సంగీత సాహిత్య సమలంకృతే -I

భారతీయ సంగీతంలో రాగానికీ, భావానికీ, లయకూ సమానమైన ప్రాధాన్యత వుంది. అందమైన భావాన్ని పలికించి నిలబెట్టటానికి రాగమూ, లయా కలిసి పనిచేస్తాయి. ఈ సూత్రానికి సినిమా సంగీతమూ మినహాయింపు కాదు. ఎంత అద్భుతమైన భావమైనా, శ్రావయమైన సంగీతం లేకపోతే చెవులకి వినిపించదు. ఎంత అత్యాధునికమైన సంగీతంతో హోరెత్తించినా అందమైన భావనలేకపోతే మనసుకి హత్తుకోదు.

    మరీ ముఖ్యంగా, సంగీతమే ప్రధానమైన అంశం గా వుండే సినిమాల్లో పాటలు మామూలు పాటాలకంటే మంచి స్థాయిలో వుంటాయని ఆశిస్తాం. తెలుగులో ఇలాటి సంగీత ప్రధానమైన సినిమాలెన్నో వొచ్చాయి, మంచి పాటలనందించాయి కూడా.

చాలా పాతవాటి సంగతేమో కానీ, ఎనభైల్లో వచ్చిన రుద్రవీణ (1988) సినిమాలోని పాటలు అన్ని విధాలా గొప్ప స్థాయిలో వున్నాయనిపిస్తుంది. నాకైతే ఈ సినిమాలో ముగ్గురు హీరోలని ఒక భావన. తెర మీద కనిపించేది చిరంజీవి అయితే, సీతారామ శాస్త్రీ, ఇళయరాజా తెర వెనక హీరోలు.

rudraveena

         సినిమా కథకున్న రెండు పార్శ్వాలూ (సంఘ సంస్కరణా, శాస్త్రీయ సంగీతమూ), నటీ నటుల నటనా, మనసుని తట్టి లేపే డైలాగులూ అన్నీ కలిపి సినిమాని చిరంజీవి కున్న గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయిఅయితే ఈ సినిమాలో సంగీతం గురించి మాట్లాడుకోవటానికే చాలా వుంది. కేవలం పాటాలూ, నేపథ్య సంగీతం కొరకే ఈ సినిమా నేను లెక్క లేనన్ని సార్లు (ఈ మధ్యనే మళ్ళీ ఇంకొక సారి) చూసాను. తరచి చూస్తే ఇందులో మూడు పొరలు కనపడతాయి.

——————————————

) తేలికగా వున్నా, లోతైన సాహిత్యంతో కూడిన పాటలు, “చుట్టు పక్కల చూడరా చిన్నవాడా, “తరలి రాద తనే వసంతం“, “నమ్మకు నమ్మకు ఈ రేయినీ,””రండి రండీ, దయ చేయండీ,పాటలు.

) రెండో పొరలో సందర్భానుసారంగా వచ్చే చిన్న చిన్న బిట్స్, “తులసీదళములచే“, “అలకలల్లల్లాడగ“, నాద స్వరంలో ఖరహరప్రియ“, “సహాన, ఆఖర్న బిళహరి రాగంలో పరిదానమిచ్చితేమొదలైనవి.

) అన్నిటికంటే సంగీత పరంగా సోఫిస్టికేటేడ్ గా వినిపించేవి, పూర్ణ చంద్రిక రాగంలో మానవ సేవ ద్రోహమా, లలిత రాగంలో లలిత ప్రియ కమలం విరిసినదీ, బిళహరి రాగంలో నీతోనే ఆగేనా సంగీతం పాటలు.

———————————————————————

ఏదీ సొంతం కోసం కాదను సందేశంముఖ్య ఉద్దేశ్యమైన కథలోమొదటి పాటే కథానాయకుని పాత్రలో కీలకమైన మలుపు తెస్తుంది.

స్వర్గాలను గెలిచెయ్యాలని,

వడిగా గుడి మెట్లెక్కేవు,

సాటి మనిషి వేదన చూసి

జాలి లేని శిలవైనావు,” అని వీపున చరచి అతన్ని అంతర్ముఖున్ని చేస్తుంది.

ఆ తరవాత వచ్చే తరలి రాద తనే వసంతం సంగీత పరంగా, సాహిత్య పరంగానూ మామూలుగానే వున్నా, కథానాయకుని స్వగతం లా అనిపిస్తుంది.

ఇది తెలియని మనుగడ కథ, దిశ ఎరుగని పయనము కద,అని కథకూ, తన వ్యక్తిత్వానికీ దిశా నిర్దేశనం చేసుకుంటున్నాడా, అనిపిస్తుంది. “హంసధ్వనిలాటి బరువైన రాగంలో తేలికగా వొదిగిపోయిందీ పాట.

నమ్మకు నమ్మకు ఈరేయినీ పాటకి కూడా పెంటాటొనిక్ హిందోళాన్నే వాడారు ఇళయరాజా, బహుశా ఈస్తటిక్ ప్లెజర్ కోసమేమో.

వెన్నెలలోనీ మసకలలోనే మసలును లోకం అనుకోకు,

రవి కిరణం పడితేనే తెలియును తేడాలన్నీ,”

పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూఅనే లైన్లు చాలా లోతుగా అనిపిస్తాయి.

ఏవో అందమైన ఆభరణాలు ధరించి రాజ ప్రసాదంలో గంభీరంగా కూర్చున్న గొప్పింటి స్త్రీలా అనిపించే శాస్త్రీయ సంగీతాన్ని, మామూలు అమ్మాయిలా చిన్న బొట్టు పెట్టి, జడ అల్లి అందరి మధ్యలో కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది, “రండి రండి రండీ, దయ చేయండీ,” పాట వింటుంటే. ఎవరి అందం వారిదే కదా?

మాకు నిలయ విద్వాంసులు చిలక రాజు గారు,

కీరవాణి వీరి పేరు, పలుకు తేనెలూరు అన్న మాటల్ని కీరవాణి రాగంలో,

తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారూ అన్న వాక్యాన్ని దర్బారు లోనూ,

శునకమైన పలుకు కనకాంగి రాగాన,” అన్న వాక్యాన్ని కనకాంగిలోనూ విన్నప్పుడు, శాస్త్రీ, రాజా ఇద్దరూ సమ ఉజ్జీలే అనిపించింది. పప్పన్నం లో అప్పడాలు నంచుకున్నట్టు స్వరాక్షరాలూ, శ్లేషలూ సరే సరి.

మాటలనే సంగతులు చేయటం, సంగతులనే సద్గతులనుకొనటం,

సరిగా, సరిగా, సరి సరి సరిగా తెలుసుకొన్నాను ఈనాడు.”

కళ్ళ ముందు కటిక నిజం,

కానలేని గుడ్డి జపం,” అన్న ఎద్దేవాతో మొదలైన కథానాయకుని ప్రస్థానం,

నిలువునా నన్ను కమ్ముకున్నాయి,

శాంతితో నిలవ నీయకున్నాయి,

ఈ చీకటి తొలగించాలి, ఈ అపశృతి సవరించాలి,

జన గీతిని వద్దనుకుంటూ, నాకు నేనె పెద్దనుకుంటూ

కలలో జీవించను నేను, కలవరింత కోరను నేను,” అన్న తెగింపుతో

ఒక నిర్ణయానికొస్తుంది! (చెప్పాలని వుంది, గొంతు విప్పాలని వుంది). ఆ పాట క్లైమాక్స్ లో కేవలం మృదంగ ధ్వని తోనే అంత టెన్షనూ, ఆవేదనా పలికించొచ్చని మొదటిసారి తెలిసింది.

(సశేషం)

2 thoughts on “సంగీత సాహిత్య సమలంకృతే -I

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s