భూమి గుండ్రంగా వుంది

నేను అప్పుడప్పుడూ కథలు తెలుగు లోంచి ఇంగ్లీషులోకి అనువదిస్తూ వుంటాను. అయితే ఆ కథకులు లబ్ద ప్రతిష్టులూ పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళూ. ఈ సారి నేనొక చిన్నారి రచయిత్రి కథని ఇంగ్లీషు లోంచి తెలుగులోకి అనువదిస్తున్నాను.

కథ గురించి-

మొన్న మా చిన్నది అనన్య తలెత్తకుండా కంప్యూటర్ మీద కీ-బోర్డు టక టక లాడిస్తుంది. “ఏం చేస్తున్నావే” అని అడిగితే, “అయాం రైటింగ్ ఎ స్టోరీ” అంది. అది ఎప్పుడూ వుండేదే కాబట్టి పెద్ద పటించుకోలేదు. తర్వాత “అమ్మా! ఈ కథ ఒక సారి చదివి చూడు” అంటే కథ చదివి చాలా ఆశ్చర్యపోయాను. నాకు చాలా నచ్చింది కథ. (కాకి పిల్ల కాకికి ముద్దే అనుకోండీ! అయినా నిజంగా చాలా బాగా రాసిందే అనుకున్నా). సరే, అని సరదాకి తెలుగులోకి అనువదిస్తే ఇలా వొచ్చింది! యథా తధంగా అనువదించాను!

 

మూల కథ చదవాలంటే కింద లంకె మీద నొక్కండి.

http://www.anu-mystories.blogspot.com/

 

భూమి గుండ్రంగా వుంది

-అనన్యా మురళీధరన్

ఆ సైకిలు పారేసుకోవాలని ఫే అనుకోలేదు. కాని పారేసుకుంది. తనకి బాగా గుర్తు, గోడ పక్కన ఆనించి నిలబెట్టింది, ఎవరో ఎత్తుకెళ్ళి పోయుంటారు. ఇంకెలా పోయుంటుంది? చల్ల గాలి ఆమె జుత్తుని చిందర వందర చేసింది. వీధి దీపాలు వెలగటం మొదలు పెట్టాయి.

 

నిజానికి అదంత ఖరీదైన సైకిలేమీ కాదు, కానీ ఆమెకెంతో విలువైంది. క్లాసు పిల్లలందరి ముందరా ఎంత పోజు కొట్టింది ఆ సైకిలుతో! అందరికీ చాలా నచ్చిందా సైకిలు. నిరాశగా ఇంటి ముఖం పట్టింది ఫే. మళ్ళీ వెనుదిరిగి చూసింది, గోడ వైపు, సైకిలు అక్కడే వుందేమోననన్న ఆశతో, కానీ అదక్కడ లేదు.

 

ఎలిస్ సైకిలు దొంగతనం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ గోడకి ఆనించి వున్న ఆ సైకిల్ ఊరిస్తూ కనబడింది. ఆ దొంగతనం కూడా తనేదో సరదాకి చేయలేదు. ఇంటింటికీ తిరిగి పేపర్లు వేసే ఉద్యోగం ఈ మధ్యనే వొచ్చింది తనకి. కాలి నడకన పేపర్లు వేయటం చాలా విసుగ్గా అలసటగా వుంది. ఒక సైకిలు వుంటే బాగుండని అనుకుంటుంది ఈ మధ్య. దాంతో కొంచెం తేలిగ్గా పని చేసుకోవచ్చు, తిండి దొరుకుతుంది!

 

మెల్లిగా సైకిల్ తొక్కుతూ ఆలోచిస్తుంది ఎలిస్. వీధిలో అన్ని ఇళ్ళూ ముగించి మెయిన్ రోడెక్కింది. బ్రిడ్జి పెద్దగానే వున్నా రద్దీ బాగా వుంది. ఆలోచనల్లో మునిగి వున్న ఎలిస్ తన వైపే వొస్తున్న పెద్ద గుర్రబ్బగ్గీని చూసుకో లేదు. గుర్రపు గిట్టల చప్పుడు తర్వాత ఆమెకింకేమీ వినిపించలేదు.

 

సైకిల్ దాదాపు ఎల్డ్రెడ్ తల మీదే పడింది. ఆకాశం నించి వూడి పడ్డట్టూ! ఎల్డ్రెడ్ తల పైకెత్తి బ్రిడ్జి వైపు చూసాడు. బ్రిడ్జి మీంచి వచ్చే సందడి తప్ప ఏమీ కనిపించలేదు. ఎక్కణ్ణించైతేనేం, సైకిలు బాగుంది! డబ్బు సైకిల్ రూపంలో దొరికిందంతే. పొడుగాటి షర్టూ, పేంటూ వేసుకుని వున్నాడు ఎల్డ్రెడ్. తన పనికిమాలిన గుర్రం మీంచి దిగి సైకిల్ దగ్గరకొచ్చి పరీక్షగా చూసాడు. కింద పడటంతో కొంచెం దెబ్బ తగిలింది కానీ మొత్తానికి బానే వుంది. చుట్టూ చూసాడు! ఎవరూ లేరు. గబుక్కున సైకిలెక్కి వెళ్ళి పోయాడు.

 

ఏంటోనియో తనలో తనే నవ్వుకున్నాడు. ఎల్డ్రెడ్ ని బురిడీ కొట్టించటం అనుకున్నదానికంటే తేలికైంది. ఎల్డ్రేడ్ ని ఓడించటం అసంభవమన్నారు అందరూ! వాడి దగ్గరేముంది, ఆశా ఆత్రమూ తప్ప. గెలవాలన్న ఆత్రంతో ఆట మొదట్నించే మోసం మొదలు పెడతాడూ! తను, అలా కాదు! అదనుకోసం వేచి చూసి అప్పుడు శతృవుపై దెబ్బ తీయాలి. తనెలా ఓడిపోయాడో కూడా ఎల్డ్రెడ్ కి అర్ధం కాలేదు.

 

నవ్వు ఏంటోనియో మొహమంతా పరచుకుంది. గబగబా సైకిల్ తొక్కుతున్నాడు. ముందీ సంగతి స్నేహితులతో చెప్పాలి. సైకిల్ తో మొదలు పెట్టి ఎల్డ్రెడ్ దగ్గరున్నదంతా ఊడ్చి పారేస్తాడు తను.

 ఉన్నట్టుండి ఒక చేయి ఏంటోనియో నోటి చుట్టూ బిగుసుకుంది. అతని కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి.

 ” ఈ సైకిల్ నాదే,” అన్నాడు ఓలీ. ఎకెర్లీ అతన్ని పక్కకి తోసాడు.

“కాదు నాది. పనంతా చేసింది నేను!”

స్నేహితుల్లో సైకిల్ కోసం పోట్లాట మొదలయింది. సైకిల్ మాత్రం అమాయకంగా దూరంగా కూర్చుని వుంది. ఏంటోనియోని చంపేయటం వాళ్ళకేమీ పెద్ద కష్టం కాలేదు. వాళ్ళనా పనికి నియోగించిన వాడు వాళ్ళకి సరిగ్గా సూచనలిచ్చాడు. సైకిల్ కొరకు కొట్లాటలో దగ్గరకొస్తున్న పోలీసులని చూసుకోలేదు వాళ్ళు.

 “హలో! మనం మళ్ళీ కలుసుకున్నాం!”, పోలీసులు అందరి మెడల మీదా చేతులు వేసి ఈడ్చుకుంటూ వేళ్ళిపోయారు. సైకిల్ అలాగే గోడకానుకుని నిలబడి వుంది.

 తన కళ్ళని తనే నమ్మ లేకపోయింది ఫే! సరిగ్గా తను నిలబెట్టిన చోటే వుంది తన సైకిల్. అయిదు రోజులుగా ఎంత వెతికింది సైకిల్ కోసం! తను గోడ దగ్గరే పెట్టి మరిచిపోయిందా? ఏమో! దగ్గరికెళ్ళి చూసింది. సరిగ్గా తను వదిలేసినట్టే వుంది, కొంచెం దుమ్ము పట్టినా కూడా. సరిగ్గా తుడిస్తే ఎప్పట్లాగే వుంటుంది. సైకిల్ పట్టుకుని ఇంటి వైపు నడవసాగింది ఫే.

 

10 thoughts on “భూమి గుండ్రంగా వుంది

  1. తృష్ణ గారూ,
    ఇంగ్లీషులో రాసింది మా చిన్నమ్మాయి అనన్య (అను). ఎనిమిదో తరగతి చదువుతుంది. ఆ బ్లాగ్ సైట్ లో తన కథలూ, కవితలూ పెడుతుంది.
    శారద

  2. గుర్రం దగ్గరే కొంచెం జాగ్రత్తగా రాయవలసింది. మిగతాదంతా పెద్ద వాళ్ల రాతలకేమీ తీసిపోదు. మంచి రచయిత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఏదయినా writing workshop కి పంపండి.

  3. కృష్ణప్రియ గారూ,
    స్నేహ గారూ,
    చంద్రమోహన్ గారూ,
    శ్రీనివాస్ గారూ,
    మీ అభినందనలూ, ఆశీస్సులూ, సూచనలూ
    అనూకి అంద చేసాను. చాలా ధన్యవాదాలు.
    శారద

  4. శారద గారూ,
    మీ అమ్మాయి ఊహా శక్తీ, అది వ్యక్తీకరించిన తీరు చాలా బావున్నాయి.
    ఎలాగూ బ్లాగులో వ్రాస్తోంది, అనువాదం చెయ్యడానికి మీరు ఉన్నారు కనుక
    కొత్తపల్లి పిల్లల పత్రికకి వ్రాయించకూడదూ?
    ప్రత్యేకించి (తెలుగు4కిడ్స్ నిర్వహించే) “బొమ్మకి కథ” శీర్షికకి వ్రాయడానికి ప్రోత్సహించగలరు.
    ఈ నెల బొమ్మ ఇక్కడ:
    #http://kottapalli.in/2011/06/పెద్దపులి#
    ఏప్రిల్ నెల బొమ్మకి కథ ఇక్కడ:
    http://kottapalli.in/2011/06/తలగుమ్మడి

    ఇటువంటి ఊహతో పాత కాలం, జానపదాలకి దగ్గరగా వ్రాస్తే తెలుగు చందమామకి కూడ పంపించవచ్చు.
    ఇదేలాంటి కథలు ఆంగ్ల చందమామకి పనికి రావచ్చేమో. సంప్రదించి చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s