. (బిళహరి=మోహనం ఆరోహణ + శంకరాభరణం అవరోహణ.!) అందులోంచి మధ్యమాన్ని తీసేస్తే?  భూపేశ్వరి రాగం పుడుతుంది!( స-రి-గ-ప-ద-స,  స-ని-ద-ప- గ-రి-స ) . పండిట్ మణి ప్రసాద్ గారు ఈ రాగాన్ని కనిపెట్టారు. అయన సృష్టించిందే ఈ పాట – ఈ సినిమాకంతటికీ హైలైట్! ఈ సినిమాలో లతాకి యారా సీలీ సీలీ అనే పాటకి జాతీయ బహుమతి వచ్చింది కానీ నాకెందుకో  ఈ పాటే దానికంటే చాలా బాగుందనిపిస్తుంది.

  http://www.youtube.com/watch?v=S1dVmm6d6VU&feature=related

 ఇంకా మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయిందులో. సురేష్ వాడ్కర్ పాడిన “సుర్మయీ షాం” పాట సంగీత పరంగా కంటే గుల్జార్ పదాల పొందిక వల్ల బాగుంటుందనిపిస్తుంది. రాజస్థానీ పాట “కేసరియా బాల్మా” కూడా బోలెడు సార్లు వినిపిస్తుంది.

 ఇక ఆ తరువాత మళ్ళీ లతా ఆ స్థాయి పాటలు పాడలేదేమో!

 

5 thoughts on “కానీ….

  1. mee review chaduvutunte cinema chuseyyalannantha tempting gaa vundi but I have no chance! Please, kadha moththam review pettaroo? ela cinema chudamani madhyalone vodileste meeku time kuda save avutundi kaani; naaku sangeethagnaanam ledu kaabatti kadhante ishtam. please………….. andeeeee!

  2. కిరణ్ కుమార్ గారూ,
    హృదయ్ నాథ్ స్వర పర్చిన మీరా భజనలు కూడా చాలా బాగుంటాయండీ! మీరు విని ఉండకపోతే వినండి.
    కవితా,
    ఈ సినిమా మొత్తం యూ ట్యూబ్ లో వుందండి. మీరు ట్రై చేసి చూడండి. దొరకకపోతే నేను లింకులు పంపిస్తాను. మొదటిసారి 2000 లో చూసినా, ఈ మధ్యనే యూట్యూబ్ లో మళ్ళీ చూసాను.
    శారద

  3. ఈ పాటలు నేను తరచూ వింటుంటాను. ఝూటే నైనా బోలే పాట లో ఆశ గొంతులో సుడులు తిరిగే గమకాలు చెప్పనలవి కానంత అందంగా ఉంటాయి. ఒక్కటేమిటి, అన్నీ ఆణిముత్యాలు!కేసరియా, యారా సీలి సీలి….సునియోజీ…అన్నీనూ! తరచుగా మా ఇంట్లోనూ, నా ప్లేయర్ లోనూ వినబడుతుంటే పాటలు.

    మీ రాగ విశ్లేషణ కూడా అద్భుతంగానూ ఉపయోగకరంగానూ ఉంది.

    మీరన్నట్లు ఆ తర్వాత లతా ఈ స్థాయి పాటలు పాడలేదు. ఆమె స్వరం కూడా అంతగా సహకరించే స్థాయిలో కూడా లేదేమో!

  4. శారద గారూ,
    లేకిన్, రుడాలి లత పాడిన పాటల్లో ఎక్కువగా నన్ను వెంటాడేవి. హృదయ్ నాథ్ గారి మీరా భజనలు కూడా నాకు నచ్చాయి.
    సుజాత గారన్నట్టు, లతా మైనే ప్యార్ కియా నుంచి పాడిన ఏ పాట విన్నా, దుఖం తన్నుకొచ్చి, మధ్యలోనే ఆపేయాల్సోస్తుంది. ఆవిడ వయసు, గొంతు సహకరించక పోవడమే కారణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s