నాకు మా వూళ్ళో అన్నిటికంటే నచ్చేది లైబ్రరీ! అక్కడ దొరికే పాత సినిమా వీడియోలు! అన్నీ తీరిగ్గా వెతుక్కుని భాషా భేదం లేకుండా చూసి ఆనందిస్తాను. అందులో లైబ్రరీలకి పైసా కూడా చెల్లించక్కర్లేదు!
అలాటి ఒకానొక రెయిడ్లో నాకు “Whatever happened to Baby Jane” అనే సినిమా దొరికింది. ఆ మధ్య నవతరంగంలో సౌమ్య “ది సైలెన్స్” సినిమా మీద రాసిన వ్యాఖ్యానం చదవగానే నాకెందుకో ఈ సినిమా చటుక్కున మనసులో మెదిలింది.
సినిమా కంటే ముందు మనం బెట్టీ డేవిస్ గురించి మాట్లాడుకోవాలి. హాలివుడ్ లో అందరూ ఆడ్రీ హెప్-బర్న్ అందగత్తె అంటారు కానీ, నాకెందుకో అందరికంటే బెట్టీ డేవిస్ అద్భుతమైన సౌందర్య రాశి అనిపిస్తుంది. తన పెద్ద పెద్ద కళ్ళల్లో కోపం, వెటకారం, ప్రేమా, అహంకారం, ఏదైనా సరే, ఆవిష్కరించగల నటి.
ఆవిడకి పాజిటివ్ గా వుండే హీరోయిన్ల కంటే నెగటివ్ హీరోయిన్లే ఇష్టమట. Of human bondage” సినిమాలో మిల్డ్రెడ్ లా ఆమె చూపిన నటన అలాటిదే. ఒక రకమైన అసహ్యకరమైన యాసతో మాట్లాడుతూ, మూర్ఖురాలూ, మోసగత్తే అయినె మిల్డ్రెడ్ మాం నవలలోంచి దిగొచ్చి మనకళ్ళ ముందుకొచ్చిందా అనిపించింది నాకా సినిమా చూసినప్పటినించీ! ఆ తరవాత ఎక్కడ బెట్టీ సినిమా కనిపించినా చూడటం మొదలుపెట్టాను. అలాటి సిరీస్ లో చూసినదే Whatever happened to Baby Jane? అన్న సినిమా.
“ది సైలెన్స్” లాగే ఇది కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళ గురించే. సినిమా ముందు షాట్లో ఒక భవంతిలోకి ఒక కారు మహా వేగంగా వస్తూ వుంటుంది. కారు ఆక్సిలరేటర్ ని ఒక స్త్రీ కాలు ఇంకా గట్టిగా అదిమింది. కారు కీచుమంటూ వెళ్ళి అక్కడ నిల్చున్న ఇంకొక స్త్రీ మీదికెక్కింది. ఆవిడ కెవ్వు మని అరుస్తూ పడిపోయింది.
కట్ చేస్తే అదే పాడుబడిన ఇంట్లో వుంటుంటారు వృధ్ధులైన ఇద్దరు అక్కచెల్లెళ్ళు, బ్లాంచ్ హడ్సన్ (జోన్ క్రాఫోర్డ్), జేన్ హడ్సన్ (బెట్టీ డేవిస్). బ్లాంచ్ వికలాంగురాలు. సహాయం లేనిదే పక్క మీదినించి కదలలేదు. ఇంటి పనంతా ఒక పని మనిషి సహాయంతో జేన్ చూసుకుంటుంది. కానీ ఏదో అసహజమైన వాతావరణం ఇంట్లో. ఇద్దరికీ ఒకరిని చూస్తే ఒకరికి మంట. కానీ ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేని పరిస్థితి. బ్లాంచ్ ది శారీరకమైన బలహీనత అయితే జేన్ ది ఆర్ధికమైన బలహీనత. వారి రోజు వారీ జీవితానికి కావల్సిన డబ్బూ ఆస్తి పాస్తులూ అన్నీ బ్లాంచ్ చేతిలో వుంటాయి.
ఇంకా కిందటి కాలంలోకెళ్తే వాళ్ళ చిన్నప్పుడు జేన్ ఇంట్లో గారాబు బిడ్డ. ఆమె ఆడింది ఆట పాడింది పాట. స్తేజి మీద “బేబీ జేన్” గా ఆమె అంద చందాలూ, పేరు ప్రఖ్యాతులు చూసి అక్క బ్లాంచ్ ఈర్ష్య పడుతుందని తల్లి తండ్రుల అనుమానం. కాలం గడిచి యుక్త వయస్కులవగానే విచిత్రంగా కథ తిరగబడింది. జేన్ నటిగా విఫలమవుతే బ్లాంచ్ అద్భుతమైన నటిగా ప్రేక్షకుల అభిమానం గెలుచుకుంటుంది. ఇప్పుడు అక్క సంపాదించుకుంటున్న డబ్బూ, పేరూ చూసి ఈర్ష్య పడటం జేన్ వంతవుతుంది. జేన్ తాగుడుకి బానిసవుతుంది. అలా తాగి పార్టీ నించొచ్చేటప్పుడు ముందు చూసిన ఏక్సిడెంటవుతుంది.
ఏక్సిడెంటులో వికలాంగురాలైంది బ్లాంచ్. ఇద్దరక్క చెల్లెళ్ళూ అదే ఇంట్లో అలాగే వృధ్ధులవుతారు. ముసలితనంలో జేన్ ఈర్ష్య ముదిరి మానసిక వ్యాధిలోకి దించుతుంది. తను ఇంకా చిన్నప్పటి బేబీ జేన్ నే అనుకొని మళ్ళీ స్టేజీ షోలకోసం ప్రయత్నిస్తుంది. అక్కా చెల్లెళ్ళా కీచులాటలతో ఇంట్లో మనశ్శాంతి వుండదు. ఈ బాధ పడలేక అక్కని చంపెయ్యాలనుకుంటుంది జేన్. అయితే డబ్బంతా ఆమెదే. అందుకే చెక్కుల మీద అక్క సంతకం ఫోర్జరీ చేయ్యటం నేర్చుకుంటుంది. అక్కకి తిండి పెట్టకుండా మంచానికి కట్టేసి రక రకాల వికృత చేష్టలతో మానసికంగా హింసించటం మొదలు పెడుతుంది. అనుమానించిన పని మనిషిని చంపేస్తుంది.
అక్కని బాగా కొట్టి దుప్పట్లో కట్టేసి పోలీసుల భయంతో బీచి మీదకి పారిపోతుంది. సముద్రం ఒడ్డున అక్కకి పక్క వేసి పడుకోబెట్టి తనూ ఆ పక్కనే పాటలు పాడుతూ కూర్చుంటుంది. చావు దగ్గరకొచ్చిందని అర్ధమైన బ్లాంచ్ జేన్ కి ఒక నిజం చెప్పుతుంది. అది విన్న జేన్ “మన ఇద్దరమూ ఎందుకింత కొట్లాడుకున్నాం?” అని ఏడుస్తుంది. బ్లాంచ్ చచ్చిపోతుంది కానీ జేన్ కి అక్క చచ్చిపోయిందన్న విషయం అర్ధం కాదు. “మన ఇద్దరికీ ఐస్ క్రీం కొనుక్కొస్తానుండు” అని ఐస్ క్రీం బండి వాడి దగ్గరికి పరిగెత్తి వెళ్తుంది. తన చిన్నప్పటి బేబీ జేన్ షో లో పాట పాడుతూ ఐస్ క్రీం నాక్కుంటూ వెళ్తున్న జేన్ ని అందరూ వింతగా చూస్తూ వుంటే సినిమా ముగుస్తుంది.
సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది బెట్టీ డేవిస్, జోన్ క్రాఫోర్డ్ ల నటన. అందమైన బెట్టీ వృధ్ధురాలిగా అసహ్యంగా అనిపిస్తూ, మాటల్లో మొహంలో ఎంత క్రౌర్యమూ, ఎంత నీచత్వమూ చూపించిందంటే, ఇలాటి హీరోయిన్ల గురించి కూడా కథలు వుంటాయా అనిపిస్తుంది. కానీ సినిమా అంతా అయిపోయాక మనకామె మీద జాలే తప్ప ఇంకేమీ అనిపించదు.
1962 లో ఈ సినిమా విడులైనట్టుంది. బెట్టీకీ జోన్ కీ ఆ రోజుల్లో మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదిట. సినిమా షూటింగులో ఇద్దరూ చచ్చేట్టు కొట్టుకునే వారట. ఈ సినిమాలో జేన్ బ్లాంచ్ ని కొట్టే సన్నివేశంలో డేవిస్ పెద్ద పెద్ద హై హీల్సు చెప్పులేసుకుని క్రాఫోర్డ్ నీ మొహం పచ్చడయ్యేలా కొట్టింది. పగ తీర్చుకోవటానికి క్రాఫోర్డ్ తనని దుప్పట్లో చుట్టి ఈడ్చుకెళ్ళే సన్నివేశానికి బ్లౌజు నిండా పెద్ద పెద్ద రాళ్ళు నింపుకుంది (బరువు ఎక్కువ కావటానికి). వాళ్ళిద్దరూ అంత చైల్డిష్ గా ప్రవర్తించినా సినిమా మాత్రం గొప్పగా వుంది. ఆ సంవత్సరం బెట్టీ డెవిస్ కీ ఈ సినిమాకి ఉత్తమ నటి అవార్డు కి నామినేషన్ మాత్రమే లభించింది. (Wikipedia information).
యూట్యూబ్ లో ఉందన్నారు గా.. చూస్తాను. మంచి పరిచయం!