విశ్వ సంగీతం

అడిలైడ్ నగరం మార్చిలో మహా హడావిడిగా వుంటుంది. “ఫ్రింజ్ ఫెస్టివల్” పిచ్చి ఒకవైపు, “క్లిప్సల్” కార్ రేసులు ఒకవైపూ, అడిలైడ్ కప్పు (గుర్రప్పందాలు) ఒకవైపూ అయితే వీటన్నిటినీ తలదన్నేది “WOMADelaide” సందడి. World Music and Dance in Adelaide అన్నమాట వోమాడిలైడ్ అంటే.

మార్చిలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో దేశ దేశాలనించి సంగీతమూ, నాట్యమూ చూడొచ్చు. టిక్కెట్టు ధర మనిషికి నూటా ఇరవైడాలర్లున్నా, పొద్దున్న వెళ్ళామంటే రాత్రి పన్నెండింటివరకూ అడిలైడ్ బొటానిక్ గార్డేన్స్ లో ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏమైనా వినొచ్చు. ఫిన్లాండ్, బ్రెజీల్, టిబెట్, చైనా నే కాడు, ప్రపంచం నలుమూలలనిండీ కళాకారులొస్తారు. రవిశంకర్, ఎల్. సుబ్రహ్మణ్యం, నస్రత్ ఫతే అలీ ఖాన్ మొదలైన వారెందరో వోమాడిలైడ్ లో పాల్గొన్న వారే.

అడిలైడ్ లో ఒక రోజుకి నూట ఇరవై డాలర్లు వసూలు చేసే హోటళ్ళు ఈ వోమాడిలైడ్ సందర్భంగా నాలుగైదు వందలవరకూ అద్దె పెంచేస్తారట! అయినా నాలుగు రోజులూ హోటళ్ళు కిటకిటలాడి పోతాయి. నాలుగు రోజులు కలిపి దాదాపు తొంభై వేలమంది వస్తారని అంచనా. “ఇండియన్ ఇంక్” అనే పత్రికకి రివ్యూలు రాసే షరతు మిద నాకూ, మురళీకి రెండు పాసులొస్తాయి. అన్ని ప్రోగ్రాములూ వింటే/చూస్తే బాగుండుననే వుంటుంది, కానీ కుదరదు.

ఈ సారి నేను “శాంతలా శివలింగప్ప” కూచిపూడి నాట్య ప్రదర్శనకెళ్తే, మురళీ పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదన వినటానికెళ్ళారు.

శాంతలా శివలింగప్ప- పారిస్ నగరంలో నివసించే కూఛిపూడి కళాకారిణి. పుట్టింది మద్రాసు నగరమైనా పెరిగింది పారిస్ నగరంలో. తల్లి శ్రీమతి సావిత్రి గారి వద్దా, వెంపటి చిన సత్యం గారి వద్దా నాట్యం నేర్చుకున్నారీవిడ. పీటర్ బ్రుక్స్ లాటి పెద్ద పెద్ద కళాకారులతో పని చేసారావిడ. ఆవిడ ట్రూపులో నలుగురు సంగీత కళాకారులున్నారు. జె.రమేశ్ గారి గాత్రానికి ఎన్.రామకృష్నన్ మృదంగ వాయిద్యము, హరిబాబు గారి పకావాఝ్ వాయిద్యమూ, జయరాం గారి వేణు వాదనకి బాగా తోడైంది.

మార్చి పదకొండో తారీకున రాత్రి తొమ్మిదింటికి మొదలైంది వారి ప్రదర్శన. ముందుగా ఆవిడ ట్రూపులోని వారు ఒక చిన్న కీర్తనతో కార్యక్రమం ప్రారంభించారు. “జగజ్జననీ, సుఖపాణీ, కల్యాణీ,” ఇంతవరకూ నేనెప్పుడూ వినలేదా పాట. వింటూ వుంటే రాగం ఏమిటో కూడా అసలు తెలియలేదు. ఇంటికొచ్చి గూగులమ్మని అడిగితే తెలిసింది అది “రతి పతి ప్రియ” అని. ఆ రాగం ఫీల్ బలే గమ్మత్తుగా వుంది.

ఇప్పుడు, హంసధ్వని తీసుకొండి. స-(చ) రి- (అన్)గా- ప- (కా) ని- స కలిసి హంసధ్వని వినిపిస్తాయి. చాలా షార్ప్ గా గ- నీ వుండటం వల్లే ఆ రాగానికంత ఠీవీ, దర్జా అనిపిస్తుంది. వాటిని కొంచెం ఫ్లాట్ గా చేసి ఖారహరప్రియ జన్యం లా పాడితే స-(చ)రి- (సా) గా- ప- (కై)ని -స అవుతుంది. వినటానికి బాగున్నా పాడటం కష్టమేమో అనిపించింది. ఈ పాట రాసింది “ఘనం కృష్ణ అయ్యర్” అట. “సుఖ పాణి” అనే ప్రయోగం కొంచెం వింతగా అనిపించింది. “సుఖదా”, అని అమ్మవారిననడం విన్నా కానీ, “సుఖ పాణీ” అనటం వినలేదెప్పుడూ!

ఆ పాట తర్వాత ఆరభి లోని ఊతుక్కాడు గారి కీర్తన “ప్రణవాకారం సిధ్ధి వినాయకం” పాటకి నర్తిస్తూ శాంతలా రంగం మీదికొచ్చారు. ఈ పాటకి ఆవిడ అభినయం బాగానే వున్నా, ఇంకా బాగుండొచ్చేమో అనిపించింది.

బాల మురళీ కృష్ణ గారి వర్ణాలు వినటానికీ పాడటానికీ గూడా చాలా బాగుంటాయి. అందులో “షణ్ముఖ ప్రియ” లోని “ఓంకార ప్రణవ నాదోద్భవ” అనే పద వర్ణానికి చేసిన నాట్యం చాలా బాగుంది. ఆఖరి చిట్ట స్వరానికి శాంతలా తరంగం చేసి చూపించారు. అయితే తరంగం చేసినప్పుడు నర్తకి పాదాలు కనిపించటానికి వీలుగా వుండే ఆడిటొరియం ని ఎన్నుకుంటారు సాధారణంగా. ఆ రోజు జరిగింది ఆరు బయట ప్రోగ్రాం కాబట్టి, ప్రేక్షకులకి ఆవిడ ఫుట్ వర్క్ అంతగా కనిపించలేదు. అందుకనేనేమో ఆవిడ చాలా క్లుప్తంగా తరంగాన్ని ముగించారు.

రాగేశ్వరి చాలా రొమాంటిక్ గా వుండే రాగం. పౌర్ణమి రోజులవటం మూలాన ఆ రోజు చందమామ ఆకాశంలో వెలిగిపోతున్నాడు. అందమైన వెన్నెలలో , లాల్ గుడి జయరామన్ గారు స్వర పర్చిన రాగేశ్వరి తిల్లాన కి ఆవిడ మృదువైన నాట్యంతో ఆ రోజు కార్యక్రమం ముగిసింది. అంత ఆరు బయట, భాష ఒక్క ముక్క అర్ధం కాకపోయినా ఆస్ట్రేలియన్లందరూ మౌనంగా, శ్రధ్ధగా ఆ ప్రోగ్రామంతా చూసి, ముగిసింతర్వాత మర్యాదగా లేచి నిలబడి చప్పట్లు కొట్టి అక్కణ్ణించి వెళ్ళిపోవటం చూసినప్పుడు, అలాటి సందర్భాల్లో మన వాళ్ళ ప్రవర్తన గుర్తొచ్చి మనసు మూలిగిన మాట నిజం. మర్నాడు శాంతలా బృందం కూచిపూడిని గురించిన ఒక వర్క్ షాప్ నిర్వహించారు. దానికి నేను వెళ్ళలేకపోయినా, మురళీ వెళ్ళొచ్చి చాలా ఇంఫర్మేటివ్ గా వుండినదని అనుకున్నారు.

పకావాఝ్ తోడుంటటం కూచిపూడిలో నాకు వింతగా నిపించింది. ఎందుకంటే పకావాఝ్ నాకు తెలిసినంతవరకూ హిందుస్తానీ సంగీతంలో వాడే వాయిద్యం. అయితే మొదట్నించీ రామక్రిష్నన్ మృదంగంతో డామినేట్ చేయటం వల్ల ఏమీ తేడా అనిపించలేదు.

8 thoughts on “విశ్వ సంగీతం

  • శర్మ గారూ,
   కొంచెం పని ఒత్తిడిలో ఇటు వైపు చూడటమే వీలవటంలేదు. కొన్ని మంచి మంచి టపాలు కూడా మిస్సయినట్టున్నాను.

   అడిలైడ్ లో చాలా వింతలూ విశేషాలూ, కార్యక్రమాలూ వుంటాయండీ. వీలైతే వాటిని పరిచయం చేయాలనే ఈ అడిలైడ్ ముచ్చట్లు.
   శారద

 1. నాగేస్రావ్ గారూ,
  మీరన్నది నిజమేనండీ. ఉచ్ఛారణ సరిగా లేకపోతే పాట చాలా విసుగ్గా అనిపిస్తుంది.
  మా వూళ్ళో కొందరు విద్యార్థులు “భో, శంభో, శివ శంభో, స్వయంభో” అనే పాటని “బోసం, బో, సివసం, బో, స్వయం, బో” అని పాడతారు. నిజంగా ఒళ్ళంతా కారం రాసుకున్న అనుభూతి నాకు…

  శారద

 2. బావుంది. నాట్యప్రదర్శన రివ్యూలో కూడా చక్కగా సంగీతాన్ని ప్రకాశింప చేశారు. మా అమ్మ నాట్యకచేరీలకి వెళ్తూ, మామూలుగా కచేరీల్లో వినబడని సంగీతం వినచ్చుగదా అనుకునేది 🙂

  “సుఖ పాణీ” – బహుశా శూకపాణి అయుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s