మోహినీఆట్టం

వివిధ రకాల భారతీయ శాస్త్రీయ సంగీత రీతులని వినటం, శాస్త్రీయ నాట్యాలని చూడటం చాలా బాగుంటుంది.

కిందటి శనివారం మా అడిలైడ్ నగరంలో శ్రీమతి గోపికా వర్మ గారి మోహినీ ఆట్టంకార్యక్రమం జరిగింది. నేనింతవరకూ మోహినీఆట్టం చూసిన అనుభవం లేదు కాబట్టి, పిల్లలని తీసుకుని ఉత్సాహంగా వెళ్ళాను. ఆ సాయంత్రం చాలా గొప్ప అనుభూతినిచ్చింది.
ముందస్తుగా వేదిక మీద ఆవిడ అందం ఏదో దేవకన్య దిగొచ్చినట్టుగా అనిపించింది, అతిశయోక్తి కాదు. తరువాత ఆమె మైకు అందుకుని మాట్లాడినప్పుడు “బహుశా మోహినీఆట్టం నృత్యరీతిలాగానే మృదువుగా మాట్లాడటం ఆవిడకి అలవాటైనట్టుంది” అనుకున్నాను.

కేరళలో దాదాపు కథకళి అంత ప్రఖ్యాతి పొందింది మోహినీఆట్టం నృత్యం. దీన్ని “శాస్ర్తీయ నృత్యం” అనొచ్చా అనకూడదా అన్న విషయం మీద చాలా వాదోపవాదాలు ఉన్నవిట. నాట్యం గురించి ఎక్కువగా తెలియనందువల్ల వాటి గురించి నేనేమీ చెప్పలేను! బంగారు జరీ అంచు వున్న చీరతో తలపైన ఒక పక్కకి పెట్టిన కొప్పుతో, ఫుట్వర్క్ కంటే ముఖ కవళికలతో భావాలని వ్యక్తీకరించటం ఈ నృత్యం ప్రత్యేకత. అందువల్ల ఇది “భరత నాట్యం”, “కూచిపూడి” పధ్ధతుల కంటే మంద్ర స్థాయిలో, తక్కువ స్పీడ్ తో వున్నట్టనింపించింది.

కేరళ సంగీతంలో ఉపయోగించే వాయిద్యాలు కూడా మిగతా దక్షిణ భారతీయ వాయిద్యాలకంటే భిన్నంగా వుంటాయి. “చెండ”, “మద్దలం” (మృదంగంలాగే వుంటుంది) ,”టప్పు” మొదలైనవి అవటానికి పర్కషన్ వాయిద్యాలే అయినా, మృదంగ నాదంకంటే కొంచెం భిన్నంగా వుంటుంది.

శ్రీమతి గోపికా వర్మ గారు ట్రావంకోర్ సంస్థానానికి ప్రస్తుతం మహారాజైన పొన్నుదురై గారి అర్ధాంగి. నిజంగానే ఆమె మాటా, హుందాతనమూ, ఆత్మ విశ్వాసమూ అన్నీ ఒక మహారాణిలాగే వున్నాయి.

ఇక ఆమె చేసిన నృత్యాన్ని మాటల్లో వర్ణించలేము. చాలా వరకూ ఆవిద తమ పూర్వీకుడైన మహారాజ స్వాతి తిరునాళ్ పాటలని ఎన్నుకున్నారు. ముందుగా రేవతి రాగంలో ఒక “గణపతి ప్రార్ధన” చేసారు. (చాలా పాటలు మళయాళంలో వుండటం వల్ల నాకు వాటి పల్లవులు అంతగా అర్ధం కాలేదు.) తరువాత బాల మురళీకృష్ణ విరచితం, లతాంగి రాగంలో “ఓంకారాకారిణీ, మదహంకార వారిణీ” అనే పాటకి నృత్యం చేసారు. తరువాత యమునా కల్యాణిలో స్వరపరిచిన “చందన చర్చిత”, సురుటిలో స్వరపర్చిన “రమ్యమాయ్ ఒరు పురుషన్” (స్వాతి తిరుణాళ్) పాటలకి నర్తించారు. కాపీలో స్వరపర్చిన కుచేలోపాఖ్యానానికి (స్వాతి తిరుణాళ్) ఆవిడ చేసిన అభినయం ఎంత బాగుందంటే, మా పిల్లలకి కూడా కథ చక్కగా అర్ధమైంది.

ఆ తర్వాత, కార్యక్రమంలో నాకు అన్నిటికంటే నచ్చినది- ఆవిడ మెయిన్ పీసు, “విశ్వేస్వర దరసన్ కర్, చల్ మన్ తుం కాశీ” (సింధు భైరవి, స్వాతి తిరుణాళ్). ఆ పాటకి గాత్ర సహకారం, ఆవిడ అభినయం నన్నైతే ఏదో లోకాలకి తీసికెళ్ళాయి. సింధు భైరవి, రేవతి లాటి రాగాలకి నాట్యం చేయటం బహుశా మోహినీఆట్టం లోనే సాధ్యమేమో! ఆ పాటలో “జనన్, మరణ్” అనే రెండు మాటలకీ ఆవిడ శిశువు మాతృగర్భంలోంచి పుట్టటం దగ్గరించి, మరణించి బూడిదైపోవటం వరకూ దాదాపు ఇరవై నిమిషాలు అభినయించి చూపారు. It was a marvellous and poignant experience! ఆవిడ తల్లితండ్రులిద్దరినీ ఒకేసారి పోగొట్టుకున్నారట. ఆ సందర్భంలో తన మనస్సులో ఏర్పడ్డ సంక్షోభానికీ వ్యధకీ వ్యక్తీకరణగా ఆ పాటకి నర్తిస్తానని ఆవిడ చెప్పారు. ఆ విషయం చెప్తూ, “నేను ఈ పాటని కొరియొగ్రాఫ్ చేసాను అనటం సరికాదు. ఈ పాటకి నా నాట్యం ఒక మానసిక అవస్థ” అన్నారు. అందుకే అది కొరియొగ్రాఫ్  లాగా మెకానికల్గా  లేకుండ ఒక ఆత్మ సంభాషణలాగా వేదిక మీద సాక్షాత్కరించింది.

ఆ తరువాత కేరళలో తల్లులు పిల్లలకి పాడే లాలిపాట (నీలాంబరి), “ఒమన….” (ఇంకా ఏదో వుంది నాకు అర్ధం కాలేదు)కి నర్తించి, చివరికి మధ్యమావతిలో “హరివరాసనం” పాటతో ముగించారు.

“హరివరాసనం” జేసుదాస్ లా ఎవరూ పాడలేరని నాకో గొప్ప నమ్మకం. అయితే, ఈ నాట్యంలో ఉన్నికృష్నన్ కూడా బానే పాడారు. ఆవిడ లైవ్ సంగీతం లేకుండా రికార్డెడ్ మ్యూజిక్ ఎప్పుడూ వాడరట. నిన్న మాత్రం అన్ని పాటలూ త్రాక్ లే ఉపయోగిస్తూ ఆ విషయాన్నే చెప్పారావిడ.

మొత్తం మీద ఎన్నడూ చూడని ఒక కొత్త లోకాన్ని చూసిన అనుభవం. ఇంత ఆనందంలోనూ ఒక చిన్న పంటి కింద రాయి.

రేసిస్టు కామెంట్లు చేయటమూ, స్టీరియోటైపింగూ నాకిష్టం వుండదు, సాధారణంగా. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. మంచి సంగీత కార్యక్రమో, నృత్య ప్రదర్శనకో వచ్చినప్పుడూ ఆస్ట్రేలియన్లు ఎంత హుందాగా, నిశ్శబ్దంగా వుంటారో, మనవాళ్ళంత లేకిగా, ఏమాత్రం సివిక్ సెన్సు లేకుండా ప్రవర్తిస్తారు. మొన్నటి కార్యక్రమంలో పిల్లలూ పెద్దలూ ఇష్టం వొచ్చినట్టు లేచి బయటికి వెళ్ళటమూ, రావటమూ, మొబైల్ ఫోన్లు కనీసం సైలెంటులో పెట్టకపోవటమూ, పిల్లలని అసలే మాత్రమూ కంట్రోలు చెయ్యకపోవటమూ వల్ల భయంకరమైన రసభంగం అనుభవించాను.

10 thoughts on “మోహినీఆట్టం

  1. నాకెంతో ఇష్టమయిన నృత్య రీతి! చిన్నప్పుడు నేర్చుకుంటానమ్మా అంటే తీసుకెళ్ళి కూచిపూడిలో పెట్టారు తప్ప ఇది నేర్చుకోవడం కుదరలేదు మా ఊరిలో దీనికి తగిన గురవులు లేకపోవడం వలన! మీరిలా వర్ణిస్తుంటే నాకు ప్రత్యక్ష అనుభూతి కలుగుతోంది! ధన్యవాదాలు!

  2. రసఙ్ఞ గారూ,
    మీ బాధ నేనర్ధం చేసుకోగలనండీ. నా విషయంలో కూడా మంచి సంగీతం ఏమిటో అర్ధం చేసుకునేసరికే ఇరవై యేళ్ళు దాటిపోయేసరికి కొంచెం లేట్ గానే మొదలయింది నా సంగీతం. అందుకే చాలా సార్లు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా వుంటుంది!
    శుభగారూ,
    నాకు చాలా చిరాకు కలిగించిన విషయం ఏమిటంటే ఆవిడ, “మీరు మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయక్కర్లేదు, సైలెంట్ మోడ్ లో పెడితే చాలు” అన్నారు. కనీసం అంత సభ్యత కూడా లేకపోయింది ప్రేక్షకులకి. ఎన్నిసార్లు ఎంతమంది మొబైల్ ఫోన్లు కర్ణ కఠోరంగా మోగాయో లెక్కలేదు. ఒక విద్యని అభ్యసించి, ప్రదర్శించాలంటే ఎంత సాధనా, ఏకాగ్రతా వుండాలో అర్ధం కాదేమో మనుషులకి, అందుకే కళాకారులని గౌరవించటం తెలియటం లేదేమో అనుకున్నాను.
    ఎన్నెల గారూ,
    ధన్యవాదాలండీ. నా ఎంజాయ్మెంట్ నంతా మీకు కమ్యునికేట్ చేయగలిగినందుకు, అయాం హేపీ!
    శారద

  3. సాధారణంగా కుటుంబంలో ఒకరికి నచ్చిన చోటికి, ఆసక్తిలేకపోయినా మిగతా అందరు తరలి వెళ్ళడం, మీరనుభవించిన రసభంగానికి మూలకారణం. ఆవిడకో, ఆయనకో వెళ్ళాలనుంటుంది. కానీ ఒంటరిగా వెళ్ళకుండా మొత్తం కుటుంబ సభ్యులతో (పసి పిల్లలతో సహా!) దిగబడతారు. ఆసక్తిలేని కుటుంబ సభ్యులు ఏమీ అర్థంకాక, అలా నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ మరీ దారుణం లెండి…

  4. “మనవాళ్ళంత లేకిగా, ఏమాత్రం సివిక్ సెన్సు లేకుండా ప్రవర్తిస్తారు”
    ప్రపంచంలో ఏమూలకెళ్ళినా, ఏస్థాయిలో ఉన్నా మనవాళ్ళకిదే తెగులు.

  5. మీ బ్లాగు చాలా బాగుంది అండీ….మంచి విషయమున్న బ్లాగులు కరువైపోయాయని అనుకుంటున్న దశలో దొరికింది మీ బ్లాగు. రచనలో మీరు పాటిస్తున్న వస్తువైవిధ్యం బాగుంది. ఇంతటి వైవిధ్యం కావాలంటే నిరంతరం “జీవిస్తూ” ఉండాలని తెలుసు. మీకు నా అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s