థేమ్స్ లో పడవ ప్రయాణం

“గమ్యం” సినిమాలో ఒక చోట హీరోయిను హీరో తో, “నువ్వు చూసింది ప్రపంచం కాదు, ప్రదేశాలు.” అంటుంది. “కారులో కూర్చుని అద్దాలు బిగించుకుని కూర్చుంటే కనిపించేది….” అని ఇంకేదో అంటుంది కూడా (నాకంతగా గుర్తు లేదు). అయితే ఈ డైలాగు వినగానే నాకు రెండు పుస్తకాలు గుర్తొచ్చాయి.

Robert Prisig రాసిన “Zen and the art of motorcycle maintenance” ఒకటైతే, Jerome K. Jerome రాసిన “Three men in a boat” రెండోది. అన్నట్టు గమ్యం సినిమాకి మార్క్సిస్టు విప్లవకారూడు, చె గువెరా రాసిన “Motor Cycle Diaries” స్ఫూర్తి అని విన్నాను. నేనా పుస్తకం చదవలేదు, కాబట్టి I can’t comment on that.

 

Zen and the art of motorcycle maintenance బానే వుంటుంది. అందులో అన్న మాటలూ గమ్యం సినిమా డైలాగులానే వుంటాయి.

“You see things vacationing on a motorcycle in a way that is completely different from any other. In a car you’re always in a compartment, and because you’re used to it you don’t realize that through that car window everything you see is just more TV. You’re a passive observer and it is all moving by you boringly in a frame.”

 

ప్రయాణాల గురించి రాసిన పుస్తకాలు రకరకాల ఫిలాసఫీలని ప్రతిపాదించటం తో పాటూ రకరకాల ప్రదేశాల గురించి కూడా మనకి వివరిస్తాయి. అయితే జెరోం కె జెరోం రాసిన “త్రీ మెన్ ఇన్ ఎ బోట్” కొంచెం వైవిధ్యమైన “ప్రయాణ పుస్తకం” (ట్రావేలాగ్!). ఎందుకంటే పుస్తకం మొత్తం హాస్య రస ప్రధానంగా వుంటుంది.

ఆంగ్ల సాహిత్యంలో హాస్య రస పోషణకి మకుటం లేని మహారాజు, పి.జి.వోడ్ హవుజ్ ఈ పుస్తకం ముద్రించిన కాలానికి సరిగ్గా ఎనిమిదేళ్ళ ప్రాయంలో వున్నాడు (1889). ఆ తరువాత పెద్ద వాడై వోడ్ హవుజ్ అద్భుతమైన సిట్యుయేషనల్ కామెడీలు సృష్టించి వుండొచ్చు గాక! మామూలు భాషలో ఇంత హాస్యాన్ని మేళవించి రాయటం ఈ పుస్తకంతోనే మొదలు కాబోలు.

 

మధ్యతరగతి జీవితాల్లో మామూలు సంఘటనల్లో ఎంత హాస్యమూ,  ఎంత ఫార్సూ, ఎంత హిపోక్రసీ నిండి వున్నాయో తెలుస్తాయి ఈ పుస్తకం చదివితే!

 

తొంభైల్లో ఒకరోజు రైల్లో రావాల్సిన మిత్రులకోసం ఎదురుచూస్తూ, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూర్చుని నేనీ పుస్తకం చదివాను. అసలే నాకు నవ్వాగదు! పుస్తకం చేతిలో పెట్టుకుని మాటి మాటికీ పగలబడి నవ్వుతూ ఒంటరిగా కూర్చున్న అమ్మాయిని స్టేషన్లో వచ్చే పోయే జనం ఎంత వింతగా చూసారో ఆ రోజు!

 

కథలోకి వెళితే, కథంతా ఉత్తమ పురుషలో సాగుతుంది. తామంతా చెప్పలేని రోగాలతో బాధ పడుతున్నామనీ, దానికి విరుగుడు ఒక చిన్న హాలిడే ట్రిప్ కి వెళ్ళటం అని ముగ్గురు స్నేహితుల తీర్మానంతో మొదలవుతుంది కథ. కథని చెప్తున్న జె.  అతని మిత్రులిద్దరు, జార్జి, హేరిస్ ముగ్గురూ జే రూములో ఒకనాటి రాత్రి సమావేశమవుతారు. ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక చిన్న బోటు అద్దెకు తీసుకుని థేంస్ నదిలో చిన్న బోటింగ్ ట్రిప్ వేయాలని అనుకుంటారు.

 

ఆ తరువాత కావాల్సిన సరంజామా కొరకు లిస్టులు రాసుకోవటం, వాటినన్నిటినీ కొనుక్కొని సామాన్లు సర్దుకోవటం అదంతా పెద్ద ప్రహసనం. ఒక శుభ ముహూర్తాన బయల్దేరుతారు. వాళ్ళ ప్రయాణమూ, లండన్ నగరం లో వాళ్ళు చూసిన ప్రదేశాలూ వింతలూ మొదలైన వాటితో మిగతా కథంతా నిండి వుంటుంది. ఆ యా ప్రదేశాల చరిత్రా, విసిష్టతని కూడా వివరిస్తాడు రచయిత అక్కడక్కడా. అన్నట్టు వాళ్ళతో ఒక కుక్క కూడా వుంటుంది. అసలా కుక్క మీద రాసే ప్రహసనాలూ వ్యాఖ్యానాలూ చదివి చచ్చేట్టు నవ్వుతాం!

 

ఈ నవలలో వున్న చిన్న చిన్న హాస్యపు ఎపిసోడ్లు ఇంగ్లీషు టెక్స్ట్ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా వుండేవి. దాదాపు ఇరవై ఎపిసోడ్ల దాకా వుంటాయి. అల్లరి కుక్కలూ, మొండికేసే టెంటులూ, పెద్దాయన పఠం గోడకి వేళ్ళాడగట్టటం, చేపలు పట్టటం, సంగీత విన్యాసాలూ, పెళ్ళి కాని పడుచుల కిల కిలలూ, ఒక్కటేమిటి, నిత్య జీవితంలో అన్ని అంశాలనూ స్పృశించి రాసిన అద్భుతమైన హాస్యం. 

 

అయితే ఈ పుస్తకం మొదట్లో ఎవరికీ అంతగా నచ్చలేదుట. ఎందుకంటే అప్పటి వరకూ ఆంగ్ల సాహిత్యంలో ఎక్కువగా బీదా బిక్కీ జనం గురించి రాయటం వుండేది కాదు. ఈ నవలలో చాలా వరకు సంఘంలో అట్టడుగు వర్గాల ప్రజలూ, వాళ్ళ యాసలూ,వాళ్ళ జీవిత గాధలూ వుండటంతో విమర్శకులు పెదవి విరిచారుట. “స్టాండర్డ్” పత్రిక జెరోం ని “ఇంగ్లీషు అక్షరాలకి దాపురించిన అపాయం” అని భావిస్తే, “మార్నింగ్ పోస్ట్”, అనే పత్రిక “తక్కువ పుట్టుక పుట్టిన వాళ్ళకి ఎక్కువ చదువులబ్బితే జరిగే ఫలితం” అన్నదిట. ఎంత విచిత్రం!

 

కానీ ఎవరూ ఊహించని విధంగా తరువాత ఈ పుస్తకం ప్రజాదరణ పొందింది. ఈ పుస్తకం పబ్లిషరు తన స్నేహితునితో, “ప్రతి యేటా ఇన్ని వేల కాపీలు వేస్తున్నాను. ఏమయిపోతున్నాయో తెలియటం లేదు. ప్రజలందరూ పుస్తకాన్ని తింటున్నారా యేమిటి?” అని చెప్పుకున్నాడట.  ఆయన రాసిన మిగతా పుస్తకాలు నేనింకేమీ చదవలేదు. (అసలే లైబ్రరీల్లోనూ దొరకటం లేదు). ఆయన మిగతా పుస్తకాలు వోడ్ హవుజ్ పుస్తకాలంత ప్రాచుర్యం పొందలేదు.

 

 ఎవరినీ వెక్కిరంచకుండా, వెకిలి మాటలూ, అసభ్యపు ఆలోచనలూ లేకుండా మనుషులని హాయిగా నవ్వించటం ఏలాగో నేర్చుకోవాలంటే ప్రపంచ భాషల్లోనూ, భారతీయ భాషల్లోనూ వీలైనంత కొంచెం సాహిత్యం అధ్యయనం చేయాలి.

ఈ పుస్తకం అంతర్జాలంలోనూ వుంది.

3 thoughts on “థేమ్స్ లో పడవ ప్రయాణం

  1. >>>కథంతా ప్రథమ పురుషలో సాగుతుంది

    ఉత్తమ పురుషలో అని మీ ఉద్దేశ్యం అనుకొంటాను. తెలుగు ప్రథమ పురుష ఇంగ్లీషు “First Person” కు సమానార్థకం కాదు. అది “Third Person”.

  2. చంద్ర మోహన్ గారూ,
    మార్చేను. పొరపాటును ఎత్తి చూపినందుకు ధన్య వాదాలు.
    కవిత గారూ,
    మీ వ్యాఖ్య రాలేదండీ. మళ్ళీ పెట్టండి, పర్వాలేదు. పుస్తకం కూడా చదివి ఉండకపోతే చదవండి. మనసు భలే ఉల్లాసంగా అవటమే కాదు, మనం కూడా దైనందిన జీవితాన్ని కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో చూడటం నేర్చుకుంటాం.
    శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s