జెంజు అనబడు చెంగిజ్ ఖాన్ కథ

మా పిల్లలిద్దరికీ కొన్నేళ్ళుగా పెంపుడు జంతువులమీద ఆశ. ఎన్నో తర్జన భర్జనలూ, వాద ప్రతివాదాలూ ఇంట్లో. వారి తండ్రిది పిల్లలేదడిగినా కాదనలేని పితృ హృదయం.!

కుక్కనో పిల్లినో పెంచుకుందామంటే మాంసాహారపు బాధ. వాటిని శాకాహారులుగా మారుద్దామంటే వాటి స్వజాతి లక్షణాల మీద మన పెత్తనం ఏమిటి అన్న మీమాంస! చివరాఖరికి ఒక కుందేలు పిల్లని పెంచుకుందామని నిర్ణయించుకున్నారు.

ఒక రోజు నేను ఆఫీసుకెళ్ళిన సమయంలో  (అమ్మ లేదు, దిసీజె గుడ్ టైం!) బజారెళ్ళి కావల్సిన సరంజామా అంతా పట్టుకొచ్చారు. కుందేలు పిల్ల వుండటానికి ఒక చిన్న డబ్బా, పక్కకోసం ఎండు గడ్డీ, మంచి నీళ్ళకీ, తిండికీ చిన్న చిన్న పింగాణీ ప్లేట్లూ, లిట్టర్ ట్రే వగైరా వగైరా. ఇక నేనేమంటాను! సరే మీ ఇష్టం, ఏదో చేసుకోండి, దాని పని మాత్రం నాకు తగలకూడదు అని గట్టి వార్నింగించ్చాను.

ఆ మర్నాడే పట్టుకొచ్చారు, మా వాళ్ళు మా ఇంటికి ఒక చిన్న కుందేలు పిల్లని. కొంచెం బూడిద రంగులో కళ్ళు మిటకరిస్తూ బలే ముద్దుగా వుందది.

  

“పేరేం పెడదాం? అను ఉత్సాహంగా అడిగింది.

“చెంగిజ్ ఖాన్” నేనన్నాను.

“చీ! అదేం పేరు?”

“ఆమిర్ ఖాన్? షా రూఖ్ కాన్?” మధు అడిగింది ఆశగా!

“నో  ఫిలిం స్టార్స్!” వాళ్ళ నాన్న సీరియస్ గా చెప్పారు.

“సరే అయితే, జెంజు!”

 

ఒకరికి నచ్చిన పేరు ఒకరికి నచ్చటం లేదు. అప్పుడు అను ఒక విప్లవాత్మకైన నిర్ణయం తీసుకుంది! ఎవరికి నచ్చిన పేరు తో వాళ్ళు పిలవొచ్చు! అందరికీ ఈ అయిడియా నచ్చింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళం పిలవటం మొదలు పెట్టాము. ఇంకా స్నేహితులని పిలిచి వాళ్ళనీ పేర్లు పెట్టమని ఆహ్వానించారు.

 

“అస్లం మియా” నించి “ఏళు మలైయప్పన్” వరకూ బోలేడు పేర్లు. ఏ పేరు పెట్టి పిలిచినా నిర్వికారంగా చూసే వాడు, భక్తి సినిమాల్లో కే.ఆర్.విజయ లా!

 

పొద్దున్న లేవగానే తోటలో వదిలేస్తే హాయిగా గంతులేస్తూ ఆడుకునే వాడు. ఆఫీసులకెళ్ళేటప్పుడు తెచ్చి గరాజ్ లొ వదిలే వాళ్ళం. కార్లు రెండూ ఉండకపోవటం తో హాయిగా అంతటా తిరిగే వాడు. ఆఫీసునించి రాగానే ముందు కారు బయటపెట్టి, గరాజ్ తెరిచి, జెంజూని బయట తోటలో వదిలి మళ్ళీ వచ్చి కార్లు లోపల పెట్టే వాళ్ళం.

 

దాని తిండీ, నీళ్ళు, లిట్టర్ క్లీనింగూ అంతా పిల్లలిద్దరూ చూసుకునే వాళ్ళు. తోటలో వదిల్తే మొక్కలు పాడవుతున్నాయని, మొక్కల చుట్టూ చిన్న గ్రిల్ పెట్టారు మురళి. వెటర్నరీ డాక్టరు దగ్గరకెళ్ళి వేక్సిన్లూ అన్నీ వేయించాము.

 

ఆరునెలలు దాని సావాసంలో మా పిల్లలూ మేమూ చాలా విషయాలు నేర్చుకున్నాం. కొన్నిసార్లు రాతృళ్ళు చాలా చలిగా అనిపించటంతో దాన్ని గరాజ్ లోంచి లాండ్రీ రూము లోకి మార్చాం.

 

మెల్లిగా చలి కాలం పోయి వసంతం, తరువాత ఎండా కాలం కూడా వచ్చింది. ఎండలు విపరీతంగా కాసే ఒక నవంబరు రోజు-

 

పొద్దున్నే జెంజూని తోటలో వదిలారు మురళీ. ఆరింటికి కూరల తొక్కలు తోటలో వేయటానికెళ్ళాను. గబగబా పరిగెత్తుతూ వచ్చి నా కాళ్ళ చుట్టూ రెండు రౌండ్లేసాడు.

 

లోపలికొచ్చి పని పూర్తి చేసుకున్నాను. ఈలోగా అను లేచి తన పన్లు చేసుకుంది. ముగ్గురం ఆరున్నరకి వాకింగ్ వెళ్దామని తయారవుతున్నాం. తలుపు తెరుచుకుని బయటికెళ్ళిన మురళి ఉన్నట్టుండి గబగబా లోపలికొచ్చి, నన్నూ అనూని పిలిచి,

“ఇద్దరూ ఇలా కూర్చొండి. మీతో ఒక విషయం చెప్పాలి.” అన్నారు. నేను తోటలోకి పామొచ్చిందనుకున్నాను. ఉదయం ఆరున్నరకే బాగా వేడెక్కింది.

 

కూర్చున్నతరువాత మెల్లిగా చెప్పారు

“జెంజూ డైడ్!” అని. ఇద్దరం నిర్ఘాంతపోయాము.

“అదేంటి, అరగంట క్రితం తోటలో నా కాళ్ళ చుట్టూ తిరిగాడు,” దుఃఖంతో నాకు గొంతు పూడుకు పోయింది.

“ఒక పిల్లి ఫెన్స్ ఎక్కి దాన్ని చంపి నోట కరుచుకోని పోతుంటే ఇప్పుడే దాన్ని తరిమేసాను. మెల్లిగా వాణ్ణి తెచ్చి తోటలో పాతి పెడతాను.” మురళీ మొహం నల్లబడి వుంది.

 

మా అనూ పెద్దగా ఏడుస్తూ కూలబడింది.

“నో అప్పా! హీ కాంట్ డై. లెటజ్ టేక్ హిం టు ద వెట్! ప్లీజ్” అని ఎంత ఏడ్చిందో పిచ్చి తల్లి.

“లేదు నాన్నా! ముందు నేనది చెక్ చేసే మీకు చెప్పాను.” తండ్రి కౌగిట్లోకి తీసుకుని ఓదార్చాడు. ఆ రోజు మధూ అనూ బాధ వర్ణనాతీతం.

“పోనీ, ఇవాళ్టికి స్కూలు మానెయ్యండి నాన్నా,” అన్నాను.

అయినా ఏడ్చుకుంటూ స్కూలుకెళ్ళారిద్దరూ. ఆ రోజంతా నా మనసు మనసులో లేదు. చచ్చిపోయిన కుందేలు గురించి బాధా, దానికోసం నా బిడ్డలు అనుభవిస్తున్న బాధా రెండూ నన్ను నలిపేసాయి.

 

అది ఇంట్లో వుండీ వుండీ మాతో ఆడుకుంటూ,  తన సహజమైన ఆత్మ రక్షణని మరిచిపోయిందా? లేకపోతే పిల్లి శబ్దం వినగానే పొదల్లో దాక్కునేది, ఆ రోజా పిల్లికెలా చిక్కింది?

 

“ఐ హేట్ ఆల్ కేట్స్” అంది అను.

మధు సాయంత్రం నాతో, “అమ్మా! బహుశా నా వల్లే జెంజూ చచ్చి పోయాడేమో. నేను గదిలో బేగు సర్దుకుంటుంటే వెనక దబ్బుమని చప్పుడైంది. నేను నిన్ను వెంటనే అలర్ట్ చేసి వుంటే అ పిల్లిని తరిమేసే వాళ్ళం కదా?” అంది. అను, “అమ్మా! బహుశా నేను జెంజూని సరిగ్గా చూసుకోలేదేమో. అందుకే గాడ్ ఈజ్ పనిషింగ్ మీ బై కిల్లింగ్ హిం” అని ఏడ్చింది.

 

ఇద్దర్నీ రాత్రి మా గదిలోనే పడుకోబెట్టుకున్నాం. అలాటి గిల్టీ ఫీలింగ్స్ వద్దనీ, సృష్టిలో ప్రతీ ప్రాణికీ చచ్చి పోక తప్పదనీ వీలైనంత వివరించాం.

 

పడుకునేముందు నన్ను హత్తుకుని అను,

“అమ్మా! అయాం సో లక్కీ. నాకు చాలా బాధగా అనిపించినప్పుడు నువ్వు నన్ను హగ్ చేసుకుంటే బాగుంటుంది. నీకు బాధనిపించినప్పుడేం చేస్తావు? పాపం మీ అమ్మ హైదరాబాదులో వుంది కదా? డు యు థింక్ యూ ఆర్ అన్లక్కీ?” అని అడిగింది.

“నేనూ నీ అంతప్పుడు అమ్మ దగ్గరే వున్నాకదా? ఇప్పుడు మరి పెద్దైపోయాను.”

“అంటే చిన్నప్పుడు అమ్మ దగ్గరున్నప్పుడు లక్కీగా వుండి పెద్దయ్యాక అమ్మ దగ్గర్నించి వెళ్ళిపోతాం కాబట్టి అన్-లక్కీ అవుతామా?”

 

“మీ లాటి బంగారు తల్లులున్నప్పుడు నేనూ చాలా లక్కీనే. ” చెప్పాను.

 

ఇదంతా జరిగి దాదాపు రెండేళ్ళవుతుంది. ఇప్పటికీ మా ఇంట్లో చెంగిజ్ ఖాన్ ఆకా జెంజూ కబురెత్తితే పెద్దదానికి బిక్క మొహం పడుతుంది, చిన్నదానికి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. దానికింకా పిల్లులంటే కోపమే.

                                   ———————

8 thoughts on “జెంజు అనబడు చెంగిజ్ ఖాన్ కథ

  1. నేనింకా తెన్నేటి సూరిగారు రాసిన మంగోలియన్ నాయకుడు “ఛెంగిజ్ఖాన్” నవల గురించిన టపా అనుకున్నా..

    అయ్యో..అలా అయ్యిందా..నాకందుకే జంతువులను పెంచటమంటే భయమండీ..పెంచుతున్నప్పుడు ఉన్న ఆనందం కన్నా వాటికేమైనా అయితే కలిగే దు:ఖం ఎక్కువ. మా ఇద్దరు మావయ్యలు పిల్లులను, కుక్కలను పెంచి,అవి చనిపోయినప్పుడు పడిన బాధ చూశాకా..ఎప్పుడూ ఏ జంతువునూ పెంచకూడదని నిర్ణయించుకున్నాను.మా పాప అడిగినా అదే చెప్తాను ఇప్పుడు.

  2. తృష్ణ గారూ,
    నిజానికి ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేనా పేరు పెట్టమన్నానండి. చెంగిజ్ ఖాన్ కాకపోతే టెమూజిన్ అయినా పర్లేదన్నాను కానీ మా వాళ్ళకి అర్ధం కాలేదు. మీరన్నట్టు నిజంగా అది పరిచయం చేయాల్సిన పుస్తకమే.

    మినర్వా గారూ, నాగ మురళీ గారూ,
    ధన్యవాదాలు.
    శారద

  3. నాకూ కాస్త భయమే.. మా అమ్మ, చెల్లి ఇంట్లో బోల్డు పెంపుడు జంతువులని (కుక్కలు, పిల్లులు, చిలకలు, ఉడతలు) పెంచేవారు. ఏది పోయినా వాటిని పూడ్చి, ఒక వారం పాటు శోక సముద్రం లో మునిగిపోయేవారు. అచ్చం మీ ఇంట్లోలానే…

    వాళ్లని చూసి నేను ఎప్పుడూ వాటికి దూరమే..

  4. maa ammayidi deeni gurinche allari,yedina pet penchukundamani.Ee madya India kellinapudu akkada street puppies chusi amma yenta bagunnayi antundi.naku navvalo ,yedvalo artham kadu.Memu chinnaga unnappudu ma factory lo kundelu .pavuralu vundevi.avi vellipoinapudu ide badha.ummm,sharada garu,mee post english lo dorikete baguntundi,maa ammayiki chupinchhachu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s