నెగెటివ్ గురువులు
జీవితం కంటే పెద్ద గురువింకెవరు వున్నారు? చావగొట్టి చెవులు మూసైనా సరే మనకి కావల్సిన పాఠాలని నేర్పించే గురువే జీవితం. అయితే క్లాసులో తెలివైన విద్యార్థులు ఇతరుల అనుభవాలనించి నేర్చుకున్నట్టు జివితంలో కూడా చాలా విలువైన పాఠాలని ఇతర్ల అనుభవాలనీ, జివితాలనీ చూసి నేర్చుకుంటాం. చాలా మంది వారి ప్రవర్తనతో, ఆలోచనలతో, మాటలతో మనని ఎంతగానో ప్రభావితం చేస్తారు. ఇన్స్పైర్ చేస్తారు. వీళ్ళంతా కూడా మనకి గురువులే. చాలా సార్లు వీరిని మనం తలచుకుంటాం కూడా.
ఇంకొక రకం గురువులున్నారు. వీరిని చూసి మనం ఎలా ప్రవర్తించకూడదో, ఎలా ఆలోచించకూడదో, మాట్లాడకూడదో నేర్చుకుంటాం. “ఏం చేస్తానో తెలియదు కానీ ఇలా మాత్రం చేయను” అనుకుంటామన్న మాట. వీళ్ళని మనం ఎక్కువ తలచుకోం కానీ, నాకెందుకో అది అన్యాయమనిపిస్తుంది. ఎందుకంటే వీరి వద్ద కూడా మనం చాలా విలువైన పాఠాలే నేర్చుకుంటాం. నా జీవితంలో అలాటి కొందరు నెగెటివ్ గురువులు…….
———————————–
“రేపు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి మరి,” మొహమాట పెడుతుంది మా దూరపు బంధువు సీతమ్మ వారు. “రేపా? అలాగే వద్దును కానీ,మీ యిల్లు నాకు తెలియదు!” సిగ్గు పడుతూ అంది మా ఇంటికొచ్చిన దగ్గర బంధువు లక్ష్మి అత్తయ్య. “ఇల్లు తెలవదా? ఇదిగో శారద వుందిగా? దానికి బాగా తెలుసు మా యిల్లు. శారదా, రేపు నువ్వూ లక్ష్మి అత్తయ్యా మా ఇంటికి పన్నెండింటికల్లా వొచ్చెయ్యండి, తెలిసిందా?”
చచ్చాన్రా దేవుడా! అసలే పరీక్షల టైము! బీ యెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న నేను, ఇంకేమనే ధైర్యం లేక సరే నన్నాను. సీతమ్మ గారి శ్రీ వారు మాకు బంధువవటం వల్ల, భర్త వైపు బంధువులమని ఎంతో అభిమానంతో పిలిచి వుంటుంది అనుకున్నాను నేను. అప్పటికి నాకింకా సాంఘిక మర్యాదలూ లాటివి కొత్త. మర్నాడు ఠంచనుగా పన్నెండింటికి నేనూ లక్ష్మి అత్తయ్యా వాళ్ళిల్లు చేరుకున్నాము. “రండి, రండి, అన్నాలు తినేద్దామా?” ప్రేమగా ఆహ్వానించింది సీతమ్మ గారు. మా ఇద్దరికీ రెండే కంచాలు పెట్టటం చూసి ఆశ్చర్య పోయాము మేమిద్దరమూ. “అదేంటీ? మీరెవ్వరూ తినరా? అసలందరూ ఏరి?” అడగనే అడిగింది లక్ష్మి అత్తయ్య.
“మేమందరమూ తినేశాము. మీ మావయ్య పొద్దున్న ఆఫిసుకెళ్ళేటప్పుడూ భోజనం చేసి వెళ్ళిపోయారు. పిల్లలూ నేనూ ఇందాకే తినేసాము. వాళ్ళు ఆటలకి వెళ్ళిపోయారు.” ఎందుకో నాకంతగా నచ్చలేదీ వ్యవహారం.ఇంటికొచ్చే అతిథులకోసం ఎదురు చూడని ఆ పెద్దాయనా, ఆ యిల్లాలూ, పిల్లలూ, ఎందుకో మనసు చివుక్కుమంది. నేరస్థుల్లా ఇద్దరం కంచాల ముందు కూర్చున్నాం.
కంచంలో ఇంత అన్నమూ పప్పూ వేసి “తినండీ! ఆకలి వేయటంలేదూ?” అన్నదావిడ. ఉత్త పప్పేనా? “కొంచెం నెయ్యి వేస్తావా అత్తయ్యా?” సిగ్గొదిలి అడిగాను నేను. “హయ్యో నాన్నా! నెయ్యి అయిపోయిందిరా! మా వాడంతా మీ మావయ్య పోలికే! చెప్పిన పని గుర్తే వుండదు. నెయ్యికొనుక్కురమ్మని పంపిస్తే వీధిలో పిల్లలతో గోలీలాడుతూ మర్చేపోయాడూ! పోనీ నూనె వేసుకుంటావా పప్పులో?”
“వద్దులే. కొంచెం ఆవకాయ ముక్కుంటే వెయ్యి.” కష్టపడి ఎండిపోయిన అన్నమూ పప్పూ, ఆవకాయ ముక్కా, నీళ్ళ మజ్జిగతో భోజనం చేసి వొచ్చేసాము. తర్వాత చాలా సార్లు ఆలోచించాను ఆవిడ ఎందుకలా చేసిందా అని.
నాకా రోజు తిండి నచ్చకపోవటానికి కారణం తిండి మాత్రం కాదు. అంతకన్నా నీరసమైన భోజనాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా హాయిగా తిన్న రోజులున్నాయి. ఎండాకాలం సెలవులంతా అమ్మమ్మ కేవలం మరమరాలే పెట్టేది అందరికీ, ప్రతీరోజూ! అవి తింటూ స్వర్గంలో వున్నట్టు ఫీలైపోయే వాళ్ళం కూడా. తిండి క్వాలిటీ కంటే ఇంటి కొచ్చిన అతిథుల పట్ల అశ్రధ్ధా, నిజమైన ఆప్యాయత లేకపోవటమూ, నిరాదరణా మనసుని ఎక్కువ నొప్పించాయి. అసలంత ఏ మాత్రమూ ఆదరం లేని బంధువులని ఎందుకని పిల్చిందో అనుకున్నాను కూడా.
ఆవిడకి భర్త అన్నా, అతని వైపు బంధువులన్నా చాలా చిన్న చూపనీ, ఇలాటి ఆహ్వానాలు ఆవిడ అతన్ని చిరాకు చేయటానికే ఇస్తుందనీ కొన్నేళ్ళ తర్వాత అర్ధం అయింది.
పదిహేడేళ్ళ వయసులో జీవితంలో మొదటి పాఠాన్ని నేర్చుకున్నాను. మనకీ మన మొగుడికీ సవాలక్ష వాదనలు వుండొచ్చు. ఇంట్లో నాలుగ్గోడల మధ్యా మన సౌడభ్యం సిగ పట్ల లోనే వుండొచ్చు. అయినా భర్త వైపు బంధువులతో సాదరంగా, ఆప్యాయంగా ప్రవర్తించటంలోనే మన గౌరవమూ, హుందాతనమూ వున్నాయి. ఇదే సూత్రం మగవాళ్ళకీ వర్తిస్తుంది.
“వార్నీ! ఈ ఫోటోలు మన రైల్వే స్టేషన్లో కేడీలవా? నేనింకా మీ నాన్నా, మీ అన్నయ్య, మీ మావయ్యా అనుకున్నానే!” అనే భర్తగారి ముతక హాస్యానికి భార్య ఏమీ అనకపోవచ్చు కానీ మనసులో ఎంతో అసహ్యించుకుంటుంది, ఇంకెంతో నొచ్చుకుంటుంది.
భర్తని భార్య అతని బంధువులముందు అవమానించినా, భార్య బంధువులని భర్త పదిమందిలో హేళన చేసినా పోయేది ముందు తమ కుటుంబం పరువేనని గుర్తుంచుకుంటే చాలు. అత్తగారి వైపు బంధువులని హేళన చేసే వారికంటే, వారి గురించి ఆదరంగా మాట్లాడే వాళ్ళనే అసంకల్పితంగా ఎక్కువ గౌరవిస్తాం.
ఈ పాఠాన్నే నేను వీలైనంతవరకూ మా పిల్లలకి కూడా నేర్పటానికి ప్రయత్నిస్తాను. (వాళ్ళెంతవరకు పాటిస్తారో కాని!) భర్తా/భార్యా, అత్త మామలూ బంధువులనే కాదు, చాలా వరకు కుటుంబ సభ్యులను పదిమందిలో చిన్నబుచ్చటం, అవమానించటం, హద్దు మీరి వెక్కిరించటం లాటి అలవాట్లు మన వ్యక్తిత్వాలనే దిగజారుస్తాయి. ఇంత మంచి పాఠాన్ని చిన్న తనంలోనే నాకు నేర్పిన ఆ అత్తయ్య గారిని నేనెప్పుడూ మర్చిపోలేను.
____________________
ఆ మధ్య ఏదో వూళ్ళో శ్రీ మతి రమణి గారు పరిచయమయారు. చాలా మంచి ఆవిడ, స్నేహశీలి. అయినా ఎందుకో స్నేహితులలో ఆవిడా కంతగా మంచి పేరు లేకపోవటం గమనించాను. ఎందుకబ్బా అనుకున్నాను కూడా! రెండు మూడు సార్లు ఆవిడని కలిసి మాట్లాడటంతోనే రహస్యం వీడిపోయింది. ఆవిడకున్న ఒకేఒక బలహీనత తన పిల్లలు. రెండు, మూడు, ఐదు, పది ఎన్ని గంటలైనా సరే ఆవిడ తన పిల్లల గురించి మాట్లాడగలదు. వినే వాళ్ళకి బోరు కొడుతుందేమో అన్న అనుమానం కూడ రాదావిడకి పాపం.
ప్రతీ తల్లికీ తండ్రికీ తమ పిల్లలు అద్భుతమైన పిల్లల్లా కనిపిస్తారు. అందులో వింతేమీ లేదు, వీపరీతమూ కాదు. కాకి పిల్ల కాకికి ముద్దే కదా? అయితే ఆవిడ తన పిల్లలు ప్రపంచంలో అందరికీ అద్భుతంగా కనిపిస్తారనుకుంటుంది. అక్కడే వస్తుంది చిక్కు.
వాళ్ళకి మార్కులు ఎక్కువొస్తే, అసలేమాత్రమూ చదవకుండానే వాళ్ళకన్ని మార్కులొస్తాయి. ఎలాగో ఏమో! తక్కువొస్తే, అసలు టీచరే వొచ్చి చెప్పాడూ, “నేను పొరపాట్న పై క్లాసు పేపరు ఇచ్చాను. అందరికీ సున్నాలు చుట్టాయి, మీ వాళ్ళకి కనీసం ఇన్నైనా వొచ్చాయి,” అని. స్కూలు టీచర్లు వాళ్ళు తమ స్కూలులో చదవటం తమ అదృష్టమంటారు. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టరు వాళ్ళకి పుట్టుకతోటే డ్రైవింగు వొచ్చంటాడు.
వాళ్ళకి ఇంటరెస్టు వున్న విషయాల్లో అసక్తి లేని పిల్లలందరూ ఉట్టి వెధవలు! వాళ్ళకి ఆసక్తి లేని విషయాలు అసలెవరికీ పనికిరావు. ఆ మధ్య ఎక్కడో ఒక పెద్ద జాయింట్ సెక్రటరీ వొచ్చి, “ఫలానా పిల్లలు మీ పిల్లలా? మీరెంత అదృష్టవంతులు!అలాటి పిల్లలకోసం తపస్సు చేయాలి” అన్నాడు. ఇంకేదో మీటింగులో వాళ్ళడిగిన ప్రశ్నలకి అసలు కొమ్ములు తిరిగిన శాస్త్రఙ్ఞులే జవాబివ్వలేక పోయారు! ఇన్ని మాటలెందుకు? అసలు వాళ్ళు పుట్టినప్పుడు దేవ దుందుభులు మ్రోగి, పూల వర్షం కూడా కురిసింది. ఇలా గొప్పలు వినీ వినీ నాకైతే చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి.
ఆవిడతో మాట్లాడటాన్ని ఒక ఛాలెంజిగా తీసుకుంటాను నేనెప్పుడూ. ఎన్నిసార్లు టాపిక్ ఆవిడ పిల్లలమీదినించి తప్పించి మిగతా విషయాల మీదికి మళ్ళించగలనేమో అని ప్రయత్నిస్తాను, కానీ ఎప్పుడూ నేనే ఓడిపోతూవుంటాను. .
మొదట్లో వినోదంగా వుండేది. తర్వాత ఆశ్చరమేసేది. తర్వాత ఎబ్బెట్టుగా అనిపించటం మొదలైంది. ఆకరికి ఆవిడకదేమైనా మానసిక వ్యాధేమో ననిపించసాగింది. తల్లులు పిల్లల గురించి మాట్లాడటం సహజమే అని ఎంత సరిపెట్టుకుందామన్నా, నాకు ఆవిడ ధోరణి చిరాగ్గా అనిపించి “అతి సర్వత్ర వర్జయేత్” అనిపించేది.
పాపం ఆవిడ ఈ గొప్పల వల్ల మామూలుగా అందరికీ ముచ్చట గొల్పే వాళ్ళ పిల్లలు వూళ్ళొ అందరికీ శతృవులై కూర్చున్నారు.
ఇంకొక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను.
నా పిల్లలు నా కంటికి అద్భుతమైన అందగత్తెల్లా, గొప్ప గాయకులుగా, ఎంతో బుధ్ధి మంతులుగా అనిపించొచ్చు. మిగతా ప్రపంచం కంటికి వాళ్ళు మామూలు పిల్లలే. వాళ్ళగురించి నేను చేసే ఎవాల్యుయేషన్ కీ ప్రపంచం చేసే ఎవాల్యుయేషన్ కీ చాలా తేడా వుంటుంది. అందుకే నా పిల్లల గురించి నేను చేసే ఆలోచనల్లో వీలైనంత వరకూ అబ్జెక్టివ్ గా వుండటానికే ప్రయత్నిస్తాను! (ఎంత వరకు సాధ్య పడుతుందో కాని!)
——————————–
2000 సం|| ప్రాంతాల్లో నేను ఒక ఇంగ్లీషు వెబ్-జైను కోసం అడపా దడపా రాస్తూ వుండేదాన్ని. ఒక రోజు ఆ వెబ్ సైటులో ఒక వ్యాసాన్ని చదివి ముందు ఆశ్చర్య పోయాను, తర్వాత కోపం తెచ్చుకున్నాను, తర్వాత అసహ్యించుకున్నాను.
వ్యాసం పేరూ, రచయిత పేరూ గుర్తు లేవు కాని, స్థూలంగా “తెలుగు వారి అలవాట్లూ, జీవన శైలి గురించి” ఒక హాస్య రస ప్రధానమైన వ్యాసం. అందులో హాస్యంకన్నా అపహాస్యం, లేకి తనమూ, అఙ్ఞానమూ మాత్రమే కనపడ్డాయి. ఒక మొత్తం వర్గాన్ని గురించి జోకులేసేటప్పుడు ఆ వర్గం వాళ్ళు కూడ నవ్వుకునేంత సున్నితంగా వుండాలి. అలా రాయటం చేతనైనప్పుడే హాస్యం రాయాలి. అంతే కాని, “ఫలానా వర్గం వాళ్ళు జుట్టుకి బోలెడు నూనె రాసుకుని ముఖాల్లో జిడ్డు కారుతూ వుంటారు, ముక్కులో వేళ్ళు పెట్టుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు” అని రాస్తే అది హాస్యం అవదు సరి కదా, రాసిన మనిషిని చూసి నవ్వే ప్రమాదం వుంది. హాస్యం ఒంటికి కితకితలు పెట్టినట్టుండాలి కానీ, కారం రాసినట్టు కాదు కదా?
ఆ వ్యాసం వొచ్చిన వెంటనే పెద్ద దుమారం రేగింది. వ్యాస రచయితా, వెబ్ సైటు స్థాపకులూ క్షమాపణ చెప్పాలన్న డిమాండూ వొచ్చింది. చాలా చర్చలూ, వాదోపవాదాలూ, మాటలు విసురుకోవటలూ, ఓహ్, పండగేపండగ! సరే మొత్తం మీద క్షమాపణలూ వగైరాలతో యుధ్ధం ముగిసింది.
ఆ సందట్లో ఎవరో అన్నారు, “మనం తర తరాలుగా సర్దార్జీల మీద ఎంత చెత్త జోకులూ, ముతక హాస్యమూ పండిస్తున్నాము? ఇప్పుడు దానిని గురించి ఆలోచించాల్సిన సమయం వొచ్చిందేమో!” అని.
నిజమే, సర్దార్జీ అనగానే మనకు తెలివి తక్కువ వాళ్ళ మీద వేసుకునే జోకులే గుర్తొస్తాయి కానీ, భారత సైన్యంలో ఎక్కువ భాగం వుండేది వాళ్ళేననీ, ధైర్య స్థైర్యాలకి వాళ్ళు పెట్టింది పేరనీ గుర్తు రాదు. ఆ రోజే ఆ సైటులోనే కొందరు ప్రతిఙ్ఞ చేసారు, ఇక పై సర్దార్జీ జోకులు చెప్పమని.
హాస్యమంటే కుళ్ళు బోతు తనమూ, ఒక వర్గాన్ని మొత్తంగా హేళన చేయటమూ, మొరటు తనమూ కాదనీ, హాస్యానికీ అప హాస్యానికీ మధ్య వుండేది చాలా సున్నితమైన తేడా అనీ కానీ ఖర్చు లేకుండా పాఠం నేర్పించిన ఇంకొక గురువు. ఈ అనుభవం తర్వాత నేను ఎక్కడ సర్దార్జీ జోకులు చెప్పినా మందలిస్తాను, నా వంతు కృషిగా.
flip side of the coin, hmmm…!
మీరన్నది నిజమే. భార్య చేసే వంటలకి పేర్లు పెడుతూ, పిసరు కూడా మిగల్చకుండా మెక్కే భర్తలు ఉన్నారు. ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ‘అమ్మయ్య, ఈ ఒక్క రోజైనా నా భార్య చేతి వంట తప్పించు కుంటున్నాను” అని హాస్యం ఒలక బోయడం . వినే వాళ్లకు ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పలేం.
Sardaarjila gurunchi correctga cepparandi Sharada Garu.We dont encourage jokes on Sardharjis since i visit Punjab n when my husband told more than half of the Indian army is from Punjab…
సర్వేభ్యో గురుభ్యోన్నమహ!! 🙂
మీ కలం మొహమాటమనే మకిలి వదిలించుకుని పదును తేరుతోంది, సంతోషం
మంచి విషయం ప్రస్తావించారు.
ఒకసారి పొరుగూళ్ళో బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే మాకూ అయ్యింది. భోజనానికి రారమ్మన్నారని ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి వెళ్తే అర్ధాకలితో కంచం ముందర నుంచి లేవాల్సి వచ్చింది. మేం ఉన్న రెండురోజులూ ఇదే తరహాలో అన్నం పెట్టిందా మహా ఇల్లాలు ! ఇంకెప్పుడూ వాళ్ళింటికి రానంటే రానని గట్టిగా చెప్పేసా మావారికి.
బోలెడంత చాదస్తం, కొంచెం గర్వం, ఇంకొంత పొగరు కలిగినవాళ్ళే, మీరు చెప్పినవాళ్ళు.
ప్రపంచం మన గురించి ఏమనుకుంటుందో అని ఒకసారి కాస్తంత విశాల దృక్పథంతో వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళ తప్పు వాళ్ళకే తెలుస్తుంది.
చాలా రోజుల తర్వాత బ్లాగులు చూద్దామని వస్తే మంచి పోస్టే కనపడింది.
ఒకసారి మమ్మల్ని ఒక స్నేహితులు టీ కి పిలిచారు. సాయంత్రంవేళ వెళ్ళాము. మంచి ఆవ పెట్టిన పులిహొరా, కమ్మని గారెలు పెట్టారు. పులిహోర ఎంతో బాగుందని మెచ్చుకుంటే వాళ్లమ్మాయి “మా బామ్మకి ఆవ పులిహోర చాలా ఇష్టం. తొంభయ్యేళ్ళ వయసులో కూడా మా బామ్మ చేసిన పులిహోర రుచి ఇంకెవరికీ రాదు” అంది గర్వంగా! ఆ పులిహోర వాళ్ళ బామ్మే చేశారనుకుని “ఏరి ఆవిడ? ఎక్కడున్నారు?” అనడిగా అటూ ఇటూ చూస్తూ!
అ పిల్ల గొల్లున నవ్వి “అయ్యో, ఇవాళ బామ్మ ఆబ్దికమండీ! ఆవిడ పోయి నాలుగేళ్ళయిందిగా! ఆవిడకిష్టమని అమ్మ ఆవ పులిహోర చేసింది అమ్మ” అని చల్లగా చెప్పింది.
తద్దినం వంటలు పెట్టారు అతిధులకి! ఇది తప్పో రైటో నాకు తెలీదు కానీ ఎందుకో మరి నొచ్చుకోవాలనిపించింది.
పిల్లల విషయంలో కూడా నేను బయటి వాళ్ల ఎవాల్యుయేషన్ ఆధారంగా మా పిల్లని అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తుంటా…!
మీ పాఠాల్లో నేను నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి.:-)
సర్దార్జీ లు తెలివి మీద ఉన్న జోక్ లకు అసలు కారణం, వాళ్లను వారి మత గురువులు యుద్ద0చేయటానికి ప్రోత్సహించారు. గురుగోబింద్ సింగ్ గురించి చదవండి. ఆరోజుల్లో తురకవాళ్లు అత్యంత ఘొరంగా మనదేశం మీద దాడి జరిపినపుడు వీరు వారికి గట్టి పోటినిచ్చి, వాళ్లను అడ్డుకొన్నారు. మనిషి ఎక్కువగా ఆలోచించే కొద్ది భయస్తుడుగా తయారౌ తాడు.
శత్రువు తో యుద్దం చేయాల్సివచ్చినపుడు, అతి తెలివితో ఆలోచిస్తూ కూచొంటే (ఆ యుద్దంవలన ఎమీ లాభం.అందరు చనిపోతారు. ఇరుపక్షాలకు నష్ట్టం అనే కోణంలో ) అది పిరికితనంగా అవతలి వారు భావిస్తారు. వాళ్లు ఎక్కువగా ఆలోచించటం కన్నా ధైర్యంగా యుద్దంలో పాల్గొనటం/ ఎక్కడైనాన్యాయం జరిగితే తిరగబడటం చేసేవారు. ఇప్పటికి డిల్లిలో సర్దార్జీలతో తగవుకు ఎవరు దిగరు, వాళ్లు ముందు వెనుక చూసుకోకుండా అవతలి వాడి దగ్గర ఆయుధం ఉన్నా తన్నడానికి వెళిపోతారు.
“ఆవిడతో మాట్లాడటాన్ని ఒక ఛాలెంజిగా తీసుకుంటాను నేనెప్పుడూ. ఎన్నిసార్లు టాపిక్ ఆవిడ పిల్లలమీదినించి తప్పించి మిగతా విషయాల మీదికి మళ్ళించగలనేమో అని ప్రయత్నిస్తాను, కానీ ఎప్పుడూ నేనే ఓడిపోతూవుంటాను.” .
ఇది మనవల్ల కాదండీ! అనుభవించడమే!! తప్పదు కదా!!!
Chala baga chepparu.
శారదగారూ,
విజ్ఞులు విషయాలని రెండు రకాలుగా తెలుసుకో వచ్చన్నారు. మొదటిది ఇది ఇది అని తెలుసుకోవడం. రెండోది, అది కానిదేదో తెలుసుకుని, ఒక్కొక్కటిగా వేరుచేస్తూ, చివరికి అది ఏమిటో తెలుసుకోవడం. మీరు రెండో విషయాన్ని సోదాహరణంగా బాగా చెప్పారు. జ్ఞానాన్నందిస్తున్నంతవరకూ, ప్రతీదీ పోజిటివే. మీ టపా నవ్విస్తూనే ఆలోచింపజేసింది. ఒక్కసారి బుజాలు తణువుకునేలా చేసింది కూడా.
అభివాదములు.
@ఫణీంద్ర గారూ,
నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదండీ?
@గౌరి గారూ,
అదే మరి! వినేవాళ్ళకీ, చూసే వాళ్ళకీ చిరాగ్గ వూంటుందని అర్ధం కాదు. భాగస్వామిని ఎంత తెలివిగా అవమానించాం అని మురిసిపోతారే కానీ, అసలు ముందు నన్ను చూసి నవ్వుతున్నారన్న ఙ్ఞానం తెచ్చుకోరు ఇలాటి మనుషులు.
@గాయత్రి గారూ
మీరన్నది బాగుందండీ.
@కొత్త పాళీ
కాంప్లిమెంటుకు థాంకులు! 🙂
@తృష్ణ గారూ,
అలాతి వాళ్ళ గురించి ఆలోచించకుండా వదిలేయడమే ఉత్తమం!
@బోనగిరి గారూ,
మీరన్నది నిజమే. అందుకే “రిట్రోస్పెక్షన్” చాలా ముఖ్యం మనందరికీ.
@సుజాత గారూ,
హయ్యో పాపం! ఎలాటి పరిస్థితిలో ఇరుక్కు పోయారు కదా? I understand how you felt at that time!!!
@శ్రీ గారూ,
చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసారు. కారణాలు ఏవైనా ఇలాటి స్టీరియోటైపులు హద్దులు దాటితే బాగుండదని నా అభిప్రాయం.
@శర్మ గారూ,
మీరన్న విషయం అర్ధం కావటానికి నాకు కొన్ని యేళ్ళ అనుభవం కావాల్సి వొచ్చిందండీ! 😦
@శ్యామల గారూ
ధన్య వాదాలు.
@ మూర్తి గారూ
మీరన్నట్టు మన ఙ్ఞానాన్ని పెంచేది ఏదైనా పాజిటివే!
మీకు అయాచితంగా గురువుల ద్వారా నేర్పబడ్డ పాఠాలు బాగున్నాయండి. :))
సర్దార్జీలంటే గుర్తొచ్చింది. బారా-బజే అని ఆటపట్టిస్తున్న ఫ్రెండ్స్తో ఓ సర్దార్ నవ్వుతూ వుండేవాడట. ఎవరో అడిగారట ఎందుకు నవ్వుతున్నావు నీకు కోపం రాదా? అని. దానికతను కష్టాల్లో వుండి సాయం అర్థిస్తున్నారు వాళ్ళు అన్నాడట. ఔరంగజేబ్ కాలంలో తురకసేనలు గ్రామాల మీద పడి అందరినీ బలవంతంగా మతమార్పిడి చేయించే వారట, నరికివేతలు, అత్యాచారాలు, అపహరణలు వుండేవట. సిక్కులు అర్ధరాత్రి దాటాక వాళ్ళ గుడారాల మీద దాడులు చేసి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆడవాళ్ళని విడిపించేవారట. అందుకే బందీలు అర్ధరాత్రి సిక్కులను ఎలుగెత్తూ పిలిచేవారట… అలా వాళ్ళకు ఆపేరు పడిపోయిందట. మరి ఇది విన్న స్నేహితులు మరెప్పుడూ బారా బజే అనలేదట.