శ్రీ సదా శివ దయితే మామవ- సదా సారంగ నయనే

నా కోరికల్లో తీరిన వాటివి లెక్కపెట్టొచ్చు కానీ, తీరని వాటిని లెక్క పెట్టాలంటే చాలా మంది కాళ్ళవీ చేతులవీ వేళ్ళు వాడాల్సొస్తుంది! ఒకటా, రెండా, బోలెడు.

చెహోవ్ లా చకచకా కథలు రాసెయ్యాలనీ, శృతి తప్పకుండా రోజంతా పాడేసుకోవాలనీ, సగటున  సున్నా-ఒకటీ మధ్యలో వ్యాఖ్యలొచ్చే నా టపాలకి ఉన్నట్టుండి పాతికా-ముఫ్ఫై మధ్య వ్యాఖ్యలొచ్చేయాలనీ, ఓ…. చెప్పుకుంటూ పోతే అలా సంవత్సరమంతా చెప్పుకోవచ్చు.

అయితే ఇన్ని కోరికల్లో నిజంగా ఒక్క తీరని కోరిక మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది, ఆ కోరిక ఇక తీరదు కూడా! అపర సరస్వతి అవతారం శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కచేరీ ప్రత్యక్షంగా వినాలని ఎంత ఆశపడ్డానో!

ఐతే విచిత్రంగా ఆ అదృష్టం మురళీ కి మాత్రం దొరికింది! వారి గురువుగార్లు సిక్కిల్ సిస్టర్స్ కూతురు మాలా గారి వివాహం ఎమ్మెస్ కూటుంబంలో జరిగింది. (ఆ వివరాలు ఇక్కడ అప్రస్తుతం). ఆ వివాహానికి మురళీ వెళ్ళారట. ఆయనకి అప్పుడు పంతొమ్మిదేళ్ళుండి వుండొచ్చు. ఆ పెళ్ళిలో ఎమ్మెస్ గారు కూడా వున్నారు.

తమిళుల పెళ్ళిలో ముహూర్తానికి ముందుగా కాశీయాత్ర తర్వాత వధూవరులని ఒక ఊయలలో ఊపుతారు. అప్పుడు వారిద్దరికీ దృష్టి తీసి, ముత్తైదువులు ఒకటో రెండో పాటలు పాడింతరువాత వారిని వివాహ వేదిక వద్దకు తీసికెళ్తారు.

అలాగే మాలా చంద్రశేఖర్ ల పెళ్ళిలో ఊయలలో కూర్చుని దృష్టి తీసింతర్వాత అక్కడ ఎవరో కొంచెం జంకుతూ, “మామీ! నీంగ పాడుంగో” అన్నారట. ఆవిడ ఏ మాత్రం బెట్టు చేయకుండా “సీతా కల్యాణ వైభోగమే”, “రామ కల్యాణ వైభోగమే” పాడారట.

“నాకూ ఆవిడకీ మధ్య ఇద్దరే ఆడవాళ్ళు నిలబడ్డారు. ఇలా, జస్ట్ నా పక్కనే నిల్చుని కేజువల్ గా పాడారు,” అని ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా అదో లోకంలోకి వెళ్ళి పోతారు మురళీ!

పది రోజుల కింద ఆవిడ పుట్టిన రోజునాడు మళ్ళీ తల్చుకున్నారు.

ఆవిడ సంగీతం గురించి మాట్లాడటం సూర్యుడిని దివిటీ వెల్తుర్లో చూపించటం కాక ఇంకేమిటి? యునైటెడ్ నేషన్స్ జెనెరల్ అసెంబ్లీ లో ఆవిడ కచేరీ తర్వాత శ్రోతలు లేచి నిలబడి ఆవిడ వేదిక దిగి బయటికి వెళ్ళి కారెక్కేంతవరకూ కరతాళ ధ్వనులు చేసారట! సాక్షాత్తూ ఏడుకొండలవాడినే రోజూ మేల్కొలిపే గాన సరస్వతి గురించి మనమేం చెప్పగలుగుతాం?

ఏ పాట దానికదే సాటి అనిపించినా, మళ్ళీ అన్నిట్లోకి నాకిష్టమైన పాట రంజని రాగం లో యోగ నరసింహం గారి,

“సదా సారంగ నయనే, శ్రీ సదా శివ దయితే, మామవ,

సుధాకర కళా శేఖర కౌముదీ మిళిత మందహాసే మామవ

సదా సారంగ నయనే”

తా.క. పైన పెట్టిన పెయింటింగు మా మావగారు శ్రీ రామకృష్ణన్ గారు వేసినది.

4 thoughts on “శ్రీ సదా శివ దయితే మామవ- సదా సారంగ నయనే

  1. కొత్తపాళీ,
    అదృష్టవంతులు మీరు!
    నిన్న రామ చిలక బ్లాగులో యూట్యూబు లింకులో ఎమ్మెస్ గారి “కంజదళాయతాక్షీ కామాక్షీ” పాట వుంది. చుసారా? Mind blowing!

    ధన్యవాదాలు.
    శారద

  2. 1996 లో పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆవిడని కలిసే భాగ్యం దక్కింది. మేము ఆవిడ కాటేజి పక్కనే ఉన్నాము, ఆవిడని కలిసినప్పుడు మీ పాట అంటె ఇష్తం అండీ అంది అమ్మ. అమ్మకి కూడా సంగీతం తెలుసని తెలుసుకొని ఆవిడ ఆనందించారు అడిగినదే తడవుగా పాడారు కూడా , 12 ఏళ్ళ వాడినేమో ఆవిడ గొప్పతనం అప్పుడు తెలియలేదు. ఇప్పటికీ ఈసంగతి నెమరు వేసుకొని ఆవిడ ‘simplicity’ కి పొంగిపోతాము

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s