నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులు

మనిషి మేధస్సు  ఎన్నో విషయాలని కనుగొన్నది, కొన్ని మంచివీ, కొన్ని చెడ్డవీ కూడా. అయితే నా దృష్టిలో మనిషి మేధస్సు సాధించిన పెద్ద విజయాలు, తత్వ శాస్త్రమూ, లెక్కలూ, సంగీతమూ.

తత్వ శాస్త్రమూ, లెక్కలూ పక్కన పెడితే సంగీతం కనుక్కొన్నందుకే మనిషి దాదాపు దేవుడికున్నంత సృజనాత్మకత చూపించాడేమో.  ఆ సంగీతం భారతీయ సంగీతమైనా కావొచ్చు, పాశ్చాత్య సంగీతమైనా కవొచ్చు.

భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలు తీసుకొంటే ఒక వింతైన విషయం గోచరిస్తుంది. ఆ యా పధ్ధతుల్లో గొప్ప విద్వాంసులు దాదాపు ఒకే కాలంలో  పుట్టారు.  ఉదాహరణకి, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో క్లాసికల్ ఇరా  కి చెందిన సంగీత కారులు, హేడెన్ (1732-1809), బాక్ (1685-1756), బీత్ హొవెన్ (1770-1827), మొజార్ట్ (1756-1791) అందరూ పదిహేడు నించి పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన వారు కాగా,   కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పేరు పొందిన త్యాగరాజ స్వామీ (1767-1847), ముత్తు స్వామి దీక్షితార్ (1775-1837), శ్యామశాస్త్రీ (1762-1827)   దాదాపు అదే కాలానికి చెందిన వారై వుండడం లో ఏదో కాస్మిక్  రహస్యం వుందేమో!.

సంగీతమే వూపిరిగా బ్రతికిన ఈ వాగ్గేయకారుల గురించి ఎన్నో పుస్తకాలూ, ఎన్నో సినిమాలూ రావటం వింతేమీ కాదు.  తెలుగులో త్యాగయ్య సినిమా ఇష్టంగా చూసినట్టే ఈ మధ్య 1984 లో తయారైన “ఎమేడియస్” అనే సినిమా చూసాను.

వోల్ఫ్ గాంగ్ అమేడియస్ మొజార్ట్– క్లాసికల్ ఇరా కి చెందిన సంగీత కారుడు.  తన పన్నెండో యేటనే ఒపెరా ని రాసి, దాదాపు ఆరు వందల  మ్యూజికల్ పీసులు  రచించిన మేధావి. తన ఈడు పిల్లలంతా  వీధుల్లో ఆడుకొనే వేళ ప్రముఖుల యెదుట కచేరీలు చేసిన కారణ జన్ముడు. తన అయిదో యేటనే చిన్న చిన్న పాటలు రాసేవాడని ప్రతీతి.  ఆయన గురించీ, ఆయన సంగీతం గురించీ ఎంత చెప్పినా తక్కువే!

ముఫ్ఫై అయిదేళ్ళకే మరణించిన మొజార్ట్  జీవితంలోని ఆఖరి పది సంవత్సరాలే “ఎమేడియస్” చిత్ర ఇతివృత్తం.  అలెగ్జాండర్ పుష్కిన్  1830లో రాసిన నాటకం ఆధారంగా  1979 లో ఎమేడియస్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత దాని ఆధారంగానే పీటర్ షీఫర్ రాసిన స్క్రీన్ ప్లే కి మిలో  ఫోర్మన్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. యాభై మూడు అవార్డులకి నామినేషన్ లు లభించగా, నలభై అవార్డులు గెలుచుకుందట ఈ సినిమా.  చూసింతరవాత చాలా సేపు మనల్ని వెంటాడే సినిమా ఇది. పైన చెప్పినట్టు మొజార్ట్ జీవితంలోని ఆఖరి పది సంవత్సరాల కథని “ఎంటోనియో సేలియెరి” అనే ఇంకో సంగీత విద్వాంసుడి దృక్కోణం నించి ఆవిష్కరిస్తారు.

కథా సమయం 1823- మొజార్ట్ మరణించి అప్పటికే  ముప్పై రెండు సంవత్సరాలు గడచింది.   వృధ్ధుడైన సేలియేరీ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మొజార్ట్ ని చంపేసింది నేనే, ఆ పాపపు భారాన్ని భరించలేక పోతున్నానంటాడు. అతన్ని ఒక పిచ్చాసుపత్రి లో చేర్పిస్తారు. అక్కడ ఒక  ఫాదర్ తో తన కథంతా చెప్పి మనసులో భారాన్ని దించుకుంటాడు.

సంగీతం అంటే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే సేలియేరి దేవుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరతాడు.  అద్భుతమైన సంగీతాన్ని తయారు చేసే శక్తి తన కిమ్మని. అందుకు ప్రతిగా తను జీవితాంతం మంచి వాడుగా వుంటానని వాగ్దానం కూడా చేస్తాడు దేవుడికి.  ఆ మాటకే కట్టుబడి పేద విద్యార్ధులకి ఉచితంగా సంగీతం నేర్పించటం వంటీ  సహాయాలు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ సంగీత రచనే పరమావధిగా బ్రతుకుతూ వుంటాడు. అతను  అప్పుడు ఆస్ట్రియా రాజు జోసెఫ్ ఆస్థానంలో ఆస్థాన సంగీత కారుడు (కోర్ట్ కంపోజర్).

వున్నట్టుండి ఒకరోజు మొజర్ట్ అక్కడికి వస్తున్నాడన్న వార్త్ వింటాడు  సేలియేరీ. అప్పటికే పారికేళ్ళ మొజార్ట్ పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసి వుంటాయి. ఆ బాల మేధావి ఎలా వుంటాడో చూడాలని చాలా ఉత్సాహ పడతాడు సేలియేరీ. అంత గొప్ప సంగీతాన్ని రూపొందించటానికి దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు (Man touched by God- incidentally the literal meaning of Amadeus) చాలా అద్భుతమైన వ్యక్తి అయి వుండొచ్చు అనీ- అతని మొహం చూడగానే ఇట్టే పట్టేయొచ్చనీ అనుకుంటాడు. తీరా చూస్తే మొజార్ట్ అల్లరి చిల్లరిగా నవ్వుతూ తిరిగే యువకుడు.

ఒక్కసారిగా నిరాశ పడతాడు సేలియేరి.
” నన్ను గొప్ప విద్వాంసుణ్ణి చెయ్యమని నిన్నంత వేడుకుంటే, నువ్విలాటి వాడికింత విద్వత్తు నెందుకిచ్చావు దేవుడా?” అని భగవంతుణ్ణి దుయ్యబడతాడు.

ఆ తర్వాట మొజార్ట్ సంగీతం పట్ల ఆరాధనా,  వ్యక్తిగతంగా ఈర్ష్యా- రెండిటి మధ్యా నలిగిపోతాడు సేలియేరి.  వీలైనన్ని విధాలుగా మొజార్ట్ ని పతనం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తాడు.  అతని పదవి మూలంగా మాటి మాటికీ సహాయం కోసం మొజార్ట్ తన దగ్గరకే రావటంతో అతని పని సులువవుతుంది. పైగా వారి ఇంట్లో ఒక దాసీని తన గూఢచారిణిగా నియమిస్తాడు.

అనేక నాటకీయ సంఘటనల మధ్య,   ముసుగు మనిషి రూపం లో ఒకడు మొజార్ట్ ని “ది రెక్వియం” అనే పాటని రాయమని కోరతాడు. అప్పటికే మొజార్ట్ బీదరికమూ, తాగుడూ, తండ్రి మరణం వల్ల తన జీవితంలో ఏర్పడ్డ శూన్యతా మొదలైన సమస్యలతో పోరాడుతూ వుంటాడు.  మరణించేందుకు ముందు రోజు మొజార్ట్ చెప్తూ వుండగా సేలియేరీ రాస్తూ “ది రెక్వియం” పూర్తి చేస్తారు. వర్షం కురుస్తున్న రాత్రి ఒక బండిలో మొజార్ట్ శవాన్ని తీసికెళ్ళి సామూహిక స్మశాన వాటిక  లో ఎన్నో శవాల మధ్య గుట్టలోపడేస్తారు.

“ది రెక్వియం” రాయమని సేలియేరి ఎందుకు కోరాడు? నిజంగా అతనే మొజార్ట్  మరణానికి కారకుడా? ఇలాటి సందేహాలన్నిటికీ జవాబు సినిమాలోనే దొరుకుతుంది.

సినిమా అంతా గొప్పగా, ఇంటెన్స్ గా వుంటుంది.  నాకు మొజార్ట్ కన్నా సేలియేరి పాత్ర ధారి చాలా నచ్చాడు. మనసులో జరిగే సంఘర్షణని ఆయన చాలా అద్భుతంగా ఆవిష్కరించడమే కాకుండా ఆస్కార్ కూడా కొట్టేసారు.  అన్నిటి కంటే వాళ్ళిద్దరూ కలిసి “రెక్వియం”  రాసిన షాటు సినిమాకంతటికీ హైలైటు- నటన పరంగా- సంగీతం పరంగానూ.   మొజార్ట్ పాత్రని కూడా- చిన్నతనపు కుర్రవేషాలనీ, సంగీతం మీద  అద్భుతమైన పాషన్ ని సమ తూకంగా చూపించారు.  నటీ నటులు చాలా వరకు థియేటర్ నటులు.

సినిమాలో ఇంకా చెప్పుకోవాల్సింది సంగీతం. మొజార్ట్ పాటలూ ఒపేరాలూ “డాన్ జియోవాని”, “ఫిగారో”, “ది రెక్వియం”-  మొదలైనవి చాలా ఉపయోగించుకున్నారు.   “ఫిగారో”, “డాన్ జియోవానీ” లు చూస్తుంటే ఒక్క సారి పెద్ద థియేటర్ లో ఒపెరా చూడాలని ఆశ పుట్టింది.

అయితే సినిమా కథకు  నిజమైన మొజార్ట్ చరిత్రకూ పెద్ద పోలికలు లేవంటారు. అంటే సేలియేరి, మొజార్ట్ లి కలిసి “ది రెక్వియం” రాసిన మాట నిజమే కానీ,  సేలియేరీ కి వున్న ఈర్ష్యా, అతను మొజార్ట్  పతనానికి ప్రయత్నించడమూ వంటివి నిజం కావంటారు చరిత్ర కారులు. అలాగే మొజార్ట్  మృత దేహాన్ని సామూహిక స్మశాన వాటికలో పడ వేసిన మాట నిజమే కానీ, దానికి కారణం అప్పుడు ఆస్ట్రియా లో వున్న చట్టాలే నంటారు.

నిజానిజాలెలా వున్నప్పటికీ మనసంతా ఒక రకమైన బాధతో నింపే సినిమా- ఎమేడియస్.

15 thoughts on “నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులు

 1. @సంగీత గారూ,
  ధన్యవాదాలు, మీ ఎప్రిసియేషన్ కి.

  @SNKR గారూ,
  నిజానికి సినిమా గొప్పతనాన్ని గానీ, మొజార్ట్ గొప్పతనాన్ని కానీ నేను వెయ్యో వంతు కూడా చూపించలేదండీ! నిస్సందేహంగా ఆయన సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి. మీరు వీలైతే సినిమా చూడండి. ఆ తర్వాత ఒపేరాల కంటే మొజార్ట్ instrumental compositions వినండి. నా కలెక్షన్ లో majical strings అనే సీడీ వుంది. అందులో ఒక పాటా- హేడేన్ ది- అసలు అది వింటుంటే స్వర్గంలో విహరిస్తున్న అనుభూతి దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు.

 2. ఆసక్తికరంగా ఉంది మీ పోస్టు. ‘ఎమేడియస్’ మోజార్ట్ వాస్తవిక చరిత్రకు అద్దం పట్టకపోయుండకపోవచ్చు కానీ దీనిలో మలుపులు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. మన ఇళయరాజాకు మోజార్ట్ అంటే బాగా ఇష్టం. తన నథింగ్ బట్ విండ్ ఆల్బమ్ లో Mozart I love You అనే సంగీత ఖండికను నివాళిగా అందించాడు.

  మీరు ప్రస్తావించిన magical strings సీడీ గురించి ప్రత్యేకంగా పోస్టు రాయమని నా సూచన!

 3. ఎప్పుడో చూసిన సినీమా గుర్తుకు వస్తోంది. చాలా బాధ కలిగించే సినీమా. “నేను ఇంత సంగీతం సృష్టించాను. ఎందుకు నన్ను ఎవ్వరూ తలుచుకోరు? ఆ మొజార్ట్ ని తప్ప?” అంటూ మొదలవుతుంది సినీమా పిచ్చాసుపత్రిలో“ఎంటోనియో సేలియెరి” మాటలతో.
  మొజార్ట్ ఆటలాడుతూ సంగీతం సృష్టించటం ఒకటే కొంచెం చూడటానికి బాగుంటుంది.
  చివరికి మొజార్ట్ చనిపోయిన తరువాత వింటర్ స్నో లో బాడీ బ్యాగ్ ని బండి మీద తీసుకు వెళ్ళి కామన్ గ్రేవ్ లో పడేయ్యటం విషాదాంతం. చివరికి కధ ఏదో చెబుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా జీవితంలో అందరూ వారు చెయ్యాల్సిన పనులు చేసి నిష్క్రమిస్తారు.
  జ్ఞాపకాలని వ్రాస్తున్నాను. ఈ పోస్ట్ ద్వారా వాటిని కుదిపి బయటికి తీయించి నందుకు థాంక్స్.

 4. బావుంది. మొజార్ట్ నిజజీవితాన్ని గురించి నాకూ ఏమీ తెలియదు, అందుకని సినిమాని సినిమాగానే ఆస్వాదించాను. మీరు చెప్పినట్టే సెలియేరి పాత్ర చాలా ముఖ్యమైనది, నటుడు కూడా చాలా బాగా చేశాడు. టపాకి మీరిచ్చిన శీర్షిక అద్భుతంగా ఉన్నది.

 5. @కొత్తపాళీ
  ధన్యవాదాలు.
  “రాగ సుధా రస” సంగీత పరంగా, సాహిత్య పరంగానూ చాల అందమైన కీర్తన అనిపిస్తుంది.
  సదా శివమయమగు
  నాదోంకార స్వర విదులు
  జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు
  రాగ సుధా రస పానము జేసి రంజిల్లవే ఓ మనసా”

  నాకు “సదా శివమయమగు” అన్న ప్రయోగం చాలా బాగుంది.

 6. శారదగారూ,
  సంగీతం కనుక్కొన్నందుకే మనిషి దాదాపు దేవుడికున్నంత సృజనాత్మకత చూపించాడేమో. ఆ సంగీతం భారతీయ సంగీతమైనా కావొచ్చు, పాశ్చాత్య సంగీతమైనా కావొచ్చు…
  ఈ మాటలు పలకడానికి వెనుక ఎంతో సమభావన, సంగీతం పట్ల అపారమైన అనురాగం ఉండాలి. దానికి తగ్గట్టుగానే మీ టపా కూడ ఉంది. మీరు పెట్టిన శీర్షికే ఒక్క సారి పట్టిలాగింది. మీరు నాకు తెలియని చాలా విషయాలు పరిచయం చేశారు. ఆ సినిమా తప్పకుండ చూస్తాను.
  అభివాదములతో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s