అమెరికా అందాలు – I

డిసెంబరు నెలలో మొదలు పెట్టి దాదాపు నాలుగు వారాలు అమెరికా అంతా చుట్టి రెండు వారాల క్రితం అడిలైడ్ తిరిగొచ్చాము.

ఇటు చివర స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నించి మొదలు పెట్టి అటు చివర హెన్రీ ఫోర్డ్ మ్యూజియం వరకూ ఎన్నెన్నో వింతలూ విశేషాలూ చూసాము! అన్నిటినీ మించి అద్బుతంగా మంచు కురుస్తుంటే ఇంట్లో వెచ్చగా కూర్చుని చూస్తూ “అబ్బ, ఎంత బాగుంది” అనుకున్నాము. తల్లి తండ్రులనీ, తోబుట్టువలనీ బంధువులనీ పలకరించి చెమర్చిన కళ్ళతో తిరిగొచ్చాము.

అక్కడ చూసిన కొన్ని వింతలు విశేషాలు…

అ) స్టాన్ఫోర్డ్ విశ్వ విద్యాలయం

” చదివితే ఇలాటి చోట చదవాలి” అనిపించింది స్టాన్ఫొర్డ్ చూస్తే! “ది ఫార్మ్” అని విద్యార్థులందరూ ముద్దుగా పిలుచుకునే స్టాన్ఫోర్డ్ విశ్వ విద్యాలయం లేలాండ్, జేన్ స్టాన్ఫోర్డ్ దంపతులు మరణించిన వారి పదిహేనేళ్ళ కుమారుని గుర్తుగా స్థాపించారని ప్రతీతి. 1878 లో స్థాపిస్తే 1891 నించి విద్యార్థులకొరకు తలుపులు తెరచారు. అప్పట్లో ఆడా-మగా కలిసి చదుకునే కో-ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇదొక్కటేనట! శాన్ ఫ్రాన్సిస్కో కీ శాన్ యోసే కీ మధ్యన సిలికాన్ వేలీలో పాల్-ఆల్టో లో వుందీ యూనివర్సిటీ. దాదాపు పదిహేడు మంది నోబెల్ గ్రహీతలనందించిది ప్రపంచానికి. అజీజ్ ప్రేంజీ, విక్రం సేథ్, రే డాల్బీ, హర్బర్ట్ హూవర్, జాన్ మెకెన్రో, టైగర్ వుడ్స్ వంటి వారు ఈ తరగతి గదులనించే వచ్చారు.

ఆ) గోల్డెన్ గేట్ బ్రిడ్జి

శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి తలమానికంగా అనిపించే గోల్డెన్ గేట్ బ్రిడ్జి శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని మారిన్ కౌంటీ తో కలిపే సస్పెన్షన్ బ్రిడ్జి. జోసెఫ్ స్ట్రాస్ అనే ఇంజినీరు డిజైన్ చేసిన ఈ బ్రిడ్జి 1933 లో మొదలు పెట్టి 1937 లో పూర్తి చేసారు. 1964 వరకూ ఇదే ప్రపంచంలోకెల్లా అతి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి గా వుండేదట. అన్ని రకాల వాతావరణాల్లో దూరం వరకూ కనిపించేలాగుండాలని ఈ వంతెనని కొంచెం ఎరుపు రంగు (కాషాయం రంగు) లో నిర్మించారట. అద్భుతమైన సాంకేతిక పరిఙ్ఞానానికే కాదు, ఈ వంతెన ఆత్మ హత్యలకి కూడా ప్రసిధ్ధి చెందిందంటారు. ఇంతవరకూ ఈ వంతెనని మూడు సార్లు మూసివేసారు. అయితే శాంఫ్రాన్సిస్కో భూమి ఉపరితలం మీద వుండే ఫాల్ట్ లైనె కి దగ్గరగా వుంది. అందు వల్ల భూకంపాల సంభావ్యత ఎక్కువ.ఇంతవరకూ ఈ వంతెన భూకంపాలని తట్టుకోగలదని అనుకున్నారు కానీ ఇప్పుడు దీని స్ట్రక్చరల్ స్ట్రెంత్ ని మెరుగు పరచటానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుంది. సాయంత్రం చలి చలి గా వున్నా బ్రిడ్జి మీద బోల్డు జనం!

ఇ)మ్యూర్ వుడ్స్

శాన్ ఫ్రాన్సిస్కోలో మేము చూసిన ఇంకొక అందమైన ప్రదేశం మ్యూర్ వుడ్స్. సంవత్సరం పొడుగూతా చల్లగా తడి తడిగా వుండే ఈ అడివిలో ప్రాచీనమైన రెడ్ వుడ్ చెట్లు దట్టంగా వుంటాయి. నిజానికి ఇది ఒక పర్యావరణ ఔత్సాహికుడు ఈ అడివినంతా కొని దేశానికి ధారాదత్తం చేసాడట. ప్రభుత్వం పేదవాళ్ళకివ్వదల్చిన స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకుని షాపింగ్ మాళ్ళూ, అపార్ట్మెంట్ బిల్డింగులూ కడుతున్న ఈ రోజుల్లో ఇది వినటానికే ఆశ్చర్యంగా అనిపించింది నాకు! దాదాపు ఆరువందల ఎకరాల అడివిని కొన్న విలియం కెంట్, ఎలిజబెత్ కెంట్ తీరా ఈ స్థలానికి తమ పేరు పెట్టటానికి ఒప్పుకోలేదట. తమ స్నేహితుడూ, పర్యావరాణలో ఎంతో ఆసక్తి వున్నవాడు అయిన జాన్ మ్యూర్ పేరు పెట్టాలని సూచించారు. అందుకే ఇది మ్యూర్ వుడ నేషనల్ పార్క్ అయింది.

ఈ రెడ్ వుడ్ చెట్లు దాదాపు మూడు వందల యాభై అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. ఈ పార్కులో అన్నిటికన్నా పొడవైన వృక్షం ఎత్తు రెండువందల యాభై ఎనిమిది అడుగులు. సూర్య కాంతి జల్లెడలోంచి పడుతున్నట్టు సన్నగా పడుతుండటంతో మిగతా చిన్నా చితకా చెట్లు మెడలు సాచి సూర్య కాంతి వచ్చే దిశగా పెరుగుతాయి. అందువల్ల తిన్నగా పెరగక వంకర టింకరగా పెరుగుతాయి. ఒక రకమైన మేపుల్ చెట్టయితే ఏకంగా పెద్ద పెద్ద ఆకులతో వీలైనంత సూర్యకాంతిని జుర్రుకుంటుంది. ఎటు చూసినా పచ్చదనం, రంగురంగుల పక్షులూ, చల్లదనం, ఈ అడివంతా ఒక అడ్బుతం! ఇక్కడ వున్న చెట్లన్నిటిలోకీ పురాతనమైనరెడ్ వుడ్ వృక్షం వయసు దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు.

మూడు రోజులు శాన్ ఫ్రాన్సిస్కో లో గడిపి అట్నించి లాస్ ఏంజెల్స్ నగరానికి ప్రయాణం. దాన్ని గురించి ఇంకో టపాలో….

7 thoughts on “అమెరికా అందాలు – I

    • తృష్ణ గారూ,
      మూడు నాలుగు నెలలుగా, రాయటానికే కాదు, అసలు చదవటానికీ తీరిక లేకుండా అయింది. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నాను. 🙂

  1. “ప్రభుత్వం పేదవాళ్ళకివ్వదల్చిన స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకుని షాపింగ్ మాళ్ళూ, అపార్ట్మెంట్ బిల్డింగులూ కడుతున్న ఈ రోజుల్లో ఇది వినటానికే ఆశ్చర్యంగా అనిపించింది నాకు! … దాదాపు ఆరువందల ఎకరాల అడివిని కొన్న విలియం కెంట్, ఎలిజబెత్ కెంట్ తీరా ఈ స్థలానికి తమ పేరు పెట్టటానికి ఒప్పుకోలేదట. తమ స్నేహితుడూ, పర్యావరాణలో ఎంతో ఆసక్తి వున్నవాడు అయిన జాన్ మ్యూర్ పేరు పెట్టాలని సూచించారు….”
    అంతేనా, తమ పిల్లలూ, రాబోయే15-20 తరాలూ కూర్చునితిన్నా తరగని సంపద ప్రజలనుండి దోపిడీ చేసి అప్పనంగా కట్టబెట్టడానికి సిగ్గు బిడియాలు విడిచేసి పనిచేసిన, పనిచేస్తున్న అధికారులూ, అమాత్య”శేఖరు”లున్న అభివృధ్ధిచెందుతున్న దేశాల్లో (మరీ ముఖ్యంగా మనదేశంలో), ఇంకా చిత్రంగా తమవంటిదేశభక్తులు లేరని ప్రజల్ని నమ్మించడానికి తమశిలావిగ్రహాలూ, శిలాఫలకాలూ మళ్ళీ ప్రజలఖర్చుతోనే నిర్మించేసుకున్న (కుంటున్న) రాజకీయ దురవస్థలో… ఇటువంటి ఉదాత్తమైన ఆలోచన, భవిష్యత్తరాలపై అనురాగం, తమపేరుకోసం ప్రాకులాడకపోవడం, చిత్రమే కాదు, వాళ్ళు ఆచరణలో చూపించిన నిస్సంగత్వం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. వాళ్ళకి ఆ జాతే కాదు, మానవత్వంపై విశ్వాసమున్న ప్రతివాడూ మనసులో జోహారులర్పించవలసిందే.
    దయచేసి మీరు మరికొంచెం విశదంగా రాయండి. మరీక్లుప్తంగా ఉండి తొందరగా ముగించేస్తున్నారన్న ఫీలింగు వస్తోంది.
    మంచి విశేషాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు.

    • సునము గారూ,
      ధన్యవాదాలండీ! క్లుప్తంగా రాస్తున్నానని నాకూ అనిపించింది. ఇంకొంచెం వివరంగా రాస్తాను.
      మీ సూచనకి ధన్యవాదాలు.
      శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s