జో జీతా వోహీ సికందర్

టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప పోరాటం- అయిదు గంటల, యాభై అయిదు నిముషాలు అభిమానులని వెర్రెత్తించిన ఫైనల్- సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ కీ స్పెయిన్ కిన్ చెందిన రాఫెల్ నడాల్ కీ మధ్యన ఆదివారం రాత్రి మెల్బోర్న్లో రాడ్-లేవర్ ఎరీనా లో జరిగింది.

=======================================================================

సాధారణంగా జనవరి నెలలో ఆస్ట్రేలియాలో ఎండా వేడీ భరించలేనంతగా వుంటాయి. ఉదయం ఆరు గంటలకే ముప్ఫయి అయిదు డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఉష్ణోగ్రత దాదాపు రాత్రి పదింటి వరకూ అక్కడే వుంటుంది. గాలిలో తేమ చాలా తక్కువ వుండటం వల్ల డీహైడ్రేషనూ, కళ్ళ మంటలూ, తలనొప్పీ వగైరాలు రావటం ఖాయం.

అలాటి చిరాకెత్తించే  పరిస్థితిలో మనసులని ఉల్లాస పరచే ఏకైక సాధనం – ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్! కిందటి ఆదివారం మగవాళ్ళ ఫైనల్స్ జరిగాయి. అసలే ఈ సారి క్రికెట్లో ఇండియా జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఒళ్ళు హూనం చేయించుకుంటుందేమో, మా అందరినీ కదిలిస్తే ఏడ్చే లాగున్నాము. ఆఖరికి మొన్న మా ఆఫీసులో ఏదో మీటింగులో, నా కొలీగ్ , ఇంకొకరితో, “పాపం ఆవిడని యేదీ అడగకండి. అసలే  వాళ్ళు దెబ్బలు తిని వున్నారు,” అన్నాడు. అందరం గొల్లుమన్నాం!

అందుకే క్రికెట్టు బారినించి తప్పిచుకోవటానికి ఈ సారి టెన్నిస్ ఎప్పటికంటే ఉత్సాహంగా చూసామేమో. అందరూ అనుకున్నట్టుగానే జొకోవిచ్ ఫైనల్ పోటీలో నెగ్గాడు. కానీ, ఏం ఆట అది? చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు.  ఈ పోటీల్లో ఈ సారి నాకు అన్నిటికంటే నచ్చినవి-

1) క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియన్ బుడతడు టామిచ్ ఫెడరర్ తో తలపడిన తీరు

2) సెమీ ఫైనల్స్ లో ఫెడరర్ కీ నడాల్ కీ నడుమ భీకరమైన పోరు,

3)ఇంకో సెమీ ఫైనల్ లో జొకోవిచ్ జోరు,

4)ఆఖరికి జొకోవిచ్-నడాల్, అయ్యారే!

చూసిన అన్ని ఆటలూ ఒక్కసారి కూడా “పనీ పాటా లేకుండా టీవీ ముంది టైం వేస్టు చేస్తున్నామే” అన్న బాధ తెలియనీయలేదు.

ఎటూ ఫెడరర్, నడాల్, జొకోవిచ్, మర్రే మొదలైన వాళ్ళే నెగ్గుతారని ఈ పోటీలో చిన్నా చితకా  ఆటలు పెద్దగా చూడ టానికేం వుండదు. ఎలిమినేషన్ జరిగి, దిగ్గజాలు మిగిలిన తర్వాతే ఆట రసపట్టులోకి వస్తుంది.

క్వార్టర్ ఫైనల్-

ఆరడుగుల అయిదంగుళాల అందగాడు, పంతొమ్మిదేళ్ళ బెర్నార్డ్ టామిచ్. క్వీన్స్లేండ్ లో నివసించే ఇతను జూనియర్ లెవెల్ లో గ్రేండ్ స్లాం పోటీల్లో చాలా సార్లు ఆడి వున్నాడు. 2011 లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ లో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఈ చిచ్చర పిడుగు  2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్ లో ఫెడరర్ ని జంకూ గొంకూ లేకుండా డీకొన్నాడు. స్ట్రెయిట్ సెట్స్ లో ఓడిపోయినా (6-4, 6-2, 6-2), గట్టి పోటినే ఇచ్చాడు.  నిస్సందేహంగా టామిచ్ కంటే ఫెడరర్ అన్ని రకాలుగా గొప్ప ఆటగాడు. ఆ సంగతి తెలిసినా, ఓటమి తప్పదని తెలిసినా, టామిచ్ వెనక్కి తగ్గకుండా నిల దొక్కుకుని ఆడటం నించి మన క్రికెట్ టీం కొంచెం నేర్చుకోవచ్చు కదా అనిపించటంలో ఆశ్చర్యం ఏముంది?
ఆట ముగిసిన తర్వాత ఫెడరర్ “బెర్నార్డ్ కి చాలా మంచి భవిష్యత్తు వుంది. అతని కింకా పంతొమ్మిదేళ్ళే! ఈ ఆట నెగ్గటానికి నేనెంతో కష్ట పడవలసి వచ్చింది. దానితోనే తెలుస్తుంది అతనికి మంచి భవిష్యత్తుందని”  అన్నాడు. (అన్నట్లు టామిచ్ ఆ తర్వాత గోల్డ్-కోస్ట్ లో ఒక చిన్న ట్రాఫిల్ వివాదంలో చిక్కుకున్నాడని చదివినప్పుడు నవ్వొచ్చింది. ఫెడరర్ అన్నట్టు, “అతనికింకా పంతొమ్మిదేళ్ళే!”)

క్లాష్ ఆఫ్ టైటన్స్

టెన్నిస్ పోటీలో అందరూ ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూసే సందర్భం- ఫెడరర్- నడాల్ పోటీ గురువారం జనవరి ఇరవై ఆరున జరిగింది. ఆ రోజు ఆస్ట్రేలియా డే సందర్భంగా సెలవు కూడా! సాయంత్రం పావు తక్కువ ఏడింటికే టీవీ ముందు సెటిలైపోయరందరూ!

నిజం చెప్పాలంటే ఈ మేచ్ ఎందుకో ఫెడరర్ కొంచెం కళా విహీనంగా ఆడాడనిపించింది. మొదటి సెట్ నెగ్గింతర్వాత, ఫెడరర్ జోరు కొంచెం తగ్గితే మాడ్పు మొహంతో నడాల్ రెచ్చిపోయాడు. మొదట్లో నడాల్ కొంచెం రెస్ట్ లెస్ గా చిరాగ్గా అనిపిస్తే ఫెడరర్ కూల్ గా ఆడి 6-7 తో నెగ్గాడు. కానీ తర్వాత నడాల్ నిలదొక్కుకొని 6-2, 7-6, 6-4 స్కోరు తో గెలిచాడు.

ఫెడరర్- నడాల్ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న తేలేది కాదు, ఈ విషయం మీద వాళ్ళిద్దరి అభిమానులూ ఎంత గొంతులు చించుకున్నా. ఇద్దరి రికార్డులు చూసినా ఈ సంగతి తేలదు. పదహారు గ్రాండ్ స్లాం టైటిల్స్ ఫెడరర్ కుంటే నాడాల్ కి తొమ్మిదే వున్నాయి. కానీ వాళ్ళిద్దరు తలపడ్డప్పుడు మాత్రం విజయం ఎక్కువగా నడాల్ నే వరించింది. అందుకే “అద్దె లేకుండా ఫెడరర్ మనసులో వుంటాడు నడాల్” అని వర్ణించిందొక ఆస్ట్రేలియన్ దిన పత్రిక. ఇద్దరూ పోటా పోటీగా ఆడుతుంటే చూడటం మాత్రం బలే థ్రిల్లింగయిన అనుభవం.

జోకొవిచ్ జోరు

రెండో సెమీ-ఫైనల్ లో తలపడిన జోకోవిచ్ మర్రే లిద్దరూ టెన్నిస్ కోర్టు బయట మంచి స్నేహితులు. ఇద్దరి వయసులూ దాదాపు ఒకటే. నోవక్ కోర్టు బయట జోకులేస్తూ, మిగతా ఆటగాళ్ళని అనుకరిస్తూ కూల్ గా అనిపిస్తాడు కానీ, కోర్టులో పదునైన చూపులతో ప్రత్యర్ధిని హడలెక్కిస్తాడు. మర్రే కోర్టు బయటా, లోపలా కొంచెం సీరియస్ గానే వుంటాడు. మొన్నటి సెమీ-ఫైనల్స్ లో ఇద్దరూ “పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే ” అన్న పధ్ధతిలో ఆడారు. మర్రే ఎంత పట్టుదలగా ఆడినా, నోవాక్ ప్రతిభా, పట్టుదలల ముందు తల వొంచక తప్పలేదు. 4-6, 2-6, 3-6 (మర్రే-జోకొవిచ్) స్కోరు తో మర్రే ఓడిపోయాడు. ఈ ఆటలో పోరాటం కంటే జోకోవిచ్ బాడీ-లాంగ్వేజీ, పదునైన చూపులూ, మొత్తంగా డామినేటింగ్ గేమూ చాలా నచ్చాయి నాకు.

 ఆఖరి పోరాటం

టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప పోరాటం- అయిదు గంటల, యాభై అయిదు నిముషాలు అభిమానులని వెర్రెత్తించిన ఫైనల్- సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ కీ స్పెయిన్ కిన్ చెందిన రాఫెల్ నడాల్ కీ మధ్యన ఆదివారం రాత్రి మెల్బోర్న్లో రాడ్-లేవర్ ఎరీనా లో జరిగింది. అది ఆట కాదు. ప్రాణాలకు తెగించి ఇద్దరు యోధులు చేసే యుధ్ధం. ఒకరికొకరు తీసిపోకుండా వాళ్ళ పట్టుదలా, పటిమా, వర్ణించ శక్యం కాదు.

మొదటి సెట్లో ఓడిపోయి (5-7) , రెండు మూడో సెట్లలో నోవాక్ నెగ్గగానే (6-4, 6-2) , నడాల్ తగ్గిపోతున్నాడా అనిపించింది కానీ ఆ తర్వాత అతను విజృంభించిన తీరు అమోఘం. 5-7, 6-4, 6-2, 6-7, 7-5 (నోవాక్-రాఫా) స్కోరుతో రాఫా ఓడిపోయినా, అతనూ గెలిచాడనిపించింది, చివరిదాకా అతని ఫైటింగ్ స్పిరిట్ చూస్తే.

మేచ్ ముగిసి ఇద్దరూ నిలబడలేని పరిస్థితిలో వుంటే ప్రెజెంటేషన్ సెరిమోనీ లో వాళ్ళకి కుర్చీలు వేసారు. ఓటమిని మొహం మీద ఏమాత్రం కనబడనీయకుండా నాడల్ “గుడ్ మార్నింగ్” అని అందరినీ పలకరించాడు. అప్పటికి సమయం ఒంటి గంటైంది. జోకొవిచ్ మాట్లాడుతూ, “రాఫా! నువ్వు చాలా గొప్ప ఆటగాడివి. టెన్నిస్ ఆటలో ఎంతో గౌరవం సంపాదించుకున్న క్రీడాకారుడివి. ఈ రాత్రి మనిద్దరం  చరిత్ర సృష్టించాం. దురదృష్టవశాత్తూ, విజయం ఒక్కరికే లభిస్తుంది,” అన్నాడు.

టెన్నిస్ ఆటా, దాన్లో వుండే టెక్నిక్కూ, ప్రావీణ్యతా, సీ-సా లాగా వూగే మేచీ చూడటం ఒక మంచి అనుభవమైతే, వాళ్ళలోని స్పోర్టివ్ స్పిరిట్ నీ, చివరివరకూ వదలకుండా ప్రయత్నిస్తూనే వుండే పట్టుదలనీ చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. నేనైతే వాటికోసమే చూస్తా, నిజానికి.

ఇది రాస్తుండగా మళ్ళీ ఇండియా క్రికెట్ టీము ఆస్ట్రేలియా చేతిలో ట్వెంటీ-ట్వెంటీ మేచ్ లో ఘోర పరాజయం పాలైంది. అన్నట్టు, ఆ మేచిలో ఫీల్డింగ్ బాగా చేసి ఆస్ట్రేలియా జట్టుని నూట డెభ్భై పరుగులకే ఆల్-అవుట్ చేసారు. ఇవాళ పొద్దున ఒక స్నేహితుడు నాతో ఆనందంగా అన్నాడు, “ఇక మనకి ఫీల్డింగ్ బాగా వచ్చేసినట్టే. ఒక్క బేటింగ్, బవులింగ్ నేర్చుకుంటే చాలు!” అని.

6 thoughts on “జో జీతా వోహీ సికందర్

  1. “ఇక మనకి ఫీల్డింగ్ బాగా వచ్చేసినట్టే. ఒక్క బేటింగ్, బవులింగ్ నేర్చుకుంటే చాలు!”

    మీ ఫ్రెండ్ అభిప్రాయం కేవ్వు కేక. ఆయనకి భారతరత్న ఇవ్వాలని డిమాండు చేస్తున్నా. (సచిన్ పేరే రాంగా లేనిది, ఈ సిసలు రహస్యం పట్టేసిన మీ ఫ్రెండ్ పేరు భారతరత్నకు లాబీ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది రాకపోయినా, కనీసం పరిశీలనకైనా రాకపోయినా దాని వెనక వైయస్ అధికార దుర్వినియోగం, జగన్ లాభపడడం ఉన్నాయేమో జగన్ మామగారి తోడల్లుడి డ్రైవర్ వియ్యంకుడి మరిదిని సిబిఐ అరెస్ట్ చెయ్యాలి.

  2. sarada garu,

    leander pace adina doubles match kuda chala bagundindi. he played very well.
    mi post lo mention cheste bagundedemo aa match gurinchi.

    memu melbourne lo vuntamu. every year veltam australian open ki.

    mana cricket gurinchi enta takkuva cheppkunte anta manchidi anipistundi.
    indian team odi poyinnanduku badha ledu kani asalu fight ivvakunda odi potare enta virakti kalugutundo cheppa lenu. ila adite australia matram rakandi nayanalara ani cheppalani anipistundi.

    totally totally disillusioned with indian cricket. sorry for the long comment . I had to get it out of my system.

  3. గాయత్రి గారూ, సునము గారూ, శర్మ గారూ
    ధన్యవాదాలు.
    భారతి గారూ,
    నేను మీతో ఫుల్లు అగ్రీమెంటు!
    సంగీత గారూ,
    ఈ సారి నేను అన్ని డబుల్స్ ఆటలూ మిస్సయ్యానండీ! అరెరే, చూడాల్సింది!
    క్రికెట్ గురించి ఎంత బాధ పడి ఏం లాభం లెండి. మీరన్నట్టు ఓడిపోవటం బాధ కాదు, అసలేమాత్రమూ ఫైటింగ్ స్పిరిట్ లేకుండా ఇన్-సిపిడ్ గా ఓడిపోవటం బాధా, అవమానమూ ! నిజానికి ఫాన్స్ ని ఓటమి కంటే ఆట ఉత్సాహంగా లేకపోవటం ఎక్కువ డిజప్పాయింట్ చేస్తుందేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s