అంతర్లీనంగా మనందరిలోనూ ఒక అల్లరి పిల్లవాడు లేదా పిల్లది వుంటాడు/వుంటుంది. పెద్దయిపోవాలన్న తొందర్లో వాళ్ళని మనసులోంచి గెంటేస్తాం.
నేను అప్పుడప్పుడూ చదివే ఇంగ్లీషు/తెలుగు నవలలు చూసి మురళీ “ఒక్కటన్నా బొమ్మలేని ఆ పుస్తకాలు ఎలా చదువుతారబ్బా,” అని ఆశ్చర్యపోతూ వుంటారు. తనకి పుస్తకంలో కథతోపాటు బాగా బొమ్మలు వుండాలి.
అందుకే మా ఇంట్లో నేను పుస్తకాలు కొన్నప్పుడల్లా తనూ పోటీ పడి “ఎస్ట్రిక్స్”, “టిన్-టిన్” లాటి కామిక్కులు బాగా కొంటూ వుంటారు. వాటి తర్వాత అంతే పాప్యులర్ “కేల్విన్ & హాబ్స్“. ఇండియాలో బెంగుళూర్లో వున్నప్పుడు ఒకటి రెండు వాల్యూములు కొన్నాం. మొన్న మళ్ళీ Tenth Anniversary edition కొని ఇంటిల్లిపాదీ రామాయణంలా పారాయణం చేస్తూ వున్నాము.
నవంబర్ 1985 నించి పదేళ్ళపాటు అమెరికన్ పేపర్లలో వచ్చిన కామిక్ స్ట్రిప్పు “కేల్విన్ ఎండ్ హాబ్స్”. దీని సృష్టికర్త బిల్ వాటర్సన్.
కేల్విన్ ఆరేళ్ళ అల్లరి పిడుగు. హాబ్స్ అతను ఎప్పుడూ ఆడుకునే పులి బొమ్మ. నిజానికి వాళ్ళ పేర్ల వెనక పదహారవ శతాబ్దికి చెందిన తత్వ వేత్త జాన్ కేల్విన్, పదిహేడవ శతాబ్దికి చెందిన తత్వ వేత్త థామస్ హాబ్స్ వున్నారు.
కేల్విన్- హాబ్స్ చర్చల్లో వాటర్సన్ పాఠశాలలమీదా, పిల్లల పెంపకం మీదా, అమెరికా వస్తు సంస్కృతి మీదా చాలా వ్యాఖ్యలు చేసారు. కేల్విన్ మనసులో మెదిలే ప్రశ్నలూ, ఆలోచనలూ అన్నీ తనవేనని అన్నారు రచయిత ఒక ఎడిషన్ ముందు మాటలో. తనలోని చిన్న పిల్లల మనస్తత్వానికీ, అల్లరికీ కేల్విన్ ఒక అవుట్లెట్ అనుకున్నారు.
కేల్విన్ అసాధారణమైన ఊహా శక్తీ, తెలివి తేటలూ, అల్లరీ వున్న పిల్లవాడు. ఈ ప్రపంచమంతా తన సంతోషంకోసమూ, అల్లరి కోసమూ వున్నవనే నమ్మకం వాడికి.
హాబ్స్ కేల్విన్ కి ఆల్టర్ ఈగో లాటి వాడు. అతనితో కలిసి అల్లరి చేస్తూ, కొన్ని సార్లు మృదువుగా మందలిస్తూ, నవ్విస్తూ, అబ్బో, హాబ్స్ లాటి స్నేహితుడు (ఉహాజనితమైన స్నేహితుడైనా సరే) మనకీ వుంటే బాగుండనిపిస్తుంది.

కేల్విన్ జీవితంలో చాలా మందే వుంటారు. అతని తల్లీ-తండ్రీ (వీళ్ళకి పేర్లుండవు), వాళ్ళెప్పుడైనా బయటికి వెళ్ళలనుకుంటే కేల్విన్ ని కనిపెట్టి వుండే బేబీ సిట్టరూ (రోసలీన్), పక్కింటి సూసీ డెర్కిన్స్, స్కూల్లో కేల్విన్ ని కొట్టి సతాయించే దుండగీడు మో, కేల్విన్ అల్లరికి ఎప్పుడూ తల పట్టుకుని, “ఇంకొక్క అయిదేళ్ళూ,” అంటూ గొణుగుతూ వుండే టీచరూ (ఆవిడకి ఇంకా అయిదేళ్ళ సర్వీసుంది), వీళ్ళంతా ఈ కామిక్ స్ట్రిప్ లో కనిపిస్తూ వుంటారు.
సూసీ డెర్కిన్స్- కేల్విన్ తో పాటు స్కూలు కెళ్తూ అతని అల్లరికి బలయ్యే అమ్మాయి. ఇద్దరికీ క్షణం పడదు. ఆఖరి నిమిషం వరకూ హోం-వర్కు ఎగ్గొట్టి ఆడుకోవటం కేల్విన్ పద్ధతైతే, విపరీతంగా కష్టపడి ఎప్పుడూ క్లాస్ ఫస్టు రావటం సూసీ కలవాటు. ఇక వాళ్ళిద్దరినీ ప్రాజెక్టుల్లో ఒకే టిం లో వేసినప్పుడెలా వుంటుంది?

తన మనసులో మెదిలే ఆలోచననలూ, సందేహాలూ అన్నీ హాబ్స్ తో చెప్పుకుంటూ వుంటాడు. అతని దృష్టిలో హాబ్స్ ఒక బొమ్మ పులి కాదు, నిజమైన స్నేహితుడు. ఆ ఆలోచనలూ, సందేహాలూ, చాలా సార్లు నవ్వించేటట్టూ, కొన్నిసార్లు ముద్దొస్తూ, ఇంకొన్నిసార్లు మననీ ఆలోచింపచేస్తూ వుంటాయి.
తనసలు చిన్న పిల్లాడి వేషంలో వున్న సూపర్ హీరోనని కేల్విన్ నమ్మకం. సూపర్ హిరోలా వున్నప్పుడు అతని పేరు “స్పేస్ మాన్ స్పిఫ్”. ఆరు మూడు కలిపితే ఎంతా లాటి క్లిష్ట సమస్యలకి కూడా కేల్విన్ స్పేస్ మాన్ స్పిఫ్ రూపంలో జవాబు కనుక్కుంటాడు.

“జాక్ గంటకి ముఫ్ఫై మైళ్ళ వేగంతో జిం వైపు నడుస్తున్నాడు. జిం గంటకి ఎనభై మైళ్ళ వేగంతో జాక్ వైపు నడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఎంత సేపట్లో ఎక్కడ కలుసుకుంటారు” అన్న లెక్కల ప్రశ్నకి కేల్విన్,
“అసలు జిం కంత తొందరెందుకు? ఇలాటి ముఖ్యమైన సమాచారం చెప్పకుండా ఈ సమస్య ఎలా సాధించటం?” అనుకుంటాడు. అన్నట్టు అప్పుడతను డిటెక్టివ్ ట్రేసర్ బుల్లెట్!

కేల్విన్ అమాయకమైన ప్రశ్నల్లో, మనకి మన బ్రతుకుల్లో వుండే హిపోక్రసీ, బలహీనతలూ, మూర్ఖత్వాలనూ అన్నీ తేట తెల్లంగా కనబడతాయి. ముఖ్యంగా కొంచెం చురుకైన విద్యార్థులని విద్యా వ్యవస్థ (అమెరికాలోనైనా సరే) ఎంత డల్ గా చేయగలదో వాటర్సన్ చాలా వ్యంగ్యంగా చెప్తారు.
అమ్మని రకరకాల తిప్పలు పెట్టినా, అమ్మ మీదే అతని నమ్మకమంతా! “అన్ని ప్రశ్నలకీ జవాబు తెలిసిన వాళ్ళే అమ్మలవుతారు” అంటాడు ఆరేళ్ళ అమాయకత్వంతో. (అన్నట్టు ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరిట్ డైలాగు.ఏ విషయానికైనా, “యూ డోంట్ గెట్ టు బీ ఎ మం అన్-లెస్ యూ నో ఆన్సర్స్ టు ఆల్ ది క్వెస్చెన్స్“!)
అంతర్లీనంగా మనందరిలోనూ ఒక అల్లరి పిల్లవాడు లేదా పిల్లది వుంటాడు/వుంటుంది. పెద్దయిపోవాలన్న తొందర్లో వాళ్ళని మనసులోంచి గెంటేస్తాం. ఒక్కసారి కేల్విన్ తో పరిచయం అయితే ఆ పిల్లవాడో పిల్లదో బయటికి వచ్చి పడీ పడీ నవ్వుకోవటం ఖాయం.
అందుకే మనసు బాలేదనిపించిన ప్రతీ రాత్రీ ఒక్కసారి కేల్విన్ ని పలకరిస్తాను! మీ ఇళ్ళల్లో ఎనిమిదేళ్ళు దాటిన పిల్లలుంటే తప్పక కేల్విన్ & హాబ్స్ చదివించండి. వాళ్ళతో పాటు మీరూ నవ్వండి, మన పిరికి తనాలనీ, అవకాశవాదాలనీ, ఇజాలనీ, సిధ్ధాంతాలనీ, రాధ్ధాంతాలనీ అన్నిటినీ చూసి నవ్వుకోవటం కంటే ఆరోగ్యకరమైనదేముంది?
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే
శారద గారికి వందనాలు . చాలా అద్భుతమైన పరిచయం. నాకు జాన్ కెల్విన్ తెలుసు థామస్ హాబ్స్ తెలుసు గాని వారి పేరు మీద ఉన్న ఈ కామిక్ హీరోలు తెలియదు . మొదటి సారిగా వింటున్నాను . మీరు చేసిన పరిచయం చాలా బాగుంది . ఇక్కడ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను .
Nice Review.
The whole series is an incisive yet balmy commentary on modern American life.
BTW, did you notice that Hobbes comes to life only when he’s alone with Calvin.
రాజశేఖర్ గారూ,
ధన్యవాదాలు. తప్పక చదవండి. చాలా నచ్చుతుంది.
కొత్తపాళి గారూ,
అవును! హాబ్స్ ఒక్క కేల్విన్ కి మాత్రమే ప్రాణమున్న స్నేహితుడు. అంతే కాదు, ఒకసారి కేల్విన్ వాళ్ళమ్మ, హాబ్స్ తో మాట్లాడుతూ,
“నీతో మాట్లాడుతున్నాంటె నేను చాలా దిగులు పడుతున్నానన్నమాట” అంటుంది.
టీవీ అలవాటు గురించీ, టైంకి పని చేసుకోవటం గురించీ, కన్స్యూమరిజం గురించీ హాబ్స్ చేసే tongue-in-cheek వ్యాఖ్యలు భలే నచ్చుతాయి నాకు!
మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శారద
I like kelvin and i want to introduse him to my ten year son,and eighth year daughter.Thank you