నిన్న రాత్రి మా వూళ్ళో వయొలీన్ చక్రవర్తి శ్రీ ఎల్.సుబ్రహ్మణ్యం గారి కచేరీ జరిగింది. ఆయనతో పాటు ఆయన సుపుత్రుడు అంబి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. శ్రీ తిరుచూర్ మోహన్ మృదంగం పైనా, శ్రీ సత్య సాయి మోర్ సింగ్ పైనా సహకారాన్నందించారు.
కచేరీ రెండు గంటల పాటు సాగింది. టికెట్టు ధరని దృష్టిలో పెట్టుకుని కొందరు ఆయన ఇంకొంచెం ఎక్కువసేపు వాయించి వుండాల్సింది అని గునిసారు. ఆయన రెండే పాటలు, ఎక్కువగా మనోధర్మ సంగీతం వాయించారు.
ముందుగా ఆయన అభోగి రాగంలో ఆలాపన చేసి తనే స్వయంగా స్వర పర్చిన పాటొకటి వాయించారు.అయితే అదేం పాటొ అర్ధం కాలేదు. పాటలో ఆయన తనదైన శైలిలో నెరవల్, స్వర కల్పనా చేసారు.
రాగం ఆలాపనలో కానీ, స్వర కల్పనలో కానీ, ఆయన రూటే సెపరేటు. ఎందుకో ఆయన రాగం “గ్రామరు” కొంచెం కూడా పట్టించుకోరనిపించింది నిన్న నాకు. రాగ లక్షణం, స్వరాల పొందిక వీటికంటే “టెక్నిక్” కీ ఆయన పెద్ద పీట వేస్తారు. అయితే ఆ టెక్నిక్ మాత్రం ఎవరూ అందుకోలేనంత స్థాయిలో వుందన్నది కాదనలేని సత్యం. ఆలా కాకుండా రాగంలో వుండే మెలోడీ కోసమో పాటలో వుండే భావ గాంభీర్యం కోసమో వెతికితే ఆయన సంగీతంలో అవి కనిపించవు/వినిపించవు.
ఆ టెక్నికూ, వయొలీన్ వాదనలోనే ఆయన మెయింటెయిన్ చేసే లయా ఎంత గాడంగా వుంటాయంటే ఎంత గొప్ప మృదంగం విద్వాంసుడైనా ఆయన ముందు కొన్నిసార్లు వెల వెల పోక తప్పదు. నిన్న అంతే జరిగింది. త్రిచూర్ మోహన్ గారి మృదంగం ఆయన వేగాన్నందుకోలేక పోయింది. సత్య శాయి మోర్ సింగ్ మాత్రం చాలా స్పిరిటెడ్ గా వుండింది. అంబి దాదాపు తండ్రి కున్నంత విద్వత్తూ ప్రదర్శించాడు. అయితే త్వరలో తనదంటూ ఒక శైలీ, వాదనలో ఒక వైవిధ్యమూ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో! లేకపోతే వటవృక్షం నీడన పెరుగుతున్న మొక్కలాగయ్యే ప్రమాదం వుంది.
అభోగి తరువాత ఆయన గౌరీ మనోహరిలో రాగం తానం పల్లవి మొదలుపెట్టారు. తానం ముగిసి పల్లవి మొదలు పెట్టేటప్పుడు ఆయన కుమారుడు ప్రతి మధ్యమం ఎత్తుకుని రాగం మార్చారు.
ఈ రాగం ఏదన్న విషయం మీద మేమెవ్వరమూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాము. మురళీ “వాచస్పతి” అన్నారు, కానీ నాకెందుకో అది వాచస్పతి లాగనిపించలేదు. మా స్నేహితురాలొకామె “లతాంగి” అన్నారు. అయి వుండొచ్చు, వాచస్పతి, లతాంగి కి ఒక్కటే స్వరం తేడాగా వుంటుంది కాబట్టి కొంచెం ఒకేలాగనిపిస్తాయి. ఇంతకీ అదేమిటన్నది మిస్టరీ లాగే వుండే టట్టుంది.
ఆ తరువాత మళ్ళీ ఆయనందుకుని అందమైన జోగ్ రాగం లోకెళ్ళిపోయారు. ఆయన వాయిస్తున్నంత సేపూ నాకేదో పాట మనసులో మెదుల్తోంది. రాత్రంతా నిద్దట్లో అదే రాగం ఆలాపనగా. పొద్దున్న యాదృఛ్ఛికంగా తృష్ణ గారి “సంగీత ప్రియ” బ్లాగు చూడగానే గుర్తొచ్చింది! ఆ పాట “స్మర వారం వారం”!
“తిలంగ్” రాగానికి చాలా సమీపంగా వుండే “జోగ్” రాగంలో ఒక రకమైన హాయి, లాలనా వుంటాయి. “ఖమాజ్” ధాట్ (కర్ణాటక సంగీతంలో హరి కాంబోజి) నుంచి జన్మించిన “తిలంగ్” లో అంతర గాంధారం (చాలా షార్ప్ గా వుంటుంది) తో పాటు రెండు నిషాదాలూ (కాకలి ని – కైశికి ని) వాడతారు.
వీటితో పాటు అదనంగా కొంచెం ఫ్లాట్ గా వుండే సాధారణ గాంధారం వాడితే జోగ్ రాగం వస్తుంది. ఆ సాధారణ గాంధారాన్ని ఎక్కువ స్ట్రేస్ చేయకుండా స-గ-స అని అలా ముట్టుకుని పరిగెత్తుకుని రావటం వల్ల ఒక రకమైన మెలొడీ పుడుతుంది.
“పని విళుం మలర్ వనం” అనే తమిళ పాటా, “ప్రమద వనం వేండుం” అనే మళయాళ పాటా జోగ్ లో వుండే రెండు మంచి పాటలు.
హిందుస్తాని సంగీతాన్ని దక్షిణ భారతీయ సినిమాల్లో వాడినప్పుడు చాలా అందమైన పాటలు పుట్టాయి, పైన చెప్పినటువంటివి. తెలుగు సినిమాల్లో కూడా “పీలూ”, “మధువంతి”, “మధు కౌంచ్”, “చంద్ర కౌంచ్” రాగాల్లో చాలా మంచి పాటలున్నాయి. అన్నిట్లోకి పీలూ గురించి రాయలని ఎప్పటికప్పుడూ అనుకోవటం, బధ్ధకించి మానేయటం……
పై శనివారం మా వూళ్ళో ఇంకో కచేరి, కస్తూరి రంగన్ గాన కచేరీ! దాని గురించి వచ్చే వారం.
ఈ లోగా ఈ పాటలు – మీ ఆనందం కోసం.
ఎల్.సుబ్రహ్మణ్యం కచేరీ నా…ఏమి అదృష్టం అండీ. కొన్ని కేసెట్స్ వినటమూ,టివీలో అప్పుడప్పుడు లైవ్ షో తాలూకూ ముక్కలే తప్ప ప్రత్యక్ష్యంగా చూసే అవకాసం దొరకలేదెప్పుడు. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ గురింఛీ నాన్న చెప్తుంటే వినటమే ! ‘సలాం బాంబే’ సినిమాకు ఆయన అందించిన సంగీతం నాకు చాల ఇష్టం. ఎన్నిసార్లు ఆ కేసెట్ విన్నేవాళ్లమో చిన్నప్పుడు.
సంగీతం విని ఆనందించటమే తప్ప రాగాలూ వాటి అవగాహనా లేదండి నాకు…ఆ జ్ఞానం ఉండటం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను.
స్మరవారం అర్ధం ఉన్న లింక్ దొరికింది. బ్లాగ్లో లింక్ ఇచ్చాను వీలున్నప్పుడు చూడండి.
The Above comment link shows :
http://trishnaventa.blogpsot.com/
Actual link is:
http://trishnaventa.blogspot.com/
Saradaa madam…
Be aware of the Fake candidates/profiles..
Thanks
అదృష్టవంతులు. ఎల్.సుబ్రహ్మణ్యం గారి కచ్చేరీ ప్రత్యక్షం గా చూసే అవకాశం దొరికింది. సంగీతాన్ని ఒడ్డున కూర్చుని ఆస్వాదించడమే తప్ప అందులో లోతులు నాకు తెలియవు కనుక మొదటి వాక్యం తప్ప మీ మిగిలిన పోస్ట్ అంతా నాకు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వేణు నాదం వింటున్నట్టు ఉందండీ. 🙂
@సురేష్ గారు
“Be aware of the Fake candidates/profiles..”
సురేష్ గారూ ఈ బ్లాగులో కామెంట్ బాక్స్ కింద మెయిల్ ఐడి, పేరు, వెబ్ సైట్ అడ్రస్ టైపు చేసేటప్పుడు పొరపాటు జరిగి ఉంటుంది. అంతే తప్ప ఆ టైపో ఎర్రర్ తో ఇంకో సైట్ ఉండచ్చన్న ఆలోచన రాదు కదండీ. ఈ మాత్రం దానికి అసలు ఆ బ్లాగరే ఫేక్ అనుకోవడం తగదు. తృష్ణ గారి బ్లాగ్ చూస్తే మీరీ మాట అనుండేవారు కాదేమో.
బ్లాగ్ ఐడి టైప్ చేసేప్పుడు పొరపాటు అయినట్లుంది..
@సురేష్ గారు: పైన రాసిన వ్యాఖ్య ‘తృష్ణ’ అనబడే నేను రాసినదే వ్యాఖ్యే నండి. ఫేక్ ఐడి కాదు..:))
@shankar:thank you.
తృష్ణ గారూ, శంకర్ గారూ,
మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
నిజంగా చెప్పాలంటే నాదీ మిడి మిడి ఙ్ఞానమే లెండి, సంగీతంలో. అయితే నాకు ఇష్టం మాత్రం బోలెడు.
తృష్ణ గారూ, స్మర వారం వారం లింకు చూసాను ధన్యవాదాలు.
శారద
చాలా బావుంది. ఇతని తమ్ముడు శంకర్ గారిదీ ఇంచుమించు ఇదే పద్ధతి, కాకపోతే అతని టెక్నిక్ వేరేగా ఉంటుంది.
మనవాళ్ళు (దాక్షిణాత్యులు) మేళకర్తల పేరుతో తయారు చేసిన చట్రం స్వరాలపొందికని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది గానీ కొన్ని హద్దులు కూడా తెచ్చిపెట్టింది. ఉదాహరణకి ఒకే రాగంలో రెండు రకాల “గ” లు ఉండడం ఒప్పదు. అలా వచ్చి తీరవలసిన రాగాల్లో ఒకదాన్ని “అన్య”స్వరం అని నిర్వచించుకుని తృప్తిపడుతూ ఉంటారు. ఆ లెక్కన హిందుస్తానీ వాళ్ళకి కొంచెం సులువు. వాళ్ళు ఈ జన్య జనక సంబంధాన్ని పెద్దగా పట్టించుకోరు – రెండు గాలు ఉంటే ఉన్నాయి, అని హాయిగా పాడేసుకుంటారు.
కొత్తపాళీ గారూ,
ముందస్తుగా మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
అయితే మేళ కర్తల గురించీ, రాగాల విషయంలో “ఫ్లెక్సిబిలిటీ” గురించి నా అభిప్రాయం కొంచెం వేరేమోనండి.
ఒకే రాగంలో రెండు స్వరాలని స్వేఛ్ఛగా ఉపయోగించిన రాగాలు కర్ణాటక సంగీతంలో బోలెడు ఉన్నట్టున్నాయి. అన్నిటికంటే సులువైనదీ, నాకు బాగా తెలిసినదీ అయిన బేగడ గురించి చెపుతాను.
బేగడ 29 వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. శంకరాభరణం స్కేల్ లో అన్నీ చాలా షార్ప్ గా వుండే స్వరాలు. (విచిత్రంగా, వీటిని హిందుస్తానీ సంగీతంలో శుధ్ధ స్వరాలంటారు! అది వేరే విషయం). కానీ బేగడలో (ఫ్లాట్ గా వుండి, శంకరాభరణానికి చెందని) కైశికి నిషాదాన్ని బాగా ఉపయోగిస్తారు. స-నీ-ద-ప-మా-గ-రి-సా అంటూ. నిషాదాన్ని అవరోహణలో జస్ట్ టచ్ చేసి వదిలేసేటప్పుడు మాత్రం శంకరాభరణానికి చెందిన కాకలి నిషాదాన్ని ఉపయోగిస్తారు. స-ని-ద-ప అంటూ. అంటే శంకరాభరణ జన్యమైనా, కైశికి నిషాదానికి ప్రాముఖ్యత వుందీ రాగంలో. రెండు నిషాదాలనీ సమానంగానే వాడతారు.
“అన్య” స్వరం అన్న ప్రయోగం కేవలం “ఈ స్వరం ఈ రాగపు తల్లి అయిన మేళకర్తలో లేదు” అన్నది సూచించటానికే అంటారేమోనని నా గెస్.
మురళీ ఉవాచ-
నిజానికి హిందుస్తానీ సంగీతంలోనే ప్రతీ రాగానికీ స్వరాల గురించిన నియమాలు స్ట్రిక్టుగా వుంటాయి. అంటే ప్రతీ రాగానికీ వాదీ-సంవాదీ స్వరాల ఎన్నికని మనం గౌరవించి తీరాలి. అలాటి నియమం కర్ణాటక సంగీతంలో ఏదీ లేదు. బాల మురళీ గారూ కల్యాణి పాడినప్పుడు ఒక్కోసారి ఒక్కో స్వరాన్ని ఎంఫసైసు చేస్తారని విన్నాను. ఇది హిందుస్తానీ సంగీతంలో సాధ్యపడదు కదా?
అయితే మేళ కర్తల విషయంలో మీరన్నది నిజమే.మరి డెభ్భై రెండు మేళకర్తలని పది థాట్- లలోకి కుదించాలంటే కొంచెం నియమాలని గాలికొదిలెయ్యాల్సొస్తుంది. అందుకే అహిర్ భైరవ్ (చక్రవాకం)- భైరవ్(మాయా మాళవ గౌళ) ఒకే థాట్ లోకొస్తాయి!
శారద